ఉక్రెయిన్ కాల్పుల విరమణ, రష్యాకు మరో వ్యూహాత్మక విజయం!


తూర్పు ఉక్రెయిన్ లోని దోనెట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాలకు చెందిన స్వయం రక్షక బలగాలపై నాలుగు నెలలుగా దాడులు చేస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోలు ఇరువురూ టెలీఫోన్ లో మాట్లాడుకున్నారని, దరిమిలా శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యపడిందని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

అయితే ఇంతలోనే తమ ప్రకటనను ఉక్రెయిన్ మార్చుకుంది. ‘శాశ్వత’ కాల్పుల విరమణ ఒప్పందం కాదని ఉద్రిక్తతలు తగ్గించి, కాల్పులు విరమించుకునే ఒప్పందం మాత్రం కుదిరిందని తెలిపింది. రష్యా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఒప్పందం కుదిరిందని చెప్పడం సరికాదని రష్యా ప్రభుత్వ వర్గాలు అభ్యంతరం తెలిపాయి. తూర్పు ఉక్రెయిన్ బలగాలు, ఉక్రెయిన్ బలగాలకు మధ్య ఘర్షణ జరుగుతోంది తప్ప రష్యా, ఉక్రెయిన్ ల మధ్య కాదనీ కాబట్టి ఘర్షణల విరమణతో తమకు ప్రమేయం లేదని రష్యా ప్రకటించింది. దానితో ఉక్రెయిన్ తన ప్రకటనను వెనక్కి తీసుకుంది.

“ఈ రోజు పుతిన్, పోరోషెంకోల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగిన మాట నిజమే. ఈ సంభాషణ క్రమంలో ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉక్రెయిన్ మిలట్రీ మరియు తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు బలగాల మధ్య సాగుతున్న ఘర్షణలను వెంటనే విరమించుకోవాలన్న అంశాన్ని ఇరువురు నేతలు అంగీకరించారు. ఘర్షణల విరమణకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించుకున్నారు” అని పుతిన్ ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ చెప్పారు. తూర్పు ఉక్రెయిన్ ఘర్షణలు ఉక్రెయిన్ దేశం లోపల అంతర్గతంగా జరుగుతున్నవి కనుక ‘శాశ్వత కాల్పుల విరమణ’ అన్న పదజాలం వర్తించదని పెస్కోవ్ ఎత్తి చూపారు.

దాదాపు ఇదే విషయాన్ని పుతిన్ కొద్ది రోజుల క్రితం బెలో రష్యాలో జర్మనీ, ఇ.యు, ఉక్రెయిన్ నేతలతో కలిసినప్పుడు కూడా చెప్పారు. ఉక్రెయిన్ ఘర్షణల్లో తమకు ప్రమేయం లేదని కనుక కాల్పుల విరమణకు అవసరమైన విధివిధానాలను రూపొందించడం తమ పరిధిలో లేదని ఆయన చెప్పారు. అలాంటివి ఏమన్నా ఉంటే ఘర్షణ పడుతున్న ఇరు పక్షాలు మాట్లాడుకోవాలి తప్పితే తమకు పాత్ర లేదని ఆయన బెలో రష్యా రాజధాని మిన్స్క్ లో స్పష్టం చేశారు.

తూర్పు ఉక్రెయిన్ స్వచ్ఛంద బలగాలను రష్యాయే ప్రేరేపించిందని ఉక్రెయిన్, అమెరికా, ఐరోపాలు ఆరోపిస్తూ వచ్చాయి. తమ పాత్ర ఏమీ లేదని రష్యా తిరస్కరిస్తూ వచ్చింది. అయితే తూర్పు ఉక్రెయిన్ ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించాలని రష్యా ప్రతిపాదించింది. స్వతంత్రం ప్రకటించుకున్న డాన్ బాస్ (దోనెత్స్క్, లుగాన్స్క్) ప్రాంత బలగాలతో పాటుగా రష్యన్ సైనికులు కూడా తలపడుతున్నారని, రష్యా ట్యాంకులు, ఇతర యుద్ధ వాహనాలు సరిహద్దుదాటి తమ సైనికులపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు అనేకసార్లు ఆరోపించాడు. అయితే అందుకు తగిన సాక్ష్యాలను ఆయన చూపలేకపోయాడు.

