ప్రశ్న: తన ప్రజల్ని చల్లగా చూసుకునే దేశమే లేదా?


ఎస్. రామ కృష్ణ రావు:

Thanks for publishing my question in QA and detailed analysis. Let me ask you differently. Actually my intention behind asking the question was in which country typical common people are living with more peace & happily? Is it China (as it became financially stronger) or America (good governance) or England, Singapore or Australia? I know that there can’t be absolute peace & happiness in any part of the world, nevertheless which country is taking care of their citizens to the most possible extent?  

నా (గత) ప్రశ్న అర్ధం సగటు మనిషి సాపేక్షికంగా ఎక్కువ సుఖ శాంతులతో జీవిస్తున్న దేశం ఏది అని. ఆర్ధికంగా శక్తివంతం అయిన చైనా? సుపరిపాలన ఉన్న అమెరికా? లేదా ఇంగ్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా? ప్రపంచంలో ఎక్కడా సంపూర్ణ సుఖ శాంతులు ఉండలేవని నాకు తెలుసు. సాధ్యమైనంత ఎక్కువగా తన పౌరులను చల్లగా చూసుకుంటున్న దేశం ఏది?

సమాధానం:

వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు కేవలం ప్రశ్నకర్త కోణాన్ని మాత్రమే కాకుండా ప్రశ్నలోని విషయంపై ఒక అవగాహన ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను. ప్రశ్న కర్త కోరుతున్న అంశాన్ని చెపుతూనే దానితో సంబంధం ఉన్న ఇతర అంశాలను కూడా స్పృజించడం ద్వారా సమాధానాన్ని ఒక దృక్పధంలో లేదా ఒక విస్తృత సందర్భంలో పెట్టగలిగితే పాఠకులకు ఉపయోగం అన్నది నా ప్రయత్నం. అయితే మీ ప్రశ్నలోని మీ కోణాన్ని నేను మిస్ అయినట్లున్నాను.

ప్రజల్ని చక్కగా పాలించడానికీ ఆర్ధిక శక్తికీ సంబంధం లేదు. వాస్తవంగా అయితే ఉండాలి, కానీ ఆచరణలో ఆ సంబంధం లేకుండా పోయింది. దానికి కారణం ఒక దేశ ఆర్ధిక శక్తి ఆ దేశ ప్రజలందరి శక్తికి ప్రతిబింబం కాదు. ఒక దేశంలోని ధనిక వర్గాలు ఎంత ఎక్కువ మిగులు సాధిస్తే ఆ దేశం అంత సంపన్నంగా కనిపించవచ్చు.

ఎక్కువ మిగులు ఎలా సాధ్యం?

ఒకటి: ఉత్పత్తి ఎక్కువ చేయగలిగి, దాన్ని పూర్తిగా అమ్ముకోగలగాలి. తద్వారా లాభం ఇంకా ఇంకా పోగుబడి మరిన్ని పెట్టుబడులు పెట్టగల సామర్ధ్యం వస్తుంది. మిగులు ఎక్కువగా ఉంటే ఆర్ & డి లో ఎక్కువ పెట్టుబడులు పెట్టి కొత్త కొత్త టెక్నాలజీ కనిపెట్టి సరికొత్త ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఈ ఉత్పత్తులు జనానికి అత్యవసరం కానవసరం లేదు. అత్యవసరం అన్న మాయను సృష్టించగలిగితే చాలు.

రెండు: సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సంపాదించడం. ఉదాహరణకి ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా చట్టాలను ఖచ్చితంగా పాటిస్తూ వేతనాలు సరిగ్గా ఇస్తే ఉత్పత్తి ఎక్కువ చేసినా లాభం తగ్గుతుంది. కానీ చట్టాలను ఉల్లంఘిస్తూ, ఉత్పత్తుల్లో మోసాలకు పాల్పడుతూ తక్కువమందికి ఉద్యోగాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటే లాభం బాగా పెరుగుతుంది. యాంత్రీకరణ, కంప్యూటరీకరణ ప్రవేశ పెట్టినా తక్కువ లేబర్ తో ఎక్కువ ఉత్పత్తులు తద్వారా ఎక్కువ లాభాల గడించవచ్చు. కానీ నిరుద్యోగం ప్రబలిపోతుంది. దేశం శక్తివంతంగా కనిపిస్తుంది గానీ మెజారిటీ ప్రజలు సుఖ సంతోషాలకు దూరం అవుతారు.

