పాకిస్ధాన్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం (ప్రజల ప్రజాస్వామ్యం కాదు) కూడా ఓ ఎండమావిగా మారిపోయింది. ఎన్నికలు జరిగి పౌర ప్రభుత్వం ఏర్పడి అది కుదురుకునే లోపుగా అక్కడి మిలట్రీ జోక్యం చేసుకోవడం, ఎన్నికయిన ప్రభుత్వాల్ని కూల్చివేయడం ఒక పరిపాటి అయింది. పాలక వర్గాల మధ్య కుమ్ములాటలే ఈ ప్రహసనానికి మూల కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. కానీ నవాజ్ షరీఫ్ కీ, అక్కడి మిలట్రీకి ఎన్నడూ పడింది లేదు. గతంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడే ముషార్రాఫ్ నేతృత్వంలోని మిలట్రీ కుట్ర చేసి కూల్చేసింది. ముషార్రాఫ్ ఉన్నంత కాలం షరీఫ్ ను దేశంలోకి కూడా అనుమతించలేదు.
సంవత్సరాలు గడిచాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ని ఓడించి ముస్లిం లీగ్ అధికారం చేపట్టింది. నవాజ్ ప్రధానిగా ఉండగానే ముషార్రాఫ్ మళ్ళీ బ్రిటన్ నుండి పాక్ వచ్చాడు. ఆయనపైన కేసులను తిరగదోడి కొన్నాళ్లు జైల్లో పెట్టించింది నవాజ్ ప్రభుత్వం. ఎలాగో ఒప్పందం కుదుర్చుకుని ముషార్రాఫ్ బైటపడినా, ఆయన లండన్ వెళ్ళాక ఇమ్రాన్ ఖాన్ ను రంగంలోకి దింపి నవాజ్ పై పగ సాధిస్తోంది పాక్ మిలట్రీ.
పైకి ముషార్రాఫ్ జైలు జీవితం, ఇమ్రాన్ ఖాన్ ఆందోళనలు కనపడినా వారి వెనుక ఉన్నది పాలక వర్గాల కుమ్ములాటలు. పాకిస్ధాన్ లో మిలట్రీ, కోర్టులు ఒక పాలక గ్రూపుకు ప్రాతినిధ్యం వహిస్తాయి. పి.పి.పి, ముస్లీం లీగ్ లు చెరో గ్రూపుకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ గ్రూపుల మధ్య పంపకాలలో తేడా వచ్చినప్పుడల్లా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్తంభించిపోతుంది. మిలట్రీ దూకుడుగా ముందుకు వచ్చి వ్యవస్ధలను పని చేయకుండా ఆటంకం కలిగిస్తుంది.
ఇలా పాక్ మిలట్రీని పాలక వర్గాలు పోషిస్తున్నంతవరకూ అది గదిలో ఏనుగులా (పాలకుల) ప్రజాస్వామ్యానికి ఆటంకం కలిగిస్తూనే ఉంటుంది. గదిలో ఏనుగు ఉన్నప్పుడు ఏ పనీ చేసుకోలేము. ఏనుగు భారీ ఆకారం వల్ల గది ఇరుకైపోతుంది. అలాగని ఏనుగును బైటికి పంపించగల ద్వారం గదికి ఉండదు. కనుక ఏనుగును భరిస్తూనే పని సాగించాలి. పాక్ ప్రజాస్వామ్యానికి అక్కడి మిలట్రీ ‘గదిలో ఏనుగు’ లా మారిందని కార్టూనిస్టు సరిగ్గా సూచించారు.
మీ విశ్లేషణలు బాగుంటున్నాయి సార్. క్రమం తప్పకుండా చదువుతున్నాను. బాధ కలిగే విషమేమిటంటే మీ బ్లాగును ఆలస్యంగా చూడటం. అందుకే గతంలోని ఆర్టికల్స్‌ను చదవడం ప్రారంభించాను.