A for Achche din…
గతంలో ఎన్నడూ ఎవరూ పెద్దగా పట్టించుకోని ‘ఉపాధ్యాయ దినోత్సవం’ (సెప్టెంబర్ 5) ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడి పుణ్యమాని ఓ పెద్ద చర్చాంశం అయింది. రాజకీయాలకు అతీతంగా నిస్పాక్షిక సంబరంగా ఇన్నాళ్లూ ఉంటూ వచ్చిన ఉపాధ్యాయ దినం ఇప్పుడు రాజకీయ ప్రకటనలకు వేదిక కావడమూ ప్రధాని మోడి పుణ్యమే.
‘చాయ్ పే చర్చా’ తరహాలో ప్రధాన మంత్రి స్వయంగా పిల్లలతో మాట్లాడుతారంటూ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించిన దగ్గర్నుండి పత్రికల్లో కలకలం మొదలైంది. మోడి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అవుతున్న దృష్ట్యా విద్యార్ధులు ప్రసంగం వినడానికి వీలుగా పాఠశాలలు తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె విద్యా శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. దానితో రాజకీయ చర్చలకు దూరంగా ఉంచవలసిన స్కూల్ పిల్లలతో నేరుగా మాట్లాడడం అంటే వారిని ప్రభావితం చేసే ఉద్దేశ్యం అందులో దాగి ఉందని విమర్శలు బయలుదేరాయి.
విమర్శకులకు సమాధానం ఇస్తూ మానవ వనరుల మంత్రి ‘ప్రధాని ప్రసంగాన్ని పిల్లలు చూసి తీరాలన్న రూల్ ఏమీ లేదని, స్వచ్ఛందంగా ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చని సూచించారు. తద్వారా కార్యక్రమం వెనుక నిజంగానే ఏదో ఉద్దేశ్యం ఉందన్న అర్ధాన్ని ఆమె ధ్వనింపజేశారు.
కానీ వాస్తవంలో ప్రైవేటు, ప్రభుత్వం అన్న తేడా లేకుండా పాఠశాలలన్నింటికీ ఆయా జిల్లాల విద్యాధికారుల ద్వారా ఆదేశాలు వెళ్ళాయని పత్రికలు వెల్లడించాయి. ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ప్రధాని ప్రసంగం మొదలయ్యే సమయానికి తప్పనిసరిగా సరిపోయినన్ని టి.విలను పాఠశాలలో అమర్చాలని ఈ ఆదేశాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. వీలయితే పెద్ద తెరలను అమర్చాలని, సెట్ టాప్ బాక్స్, కనెక్షన్ తదితర సౌకర్యాలను అద్దె ప్రాతిపదికన తెచ్చి అమర్చాలని ఆదేశాలు వెళ్ళాయని ది హిందు తెలిపింది.
కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లోనైతే ప్రధాని ప్రసంగం కోసం ఏకంగా పాఠశాల సమయాలనే మార్చివేశారు. మార్చిన సమయాలకు అనుగుణంగా తగిన సౌకర్యాలను (బస్సులు, ఆహారం మొ.వి) మాత్రం ఏర్పాటు చేయలేదు. కేంద్రీయ విద్యాలయ పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రుల అసోసియేషన్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. పిల్లల డైరీల్లో రెండు రోజులు ముందుగానే కార్యక్రమం గురించి తెలియజేశామని కేంద్రీయ విద్యాలయ సంస్ధ వాళ్ళు సమాధానం ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రధాని ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని పాఠశాలలకు చేరవేయడానికి ముందుగానే నిరాకరించింది. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని, చాలా పాఠశాలల్లో తగిన సౌకర్యాలు లేవని బెంగాల్ ప్రభుత్వం కారణాలుగా చెప్పింది. చెప్పినట్లుగానే ప్రధాని ప్రసంగానికి ఏర్పాట్లు చేయకపోవడంతో బెంగాల్ ప్రభుత్వంపై బి.జె.పి విరుచుకుపడింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడింది.
విచిత్రంగా పవిత్రమైన ఉపాధ్యాయ దినాన్ని రాజకీయమయం చేశారని ఆరోపించింది. మానవ వనరుల శాఖ మంత్రిగారే స్వయంగా కార్యక్రమం తప్పనిసరి కాదని ‘స్వచ్ఛందం’ (optional) మాత్రమే అని చెప్పినా బి.జె.పి మాత్రం బెంగాల్ ప్రభుత్వ చర్యలో రాజకీయాలను చూడడానికే నిర్ణయించుకుంది.
బెంగాల్ చర్య రాజకీయం అయితే బి.జె.పి ప్రభుత్వం చర్య కూడా రాజకీయం కాకుండా పోతుందా?
నరేంద్ర మోడి హామీ ఇచ్చిన ‘అచ్చే దిన్’ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చిన నినాదం. అదే నినాదాన్ని టీచర్స్ డే రోజున పిల్లలకు పాఠంగా చెప్పడం ద్వారా ఆయన టీచర్స్ డే ను కూడా రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించారని కార్టూనిస్టు పరోక్షంగా సూచించారు.
When May Day can be hijacked from USA and made a political event in India, there is no wonder you call celebration of Teacher’s Day is politicised.