ఇండియా-ఆస్ట్రేలియా: కుదిరిన అణు ఒప్పందం


Tony Abbot and Narendra Modi

Tony Abbot and Narendra Modi

ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఇండియా పర్యటన ఫలితంగా ఇరు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. దాదాపు రెండు సంవత్సరాలుగా విడతలు విడతలుగా జరిగిన చర్చలు ఫలప్రదమై శుక్రవారం సంతకాలతో ఒప్పందం రూపం సంతరించుకున్నాయి. “పౌర అణు సహకార ఒప్పందం” గా పిలుస్తున్న ఈ ఒప్పందానికి అమెరికా ఆమోదం ఉంది. అమెరికా ‘ఊ’ అనకుండా ఒప్పందం సాధ్యం కాదు.

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి) పై ఇండియా సంతకందారు కానప్పటికీ ఆస్ట్రేలియాతో అణు ఒప్పందాన్ని సుసాధ్యం చేసుకోవడం మన విజయంగా భారత పాలకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా అణు ఇంధనం యురేనియంను సరఫరా చేయడంతో పాటు రేడియో ఐసోటోపులను ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుందనీ, అణు భద్రత లాంటి ఇతర రంగాల్లోనూ సహకారం అందజేస్తుందనీ భారత విదేశీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఇక నుండి ఆస్ట్రేలియా ఇండియాకు దీర్ఘకాలికంగా నమ్మకమైన యురేనియం సరఫరాదారుగా వ్యవహరిస్తుందని ఆ ప్రకటన తెలిపింది.

ప్రపంచంలో అత్యధిక యురేనియం నిల్వలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. నిల్వలు ఉండడమే కాకుండా వాటిని వెలికి తీసి, శుద్ధి చేసి ఇంధనం రూపంలో అందించగల పరిజ్ఞానం ఆస్ట్రేలియా వద్ద ఉంది. ఈ పరిజ్ఞానాన్ని ఆ దేశానికి అందజేసింది అమెరికా, బ్రిటన్ లే. ఆస్ట్రేలియా ఇప్పటికీ బ్రిటిష్ కామన్ వెల్త్ లో భాగం. బ్రిటిష్ రాచరికాన్ని అంగీకరిస్తుంది. అనగా ఆస్ట్రేలియా రిపబ్లిక్ రాజ్యం కాదు. ఈ నేపధ్యంలో అమెరికా, బ్రిటన్ తలపెట్టే పాపకార్యాలలో దాదాపు అన్నింటిలోనూ ఆస్ట్రేలియా భాగం తీసుకుంటుంది. ఆ విధంగా అమెరికా, ఐరోపా రాజ్యాలకు యురేనియం సరఫరాదారుగా ఆస్ట్రేలియాను తయారు చేసుకున్నారు.

ఇండియా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయకపోయినా యురేనియం ఇవ్వడానికి ఆస్ట్రేలియా ఎందుకు ఒప్పుకుంది? ఈ ప్రశ్నకు టోనీ అబ్బాట్ చెప్పిన సమాధానం:

“ఇండియాను ప్రత్యేక దేశంగా మేము భావిస్తున్నాము. ఇండియా తన అణు సామర్ధ్యం విషయంలో నమూనా ప్రవర్తన కలిగిఉన్న దృష్ట్యా ఈ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. న్యూ ఢిల్లీలో రాజకీయ అధికారంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ స్వతంత్రం పొందినప్పటి నుండీ ఇండియా అంతర్జాతీయ చట్టాలను బహు జాగ్రత్తగా పాటించింది. మా మధ్య అత్యంత ఉన్నత స్ధాయి నమ్మకం నెలకొని ఉంది. అందుకే మేము ఒప్పందంపై సంతకం చేస్తున్నాము.”

