అమెరికా కరువుకు దృష్టాంతం ఒరోవిల్లే, షాస్టా సరస్సులు -ఫోటోలు


US draught (Click to enlarge)

అమెరికాలో పలు చోట్ల ఇప్పుడు కరువు నెలకొని ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో అతి తీవ్ర కరువు నెలకొని ఉండగా ఇంకా ఇతర చోట్ల ఒక మాదిరి నుండి తీవ్ర స్ధాయి వరకు కరువు పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. కరువు క్రమంగా పుంజుకుంటున్న చోట్లు విస్తరిస్తున్నాయి.

కరువు కారణాలను ప్రకృతి పైకి నెట్టేసి తప్పించుకోవడం ప్రభుత్వాలకు అనాదిగా ఉన్న అలవాటు. వర్షాభావం వల్ల పంటలు పండకపోతే ఆహార గింజల ఉత్పత్తి తగ్గేమాట నిజమే కావచ్చు. కానీ భారీ ఉత్పత్తులు తీయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని మనిషి అభివృద్ధి చేశాడు. ఉత్పత్తి చేసిన పంటలను శీతల గిడ్డంగుల్లో నిలవ చేయగలుగుతున్నాడు. పంటల ఉత్పత్తులను మాత్రమే కాకుండా తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలను సైతం వివిధ పద్ధతుల్లో నిలవ చేయగల సామర్ధ్యం నేటి మనిషికి ఉంది.

చివరికి నీటి యాజమాన్య పద్ధతులను కూడా మనిషి అనూహ్య రీతిలో అభివృద్ధి చేసుకున్నాడు. ఒక సంవత్సరంలో కురిసిన అధిక వర్షాన్ని సమర్ధవంతమైన రీతిలో భూగర్భ జలమట్టం పెరిగేందుకు ఎలా ఉపయోగపెట్టవచ్చో ఇప్పుడు మనిషికి తెలుసు. ఒక నదిలోని అధిక నీటిపారుదలను నీరు అడుగంటిన మరో నదిలోకి ఎలా మళ్లించవచ్చో తెలుసు. కాబట్టి ప్రకృతి వల్ల సభవించిన ఉత్పాతాలను అధిగమించడం తేలిక కాకపోవచ్చు కానీ కష్టం మాత్రం కాదు.

అసలు విషయం ఏమిటంటే అభివృద్ధి చెందిన పరిజ్ఞానం, సౌకర్యాలు అన్నీ మనిషి కోసం కాకుండా మార్కెట్ అవసరాలకు మాత్రమే వినియోగించడం. ఒక ఉత్పత్తి లక్ష్యం మనిషి కాకుండా ఆ ఉత్పత్తిని అమ్మగా వచ్చి పడే లాభమే అయినప్పుడు, మనుషులందరి సౌకర్యం అసలు లక్ష్యమే కాకుండా పోతుంది. లాభాలు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడే అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. ఆస్తులు, వాటివల్ల వచ్చే లాభాలు ఎవరి సొంతం అయితే వారికే అభివృద్ధి చేరువగా ఉంటుంది.

అమెరికా కరువు కూడా ఇందుకు భిన్నం ఏమీ కాదు. లేదంటే అమెరికా బహుళజాతి కంపెనీల వద్ద కుప్పలు కుప్పలుగా డబ్బు, సంపద, వనరులు పోగుపడి ఉండగా అమెరికా సమాజం నిరుద్యోగం, దరిద్రం, అసమానతలు, వివక్షలు తదితర తీవ్ర సమస్యలతో వేగుతుండడం ఎలా జరుగుతుంది?

అమెరికాలో కెల్లా కరువు ఎక్కువ ఉన్న ప్రాంతంగా కాలిఫోర్నియా ప్రస్తుతం పలువురి నోళ్లల్లో నానుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రం ‘అతితీవ్ర కరువు’ ప్రాంతంగా ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్రంలోని 82 శాతం భూభాగం ఈ ‘అతి తీవ్ర కరువు’ జోన్ గా గుర్తించారు. ఎప్పటిలాగే మూడు సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడం చేతనే కాలిఫోర్నియాలో కరువు నెలకొందని ప్రభుత్వాలు, పత్రికలు చెబుతున్నాయి.