వరుస ఓటములు, నొవొరొస్సియా ప్రకటనతో దారికి…

ఇటీవలి రోజుల్లో రష్యాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం అమెరికా, ఇ.యులు తీవ్రం చేశాయి. మరో విడత ఆంక్షలు ప్రకటించి అమలు చేస్తామని బెదిరించాయి. దానితో పుతిన్ కూడా స్వరం హెచ్చించారు. నొవొరొస్సియా ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ అనేకమంది అమాయక పౌరులను హతమారుస్తున్నప్పటికీ పశ్చిమ దేశాలు మరోవైపు చూడడానికే ఇష్టపడుతున్నాయని పుతిన్ ఆక్షేపించారు. ‘నొవొరొస్సియా’ అన్న పద ప్రయోగం చేయడం పుతిన్ కు అదే మొదటిసారి.

తమ రెండు రాష్ట్రాలను నొవొరొస్సియాగా డాన్ బాస్ ప్రాంత ప్రభుత్వాలు ప్రకటించాయి. ఉక్రెయిన్ విడిపోయి ఆ పేరుతో తాము స్వతంత్ర రాజ్యంగా ఏర్పడతామని ప్రకటించాయి. ప్రకటనలో అలా చెప్పినప్పటికీ తమ స్వయం ప్రతిపత్తిని గుర్తించాలన్నదే డాన్ బాస్ ప్రాంతాల ప్రధాన డిమాండ్ గా ఉంటూ వచ్చింది. తమ ప్రజలు రష్యా భాషను వినియోగించడానికి ఉక్రెయిన్ ప్రభుత్వ ఒప్పుకోవాలన్నది కూడా వారి డిమాండ్ లలో ఒకటి. (యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టిన పెట్రో ప్రభుత్వం డాన్ బస్ లో రష్యన్ భాష వినియోగాన్ని రద్దు చేసింది. కానీ అక్కడి ప్రజలందరూ జాతి (ethnicity) పరంగా రష్యన్లే. ఈ ప్రాంతం ఒకప్పుడు రష్యాలో భాగం.

డాన్ స్వయం ప్రతిపత్తిని అంగీకరించడం ఉక్రెయిన్ ప్రభుత్వంతో పాటు ఇ.యు, అమెరికా, ఐ.ఏం.ఎఫ్ లకు ఇష్టం లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ పరిశ్రమలు ప్రధానంగా డాన్ బాస్ లోనే కేంద్రీకృతం అయి ఉన్నాయి. పశ్చిమ పెట్టుబడులూ అక్కడే ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతం స్వతంత్రం ప్రకటించుకుని రష్యాతో సంబంధం పెట్టుకుంటే ఇక అంత పెద్ద కుట్ర చేసి యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చిన శ్రమ వృధా అవుతుంది. దానితో తూర్పు ఉక్రెయిన్ స్వయం ప్రతిపత్తి ఆకాంక్షలను కర్కశంగా అణచివేస్తే తప్ప తాము అంగీకరించిన రుణం ఇచ్చేదీ లేదని ఐ.ఎం.ఎఫ్ (అనగా ఇ.యు, అమెరికా) తేల్చి చెప్పింది.

దాని ఫలితమే తూర్పు ఉక్రెయిన్ పై అమానుష దాడులు. ఈ దాడుల ఫలితంగా డాన్ బాస్ మరో గాజాగా మారిపోయింది. దోనెస్క్, లుగాన్స్క్ లలో అనేక చోట్ల ప్రజల ఇళ్ళు సర్వనాశనమైనాయి. ఐరాస లెక్కల ప్రకారం 3 లక్షల మంది రష్యాకు వలస వెళ్ళిపోయారు. డాన్ బాస్ ప్రభుత్వం ప్రకారం 10 లక్షల మంది రష్యా, పోలాండ్, ఎస్టోనియా, మాల్డోవా తదితర దేశాలకు పారిపోయారు.

