ఐరోపా సంక్షోభ తీవ్రతను తెలియజేస్తూ 17 దేశాల యూరోజోన్ కూటమి వడ్డీ రేటును మళ్ళీ తగ్గించారు. ఆగస్టు ప్రారంభంలో 0.25 శాతం ఉన్న వడ్డీ రేటును 0.15 శాతానికి తగ్గించిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఇప్పుడు దానిని కూడా తగ్గించి 0.05 శాతానికి చేర్చింది. ఇంత తక్కువ వడ్డీ రేటు బహుశా ప్రపంచం ఎరిగి ఉండదు.
సెంట్రల్ బ్యాంకు/రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు తగ్గిస్తే ఆ మేరకు బ్యాంకులకు, తద్వారా కంపెనీలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. ఆ విధంగా వచ్చిన అదనపు నిధులను రుణాలుగా తీసుకున్న కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని పెంచి తద్వారా జి.డి.పిని పెంచుతారన్నది ఆర్ధిక సూత్రం.
ఈ సూత్రం ప్రకారమే అమెరికా, ఐరోపాలలో వడ్డీ రేటును ఇంకా ఇంకా తగ్గిస్తూ పోతున్నారు. కంపెనీలు రుణాల ద్వారా సేకరించిన పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభిస్తే ఆ మేరకు ఉపాధి లభిస్తుంది. ఉపాధి పొందిన వాళ్ళు కొనుగోళ్ళు చేస్తారు. కనుక వినిమయం పెరుగుతుంది. వినిమయం పెరిగుతూ ఉంటే ఉత్పత్తిని మరింత పెంచుతారు. ఈ చక్రభ్రమణ ప్రక్రియా ఇలా కొనసాగి క్రమంగా ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభం నుండి తేరుకోవాలి.
కానీ సెంట్రల్ బ్యాంకుల అతి తీవ్ర సరళతర ద్రవ్య విధానం (ultra loose monetary policy) ద్వారా లభించిన నిధులను బ్యాంకులు, కంపెనీలు ఉత్పత్తి కార్యకలాపాలలోకి పెద్దగా తరలించడం లేదు. దానికి బదులుగా షేర్ మార్కెట్ లో స్పెక్యులేటివ్ కార్యకలాపాలకు డబ్బు తరలిస్తున్నాయి. ఫలితంగా ఒక పక్క షేర్ మార్కెట్లు పెరుగుతూ పోతుండగా మరో పక్క ఆర్ధిక వ్యవస్ధ కుచించుకుపోతోంది.
జర్మనీ, ఫ్రాన్స్ లాంటి హేమా హేమీలు యూరో జోన్ లో భాగంగా ఉన్నప్పటికీ 2014 రెండవ త్రైమాసికంలో యూరో ఏరియా జి.డి.పి వృద్ధి చెందకుండా స్తంభించిపోయిందంటే (జి.డి.పి వృద్ధి రేటు 0 శాతం) పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. జనానికి అత్యంత ఘోరమైన పొదుపు విధానాలు అమలు చేస్తూ కంపెనీలకేమో అత్యంత సరళతరమైన ద్రవ్య విధానాన్ని అందుబాటులో ఉంచితే ఫలితం ఇంతకు మించి మరో విధంగా ఉండబోదు.
అందుకు కారణం చాలా సింపుల్. అందరికీ తెలిసినదే. ఆర్ధిక వ్యవస్ధలో కదలిక ఉండాలంటే ఉత్పత్తి అయిన సరుకులు ఎప్పటికప్పుడు అమ్ముడవ్వాలి. కొనుగోలుదారులు/వినియోగదారుల వద్ద డబ్బు ఉంటే కదా సరుకులు కొనేది? కానీ యూరప్ రాజ్యాలు అనుసరిస్తున్న పొదుపు విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని నానాటికీ హరించివేస్తున్నాయి.
ఉద్యోగాలు రద్దు చేసి, వేతనాలు తెగ్గోసి, సదుపాయాలు ఎత్తివేసి… ఇలా ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకుండా చేస్తే సరుకులు కొనేదేవరు? పొదుపు విధానాలు ప్రజల ఆదాయాలను తగ్గించి ధనిక వర్గాల వద్ద మరింత సంపద పేరుకునేలా చేస్తున్నాయి. ఫలితంగా ఆదాయ అంతరాలు ఇంకా తీవ్రం అవుతున్నాయి. ధనికవర్గాలు మార్కెట్లో సరుకులన్నీ కొనేయరు గదా! దానితో జనం దగ్గర డబ్బు లేదు గానీ మార్కెట్లో సరుకులు మాత్రం పేరుకుపోతున్నాయి. ఇది అధిక ఉత్పత్తి సంక్షోభం కూడా పెట్టుబడిదారీ విధానంలోని మౌలిక వైరుధ్యం ఇది.
