జి.డి.పి వృద్ధి: కాదు కాదు, మా వల్లే -వెంకయ్య


CHIDAMBARAM

10 త్రైమాసికాల తర్వాత మొట్ట మొదటిసారిగా 2014-15 మొదటి త్రైమాసికంలో భారత ఆర్ధిక వృద్ధి రేటు 5.7 శాతం నమోదు చేసింది. ఇది తమ విధానాల వల్లనే అని మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం మొన్న జబ్బ చరుచుకున్న సంగతి విదితమే.

చిదంబరం సంతోషానికి బి.జె.పి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ నేత అంతగా సంతోషపడడానికి ఏమీ లేదని జి.డి.పి తమ బి.జె.పి ప్రభుత్వం వల్లనే పెరిగిందని పోటీకి వచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక విధానాలు అమలు చేశామని అందుకు జి.డి.పి వృద్ధి రేటు గతం కంటే ఎక్కువ నమోదయిందని చెప్పారు.

ఆర్ధికవేత్తలు మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రుల మధ్యకు వచ్చి అసలు విషయం చెబితే ప్రజలకు మేలు చేసినవారు అవుతారు. కానీ కోరి కోరి కొరివితో తల ఎవరు గోక్కుంటారు?

5.7 శాతం జి.డి.పి వృద్ధి రేటు తమ వల్లనే అని చెప్పేందుకు వెంకయ్య గారు చెప్పిన కారణాలు విచిత్రంగా ఉన్నాయి. ఆయన మొదట అటు నుండి నరుక్కు వచ్చారు. చిదంబరం చెప్పింది నిజం అయితే ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడే జి.డి.పి వృద్ధి ఇప్పటి స్ధాయికి ఎందుకు అందుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు.

ఆ తర్వాత ఆయన కొన్ని కారణాలు చెప్పారు. అవి:

  • బి.జె.పి అధికారంలోకి రావడం వల్ల దేశంలో మూడ్ మారిపోయి మదుపుదారుల్లో విశ్వాసాన్ని పెంచడం.
  • బి.జె.పి అధికారంలోకి రావడమే ఆర్ధిక వ్యవస్ధకు ఊపు ఇవ్వడం.
  • పార్లమెంటు పని చేయడం, దాని వల్ల బిల్లులు పాస్ అవడం.
  • ప్రభుత్వ యంత్రాంగం వేగంగా పని చేయడం మొదలు కావడం.

బి.జె.పి అధికారంలోకి వచ్చింది మే 17, 2014 తేదీన. సరిగ్గా చెప్పాలంటే మే 26 తేదీన కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. 2014-15 మొదటి త్రైమాసికం జూన్ 30 తేదీతో ముగిసింది. ఫలితాలు ప్రకటించిన తేదీనే తీసుకున్నా  యు.పి.ఏ ప్రభుత్వం మొదటి త్రైమాసికంలో 56 రోజులు అధికారంలో ఉండగా ఎన్.డి.ఏ/బి.జె.పి/మోడి ప్రభుత్వం 35 రోజులు అధికారంలో ఉంది.

ఇప్పుడు వెంకయ్య గారు చెప్పిన కారణాలు చూద్దాం.

దేశంలో మూడ్ మారిపోయి మదుపుదారుల్లో (investors) విశ్వాసం పెరిగితే అది జి.డి.పి వృద్ధికి ఏ మాత్రం దోహదం చేస్తుంది? జి.డి.పి వృద్ధి అంటే ఉత్పత్తి పెరగడం. వృద్ధి రేటు అంటే పెరుగుదల రేటు అని అర్ధం. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో జి.డి.పికీ, ఈ యేడు మొదటి త్రైమాసికంలో జి.డి.పికీ మధ్య తేడా చూస్తారు. ఈ తేడా ప్లస్ అయితే వృద్ధి అనీ, మైనస్ అయితే కుచింపు (contraction) అనీ లెక్కిస్తారు. ఈ తేడాను గత సం. మొదటి త్రైమాసిక జి.డి.పిలో ఎంత శాతం  ఉందో చూస్తారు. దాన్ని వార్షిక రేటుగా మార్చడానికి 4 తో (సం. కి 4 త్రైమాసికాలు కదా) హెచ్చిస్తారు. (2014-15 Q1 వృద్ధి రేటు వాస్తవానికి 1.425 శాతం. దీన్ని 4తో హెచ్చిస్తే 5.7 శాతం అయింది.)

దేశంలో మూడ్ మారితే ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? మూడ్ మారి మదుపుదారుల్లో విశ్వాసం పెరిగితే ఏం ఒరుగుతుంది? విశ్వాసం పెరగడంతోనే సరిపోదు. అది వాస్తవ మదుపు కిందికి మారాలి. ఉదాహరణకి మోడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక సంస్కరణలు వేగవంతం అవుతాయని విదేశీ, స్వదేశీ మదుపుదారులు విశ్వాసం పెంచుకున్నారు. ఆ విశ్వాసంతో షేర్ మార్కెట్లలో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా మన సెన్సెక్స్, నిఫ్టీలు పైపైకి దూసుకెళ్ళాయి. ఇలా మదుపు చేసినా అది జి.డి.పి లో కలుస్తుంది. కాబట్టి వెంకయ్య గారు చెప్పిన ఈ కారణం కరెక్టే.

