జపాన్ పర్యటనను భారత ప్రధాని మోడి ముగించుకున్నారు. పర్యటనలో ఉండగా ఆయన జపాన్ పెట్టుబడుల కోసం ఎన్ని విన్యాసాలు ప్రదర్శించిందీ ఈ కార్టూన్ తెలియజేస్తోంది.
భారత దేశంలో రెడ్ టేపిజం తొలగించి దానికి బదులు విదేశీ కంపెనీలకోసం రెడ్ కార్పెట్ పరుస్తామని మోడి ప్రకటించారు.
దేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టదలిస్తే ఏ దేశమైనా కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంది. స్వేచ్చా మార్కెట్ సూత్రాలను పాటిస్తామని చెప్పుకునే అమెరికా, ఐరోపాలు కూడా వివిధ సుంకాలు, పన్నులు, అనుమతులను ఎఫ్.డి.ఐ లపైన విధిస్తాయి. కానీ తమ కంపెనీల పైన మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రవేశం ఇవ్వాలని, దొరికింది దొరికినట్లు దోచుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తాయి. లేకపోతే ప్రొటెక్షనిజం పాటిస్తున్నారని ఆరోపిస్తాయి. బ్యూరోక్రాట్ అనుమతులను రెడ్ టేపిజం కింద కొట్టిపారేస్తాయి. ‘ఇలా అయితే పెట్టుబడులు పెట్టడం కష్టమే’ అని బెదిరిస్తాయి. అక్కడికి తమ లాభాల కోసం కాకుండా దేశాన్ని ఉద్ధరించడానికే పెట్టుబడులు పెడుతున్నట్లు!
అలాంటి రెడ్ టేపిజం లేకుండా చేస్తామని మన ప్రధాని జపాన్ ఎఫ్.డి.ఐ లకు హామీ ఇచ్చారు. దేశ సంపదలను దేశ ప్రజలకోసం సక్రమంగా వినియోగంలోకి తెస్తున్నారా లేదా అని పరిశీలించేందుకు విధించుకున్న పాలనా నియమాలను రెడ్ టేపిజం అంటూ పక్కకు నెట్టి విచక్షణా రహితంగా అనుమతులు ఇచ్చేస్తే ఎవరికి నష్టం? దేశ ప్రజలకే నష్టం. దేశ ప్రజలకు ఉపయోగపడవలసిన వనరులు విదేశీ కంపెనీల లాభాలకు ఖర్చు చేయబడతాయి.
ప్రధాని మోడి ప్రదర్శించిన మరో విన్యాసం చైనాది విస్తరణ కాంక్ష ఉందని పరోక్షంగా దెప్పడం. “మన చుట్టూ ఎక్కడ చూసినా 18వ శతాబ్దపు విస్తరణవాద మానసిక స్ధితి మనకు కనిపిస్తుంది. ఇతర దేశాలను ఆక్రమించడం, ఇతర దేశాల (సముద్ర) జలాల్లోకి చొరబడడం, ఇతర దేశాలపై దాడి చేసి వారి భూభాగాలను ఆక్రమించడం… మొ.వి మనకు కనిపిస్తాయి” అని మోడి వ్యాఖ్యానించారు.
మోడి ఈ మాటలన్నది చైనాను ఉద్దేశించే అని పశ్చిమ పత్రికలు అర్ధం ఇచ్చాయి. సరిగ్గా పరిశీలిస్తే ఇవన్నీ అమెరికా, ఐరోపా రాజ్యాలకు సరిగ్గా వర్తిస్తాయి. పశ్చిమ దేశాలు ఈ తరహా ఆరోపణలను చైనా పైన చేస్తాయి. కాబట్టి మోడీ కూడా తమ ఆరోపణలకు మద్దతు ఇస్తున్నారని పశ్చిమ పత్రికలు అర్ధం లాగాయి. జపాన్ పర్యటనలో మోడీ ఈ మాటలు చెప్పినందున చైనాను ఉద్దేశించే అన్నారని సహజంగానే అర్ధం వస్తుంది. ఎందుకంటే జపాన్-చైనాల మధ్య ఈ తరహా తగాదాలే నెలకొని ఉన్నాయి గనుక. విచిత్రం ఏమిటంటే ఆక్రమణ కోసం చైనా ప్రయత్నిస్తోందని జపాన్, అమెరికాలు ఆరోపిస్తున్న ద్వీపాలు ఒకప్పుడు చైనా దేశానికి చెందినవే కావడం. జపాన్ రాజు దండయాత్రకు లొంగిన చైనా పాలకులు తమ ద్వీపాలను జపాన్ కి ఇచ్చి సంధి చేసుకున్నారు. తమ ద్వీపాలు తమకు ఇవ్వాలని చైనా కోరుతుంటే అది దురాక్రమణ అని జపాన్, అమెరికాలు ఆరోపిస్తున్నాయి.