జపాన్ మాత్రం సరిగ్గా అంతర్జాతీయ చట్టాలను కారణాలుగా చూపుతూ పౌర అణు ఒప్పందం కుదుర్చుకోడానికి షరతులు విధించడం గమనార్హం. అంతర్జాతీయ చట్టాలను ఇండియా పాటించడం లేదనీ, సదరు చట్టాల ప్రకారం మరిన్ని అంతర్జాతీయ తనిఖీలకు అనుమతించాలనీ, అణు కర్మాగారాలన్నింటిలో కెమెరాలు అమర్చనియ్యాలని, ఎన్.పి.టిపై సంతకం చేయాలని షరతులు పెట్టింది. ఈ షరతులకు ఒప్పుకుంటే భారత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది గనుక ఒప్పందం వాయిదా పడింది (రద్దు కాకపోవడం గమనించాల్సిన విషయం).

ఇవే కారణాలు ఆస్ట్రేలియాకు కూడా వర్తిస్తాయి. అయితే ఆస్ట్రేలియా మరోవైపు చూడడానికే నిశ్చయించుకుంది. జపాన్ తో ఒప్పందం వాయిదా పడినప్పుడే ఆస్ట్రేలియా నుండి ప్రకటన వెలువడింది. తమకు జపాన్ కు ఉన్న అభ్యంతరాలు లేవనీ, ఇండియాపై తమకు ఉన్న నమ్మకమే చాలనీ ఆస్ట్రేలియా ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ తేడాలను జపాన్, ఆస్ట్రేలియా & అమెరికా ల వాణిజ్య ప్రయోజనాల మధ్య తేడాగా చూడవలసి ఉంటుంది. వివిధ అంతర్జాతీయ కేంద్రాల మధ్య నెలకొన్న వాణిజ్య విభేదాల వల్ల ఒక కేంద్రం ఇండియా వైపు మొగ్గు చూపితే మరో కేంద్రం మరిన్ని చర్యలు కావాలని కోరింది.

తాను ఇండియాకు యురేనియం సరఫరా చేయడానికి అంగీకరిస్తున్నాను గనుక ఆస్ట్రేలియాకు ఇండియా నుండి మరిన్ని పెట్టుబడులు రావాలని భావిస్తున్నానని టోనీ అబ్బాట్ చెప్పాడు. టోనీ అబ్బాట్ ఉన్న విషయాన్ని దాచుకోలేదు. ‘నీకు ఇది ఇస్తున్నా కాబట్టి నాకు అది ఇవ్వు’ అని ఆయన బహిరంగంగానే బేరం ఆడుతున్నాడు. నిజానికి అణు ఇంధనం సరఫరాకు ఒప్పందం కుదరడానికి ముందే ఇండియాకు చెందిన అదాని (గుజరాత్), జి.వి.కె (ఆంధ్ర ప్రదేశ్) పారిశ్రామిక గ్రూపులు ఆస్ట్రేలియాలో భారీ పెట్టుబడులు ప్రకటించాయి.

క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలోని అతి పెద్ద బొగ్గు గని కార్మైఖేల్ తవ్వకాలకు ఆదానీ 16 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు జులైలో ఒప్పందం కుదిరింది. ఈ బొగ్గును ఇండియాయే కొనుగోలు చేయనుంది. తమ బొగ్గుతో 10 కోట్ల మంది భారతీయుల ఇళ్ళు విద్యుత్ వెలుగులతో నిండిపోతాయని అబ్బాట్ ఘనంగా చాటాడు. బొగ్గు తవ్వకాలకు ఆస్ట్రేలియా 36 షరతులు విధించింది. ఈ షరతులను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. బొగ్గు రవాణాకు అవసరమైన 300 కి.మీ రైల్వే లైన్లను కూడా ఆదానీ కంపెనీయే (ఆస్ట్రేలియాలో) నిర్మించనుంది. కార్మైఖేల్ గని నుండి సం.కి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఇండియా కొనుగోలు చేయాలి.

