ఉపఖండంలో ఆల్-ఖైదా, పశ్చిమ జోక్యానికి సూచిక


Ayman al-Zawahiri

భారత ఉపఖండంలో ఆల్-ఖైదా విభాగాన్ని స్ధాపించినట్లు ఆల్-ఖైదా నేతగా చెప్పుకునే అయిమన్ ఆల్-జవహరి ప్రకటించాడు. ఈ విభాగం ద్వారా భారత ఉపఖండం అంతటా జీహాద్ విస్తరణకు పాటుపడనున్నట్లు తెలిపాడు. ఆన్-లైన్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఆల్-జవహరి ‘ఖైదత్ ఆల్-జిహాద్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్’ ఏర్పాటు చేసినట్లు తెలిపాడు.

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, సోమాలియా, యెమెన్, మాలి, లిబియా తదితర దేశాల్లో మొదట ఆల్-ఖైదా లేదా మరో పేరుతో టెర్రరిస్టులను ప్రవేశపెట్టడం, అనంతరం వారిని సాకుగా చూపుతూ ఆయా దేశాలలో సైనికంగా జోక్యం చేసుకోవడం… ఒక ఎత్తుగడగా, విధానంగా పశ్చిమ దేశాలు అమలు చేశాయి. భారత ఉపఖండం పరిస్ధితి కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండబోదు.

సమీప భవిష్యత్తులో భారత దేశంలో నూతన ఆర్ధిక విధానాలను దూకుడుగా అమలు చేయడానికి భారత పాలక వర్గాలు ఉద్యుక్తులవుతున్నారు. ఈ విధానాలు పశ్చిమ బహుళజాతి కంపెనీల కోసమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంస్కరణలను నిక్కచ్చిగా, వేగవంతంగా అమలు చేస్తామని ఎన్.డి.ఏ పాలకులు ఇప్పటికే అనేకసార్లు నొక్కి చెప్పారు కూడా. ప్రజానుకూల విధానాలను ‘మతిలేని పాపులిస్టు విధానాలు’గా కొట్టిపారేసిన ఆర్ధిక మంత్రి ప్రకటన నిన్నమొన్నటిదే.

రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు తదితర శ్రామిక వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే నూతన ఆర్ధిక విధానాలను దూకుడుగా అమలు చేస్తే వారి నుండి ప్రతిఘటన అనివార్యంగానే ఎదురవుతుంది. ఈ ప్రతిఘటనను ఉక్కుపాదంతో అణచివేయడానికి తగిన చట్టాలను చేసుకోవాలని పాలకులు భావిస్తున్నారు. టాడా, (Terrorist And Disruptive Activities (Prevention) Act), UAPA (Unlawful Activities (Prevention) Act) లాంటి చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నది బి.జె.పి/ఎన్.డి.ఏ పాలకులు బహిరంగంగానే చెబుతారు. ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత పేరుతో ఉనికిలోకి వచ్చిన ఈ చట్టాలు ప్రధానంగా ప్రయోగించింది ప్రజల ఉద్యమాల పైననే.

నూతన ఆర్ధిక విధానాలను వేగవంతం చేయడంలో యు.పి.ఏ, ఎన్.డి.ఏ ప్రభుత్వాలు లేదా గ్రూపుల మధ్య విభేదాలు ఏమీ లేవు. కానీ ప్రజలకు మాయమాటలు చెప్పి అమలు చేయవచ్చని ఒక పక్షం భావిస్తే, అసంతృప్తి, ప్రతిఘటనలను ఉక్కుపాదంతో అణచివేసయినా అమలు చేయాలన్నది మరో పక్షం నిర్ధారణ. ఒకపక్క సంస్కరణలను అమలు చేస్తూనే మరో పక్క అటవీ హక్కుల చట్టం, భూసేకరణ చట్టం, గ్రామీణ ఉపాధి పధకం లాంటి చట్టాలు, పధకాలను అమలు చేయడం ద్వారా జోడు గుర్రాల సవారీని యు.పి.ఏ చేపట్టేందుకు ప్రయత్నించింది.

