సబ్సిడీలు ప్రజాస్వామ్య సాధనకు మార్గం -ఈనాడు


‘అధ్యయనం’ సిరీస్ లో 9వ భాగం ఈ రోజు ఈనాడు పత్రిక చదువు పేజీలో ప్రచురించబడింది. పత్రిక చదివిన కొందరు మిత్రులు ‘అలా అర్ధం కాకుండా రాస్తే ఎలా?’ అని నిలదీశారు.  స్ధలాభావం వల్ల కత్తిరింపులకు గురి కావడంతో కొన్ని చోట్ల వివిధ అంశాలకు మధ్య లంకెలు మిస్ అయ్యాయి. దానితో అర్ధం కానట్లుగా ఉండడానికి ఆస్కారం ఏర్పడింది.

బ్లాగ్ పాఠకుల కోసం ఈనాడు ప్రచురణను కింద ఇస్తున్నాను. బొమ్మపై క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడవచ్చు.

Eenadu chaduvu 09 -01.09.2014

ఈనాడు వెబ్ సైట్ లో చదవడం కోసం కింద లంకెను క్లిక్ చేయగలరు. ఈ లంకె ఈ వారం మాత్రమే పని చేస్తుంది.

సమాధానాల్లో సమగ్రత ఎలా?

పి.డి.ఎఫ్ కాపీ కోసం ధంబ్ నెయిల్ సైజులో మరో బొమ్మ ఇస్తున్నాను. ధంబ్ నెయిల్ పైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీ ఓపెన్ అవుతుంది.

Eenadu chaduvu 09 -01.09.2014

అర్ధం కాలేదని చెప్పినందున నేను రాసిన ఒరిజినల్ పాఠాన్ని బ్లాగ్ పాఠకుల కోసం ప్రచురిస్తున్నాను. ఇది బ్లాగ్ పాఠకులకే ఉపయోగపడుతుంది. దురదృష్టవశాత్తూ పత్రిక పాఠకులకు ఉపయోగపడదు.

************

మానవ సంబంధాలన్నీ శ్రమ సంబంధాలే అనడం ఎందుకంటే సామాజిక కార్యకలాపాలన్నీ శ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యే సంపదల చుట్టూనే తిరుగుతాయి కనుక. ఒక సంపదకు ఉండే విలువ అది ఉత్పత్తి కావడానికి చేసిన శ్రమ వల్లనే వస్తుంది. ఉదాహరణకి అడవిలో బ్రహ్మాండమైన టేకు చెట్టు అడవిలో ఉన్నంతవరకూ సంపద కాదు. దాన్ని శారీరకంగానో, యంత్రంతోనో శ్రమ చేసి మొద్దు కింద నరికి ఊళ్ళోకి తెస్తే కాస్త విలువా, మొద్దుపైన శ్రమ చేసి చెక్కలుగా కోస్తే మరికొంత విలువా, ఆ చెక్కల్ని చిత్రిక పట్టి కుర్చీని చేస్తే మరింత విలువా వస్తుంది. టేకు చెట్టు కుర్చీగా మారడానికి ఎంత శ్రమ చేశారో అదే ఆ కుర్చీ విలువ. ఇదే విధంగా మనం విలువతో చూసే సరుకులన్నీ శ్రమలవల్ల తయారైతేనే విలువలు పొందుతాయి తప్ప సరుకుల్లో ఉండే పదార్ధం వల్ల కాదు.

కనుక ఒక కుటుంబ ఆస్తి అంటే ఆ కుటుంబ సభ్యుల శ్రమ వల్ల సమకూరిన ఆస్తి. ఒక దేశ సంపద అంటే ఆ దేశ ప్రజల శ్రమల వల్ల సమకూరిన ఆస్తి. దేశ సంపద అన్నపుడు శ్రమల వల్ల తయారయిన సరుకులతో పాటు ఇంకా శ్రమలు తాకని ఆస్తులు కూడా ఉంటాయి. ఉదాహరణకి భూమిలో ఉండే ఇనుప గనులు, బొగ్గు గనులు, బాక్సైట్ గనులు, సముద్రంలో ఉండే చమురు, సహజవాయు నిల్వలు మొ.వి కూడా దేశ సంపద కిందికి వస్తాయి. మనుషులు శ్రమ చేసి వెలికి తీసేవరకు వీటిని ఉత్పత్తిగా పరిగణించరు.