బొగ్గు తవ్వకాలను చేపట్టే ఆదాని పవర్ కంపెనీ ఆదానీ గ్రూపు పూర్తి సొంతదారు. కానీ ఆదానీ గ్రూపులో విదేశీ బహుళజాతి బ్యాంకుల, కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. కార్మైఖేల్ గని అభివృద్ధికోసం కూడా ఆదాని గ్రూపు అంతర్జాతీయ పెట్టుబడుదారుల కోసం చూస్తోంది. సగం వాటాను భాగస్వామి నుండి సమకూర్చడానికి ప్రయత్నిస్తోంది. కానీ అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పడిపోతుండడంతో ఆస్ట్రేలియాలో బొగ్గు గని తవ్వకాలు నిర్వహిస్తున్న పలు అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. ఆంగ్లో అమెరికన్, రియో టింటో, బి.హెచ్.పి బిలిటన్ లాంటి భారీ కంపెనీలు సైతం ఆస్ట్రేలియా నుండి విరమించుకున్నాయి. ఆ స్ధానాన్ని జి.వి.కె, అదాని కంపెనీలు భర్తీ చేశాయి.

జి.వి.కె కంపెనీ పరిస్ధితి కూడా ఇదే. పైకి కనపడేది భారత కంపెనీ. కానీ అవి పొందే కాంట్రాక్టుల్లో వాటాలు విదేశీ బహూళజాతి కంపెనీల చేతుల్లో ఉంటాయి. ఇవి భారత కంపెనీల విదేశీ విస్తరణగా ప్రచారం పొందుతాయి. ఈ ప్రచారంతో భారతీయుల జాతీయ ఛాతీ ఉప్పొంగిపోతుంది. ప్రజలకు కనపడని మరో విషయం ఆదాని, జి.వి.కె కంపెనీలు తమ భారతీయ విద్యుదుత్పత్తి మరియు పోర్టు కంపెనీలను కూడా విదేశీ కంపెనీలకు అమ్మజూపుతున్నాయి.

యురేనియం ఇంధనంగానీ అణు విద్యుత్తు గానీ పాలకులు చెబుతున్నట్లుగా, పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రచారం చేస్తున్నట్లుగా శుభ్రమైన, కాలుష్య రహిత ఇంధనం కానేకాదు. యురేనియం కాలుష్య రహితం అయితే ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల భయపడాల్సిన పనేముంది? మరే ఇంధనం కన్నా కూడా అణు ఇంధనం అత్యంత ప్రమాదకరమైనది. బొగ్గు వల్ల కర్బన ఉద్గారాలు వెలువడి ఓజోన్ పొర క్షీణిస్తుంది. బొగ్గు వినియోగం, ఇతర శిలాజ ఇంధనాల వినియోగం తగ్గిస్తే ఓజోన్ పొర మళ్ళీ పూడుకుంటుంది.

కానీ అణు వ్యర్ధాలను శతాబ్దాల తరబడి శ్రమించినా శుభ్రం చేయలేము. ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీ మొత్తాన్ని భారీ నిర్మాణాలతో కప్పేశారు. 30 యేళ్ళ తర్వాత ఆ నిర్మాణాలు బలహీనపడి రేడియేషన్ వెలువడే ప్రమాదం మళ్ళీ తలెత్తింది. ఫుకుషిమా కర్మాగారం ఇప్పటికీ భారీ రేడియేషన్ ను సముద్రంలోనూ, గాలిలోనూ కలుస్తోంది. ఈ ప్రమాద వార్తలను అసలు పత్రికల్లోనే లేకుండా చేయడంలో అణు పరిశ్రమ సఫలం అవుతోంది.

ఫలితంగా భారత్ లాంటి దేశాలకు అణు రియాక్టర్లను, అణు ఇంధనాన్ని అంటగట్టడానికి అమెరికా, జపాన్, ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు క్యూ కట్టి నిలబడ్డాయి. అణు విద్యుత్ కోసం భారీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందులో పదో వంతు పెట్టినా ఆరోగ్యకరమైన పవన, సౌర విద్యుత్ విద్యుత్ ను సరిపడా ఉత్పత్తి చేసుకోవచ్చు. కానీ వివిధ దేశాల పాలకులకు అణు బాంబులు కావాలి. ఆ ఒక్క కారణంతో విద్యుత్ ఉత్పత్తి సాకు చూపిస్తూ అణు ప్రమాదాన్ని ప్రమ ప్రజల నెత్తిపై రుద్దుతున్నారు. ఇది తీవ్ర ఆక్షేపణీయం.

2 thoughts on “ఇండియా-ఆస్ట్రేలియా: కుదిరిన అణు ఒప్పందం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s