యు.పి.ఏ జోడు గుర్రాల సవారి ఆచరణలో విఫలం అయిందని, ఇక కఠిన అణచివేత పద్ధతులే మార్గమని భారత పాలక వర్గాలు, వారి మాస్టర్లయిన పశ్చిమ సామ్రాజ్యవాదులు నిర్ణయించుకున్నాయి. ఫలితంగా నరేంద్ర మోడి భారత భాగ్య విధాతగా ప్రచారం చేయడానికి వాల్ స్ట్రీట్ కంపెనీలే రంగంలోకి దిగాయి. వినూత్న ప్రచార ఎత్తుగడలను అమలు చేశాయి.

గత రెండు మూడేళ్లలో తక్కువ తీవ్రత కలిగిన మత కల్లోలాలు వివిధ చోట్ల రెచ్చగొట్టబడ్డాయి. సాఫ్ట్ ఉగ్రవాద పేలుళ్లు కూడా వివిధ ప్రాంతాల్లో వరుసగా చోటు చేసుకున్నాయి. ఫలితంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో ఓటర్లు స్పష్టంగా చీలిపోయి తమ ప్రాధామ్యాలను ఎంచుకునే పరిస్ధితి ఏర్పడింది. దానికి తగిన ఫలితాలు సైతం ఎన్నికల్లో ‘అనూహ్య ఫలితాలు’గా నమోదయ్యాయి. తర్వాత కధ తెలిసిందే.

ఇప్పుడిక గతంలో యు.పి.ఏ రద్దు చేసిన TADA, UAPA చట్టాల స్ధానంలో సరికొత్త కోరలు తొడిగిన చట్టాలను చేసుకోవాలి. అందుకు తగిన కారణాలు కావాలి. భారత ఉపఖండంలో ఆల్-ఖైదా ఏర్పడింది గనుక బహుశా త్వరలో/కాస్త ఆలస్యంగా అయినా వరుస ఉగ్రవాద పేలుళ్లు జరగవచ్చు. పదులు లేదా వందల సంఖ్యలో అమాయక పౌరులు మరణించవచ్చు. దానితో ప్రజల్లో ముస్లిం ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాలన్న కసి రేకెత్తుతుంది. ప్రభుత్వం నిద్రపోతోందా అని పత్రికలు ప్రశ్నిస్తాయి. ఈ ప్రశ్నలు నేరుగా పశ్చిమ కార్పొరేట్ పత్రికల నుండి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏదో ఒకటి చేయాలని ప్రజలంతా ఒక్కుమ్మడిగా ఆలోచించేలా చేయడంలో పత్రికలు తమ వంతు పాత్ర పోషిస్తాయి.

దరిమిలా ఉగ్రవాద నిర్మూలనా చట్టాలు చేసేందుకు ప్రభుత్వాలకు ప్రజల ఆమోదం లభిస్తుంది. వీలయితే విదేశాల గూఢచార సంస్ధల సహాయం తీసుకోవాలని ఎవరో ఒకరు ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదనకు విస్తృత ప్రచారం లభిస్తుండగానే విదేశీ గూఢచార అధికారులు ఉపఖండంలో సేవలు అందిస్తున్న వార్తలు వెలువడవచ్చు.

నూతన ఆర్ధిక విధానాల మలివిడత అమలుకు ప్రజల నుండి ఎంత తీవ్రంగా ప్రతిఘటన ఎదురయితే వారి అణచివేత కోసం అంత తీవ్రమైన చట్టాలు ఉనికిలోకి వస్తాయి. ఉగ్రవాదం తుదముట్టించడానికే ఈ చట్టాలని ప్రభుత్వాలు, పెట్టుబడిదారుల (ధనిక వర్గాల) విష ప(పు)త్రికలు ప్రజలను నమ్మమంటాయి. ఆచరణలో అవి అమలవుతున్నది న్యాయమైన ప్రజా ఉద్యమాలపైనే అన్న సంగతిని పత్రికలు విస్మరిస్తాయి.

ఆల్-ఖైదా అంటే ఇదే. ఆల్-ఖైదా పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికా చేతుల్లో ఒక నమ్మకమైన పనిముట్టు. ఆఫ్ఘనిస్తాన్ లో జోక్యానికి అమెరికా చూపిన కారణం ఆల్-ఖైదా/లాడెన్. ఇరాక్ పై దురాక్రమణ దాడికి అమెరికా చూపిన కారణం ఆల్-ఖైదా మరియు సామూహిక విధ్వంసక మారణాయుధాలు. లిబియాలో జోక్యానికి అమెరికా చూపిన కారణం కల్నల్ గడ్డాఫీ ఆల్-ఖైదాకు మద్దతు ఇచ్చాడని. సోమాలియా, యెమెన్ లపై అమెరికా డ్రోన్ లు సాగిస్తున్న నరహంతక క్షిపణి దాడులకు అమెరికా చూపుతున్న కారణం ఆల్-ఖైదా నేతలను అంతం చేయడం. ఇరాక్ లో మరో తడవ సైనికులను దించడానికి అమెరికా చూపుతున్న కారణం ‘ఆల్-ఖైదా కంటే ప్రమాదకరమైన ఇస్లామిక్ స్టేట్ లేదా మాజీ ఇసిస్/ఇసిల్.

