అంధులకు చెవులతో లోకాన్ని చూపుతున్న వి.టి.ఇ


VTE founder Y Umamaheswara Rao and his wife Seshamani

VTE founder Y Umamaheswara Rao and his wife Seshamani

‘సిరి వెన్నెల’ సినిమా చూసారా? అందులో పుట్టుకతో కళ్లులేని ఒక పాపకు కళ్ళులేని మరో యువకుడు (హీరో) తన పిల్లన గ్రోవి ద్వారా ‘బృందావనం’ ను దర్శింపజేస్తాడు. అనగా శబ్ద జ్ఞానం ద్వారా ఒక సుందర దృశ్య రూపాన్ని పాప మనసు చూసేలా చేస్తాడు.

ఇటీవల, బహుశా ఓ పదేళ్ళ క్రితం ‘పెళ్లి పందిరి’ పేరుతో మరో సినిమా వచ్చింది. అందులో హీరో గారు కళ్ళు లేని హీరోయిన్ తో తన కళ్ళతోనే లోకాన్ని చూడమని చెబుతూ ‘నేస్తమా, ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా’ అని ప్రతిపాదిస్తాడు. హీరోయిన్ హావ భావాలను వివిధ రంగులతో పోల్చి అవే రంగులు అంటాడు. ఉదయం, సాయంత్రం… ఇలా కాలాన్ని కూడా తన నెచ్చెలి మదిలోని భావాలతో పోల్చి అవే కాలం అంటాడు.

అవి రెండూ సినిమాలు. దర్శకుల ఊహలకు ప్రతిరూపాలు. సినిమా చూసి సంతోషించినా, ‘ఇది నిజంగా జరిగేదేనా’ అన్న నిట్టూర్పులను మాత్రమే మనకవి మిగుల్చుతాయి. కానీ ‘VISION THROUGH EARS’ సంస్ధ చేస్తున్న కృషి తెలుసుకుంటే సదరు సినిమాల్లోని ఆయా పాత్రల ప్రయత్నాలను సంస్ధ సభ్యులు దాదాపుగా ఆచరణలోకి తెస్తున్నారని తెలిసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

వి.టి.ఇ ఒక స్వచ్ఛంద సంస్ధ అని వారి వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది. విద్య పాఠ్య పుస్తకాల ద్వారానే కాకుండా పెద్ద, చిన్న తెరల ద్వారానూ, కంప్యూటర్లు, ఇంటర్నెట్, పత్రికల ద్వారానూ వ్యాపిస్తున్న ప్రపంచంలో ఉన్నామని చెబుతూ ఈ సంస్ధ ఇవేవీ కళ్ళు లేనివారికి ఇంతకాలం అందుబాటులో లేకుండా పోయాయని, అందుకే ఆ ఖాళీని తమకు చేతనైనంత మేరకు భర్తీ చేయడానికి పూనుకున్నామని వి.టి.ఇ బృందం వాళ్ళు వివరించారు.

దృష్టి లోప సవాళ్ళు ఎదుర్కొంటున్నవారు అనేకమందిని దారిద్ర్యం కూడా వేధిస్తోందని ఈ బృందం చాలా సరిగ్గా గుర్తించింది. బ్రెయిలీ లిపి ద్వారా విద్యాభ్యాసం చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఖరీదు దృష్ట్యా అది తక్కువమందికి మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఈ పరిస్ధితుల్లో చూపు లేనివారికి లేదా చూపు తక్కువగా ఉన్నవారికి పుస్తక జ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ‘శబ్ద పుస్తకాలను’ (Audio Books) తయారు చేసేందుకు వి.టి.ఇ పూనుకుంది.

శబ్ద పుస్తకాల ద్వారా వి.టి.ఇ వారు విస్తృత జ్ఞానాన్ని అంధులకు చేరువగా తెస్తున్నారు. పాఠ్య గ్రంధాలను, కధలను, సమమాలీన రాజకీయార్ధిక, సామాజిక సంఘటనలను శబ్ద పుస్తకాలుగా మలిచి సి.డిల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అంధ విద్యార్ధుల కోసం కళలు, సంగీతం, నాటకం, చరిత్ర, ఆర్ధిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, సాహిత్యం ఇంకా అనేక రంగాల సమాచారాన్ని, జ్ఞానాన్ని శబ్ద పుస్తకాలుగా మార్చాలని వి.టి.ఇ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం కాస్త పెద్దదే అయినప్పటికీ ఇప్పటివరకూ వాళ్ళు సాధించిన కృషిని బట్టి చూస్తే అదేమంత అసాధ్యం కాదని అర్ధం అవుతుంది.