మోడి జపాన్ లో ఉండగా వివిధ కార్యక్రమాల్లో అన్నీ తానే అయి అన్నట్లుగా వ్యవహరించారని పత్రికలు తెలిపాయి. ఒక చోట తానే డ్రమ్ వాయిస్తూ కనిపించారాయన. జపాన్ చక్రవర్తి, ప్రధాన మంత్రిలకు భగవద్గీత బహుమతిగా ఇవ్వడం ఒక వార్త! మరో చోట ఒక కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేయడంలో ఉన్న ఆనందం గురించి ముచ్చటిస్తే అదో వార్త. ఇంకో చోట జపాన్ లోని భారత స్త్రీలకు చీర చరించడంలో పెట్టిన పోటీలను పొగడితే అది జాతీయ భావోద్వేగాలు కూరిన వార్త అయింది.
జపాన్ విద్యార్ధులతో ముచ్కటిస్తూ కూడా మోడి చైనాను పరోక్షంగా విమర్శించారని పత్రికల సమాచారం. జపాన్, ఇండియాలలో ప్రజాస్వామిక వ్యవస్ధలు గనుక ఇరు దేశాల స్నేహానికి ప్రాధాన్యం ఉన్నదని ఆయన చెప్పిన మాటలు చైనాలో ప్రజాస్వామ్యం లేదని ఎత్తి చూపడానికే అని పత్రికలు భాష్యం చెప్పాయి.
జపాన్ పెట్టుబడిదారులకు ఇండియా తక్కువ ఖరీదుతో కూడిన తయారీ పరిశ్రమల లక్ష్యంగా అందజేస్తామని మోడీ హామీ ఇచ్చారు. అనగా ఇండియాలో పరిశ్రమలు పెడితే వేతనాలు పెద్దగా ఇవ్వనక్కర్లేదనీ ముందే చెబుతున్నారు. కానీ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం కనీస వేతనాలను పరిశ్రమలు చెల్లించాలి. ఈ చట్టాలను పాటించనక్కర్లేదనీ చెప్పడం అంటే ఏమిటి అర్ధం? ఇప్పటికే ప్రైవేటు పరిశ్రమలు కనీస వేతనాలు చెల్లించకుండా రేయింబవళ్లు పని చేయించుకుంటున్నా అడిగే నాధుడు లేడు. ఇక ప్రధాన మంత్రిగారే స్వయంగా చౌక వేతనాలు ఇవ్వచ్చు అని హామీ ఇస్తే మన ప్రధాని ఎవరికి ప్రధానిగా వ్యవహరిస్తున్నట్లు?
చైనాతో స్నేహం చెడకుండా ఉడేందుకు కూడా మోడి జాగ్రత్త పాటించారని కొన్ని పత్రికలు విశ్లేషించాయి. జపాన్ తో పౌర అణు ఒప్పందం చేసుకోకుండా ప్రధాని వెనక్కి తగ్గారని, మంత్రివర్గ చర్చలను మరింత ఉన్నత స్ధాయికి చేర్చకుండా నిభాయించుకున్నారని చెబుతూ, చైనా కోసమే మోడి ఈ జాగ్రత్త పాటించారని జపాన్ పత్రికలు భాష్యం చెప్పాయి.
వచ్చే 5 సంవత్సరాల్లో 2.1 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ హామీ ఇచ్చిందని పత్రికలు చెప్పాయి. ఇలాంటి హామీలు ప్రతి వ్యాపార సమావేశాల్లోనూ ఇవ్వడం, అవన్నీ ఆచరణలోకి రాకపోవడం మామూలే. మొత్తం మీద జపాన్ ఎఫ్.డి.ఐ ల కోసం ప్రధాని మోడి చేయని విన్యాసం లేదు.