ఉదాహరణకు బొగ్గు గనులను తీసుకుంటే అనేక మంది కార్మికులు ఉమ్మడిగా భూగర్భంలోకి సొరంగాలు తవ్వాలి. అక్కడ వివిధ పరికరాలతో బొగ్గుని తవ్వి పెద్ద పెద్ద ఇనుప బుట్టల్లో వేయాలి. ఆ బుట్టల్ని భూగర్భం నుండి బైటికి తేవడానికి పట్టాలు వేయాలి. ఆ పట్టాలపైన బుట్టల్ని తోసుకుంటూ పైకి తేవాలి. అక్కడి నుండి వివిధ రవాణా మార్గాల ద్వారా ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు తరలించాలి. బొగ్గు భూమిలో ఉన్నంతవరకు దానికి విలువ ఉండదు. మనుషులు వివిధ శ్రమలు చేసి ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు చేర్చడం వల్ల కొంత విలువ బొగ్గుకు వస్తుంది. బొగ్గులో నిక్షిప్తమై ఉన్న ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేందుకు యంత్రాలతో కూడిన పరిశ్రమలను నిర్మిస్తారు.

ఆ విధంగా బొగ్గు విలువ, దానిపై పని చేసే యంత్రాల విలువ, యంత్రాలపై పని చేసే శ్రమల విలువ, కార్మికుల శ్రమలను నిర్వహించే మేనేజింగ్ శ్రమ విలువ… ఇవన్నీ కలిసి విద్యుత్ కు విలువను చేర్చుతాయి. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ ను ఇళ్లకు చేరడానికి పెద్ద చిన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వాహక తీగలు నిర్మించాలి. విద్యుత్ విలువలో స్తంభాలు, తీగల విలువలో కొంతభాగం వచ్చి కలుస్తుంది. ఈ విలువలన్నీ కలిపి ఎన్ని ఇళ్లకు విద్యుత్ ను పంపిణీ చేస్తారో అంత సంఖ్యతో భాగిస్తే అది ఒక్కో కుటుంబం/ఇల్లు చెల్లించవలసిన విలువగా తేలుతుంది.

ఇలా వచ్చిన విద్యుత్ విలువను కుటుంబాలన్నీ చెల్లించగలుగుతాయా? భారత దేశంలో ప్రజలందరూ సమాన అభివృద్ధిని సాధించలేదు. పిరమిడ్ తరహాలో మెజారిటీ ప్రజలకు చాలా తక్కువ ఆదాయాలు ఉన్నాయి. కొద్ది మందికి ఎక్కువ ఆదాయాలు ఉన్నాయి. వారందరికీ సమానంగా విద్యుత్ ధరలు పంపిణీ చేస్తే చాలా కొద్దిమంది మాత్రమే విద్యుత్ వినియోగించుకోగలుగుతారు.

ఫలితంగా రెండు అనర్ధాలు జరుగుతాయి. ఒకటి: ఉత్పత్తి అయిన విద్యుత్ అంతా వినియోగంలోకి రాదు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాలన్న ఆదర్శం ఆచరణలోకి రాకుండా పోతుంది. పూర్వం భూస్వామ్య సమాజాల్లో

కింది కులాల వారు వేదాలు చదవడం నిషేదించారు. వేదాలు పొరబాటున వినకుండా వారి చెవుల్లో సీసం పోశారు. అభివృద్ధి చెందిన ఊరిలోకి ప్రవేశించకుండా నిషేధించి అస్పృశ్యత పాటించారు. విద్యుత్ లాంటి అభివృద్ధి సౌకర్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచకపోతే తిరిగి అదే విలువలను ఆచరణలో పరోక్షంగా అమలు చేసినట్లు అవుతుంది.

రెండు: మనది ప్రజాస్వామ్య దేశం. దేశ సంపదలను ప్రజలందరూ సమానంగా పంచుకోవడం ప్రజాస్వామ్య సమాజాల లక్షణం. ఈ రాజకీయ లక్ష్యం కూడా నెరవేరదు. అంతిమంగా భారత దేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే అర్హత కోల్పోతుంది. ప్రజాస్వామ్యం అనగానే ప్రజలందరికీ వయోజన ఓటింగు హక్కు గానే చూడడం కద్దు. ఎన్నికల్లో ఓట్లు వేసి తమ ఎమ్మెల్యేని, ఎం.పి ని ఎన్నుకుంటే అదే ప్రజాస్వామ్యం అనుకుంటాం. కానీ ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం మాత్రమే. ప్రజాస్వామ్యం అసలు లక్షణం దేశ వనరులను, సంపదలను ప్రజలందరికీ ఎటువంటి తారతమ్యాలు చూపకుండా పంపిణీ చేయడం. ఆర్ధిక తారతమ్యాలను క్రమంగా తొలగించే దీర్ఘకాలిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూనే ఉనికిలో ఉన్న తారతమ్యాలకు అతీతంగా వనరులను పంపిణీ చేయడం అనే ద్వైపాక్షిక వ్యూహాన్ని ప్రజాస్వామ్య వ్యవస్ధలు అమలు చేయాలి. ప్రజాస్వామ్యంలో పాటించవలసిన ఈ మౌలిక సూత్రం అమలులోకి రాదు.