తమ లక్ష్యం కోసం స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్ వేర్ ను వి.టి.ఎ సభ్యులు వినియోగిస్తున్నారు. అవసరమైన వారికి ఆ సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కూడా వారు కల్పించారు.

మొదటి అడుగుగా చిన్న తరగతుల పాఠ్య గ్రంధాలను శబ్ద పుస్తకాలుగా వి.టి.ఇ సభ్యులు తయారు చేశారు. 10వ తరగతిలోని పాఠ్య పుస్తకాలన్నింటినీ శబ్ద పుస్తకాలుగా వీరు తయారు చేశారుట. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలకూ ఎకనమిక్స్, సివిక్స్, స్పెషల్ తెలుగు సబ్జెక్ట్ లను ఆడియో బుక్స్ గా తయారు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యను అభ్యసించడం కోసం యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న కొన్ని సబ్ద్జెక్ట్ లకు శబ్ద పుస్తకాలు తయారు చేశారు. మరీ ముఖ్యంగా కంప్యూటర్ మౌలిక అంశాలను నేర్చుకునేందుకు గాను తెలుగులోనే ఆడియో బుక్స్ తయారు చేశారు.

కరెంట్ ఎఫైర్స్ పుస్తకాలను సైతం ఆడియో బుక్స్ గా తయారు చేసి పంపిణీ చేస్తున్నారంటే అంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? ఈ శబ్ద పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానంతో పలువురు అంధ విద్యార్ధులు పేరు పొందిన సెంట్రల్ యూనివర్సిటీ లో సైతం పి.జి సీట్లు సంపాదించారంటే మనం నమ్మాలి. ‘ఈనాడు’ వారు తెస్తున్న మాస పత్రిక ‘తెలుగు వెలుగు’ ను కూడా వీరు ఆడియో బుక్ గా మార్చి అందిస్తున్నారు.

వి.టి.ఇ వాళ్ళు తయారు చేసిన శబ్ద పుస్తకాల ద్వారా దిలీప్ కుమార్ అనే విద్యార్ధి హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎం.ఎ తెలుగు ఎంట్రన్స్ లో 4వ ర్యాంకు సాధించారంటే నమ్మగలమా? ఇలా వీరు సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి. వి.టి.ఇ వారి వెబ్ సైట్ ను సందర్శిస్తే వారి కృషిని, వారు సాధిస్తున్న గొప్ప ఫలితాలను చూసి ఆనందించవచ్చు.

వారి వెబ్ సైట్ కు లింక్: http://visionthroughears.wordpress.com/

వి.టి.ఇ గ్రూపుకు స్ధాపించిన వారు ఉమా మహేశ్వరరావు గారు. వారి సతీమణి కూడా ఈ కృషిలో భాగస్వామ్యం వహిస్తున్నారని వారి వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది.

అనేక మంది విద్యాధికులు, ఉద్యోగస్ధులు వి.టి.ఇ బృందంలో సభ్యులుగా చేరి తమ వంతుగా దృష్టి లోపం ఉన్నవారికి సహాయ, సహకారాలు అందించడం విశేషం. బృందం సభ్యుల్లో అనేకమంది ప్రభుత్వ సంస్ధల్లోనూ ప్రైవేటు కంపెనీల్లోనూ ఉన్నత స్ధాయి విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో కొందరు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నవారే.

ఇంకా ఎవరన్నా వి.టి.ఇ బృందంలో స్వచ్ఛందంగా చేరి సేవలు అందించదలుచుకుంటే చేయవచ్చు. వార్షిక సభ్యత్వ రుసుముగా రు. 600/- ను బృందం స్వీకరిస్తోంది. ఈ డబ్బును సంస్ధ తెస్తున్న శబ్ద పుస్తకాల కోసమే వెచ్చిస్తున్నారు. సభ్యత్వం తీసుకోకుండా స్వచ్ఛంద సేవ చేసేవారిని కూడా వి.టి.ఇ ఆహ్వానిస్తోంది.