ఆఫ్ఘన్ దాడి ద్వారా ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో కీలకమైన స్ధానంలో అమెరికా సామ్రాజ్యవాదం తిష్ట వేసింది. లిబియా దాడి ద్వారా ఉత్తర ఆఫ్రికాలో బలమైన సామ్రాజ్యవాద ప్రతిఘటనను అది నిర్మూలించుకుంది. మాలి పై ఫ్రెంచి & అమెరికన్ దాడుల ద్వారా స్ధానిక తౌరెగ్ గిరిజన ప్రజల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షలను కర్కశంగా అణచివేశారు. విస్తారమైన ఖనిజవనరులపై పట్టు సంపాదించారు. సిరియాపై దాడి ద్వారా ఇరాక్ + సిరియా భూభాగాన్ని ముస్లిం సెక్టేరియన్ ఐడెంటిటీ హింసావలయంలోకి నేట్టేసి మూడు సెక్టేరియన్ రాజ్యాల (షియా స్ధాన్, సున్నీ స్ధాన్, కుర్దిస్తాన్) ఏర్పాటులో సామ్రాజ్యవాదులు ముందుకు సాగుతున్నారు. తద్వారా నిబద్ధతతో కూడిన సెక్యులరిస్టు అరబ్ జాతీయ వాదాన్ని బలహీనపరచేందుకు కుట్ర పన్నారు.

యూజ్ & త్రో (Use & Throw)! కంపెనీల సరుకులను ఒకదాని తర్వాత మరొకటి కొంటూ పోవడానికి పశ్చిమ కార్పొరేట్ బహుళజాతి కంపెనీలు ప్రవేశ పెట్టిన సరికొత్త టెక్నిక్ ఇది! ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకు పోసుకునే ఫౌంటెన్ పెన్ లు లేవు. మళ్ళీ మళ్ళీ బాల్ పాయింట్ ట్యూబ్ లు వినియోగించే బాల్ పెన్నులు లేవు. ఏ పెన్ అయినా వాడి పారేసేదే. గడ్డం గీసుకునే రేజర్ల నుండి వేలకు వేలు ఖరీదు చేసే దుస్తుల వరకు అనేక సరుకుల్లో యూజ్ & త్రో పద్ధతిని ప్రవేశపెట్టి చక్రభ్రమణ (cyclical) లాభాలు పొందే మార్గాన్ని బహుళజాతి కంపెనీలు నిర్మించుకున్నాయి.

ఉగ్రవాద సంస్ధలు (ఉగ్రవాద కంపెనీలు అన్నా ఓ.కె), ఉగ్రవాద నేతలు, ఉగ్రవాద కార్యకర్తలూ అంతే. యూజ్ & త్రో! ఉపయోగపడినంత కాలం ఉపయోగపెట్టుకోవడం, ఇక అనవసరం అనుకుంటే ఒక డ్రోన్ విమానాన్ని పంపి చంపి పారేయడం. ఆనక “కరడుగట్టిన ఉగ్రవాద నేతను చంపేశామహో!” అంటూ పత్రికల చేత బాకాలు ఊడించుకోవడం. ఇదంతా చూసి అటు అలాస్కా నుండి ఇటు టోక్యో వరకూ, పైన ఎస్తోనియా నుండి కింద మాల్దీవుల వరకూ జనం అంతా నిజమే అని నమ్మి ఉగ్రవాద నిర్మూలనా ఛాంపియన్ లకు జేజేలు కొట్టాలి. తమపై ప్రత్యక్షంగా అమలవుతున్న సామ్రాజ్యవాద దోపిడీకి కారణాలు తెలియక జుట్టు పీక్కోవాలి. ప్రజల వేలితో ప్రజల కళ్ళే పొడవడం అన్నట్లు!