విచిత్రం ఏమిటంటే తమ దగ్గర బేంకులు డబ్బు డిపాజిట్ చేయకుండా నిరోధించడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అనూహ్య విధానాన్ని అనుసరిస్తోంది. తమ వద్ద డిపాజిట్ చేస్తే 0.2 శాతం వడ్డీని బ్యాంకుల నుండే వసూలు చేస్తోంది. ఎదురు వడ్డీ అన్నమాట. ఆర్ధిక భాషలో చెప్పాలంటే నెగిటివ్ వడ్డీ రేటును బ్యాంకుల డిపాజిట్లకు చెల్లిస్తోంది. ఆ విధంగా బ్యాంకులు తమ నిధులను వదిలించుకోకుండా నిరోధిస్తోంది. అధిక ఉత్పత్తి సంక్షోభం వల్ల ఏర్పడే విచిత్ర పరిస్ధితి ఇది. మెజారిటీ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ఉత్పత్తులు కొనేవారు లేకపోతే ఏర్పడే పరిస్ధితి. పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రం అయినప్పుడు ఇలాంటి విచిత్రాలు ఎన్నో చోటు చేసుకుంటాయి. ఎన్ని జరిగినా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు మాత్రం చేపట్టరు.
యూరో జోన్ పరిస్ధితికి అక్కడి పెట్టుబడిదారీ అంతర్గత సంక్షోభంతో పాటు ఉక్రెయిన్ సంక్షోభం కూడా బాహ్యంగా ఒక పాత్ర పోషిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం సాకు చూపుతూ రష్యాపై విధించిన ఆంక్షల వల్ల ఐరోపా ఆహార దిగుమతులపై రష్యా ప్రతీకార ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తమ ఆంక్షల వల్ల రష్యా ఆర్ధిక పరిస్ధితి దిగజారిందని ఒబామా, కామెరాన్ తదితరులు చంకలు గుద్దుకుంటున్నారు. తీరా చూస్తే రష్యా ఆంక్షలు ఐరోపాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అందుకే ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం కోసం జర్మనీ అధినేత మెర్కెల్, ఇ.సి.బి అధికారులు, ఐ.ఎం.ఎఫ్ అధికారులు బేరసారాలు జరుపుతున్నారు. ఒక పక్క బేరాలు సాగిస్తూ మరో పక్క సిగ్గు లేకుండా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నామని వదరుతున్నారు. ఫాల్స్ ప్రిస్టేజ్ అన్నమాట!
యూరో జోన్ దేశాల కూటమి ఈ యేడు వార్షిక జి.డి.పి వృద్ధి రేటు 0.9 శాతం మాత్రమే నమోదు చేస్తుందని ఇ.సి.బి అంచనా వేసింది. 2015లో కాస్త పెరిగి 1.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. తాను తాజాగా ప్రకటించిన చర్యలకు ఇ.సి.బి లో పూర్తి మద్దతు లేదని ఇ.సి.బి అధ్యక్షుడు మేరియో ద్రాఘి ప్రకటించడం విశేషం. ఇది మెజారిటీ నిర్ణయం అని ఆయన చెప్పారు. సంక్షోభ పరిస్ధితుల పరిష్కారానికి యూరో జోన్ రాజ్యాల మధ్య విభేదాలు నెలకొన్నాయని ఆయన ప్రకటన ద్వారా తెలుస్తోంది.
సార్వభౌమ ఋణ పత్రాల కొనుగోలు, ఆస్తులకు సెక్యూరిటీలు జారీ చేయడం లాంటి ఇతర చర్యలను కూడా ఇ.సి.బి అధ్యక్షుడు ప్రకటించాడు. సంక్షోభ పరిష్కారానికి ఇవి తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎన్ని చేసినా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు తీసుకోకపోతే సంక్షోభం మరింత ముదురుతుందే తప్ప శాంతించబోదు.
sir, you said about ECB, when i searched about that i came to know that it is external commercial borrowing. is it so. you have repeated the same word two to three times in your article. for our convince please expand at least once which are not so popular like GDP.
regards
గోపీనాధ్ గారూ, ఇ.సి.బి అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు. వడ్డీ రేట్లు నిర్ణయించేది ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులే. యూరో జోన్ దేశాలన్నింటికీ యూరో ఉమ్మడి కరెన్సీ. కాబట్టి ఆ దేశాలన్నీ ఉమ్మడి సెంట్రల్ బ్యాంకు ఏర్పాటు చేశాయి. తమ తమ సెంట్రల్ బ్యాంకులకు అది అదనం.
ఆర్టికల్ కింద ట్యాగ్స్ ఉన్నాయి గమనించారా? అందులో ఇ.సి.బి ఒకటి. అది క్లిక్ చేస్తే ఆ ట్యాగ్ ఉన్న ఇతర ఆర్టికల్స్ ని చూడవచ్చు.
Very good analysis sir