రైతులు ఓ.కె అంటే మంగళగిరి, లేదంటే నూజివీడు


Mangalagiri & Nuzvid

రాష్ట్ర ప్రభుత్వం రైతులతో మైండ్ గేమ్ ఆడబోతున్నట్లు కనిపిస్తోంది. రైతులకు, ఇతర వర్గాలకు మధ్య అనవసర విభేదాలు రేపే నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం తీసుకుందని ఛానెళ్ల వార్తలను బట్టి తెలుస్తోంది. మంత్రివర్గ నిర్ణయాలను ఎవరికీ చెప్పొద్దని ముఖ్యమంత్రి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని చెబుతూనే రాజధానిపై వారేమి చర్చించారో వెల్లడి చేశాయి.

రైతులు అంగీకరిస్తే మంగళగిరి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందట. ఒకవేళ మంగళగిరి రైతులు మొరాయిస్తే గనుక నూజివీడు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారట. రాజధాని వస్తే తమ భూముల రేట్లు పెరుగుతాయని ఆశిస్తున్న రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ‘మైండ్ గేమ్’ కి సిద్ధం అయింది.

ఇప్పుడిక రైతులకు ఒక ధర్మ సంకటం ఏర్పడనుంది. రాజధాని ఏర్పాటుకు అంగీకరిస్తేనేమో ప్రభుత్వం ఇచ్చిన ధరల్ని కిక్కురుమనకుండా అంగీకరించాలి. వారు ఆశించిన ధరలు లభించవు. రాజధాని తమ వద్దకు వచ్చిన సంతోషం వారికి మిగలదు. అదే సమయంలో ఇతర వ్యాపార, విద్యార్ధి, ఉద్యోగ వర్గాలు సంతోషిస్తారు.

ఒకవేళ రైతులు రాజధాని కంటే తమ భూములే ముఖ్యమని భావిస్తే వారి భూములకు ధరలు అనుకున్నట్లు పెరగవు. పైగా ఇతర వర్గాల ప్రజల నుండి తిరస్కారాలు ఎదుర్కోవలసి వస్తుంది. రాజధాని సంతోషం ఎలాగూ దక్కదు. చివరికి రైతులకు రాజధాని వచ్చినా ఇబ్బందే, రాకున్నా ఆశాభంగమే.

ఇప్పుడు రాజధాని కోసం రైతుల్ని ఒప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండదు. ప్రభుత్వం దిలాసాగా కూర్చుని ఉంటే ఆ బాధ్యతను సమాజంలోని ఇతర వర్గాలు నెత్తిన వేసుకుంటారు. బ్రోకర్లు రంగంలోకి దిగి రైతుల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. అయినవీ, కానివీ ఏవేవో చెబుతారు. అదీ ఇదీ అని నెరవేరని ఆశల్ని అరచేతిలో పెట్టి చూపిస్తారు. వారి గోల పడలేక ఒప్పుకుంటే ఎటూ కాకుండా పోతారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎలాగూ సరిపోదు. భూములు వదులుకుని పూలమ్మిన చోట కట్టెలు అమ్మవలసిన పరిస్ధితిని ఎదుర్కొంటారు.

ఇది అన్యాయం. రాజధాని పేరుతో ప్రభుత్వం తన బాధ్యతాయుత పాత్రను విస్మరించి ప్రజల మధ్య తగవులు పెట్టి అనుకున్న పని సాధించేందుకు తలపెట్టిన ఎత్తుగడ.

ఈ రంధిలో ఛానెళ్లు ఓ కొత్త విషయం చెబుతున్నాయి. యు.పి.ఏ ప్రభుత్వం ఒంగోలులో రాజధాని ఏర్పాటు చేయాలని అనుకుందిట. ఆ ఆలోచన వల్ల అనేకమంది కాంగ్రెస్ నేతలు సమీపంలోని మార్టూరు ఏరియాలో భూములు కొన్నారట. వారి ప్రమేయంతోనే శివరామ కృష్ణన్ కమిటీ ఒంగోలును సిఫారసు చేసిందిట. అందుకే నివేదికను బహిర్గతం చేయకూడదని మంత్రివర్గం నిర్ణయించిందని ఎ.బి.ఎన్ ఛానెల్ చెబుతోంది.

కాంగ్రెస్/యు.పి.ఎ కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ అధికారంలోకి వస్తే ఒంగోలు రాజధాని అయ్యేదిట. ఎన్నికల్లో పరిస్ధితి తారుమారు కావడంతో కాంగ్రెస్ నేతలకు పాలుపోలేదుట. చివరికి తెలుగు దేశం నేత ప్రకారమే విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఛానెళ్లు (ఈ టి.వి, ఎ.బి.ఎన్) చెప్పాయి.