ఆయన చెప్పిన రెండో కారణం అసలు బి.జె.పి అధికారంలోకి రావడమే ఒక ఊపు అని. ఇలాంటి ఊపుల వల్ల జనం ఊగిపోయి వారి జేబుల్లో డబ్బు రోడ్డు మీద పడొచ్చు గానీ జి.డి.పి లో మాత్రం పడదు. ఈ ఊపు పైన చెప్పినట్లు ఒక పెట్టుబడి, ఒక మదుపు లేదా ఒక ఉత్పత్తికి దారి తీయాలి. ఊపు మదుపు/పెట్టుబడి/ఉత్పత్తి సృష్టి గా మారిందనడానికి ఏ ఆధారమూ ఉండదు. అది ఊహ మాత్రమే.  ఒకవేళ ఊపు వల్ల మదుపు/పెట్టుబడి/ఉత్పత్తి సంభవించినా అది తెలిసే అవకాశం లేదు. కాబట్టి వెంకయ్య గారు చెప్పిన రెండో కారణం విశ్వసనీయం కాదు.

మోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్లమెంటు సమావేశాలు ఎక్కువ సమయం జరిగింది నిజమే. కానీ బిల్లులు పాసయింది జులై లోనే. బి.జె.పి ప్రభుత్వం హయాంలో ఆమోదించిన బిల్లుల్లో ఏవీ తక్షణం జి.డి.పి పెరగడానికి దోహదం చేసినవి కావు. కావున పార్లమెంటు పని చేసి, బిల్లులు పాస్ అవడం వల్ల జి.డి.పి పెరిగిందని చెప్పడం కరెక్ట్ కాదు.

వెంకయ్య చెప్పిన నాలుగో కారణం ప్రభుత్వ యంత్రాంగం వేగంగా పని చేయడం. ప్రభుత్వం నూతనంగా ఒక విధానం చేపట్టడానికి అది ఆచరణలోకి తేవడానికి మధ్య కొన్ని నెలల సమయం పడుతుంది. అత్యంత వేగంగా పని చేసింది అనుకుంటేనే నెలల సమయం పడుతుంది. కొత్తగా మదుపు చేయడానికి సమయం అవసరం లేదు గానీ పెట్టుబడి పెట్టి ఉత్పత్తి జరగడానికి నెలల సమయం కావాలి. దాని స్వభావమే అంత. అలాంటిది కేవలం వేగంగా పని చేసినంత మాత్రాన జి.డి.పి లో కలిసేది ఏమీ ఉండదు. వేగంగా పని చేసేది ప్రభుత్వ ఉద్యోగులే. వారు వేగంగా పని చేసినా, మెల్లగా పని చేసినా వేతనం ఒకటే. కాబట్టి ఆ రీత్యా కూడా అదనపు మొత్తం జి.డి.పి లో కలవదు. కనుక వెంకయ్య గారు చెప్పిన ఈ కారణంలో నిజం లేదు.

చివరికి తేలింది ఏమిటంటే ఒక్క ఎఫ్.ఐ.ఐ (షేర్ మార్కెట్ పెట్టుబడులు) ల విషయంలో మాత్రమే బి.జె.పి వల్ల జి.డి.పి లో అదనపు చేరిక జరిగింది. మిగిలింది గత కాలపు వారసత్వమే. అయితే జి.డి.పి వృద్ధి రేటు పెరుగుదలలో ఎఫ్.ఐ.ఐ ల వాటా ఎంత అనేది చర్చనీయాంశం.

వెంకయ్య గారి వాదనను చిదంబరం ఈ రోజు తిరస్కరించారు. బి.జె.పి వల్ల జి.డి.పి పెరిగింది అనడానికి ఒక్క కారణం చూపండి చాలు అని ఆయన సవాలు విసిరారు. ఈ సవాలుకి వెంకయ్య గారు సమగ్రంగా స్పందిస్తే తప్ప నిజంగా జి.డి.పి వృద్ధి క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చో తెలియదు. సమగ్రంగా అంటే గణాంక వివరాలు ఇవ్వడం ద్వారా అని. గణాంకాలు వెంకయ్య ఎలాగూ ఇవ్వరు.

One thought on “జి.డి.పి వృద్ధి: కాదు కాదు, మా వల్లే -వెంకయ్య

  1. Investorsలో విశ్వాసం ఎక్కడ పెరిగింది? నేను కూడా stock market traderని. నాకు ఉద్యోగం లేదు కనుక నేను చేసేది ఇదే పని. మోదీ ప్రవేశపెట్టిన తొక్కలో బద్జెత్ వల్ల నా షేర్ల ధరకు కూడా తగ్గినాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s