తెలుగువార్తలు వెబ్ సైట్ ఒక మిలియన్ హిట్స్ దాటిన సందర్భంగా ఒక టపా రాశాను. ఆ టపా కింద వి.టి.ఇ సభ్యులు విజయ్ కుమార్ రాసిన వ్యాఖ్య ద్వారానే నాకు వీరి సంగతి తెలిసింది. బ్లాగ్ లోని ఆర్టికల్స్ ను వి.టి.ఇ వాళ్ళు వారి నెలవారి శబ్ద పత్రికలో క్రమం తప్పకుండా ప్రచురిస్తున్నారని తెలిసి చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. తమ కృషికి ఉదాహరణగా ఒక ఆర్టికల్ ను మాటల్లోకి మార్చి ప్రచురించి దాని లింక్ ను విజయ కుమార్ గారు పోస్ట్ చేశారు. ఆ లింక్ కింద ఇస్తున్నాను.

http://vocaroo.com/i/s1wWW5r3uryr

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాపార ప్రయోజనాల కోసం కాకుండా మానవ సేవ కోసం వినియోగిస్తే ఎలాంటి అద్భుతాలనైనా సాధించవచ్చని వి.టి.ఇ వారు నిరూపించారు. వి.టి.ఇ బృందానికి, స్వచ్ఛంద కార్యకర్తలకు బ్లాగ్ ముఖంగా బ్లాగ్ పాఠకులందరి తరపునా అభినందనలు తెలియజేస్తున్నాను. బ్లాగ్ సందర్శకులు తమ వ్యాఖ్యల ద్వారా వి.టి.ఇ వారికి అభినందనలు, సలహాలు, స్వచ్ఛంద సేవలు అందజేస్తే వారికి, వారి ద్వారా ఫలితం పొందుతున్న Visually Challenged Students కూ గొప్ప ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది.

5 thoughts on “అంధులకు చెవులతో లోకాన్ని చూపుతున్న వి.టి.ఇ

  1. ఒకప్పుడు ఆకాశవాణి (రేడియో)లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ‘సంక్షిప్త శబ్ద చిత్రం’ ప్రసారమయ్యేది. దృశ్య మాధ్యమమైన సినిమాల్లోని ముఖ్యమైన సంభాషణలూ, సంగీతం అందిస్తూ ప్రసారం చేసేవారన్నమాట. అది వింటే సినిమా చూసినట్టే అనుభూతి కలిగేది.

    ‘విజన్ త్రూ ఇయర్స్’ గురించి విన్నపుడు ఈ విషయం గుర్తొచ్చింది. ఈ సంస్థ పేరే ఎంతో బాగుంది. దానికి తగ్గట్టు వీరు చేస్తున్న కృషి చెప్పుకోదగింది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వీరు ఉపయోగించుకుంటున్నతీరు ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. ఈ సంస్థ నిర్వాహకులకు అభినందనలు.

    ఆడియో బుక్స్ గా విజువల్లీ ఛాలెంజ్ డ్ విద్యార్థులకు ఉపయోగపడటం ద్వారా మీ బ్లాగు వార్తలూ, కథనాలకు గొప్ప ప్రయోజనం సిద్ధించిందని చెప్పొచ్చు!

  2. Dear Sir,

    First of all many many thanks to you on behalf of VISIONTHROUGHEARS group sir. I’m sure, your article will motivate so many people to extend their help to record so many audio books for visually challenged. Once again Special thanks to you sir.
    With warm regards
    VIJAY

  3. Dear Sekhar garu
    thanks for highlighting our activities through your article. Please Promote our Voice bank programme. the concept of the programme is whenever you got free time please record the book, story, kavithalu,or kathalu you like or the book which will be useful for visually challenged and donate the audio book to our VIHANGAM TALINKG BOOK LIBRARY. your services will be acknowledged and helpful to thousands of visually challenged people, who are in need of knowledge, entertainment like us. Thank you sir

  4. It is really wonderful assistance provided to visually challenged children.Some of the students are being benifited by the VTE started by Mr.Umamaheswar rao and Mrs.Mani.They are interested to provide this kind of knowledge support to many if they recieve encouragement morally and other wise.Let us extend the support and encourage them. T H SARMA

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s