 

7 thoughts on “రైతులు ఓ.కె అంటే మంగళగిరి, లేదంటే నూజివీడు

 1. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ…చంద్రబాబు ఇలాగే తన అతి తెలివి తేటల్ని ప్రదర్శించారు. ప్రాజెక్టు వస్తే సీమాంధ్రకు మేలు అని చెప్పి గిరిజనులకు సంబంధించిన తీవ్రమైన విషయాన్ని పక్కనపెట్టి….తెలంగాణ, సీమాంధ్రల మధ్య అంశంగా మార్చారు. ఈ విషయంలో అధికార పక్షానికి దగ్గరగా ఉండే మీడియా కూడా….గిరిజనుల సమస్యలను ప్రచారం కాకుండా కుట్రపన్నింది. ఇప్పుడు రాజధాని విషయంలోనూ అటువంటి ఎత్తుగడలే, చంద్రబాబు అండ్ మీడియా అనుసరిస్తోంది.
  రాయలసీమకు చెందిన వాళ్లు తమ ప్రాంతంలో రాజధాని పెట్టాలని ఎంతగా డిమాండ్ చేస్తున్నా….అటువంటి సమస్య ఒకటి మన రాష్ట్రంలో ఉందన్న సంగతే మిగతా ప్రాంతానికి తెలియకుండా చేస్తోంది.
  మధ్యే మార్గంగా ఒంగోలు రాజధాని అంశాన్ని…., కాంగ్రెస్ చేసిన కుట్రగా చూపిస్తున్నారు.

  మొదటినుంచి తెలుగుదేశం నాయకులకు విజయవాడలోనే రాజధాని పెట్టాలనే ఆలోచన ఉంది. ఆ ఆలోచనతోనే
  ఆ పార్టీ నాయకులు, మీడియా సంస్థల అధిపతులు విజయవాడ, గుంటూరు చుట్టూ వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకే తమ చేతిలోని మీడియాతో…..ఒంగోలు రాజధాని కావాలనే వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారుగా…., దుష్ప్రచారం చేస్తున్నారు. ఇన్ని రోజులూ శివరామకృష్ణన్ నివేదిక ఆధారంగా రాజధాని నిర్ణయం అన్నవారు కాస్తా….., ఆ కమిటీని ఇతర రాష్ట్రాల నాయకులు ప్రభావితం చేశారని ప్రచారం చేస్తున్నారు. చివరకు ఇప్పుడు బంతి రైతుల కోర్టులో ఉంచారు.

  —-ఏదేమైనా రాజధాని అనేది విజయవాడ చుట్టు పక్కలే ఏర్పాటు చేయడానికే తెలుగుదేశం నేతలు సిద్ధమయ్యారు. అటువంటప్పుడు ఈ విషయాన్ని ఎన్ని మలుపులు తిప్పినా ఆఖరికి బెజవాడ దగ్గరకే వచ్చి ఆగుతుంది.

 2. “నువ్వు నా వైపు లేకపోతే అటు వైపు ఉన్నట్లే” ఈ వాదన ప్రకారం విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని వ్యతిరేకించే వారంత అభివృద్ధిని కోరుకోని వాళ్లుగా చిత్రీకరిస్తున్నారు. వికేంద్రీకరణకు కొత్త అర్థం చెప్తూ అన్ని ఒకేదగ్గర ఉండాలంటున్నారు. సమన్యాయ సిద్ధాంతాం లాగే సమానదూరాన్ని పైకి తెస్తున్నారు. కానీ హైదరాబాద్‌ శ్రీకాకుళానికి, చిత్తూరుకు సమదూరంలో ఉందని సమైక్యరాష్ట్రం కావాలన్నారు. మద్రాస్‌ ఎంత దూరంలో ఉందని ఆంధ్రఏర్పాటుకు ముందు మాకు కావాలని గోల చేశారు. కేవలం కుల ప్రయోజనాల కోసమే ఎంతో చక్కటి అవకాశాన్ని కృష్ణా నదికి ఇరువైపులా ఒక సామాజికవర్గం కోసం బంధిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతల్ని ఉసిగొల్పి మాకు రాజధాని వద్దు అనేలా ప్రకటలు ఇప్పించినా ఇప్పిస్తరు.

 3. సమైక్యవాదమని, తెలుగు జాతి ఐక్యతని గొప్ప డవిలాగులు చెప్పిన వాళ్లంత ఎక్కడికిపోయారు. నీళ్లు, ఉపాధి లేని రాయలసీమ ఎందుకు రాజధానిగా పనికిరాదో చెప్పండి. సీమ ప్రజల అమాయకత్వాన్ని కోస్తాంధ్ర పెట్టుబడిదారులు, భూస్వాములు వాడుకుంటున్నారు. కేవలం ఓ సామాజిక వర్గం కోసం పాకులాడుతున్నారు. సింగపూర్‌ స్థాయి అంటూ సీమాంధ్ర బుద్ధిని చూపిస్తున్నారు. రైతుల పొట్టగొట్టేలా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కడుపు నింపేలా కులం బలం మరింత పెరిగేలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా రాయలసీమ మేల్కొనకపోతే ఈ కోస్తాంధ్ర పెట్టుబడిదారులు సీమను మరింత పేదరికంలో, అభివృద్ధికి దూరంగా నెట్టేస్తారు. కనీసం ఉద్యమ చైతన్యం రాకుండా కుట్రలు చేస్తారు.

 4. Ituvanti kutrapurita buddhula vallane telangana udhyamam balapadi Andhra Pradesh rendu mukkalu avadaniki karanamyndi. Repu maro udymam tappademo anipistundi.
  Innalluga telangana pranta charitranu sansskritini anagatokkinavare Andhra Pradesh lo venukabadina prantalani marinta digajarchabotunnaru.

 5. తెలంగాణా ఉద్యమం చల్లారిపోతుందని చాలా మంది అనుకున్నారు కానీ అదే విజయవంతమైంది. ప్రత్యేక రాయలసీమ కూడా తప్పకుండా ఏర్పడుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s