కాబట్టి ఒక దేశ ఆర్ధిక శక్తికీ, ఆ దేశ ప్రజలకు సుఖ సంతోషాలకూ సంబంధం ఉండడం లేదు. ప్రజలు సుఖ శాంతులతో ఉండేది ఎప్పుడంటే ఉత్పత్తి సరిపోయినంత జరగడమే కాకుండా అది సక్రమంగా పంపిణీ అయినప్పుడు. ఉత్పత్తి, పంపిణీ ఈ రెండింటిలో ఏది సక్రమంగా లేకపోయినా ప్రజలకు సుఖ శాంతులు ఉండవు. పశ్చిమ దేశాల్లో ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది కానీ పంపిణీలో వివక్ష ఉంది. మూడో ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి గతం కంటే మెరుగే కానీ పంపిణీలో విపరీతమైన వివక్ష ఉంది. నిజానికి రెండు ప్రపంచాలకు సరిపోను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ప్రస్తుత ప్రపంచాని ఉంది. కానీ ఏం లాభం? సామ్రాజ్యవాద మానవతకు పంపిణీని సమానంగా చేపట్టగల నాగరికత కొరవడింది.

చైనా, రష్యాల్లో సోషలిస్టు నిర్మాణం కొనసాగినంత వరకూ ప్రజలు సుఖ శాంతులతో బ్రతికారు. వినూత్నమైన ఉత్పత్తి పద్ధతులను కనిపెట్టి భారీ ఉత్పత్తులను తీశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.

ఇప్పుడు చైనాలో గతం కంటే ఎక్కువ ఉత్పత్తి జరుగుతోంది. కానీ అందులో ఎక్కువ భాగం చైనా ప్రజలది కాదు. అదంతా విదేశీ కంపెనీలది. పని చేసేది చైనా ప్రజలే గానీ కంపెనీలు, ఉత్పత్తులు, లాభాలు స్వదేశీ, విదేశీ ధనిక వర్గాల వద్ద కేంద్రీకృతమైనాయి. ఫలితంగా చైనా ఆర్ధిక శక్తి సాధించినా మెజారిటీ ప్రజలు సుఖ శాంతులతో లేరు. అక్కడ ప్రతి యేడూ కొన్ని వేల ఆందోళనలు, అలజడులు ఆత్మహత్యలు రికార్డు అవుతున్నాయి.

అమెరికాలో 1970ల వరకూ కాస్త మెరుగైన వేతనాలు జనాలకు చెల్లించారు. వినియోగం కూడా ఎక్కువ ప్రోత్సహించారు. దానితో అక్కడ ఉత్పత్తి ఎక్కువగా జరిగింది, వినియోగమూ ఎక్కువగా జరిగింది. ఐరోపా, జపాన్ దేశాలకు అమెరికా ముఖ్యమైన మార్కెట్ గా ఉండేది. కానీ 1970ల తర్వాత అమెరికాలో వేతనాలు స్తంభించిపోయాయి. 1990ల చివరి నుండి వేతనాలు పడిపోవడం మొదలైంది. దానితో మార్కెట్ కొనుగోలు శక్తి పడిపోయి ఉత్పత్తి తగ్గింది. అమెరికాకు చేసే ఎగుమతులపై ఆధారపడిన దేశాలకూ కష్టం వచ్చి పడింది. అమెరికా క్రమంగా సంక్షోభంలో కూరుకుపోతూ ప్రపంచాన్ని కూడా అందులోకి లాగుతోంది.

ఐరోపాలోని సంపన్న దేశాలదీ (జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ మొ.వి) అమెరికా లాంటి పరిస్ధితే.

ఈ నేపధ్యంలో ఫలానా దేశంలో ప్రజలు సుఖ శాంతులతో ఉన్నారని చెప్పడం సాహసం అవుతుంది.

కానీ సాపేక్షికంగా కూడా ఏ దేశమూ చక్కగా లేదా అంటే రెండు మూడు దేశాలు చెప్పుకోవచ్చు. స్వీడన్ లో సాపేక్షికంగా మెరుగైన చట్టాలు, పంపిణీ వ్యవస్ధను నిర్మించుకున్నారు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో సగానికి పైగా ప్రభుత్వం తీసేసుకుంటుంది. వారి కుటుంబాల విద్య, వైద్యం, రిక్రియేషన్… ఇలా దాదాపు ముఖ్యమైన సౌకర్యాలన్నీ ప్రభుత్వమే చూస్తుంది. నార్వేలోనూ దాదాపు ఇలాంటి ‘సామాజికార్ధిక సంస్కృతి’ ని అభివృద్ధి చేసుకున్నారు.  స్విట్జర్లాండ్ ప్రజలు కూడా సాపేక్షికంగా మెరుగైన వ్యవస్ధలను కలిగి ఉన్నారు.

కానీ ఈ దేశాలు అమెరికా ఆజ్ఞలకు బద్ధులు. ఉదాహరణకి జులియన్ ఆసాంజేను రాచి రంపాన పెడుతున్న అమెరికా, బ్రిటన్ లతో స్వీడన్ కుమ్మక్కు అయింది. సి.ఐ.ఏ ప్రోద్బలంతో పెట్టిన బూటకపు అత్యాచార కేసు మోపింది. ఆ కేసు ద్వారా బ్రిటన్ లో ఉన్న ఆసాంజేను రప్పించి అమెరికాకు extradite చేయాలని చూస్తోంది. ఒబామా మొదటిసారి అధికారంలోకి వచ్చిన 11 రోజులకే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చి సత్కరించడం బట్టి స్వీడన్, నార్వేల పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.