ఆల్-ఖైదా ఉగ్రవాద విస్తరణ అసలు అర్ధం ఉగ్రవాద ప్రపంచీకరణ. పాత్రలు, పాత్రధారులు అమాయక ముస్లిం యువత. వారిని ఆడించేది, వారికోసం స్వర్గంలో స్ధానాన్ని రిజర్వ్ చేసేది సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు లేదా ఆ కంపెనీల కోసం పని చేసే పశ్చిమ రాజ్యాలు.

9/11 ఉగ్రవాద దాడులు జరిగినప్పటికి ఆల్-ఖైదా అనే ఉగ్రవాద సంస్ధ అన్నదే లేదంటే నమ్మబుద్ధి కాదు గానీ అది నిజం. ఈ నిజాన్ని ఈ మధ్యనే పక్షపత్రిక ఫ్రంట్ లైన్, దినపత్రిక ది హిందూ గుర్తిస్తూ వివిధ ఆర్టికల్స్ ప్రచురించాయి. ఆల్-ఖైదా అన్నది అప్పటికి సి.ఐ.ఏ రూపొందించుకున్న తన అనుంగు ఉగ్రవాద నాయకుల జాబితా! అవును, జాబితాయే. ఆ జాబితానే ప్రపంచ టెర్రరిస్టు సంస్ధగా పశ్చిమ కార్పొరేట్ విష పుత్రికలు ప్రచారం మొదలు పెట్టగానే ప్రపంచం నమ్మేసింది. ఇప్పటికీ నమ్ముతోంది.

ఇప్పుడా జాబితాలో భారత ఉపఖండంలో పని చేసే ఉగ్రవాద నేతలు చోటు సంపాదించుకోనున్నారు. బహుశా ఇండియన్ ముజాహిదీన్ నాయకులుగా ప్రచారం పొందినవారే రేపు ఇండియన్ ఆల్-ఖైదా నేతలుగా ప్రమోషన్ పొందినా పొందవచ్చు. భారత దేశ ప్రజలు ఇక విశాలమైన, ప్రగతిశీలమైన, శక్తివంతమైన భారత జాతీయ వాదాన్ని విడనాడి సెక్టేరియన్ మత కొట్లాటల్లో మునిగి తేలడానికి ఆల్-ఖైదా ఏర్పాటు ఒక మార్గం. కానీ భారత ప్రజలు ఇలాంటి కుట్రలను గతంలో చాలా చూశారు. స్వతహాగా మతాతీత సెక్యులరిస్టు ప్రేమికులైన సామాన్య భారతం సామ్రాజ్యవాదుల కుట్రలను తిప్పికొడతారు. తిప్పి కొట్టాలి కూడా. లేదంటే మరిన్ని దుర్భర పరిస్ధితులను వారు ఎదుర్కోవలసి ఉంటుంది.

5 thoughts on “ఉపఖండంలో ఆల్-ఖైదా, పశ్చిమ జోక్యానికి సూచిక

  1. స్వతహాగా మతాతీత సెక్యులరిస్టు ప్రేమికులైన సామాన్య భారతం సామ్రాజ్యవాదుల కుట్రలను తిప్పికొడతారు

    సర్, దీనిని విపులీకరిస్తారా?

  2. సంక్షేమ పథకాలు రద్దు చేసినంతమాత్రాన విదేశీ పెట్టుబడులు రావు. సంక్షేమ పథకాల రద్దు వల్ల మిగిలిన డబ్బులని పాలకవర్గంవాళ్ళే తినేస్తారు. లైసెస్ ఫైర్ పెట్టుబడిదారులకి సమాజం విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండడం ఇష్టం లేదు. అందుకే వీళ్ళు సంక్షేమ పథకాలకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు.

  3. బి.జె.పి. ఏమీ దేశభక్తుల పార్తీ కాదు. వికీపీదియావాళ్ళు గిల్గిత్-బల్తిస్తాన్ & ముజఫరాబాద్ ప్రాంతాలని పాకిస్తాన్‌లో ఉన్నట్టు మేప్‌లు చూపిస్తోన్నా మన స్వయంప్రకటిత హిందూత్వ పార్తీకి చీమ కుట్టినట్టు కూడా లేదు.

  4. అన్నంత అపని జరిగిందన్న మాట! నాటకంలో మొదటి అంకానికి తెర లేచిందా? ఎంత మంది అమాయకులు బలి పసువులు కావాలో?! భారత దేశం మరో రావణ కాష్టం కాబోతుందా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s