అమెరికా ఎడారి రాష్ట్రం నెవాడాలో ప్రతి సంవత్సరం ఓ వినూత్న కళా ప్రదర్శన జరుగుతుంది. దీనికి ‘బర్నింగ్ మేన్ ఫెస్టివల్ అని పేరు. అమెరికా పశ్చిమ తీరానికి ఒక రాష్ట్ర వరుస దూరంలో ఉండే నెవాడా ఎడారి వాతావరణం నెలకొని ఉంటుంది. ఎల్-నినో వల్ల ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో వేడి గాలులు, తక్కువ వర్షపాతంతో కూడిన వాతావరణం ఉంటే నెవాడాలో మాత్రం వర్షాలు కురుస్తాయి.
నెవాడాలోని బ్లాక్ రాక్ ఎడారిలో బర్నింగ్ మేన్ వెస్టివల్ ప్రతి యేడూ జరుగుతుంది. అమెరికాలోని నలుమూలల నుండి కళాకారులు ఈ పండుగకు విచ్చేసి తమ తమ కళా రీతులను ప్రదర్శిస్తారు. ఇతర ప్రపంచ దేశాల నుండి వచ్చిన కళాకారులూ హాజరవుతారు. కళా రీతి అంటే కేవలం నాట్యం, గానం లకు సంబంధించినవే కాదు. నాట్యం, గానం తక్కువగా ఉంటాయి. ఎక్కువగా వివిధ కళాత్మక ఆకృతులను, నిర్మాణాలను రూపొందించి ఇక్కడ ప్రదర్శిస్తారు.
పశ్చిమ దేశాల్లో Art Installation అంటూ ఒక కొత్త ధోరణి వాడుకలోకి వచ్చింది. ఈ కళాకృతి నిర్మాణంలో ఒక పరిమితి అంటూ ఏమీ ఉండదు. వాడిపారేసిన కార్లను నిర్దిష్ట రూపంలో అమర్చి అది కళాకృతి అంటారు. తీసిపారేసిన వివిధ వాడుక సరుకులతో ఒక ఆకారం నిర్మించి అదీ కళే అంటారు.
బర్నింగ్ మేన్ అన్నదే ఒక కళాకృతి. కలపతో ఒక భారీ మానవాకృతిని తయారు చేసి ఇక్కడ ప్రతిష్టిస్తారు. పండుగ ముగిసినప్పుడు ఈ ఆకృతిని తగలబెడతారు. అందుకే దీనికి బర్నింగ్ మేన్ ఫెస్టివల్ అని పేరు. నీరు ఆవిరైపోయిన ఒయాసిస్సు ప్రాంతం (playa) లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఆగస్టు నెల చివరి సోమవారంతో ముదలై సెప్టెంబర్ నెల మొదటి సోమవారంతో పండుగ ముగుస్తుంది.
పండగ కోసం బ్లాక్ రాక్ ఎడారిలో తాత్కాలికంగా ఒక నగరం వెలుస్తుంది. ‘బర్నింగ్ మేన్ 2014’ ఫెస్టివల్ కోసం 65,000 మంది అమెరికన్లు, ఇతర దేశాల వాళ్ళు వచ్చారని పత్రికలు అంచనా వేశాయి.
1986 లో ప్రారంభమయిన బర్నింగ్ మేన్ ఉత్సవం నిర్వాహకులు కాలక్రమేణా అనుభవాల నుండి కొన్ని సూత్రాలను రూపొందించుకున్నారు. ఫెస్టివల్ ముగిశాక అక్కడ ఫెస్టివల్ జరిగిన ఆనవాళ్ళు లేకుండా చేయడం ఆ సూత్రాల్లో ఒకటి. కార్లు ఇతర పెద్ద వాహనాలను అనుమతించకపోవడం, ద్విచక్ర వాహనాల వేగంపై పరిమితి, క్రమబద్ధంగా తాత్కాలిక కాలనీ నిర్మించడం, సొంత కళాకృతులను దహనం చేయాలనుకుంటే వాటిని నిర్దిష్ట స్ధానంలోనే దహనం చేయడం మొదలైన సూత్రాలను కళాకారులు పాటిస్తారట.
కళ ప్రజల కోసం కాకుండా పోయినప్పుడు, ఉత్పత్తి ఎక్కువైపోయి తిన్నగా బతకడం కోసం కంటే మరీ ఎక్కువగా సమయం మిగిలిపోయినప్పుడూ ఇలాంటి చిత్ర విచిత్రమైన కళా పండుగలు పుట్టుకొస్తాయి కాబోలు!
వినడానికి, ఊహించడానికి చిత్రంగా ఉన్న ఈ పండగ దృశ్యాలను రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసి అందించగా వాటిని ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.
Photos: The Atlantic & Reuters