వర్షాభావం వల్ల కాలిఫోర్నియాలో ముఖ్యమైన రిజర్వాయర్లు షాష్టా లేక్, లేక్ ఒరోవిల్లే లలో నీరు దాదాపు లేకుండా పోయింది. ఈ రిజర్వాయర్ల పూర్తి సామర్ధ్యంలో కేవలం 30 శాతం మాత్రమే నీరు మిగిలి ఉంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటితే అది వినియోగానికి అందుబాటులో ఉండదన్నది తెలిసిన విషయమే. కనుక 30 శాతం నీరు అంటే దాదాపు లేనట్లుగానే భావించవచ్చు. నీరు అడుక్కి చేరడంతో ఈ సరస్సుల తీరాలు స్పష్టంగా కనిపిస్తూ ఎన్నడూ చూడని దృశ్యాలను వెల్లడి చేస్తున్నాయి. నీటిని చేరడం కోసం నిర్మించిన ర్యాంపులు, రోడ్లు ఎందుకూ పనికిరావడం లేదు. వర్షాభావం వల్ల కాలిఫోర్నియాలో భూగర్భ జలమట్టం కూడా బాగా పడిపోయింది.

పై ఫోటో (మ్యాప్) ను చూసినట్లయితే అమెరికా కరువు తీవ్రత ఏ స్ధాయిలో ఉన్నదో గమనించవచ్చు. ఆగస్టు 26 తేదీ నాటి పరిస్ధితులను సూచిస్తున్న ఈ మ్యాప్ ను బట్టి తూర్పు తీర ప్రాంతాల్లోనూ అసాధారణ పొడి వాతావరణం నెలకొని ఉంది. దాదాపు సగం అమెరికాను అసాధారణ పొడి వాతావరణం చుట్టుముట్టగా నైరుతి (South-West) దిశకు వెళ్ళే కొద్దీ కరువు తీవ్రంగా నెలకొని ఉండడం గమనించవచ్చు. ఈ మ్యాప్ ను బట్టి కాలిఫోర్నియా అతి తీవ్ర కరువు పరిస్ధితి కంటే మరింత తీవ్ర (exceptional draught) కరువు నెలకొని ఉందని తెలుస్తోంది.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం అమెరికాలో తీవ్ర కరువు ఉన్న పక్క పక్క ప్రాంతాలు అమెరికా మొత్తం ఏరియాలో 34 శాతం ఉంటుంది. 1930లు, 1950ల నాటి చరిత్రాత్మక కరువులతో సమానంగా ప్రస్తుత పరిస్ధితి నెలకొని ఉంది. ఈ పరిస్ధితికి గ్లోబల్ వార్మింగే కారణం అని న్యూయార్క్ టైమ్స్ తేల్చింది. తీవ్ర పరిస్ధితులు ఉన్న కాలిఫోర్నియాలో నీటి వినియోగాన్ని తగ్గించడానికి అనేక చర్యలు ప్రకటించారు. రైతుల వినియోగానికి నీరు లేనందున ఏయే పంటలకు నీటిని వినియోగించుకోవాలో ఎంచుకోవాల్సిన పరిస్ధితిలో రైతులు ఉన్నారు. టెక్సాస్, ఓక్లహామా రాష్ట్రాలతో పాటు వాటి చుట్టుపక్కల రాష్ట్రాలకు తీవ్ర కరువు విస్తరిస్తోందని ప్రభుత్వాలు గుర్తించాయి.

గత పదేళ్లుగా అమెరికాలో కరువు పరిస్ధితులు స్ధిరంగా పెరుగుతున్నాయని వాతావరణ పరిశీలకుల అధ్యయనంలో తేలింది. అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడం మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలకు తెలియని వ్యవహారం. ఒకవేళ పాఠాలు నేర్చుకున్నామని చెబితే వాటిని జనానికి వర్తింపజేస్తారు తప్ప ధనిక వర్గాలకు, బహుళజాతి కంపెనీలకు వర్తింపజేయరు. ఫలితంగా ప్రజల కరువు మరింత తీవ్రం అవుతుంది.

కింది ఫొటోల్లో కొన్ని జతల ఫోటోలు ఉన్నాయి. ఈ జతల్లో మొదటిది 2011 జూన్, జులై నెలల్లో తీసిన ఫోటోకాగా రెండవది ఆగస్టు 19, 2014 తేదీన తీసినది. అప్పటికీ ఇప్పటికీ నీటి మట్టం ఎంత తీవ్రంగా పడిపోయిందో ఈ జతల ఫోటోలు పట్టిస్తాయి. ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.

Photos: The Atlantic

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s