అయితే పైన చెప్పినట్లు తమ ప్రజలను కాస్త మెరుగ్గా చూస్తున్నాయి. పిల్లల భద్రత కోసం, స్త్రీల బధ్రత కోసం స్వీడన్, నార్వేలో ఉన్న ఉదాత్తమైన చట్టాలు ఇంకే దేశంలోనూ లేవు. చాలా సున్నితమైన చట్టాలను అవి అమలు చేస్తాయి. అలాంటి సున్నిత చట్టం వల్ల మన దేశానికి చెందిన ఒక జంట తమ పిల్లాడికి వాతలు పెట్టి జైలు పాలయింది. మరో సున్నిత చట్టాన్ని దుర్వినియోగం చేసి ఆసాంజేను ఓ చిన్న గదిలో ఎండ అనేది ఎరుగని పరిస్ధితి కల్పించారు.

గత పదేళ్లుగా లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలు మెరుగైన పరిస్ధితులను తమ ప్రజలకు కల్పించడంలో సఫలం అవుతున్నాయి. వెనిజులా వాటిలో అగ్రభాగాన ఉండగా ఈక్వడార్, బొలీవియాలు వెనిజులా బాటలో నడుస్తున్నాయి. క్యూబాతో కలిసి ALBA అనే కూటమి ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నాయి. అంతకుముందు ఈ దేశాల్లో అమెరికా మాట వినే నియంతలు ప్రభుత్వాలు నడిపారు. ఆనాటి ధనిక వర్గాలు ఇంకా శక్తివంతంగా ఉండడం వల్ల ప్రభుత్వాలకు సమస్యలు సృష్టించగలుగుతున్నారు. సి.ఐ.ఏ పనుపుతో ప్రభుత్వాల్ని కూల్చడానికి కుట్రలు పన్నుతున్నారు. వాటిని తట్టుకుంటూ దేశ సంపదను ప్రజలందరికీ చేరువ చేయడానికి కాస్త ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వాలకు తగిన స్ఫూర్తి, శక్తి ఇవ్వగల ఐడియాలజీ కొరవడింది. అందువల్ల వారి పాలనకు అనేక పరిమితులు ఉన్నాయి.

ప్రపంచం నాగరికత సాధించింది నిజమే. ప్రపంచ దేశాల్లో నార్డిక్ దేశాలు (స్వీడన్, నార్వే…) మరింత సున్నితమైన నాగరిక విలువలను అభివృద్ధి చేశాయి. కానీ అదే సరిపోదు. నాగరికత అనేది నాగరీకుల చేతుల్లో ఉన్నప్పుడే అది తనను తాను సరిగ్గా వ్యక్తం చేసుకుని ప్రజల్ని కాపాడుతుంది. కానీ అదే నాగరికత దోపిడి వర్గాల చేతుల్లో ఉన్నప్పుడు ప్రయోజనం పెద్దగా ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉన్నా దానికి పరిమితులు ఉంటాయి.

3 thoughts on “ప్రశ్న: తన ప్రజల్ని చల్లగా చూసుకునే దేశమే లేదా?

  1. క్యూబా సోషలిస్టు దేశమట కదా! అక్కడి పరిపాలన ఎలా వుంటుంది?. లాటిన్ అమెరికా దేశాల్లో వెనిజులాని ఎక్కువ చేసి చెప్పారు కానీ నేను విన్న దాన్ని బట్టి క్యూబా ముందుండాలి కదా!

  2. మంజరి గారూ, ఓ పదేళ్ళ క్రితం వరకూ మీరు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడు క్యూబా వెనక్కి ప్రయాణం కట్టింది. అమెరికాకు సఖ్యత కోసం ప్రయత్నిస్తోంది. సంస్కరణల పేరుతో స్వేచ్ఛా మార్కెట్ విధానాలను ప్రవేశపెడుతోంది. అనగా అరమరికలు లేకుండా ధనిక వర్గాల పక్షం వహిస్తోంది. కానీ వెనిజులా సాధ్యమైనంత ఎక్కువగా దేశ వనరులను ప్రజలకి కేటాయించడానికి ప్రయత్నిస్తోంది. వర్తమానంలో క్యూబా కంటే వెనిజులా బెటర్.

    సోషలిజం విషయానికి వస్తే క్యూబా అచ్చంగా ఎన్నడూ సోషలిజం కోసం ప్రయత్నించలేదు. సోషలిస్టు తరహా విధానాలను అనుసరించేది. సోషలిజం లక్ష్యంగా అక్కడి పాలన ఎప్పుడూ లేదు. క్యూబా విప్లవం కూడా సోషలిస్టు విప్లవం కాదు. ప్రస్తుతం ప్రపంచంలో సోషలిస్టు దేశం అనేది లేదు. ఉందని ఎవరన్నా చెబితే అది నిజం కాదు. వారు వాస్తవాలు చూడలేకపోతున్నారని అర్ధం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s