నొవొరొస్సియా (కొత్త రష్యా) పదాన్ని పుతిన్ ప్రయోగించడంతో రష్యా ఇక నిజంగానే దాడి చేసి క్రిమియా తరహాలో తూర్పు ఉక్రెయిన్ ను కూడా కలిపేసుకుంటుందని పశ్చిమ రాజ్యాలు అంచనా వేశాయి. ఆ అంచనాతోనే బ్రిటన్ లో సమావేశం అయిన నాటో రాజ్యాలు తమ సేనలతో ‘స్పియర్ ఫోర్స్’ పేరుతో ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇవి ఆదేశం అందుకున్న వెంటనే అత్యంత వేగంతో ఉక్రెయిన్ సహాయానికి వస్తాయని ప్రకటించాయి. కానీ ఈ బెదిరింపులకు పుతిన్ అదరలేదు, బెదరలేదు.

బెదరకపోగా ‘మరిన్ని యుద్ధ సామాగ్రిని తూర్పు ఉక్రెయిన్ బలగాలకు పుతిన్ పంపాడని’ ఇ.యు, అమెరికా ఆరోపించాయి. అది నిజమో కాదో తెలియదు గానీ ఉక్రెయిన్ బలగాలు మరిన్ని ఓటములు ఎదుర్కోవడం మొదలైంది. డాన్ బాస్ బలగాల ధాటికి తట్టుకోలేక ఉక్రెయిన్ బలగాలు పలాయనం చిత్తగించడం ఎక్కువైంది. చివరికి తమ ఆధీనంలో ఉన్న దోనెత్స్క్, లుగాన్స్క్ విమానాశ్రయాలను ఖాళీ చేసి వెనక్కి వచ్చేయాలని ఉక్రెయిన్ ఆదేశించాల్సి వచ్చింది. ఈ విధంగా పరిస్ధితి ఒక్కసారిగా తూర్పు ఉక్రెయిన్ (లేదా రష్యా) అదుపులోకి వచ్చింది. ఫలితంగా కాల్పుల విరమణకు అంగీకరించి డాన్ బాస్ పోరాటకారులతో చర్చిస్తామని మొదటిసారిగా పెట్రో పోరోషెంకో ప్రకటించాడు.

ఒక పక్క అమెరికా ఆధ్వర్యంలో నాటో సమావేశమై బెదిరింపులు సాగిస్తుండగానే పోరోషెంకో కాల్పుల విరమణ ప్రకటన చేయడం గమనార్హం. ఇ.యు, అమెరికాల అనుమతి లేకుండా ఆయన ఈ ప్రకటన చేయలేడు. అనగా రష్యా మరోసారి పశ్చిమ దేశాలపై వ్యూహాత్మక విజయాన్ని నమోదు చేసినట్లే. యనుకోవిచ్ ప్రభుత్వం కూల్చివేత వల్ల పశ్చిమ దేశాలకు ఒరిగింది ఏమీ లేకపోగా ప్రతికూల ఫలితమే దక్కింది. ఇప్పుడు క్రిమియా పూర్తిగా రష్యాలో భాగం అయింది. పారిశ్రామిక ప్రాంతం అయిన డాన్ బాస్ రష్యా అదుపులో ఉన్నట్లే. కనుక ఉక్రెయిన్ ఆర్ధిక అదుపు రష్యా చేతిలో ఉన్నట్లే.

ఆ విధంగా ఉక్రెయిన్ లో, ఇప్పటి వరకు జరిగిన పరిణామాల వరకు చూస్తే, పశ్చిమ దేశాలకు వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదు. సమీప భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఈ అంశం’పై మరింత స్పష్టత ఇవ్వగలవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s