ఉదాహరణ కోసం ఇక్కడ విద్యుత్ తీసుకున్నాం గానీ ఇతర వనరులు, సరుకుల విషయంలోనూ ఈ విశ్లేషణ వర్తిస్తుంది.

ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య సమాజాలు సబ్సిడీలను ఉనికిలోకి తెచ్చాయి. విద్యుత్ ఉత్పత్తికి అయ్యే అసలు ఖర్చులో కొంత భాగం తగ్గించి అల్పాదాయ వర్గాల నుండి వసూలు చేస్తూ ఆ మిగిలిన భాగాన్ని ప్రభుత్వం చెల్లించడమే సబ్సిడీ. దేశ ఉత్పత్తిలో కొంత భాగాన్ని పన్నులు, ఫీజుల రూపంలో ప్రభుత్వం వసూలు చేసి తన వద్ద అట్టిపెట్టుకుంటుంది. దీనిలో కొంత భాగాన్ని సబ్సిడీగా చెల్లిస్తారు. సబ్సిడీలు ఒక్క అల్పాదాయ వర్గాలకు మాత్రమే పరిమితం కాదు. ధనికులు, పారిశ్రామిక వర్గాలకు కూడా వివిధ రూపాల్లో ప్రభుత్వాలు సబ్సిడీ చెల్లిస్తాయి.

ఉదాహరణకి కర్బన ఉద్గారాల వల్ల భూగ్రహం వేడెక్కుతోంది. కనుక శిలాజ ఇంధనాల (పెట్రోలు, బొగ్గు మొ.వి) వాడకం తగ్గించి సంప్రదాయేతర ఇంధనాల (పవన శక్తి, సౌర శక్తి) వాడకం పెంచాలని ప్రపంచ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. కానీ ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం జర్మనీ, జపాన్, అమెరికా లాంటి కొన్ని దేశాల్లోనే ఉంది. అవి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు ఇవ్వవు. తమ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన పరికరాలను మాత్రమే ఇస్తాయి. అక్కడి పరికరాలను దిగుమతి చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఖర్చు తడిసిమోపెడు అవుతుంది. భారీ ఖర్చుతో ఉత్పత్తి చేసే విద్యుత్ ధర కూడా భారీగా ఉంటుంది.

కానీ సంప్రదాయేతర శక్తి వనరులను ప్రోత్సహించవలసిన తప్పనిసరి పరిస్ధితుల్లో ఉన్నాం. ఈ దృష్ట్యా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. తానే బ్యాంకుల చేత తక్కువ వడ్డీలకు ఉదారంగా రుణాలు ఇప్పిస్తుంది. బడ్జెట్ లో అదనపు కేటాయింపులు చేస్తుంది. పన్ను రాయితీలు ప్రకటిస్తుంది. ఇవన్నీ సబ్సీలే. ఈ సబ్సిడీలను శోషించుకున్న పరిశ్రమలు తక్కువ ధరకు సంప్రదాయేతర వనరుల విద్యుత్ ను ప్రజలకు ఇవ్వగలుగుతాయి. అయితే ఇది ఇలా ఎల్లకాలం సాగించడం కుదరదు. సబ్సిడీలను ఒకే రంగంలో ఎక్కువ కాలం కొనసాగించడం అనుత్పాదక వ్యయం అవుతుంది. తాత్కాలిక అననుకూలతను సానుకూలం చేసుకోవడం కోసం సబ్సిడీలు ఇస్తూ మరోవైపు సబ్సిడీలను తొలగించేందుకు అవసరమైన పరిస్ధితులను సృష్టించుకోవాలి. సొంతగా ఉత్పత్తి చేసుకోగల సామర్ధ్యం పొందడం దీనికి పరిష్కారం. అనగా దిగుమతులకు సబ్సిడీలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వాలు సొంతగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకునేందుకు కృషి చేయాలి. పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) రంగాలకు తగిన మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు చేస్తూ దేశీయ పరిజ్ఞానం అభివృద్ధికి కృషి చేయాలి.

దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి: ప్రభుత్వమే ఆర్ & డి లో పెట్టుబడి పెట్టడం. రెండు: ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు నిధులు (సబ్సిడీలు) ఇచ్చి ఆర్ & డి లో పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించడం. భారత దేశంలో ఇప్పటివరకు మొదటి రంగమే సత్ఫలితాలను ఇచ్చింది. రెండవది ఇవ్వలేదు. 1991 నుండి నూతన ఆర్ధిక విధానాలు ప్రవేశించిన దరిమిలా ఇప్పుడు రెండోదానిపై ఆశలు పెంచుతున్నారు. కానీ ఆచరణలో అది సఫలం కాలేదు. ఎందుకంటే విదేశీ బహుళజాతి కంపెనీలు, వాటి వెనుక ఉన్న విదేశీ ప్రభుత్వాలు దానికి గండి కొడుతున్నాయి. దేశీయ పారిశ్రామికవేత్తలు పరిశోధనలు జరిపి దేశీయ పరిజ్ఞానం అభివృద్ధి చేస్తే వారికి పోటీ అవుతాము. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ రుణాల ద్వారా షరతులు విధించి ఆర్ & డి లో కూడా ఎఫ్.డి.ఐ లకు అనుమతి ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. దానితో దేశీయ ఆర్ & డి రంగం మూలన పడిపోయింది.

ఈ విధంగా సబ్సిడీలు దేశ ఆర్ధిక వృద్ధిలోనూ, స్వావలంబన సాధించడం లోనూ, ప్రజాస్వామ్య ఆచరణలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే సబ్సిడీలు ప్రభుత్వాల బడ్జెట్ లలో ఒక ముఖ్య భాగంగా ఉంటాయి. ఆర్ధిక పరిభాషలో చెప్పాలంటే సబ్సిడీలు ప్రభుత్వాల చేతుల్లో ఉండే కోశాగార ఉపకరణం (Fiscal Instrument). ఈ ఉపకరణం ప్రభుత్వాల చేతిలో లేకపోతే దేశ ఆర్ధిక స్వావలంబన కూడా ఒక మేరకు ప్రభుత్వాల చేతుల్లో లేకుండా పోతుంది. సబ్సిడీలు క్రమంగా తగ్గించి నిర్మూలించాలన్న ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల షరతులను ఈ కోణంలో అర్ధం చేసుకోవాలి.

సబ్సిడీలపై అధ్యయనం చేసే క్రమంలో దానితో ముడిపడి ఉన్న వివిధ అంశాలను తెలుసుకున్నాం.

 • దేశ సంపద అంటే ఆ దేశ ప్రజల శ్రమల సంపద.
 • ప్రజాస్వామ్యం అనే రాజకీయ లక్ష్యం యొక్క వాస్తవ రూపం ఆర్ధిక అసమానతలు తొలగించాలన్న ఆర్ధిక లక్ష్యమే.
 • సబ్సిడీలు అసమానతల తాత్కాలిక పరిష్కారానికి సాధనం. అదే సమయంలో దేశంలోని అసమానతల తొలగింపుకు, దేశ ఆర్ధిక స్వాలంబనకు దీర్ఘకాలిక సాధనం.
 • క్లుప్తంగా సబ్సిడీలు ప్రభుత్వాల చేతిలోని కోశాగార సాధనం.
 • సబ్సిడీల ద్వారా సాధించిన దేశీయ పరిజ్ఞానం, దేశీయ అభివృద్ధి విదేశీ బహుళజాతి కంపెనీలకు పోటీ అవుతుంది. అందుకే సబ్సిడీలు క్రమంగా రద్దు చేయాలని షరతులు.

అధ్యయనం కోణంలో గ్రహించవలసిన అంశాలు:

 • ఒక వస్తువు విలువ అంటే ఆ వస్తువు తయారీకి పట్టే శ్రమ అని అర్ధం చేసుకోవాలి. అదే ఆ వస్తువు యొక్క మారకం విలువ.
 • మారకం విలువల మొత్తమే ఉత్పత్తి.
 • ఉత్పత్తుల సమాన పంపిణీయే ప్రజాస్వామ్యం యొక్క సారం.
 • ఉత్పత్తుల పంపిణీ ఆర్ధిక అంశం కాగా, ప్రజాస్వామ్యం రాజకీయ అంశం.
 • ఆర్ధిక అంశాల వ్యక్తీకరణే రాజకీయ అంశాలు. కనుక రాజ్యం (state) యొక్క రాజకీయ నిర్వహణ వాస్తవంలో ఆ రాజ్యం పరిధిలోని ఆర్ధిక వనరులు, సంపదల నిర్వహణ.
 • దేశంలోని ఆర్ధిక వనరుల నిర్వహణను విదేశీ కంపెనీలు పట్టించుకుంటాయి. అవి తమ ఉనికికి ప్రమాదమా లేదా అని ఆలోచిస్తాయి.

One thought on “సబ్సిడీలు ప్రజాస్వామ్య సాధనకు మార్గం -ఈనాడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s