2014-15 ఆర్ధిక సం.లో మొదటి త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్ 2014) లో భారత ఆర్ధిక వ్యవస్ధ 5.7 శాతం వృద్ధి నమోదు చేసింది. గత రెండున్నరేళ్ల కాలంలో ఇదే అత్యధిక జి.డి.పి వృద్ధి శాతం. మెరుగైన జి.డి.పి వృద్ధి కోసం మొహం వాచిపోయి ఉన్న భారత పాలకులు ఈ 5.7% అంకెను చూసి సంబరాలే తక్కువ అన్నట్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. మోడి వల్లనే ఇది సాధ్యం అయిందని బి.జె.పి నాయకులు చెప్పుకుంటుండగా, కాదు తమ వల్లనే అని కాంగ్రెస్ నేతలు పోటీకి వచ్చారు.
2013-14 ఆర్ధిక సంవత్సరం/ఫిస్కల్ ఇయర్ చివరి త్రైమాసిక కాలానికి గాను భారత్ 4.5 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. 2012 ద్వితీయ త్రైమాసికంలో 5.1 శాతం వృద్ధి నమోదు చేసిన ఇండియా జి.డి.పి వృద్ధి ఆ తర్వాత మళ్ళీ 5 శాతం దాటలేదు. 2012 ప్రధమ త్రైమాసికంలో 6 శాతం వృద్ధి నమోదు చేసిన భారత జి.డి.పి ఆ తర్వాత నమోదు చేసిన అత్యధిక వృద్ధి రేటు ఇప్పుడే. దానితో సహజంగానే పాలకులు ఉత్సాహపడుతున్నారు.
కాగా జి.డి.పి వృద్ధి మెరుగు కావడానికి కారణం తాము తీసుకున్న చర్యలే అని మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం చెప్పుకున్నారు. 2014-15 నుండి ఆర్ధిక వ్యవస్ధ మెరుగైన వృద్ధి నమోదు చేయడం ప్రారంభిస్తుందని తాము ముందే చెప్పామని ఆయన వ్యాఖ్యానించారు.
5.7 శాతం వృద్ధి రేటు అన్నది గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో నమోదు చేసిన జి.డి.పితో పోల్చుతూ లెక్కించినది. అనగా 2013 ఏప్రిల్-జూన్ కాలంలో 100 రూపాయల జి.డి.పి నమోదు చేయగా 2014 ఏప్రిల్-జూన్ కాలంలో 105.7 రూపాయలు జి.డి.పి నమోదు అయిందని అర్ధం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 2013 ఏప్రిల్-జూన్ లో జి.డి.పి వృద్ధి 4.7 శాతం మాత్రమే. అనగా శాతం లెక్కించే బేస్ సంఖ్య తక్కువగా ఉంది. బేస్ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడూ వృద్ధి శాతం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఎంతయినా వృద్ధి వృద్ధే అని మన పాలకుల సంబరం.
మాన్యుఫాక్చరింగ్ రంగం పుంజుకోవడమే మెరుగైన వృద్ధికి కారణం అని తెలుస్తోంది. ఇక్కడ కూడా అదే జరిగింది. 2013 ఏప్రిల్-జూన్ కాలంలో మాన్యుఫాక్చరింగ్ వృద్ధి -1.2 శాతం. అనగా పెరగడానికి బదులు తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా బేస్ ఫిగర్ తక్కువగానే ఉంది. అందువల్లనే 2014-15 ఏప్రిల్-జూన్ కాలంలో ఈ రంగం 3.5 శాతం వృద్ధి నమోదు చేయడం సాధ్యపడింది. మైనింగ్ రంగం కూడా గత యేడు -3.9% వృద్ధి నమోదు చేస్తే ఈ యేడు 1.2 శాతం వృద్ధి చెందింది. 5.7 శాతం వృద్ధి మైనింగ్ రంగం వల్ల కూడా సాధ్యమైందని గ్రహించవచ్చు.
మాన్యుఫాక్చరింగ్ వృద్ధిని సాపేక్షికంగా మెరుగైన వృద్ధిగా చూడవచ్చు గానీ ప్రజలకు పెద్దగా ఉద్యోగావకాశాలు కల్పించలేని ఈ వృద్ధి ప్రజల కోణంలో వ్యర్ధమే. సాధారణంగా మాన్యుఫాక్చరింగ్ రంగం ఎంత ఎక్కువ వృద్ధి చెందితే అన్ని ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడాలి. యాంత్రీకరణ, కంప్యూటరీకరణ పెరిగినందున ఈ సూత్రం క్రమంగా సంభావ్యత (relevance) కోల్పోతోంది.
“2013-14 అర్ధ భాగం నుండి ఆర్ధిక వృద్ధి క్షీణత ఆగిపోయిందని, 2014-15 ప్రారంభం నుండి మెరుగైన వృద్ధి నమోదు అవుతుందని మేము చెప్పాము. 5.7 శాతం వృద్ధి నమోదు కావడం బట్టి మా అంచనా నిజమే అని రుజువయింది” అని చిదంబరం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్-జూన్ కాలం అని చిదంబరం గుర్తు చేశారు. మే 26, 2014 వరకు తాము అధికారంలో ఉన్నామని కూడా ఆయన గుర్తు చేశారు. “కాబట్టి ఆర్ధిక వ్యవస్ధ పునఃవృద్ధి సాధించడంలో క్రెడిట్ మాకే దక్కుతుంది. అయితే చేయవలసింది ఇంకా ఉంది” అని చిదంబరం ప్రకటన తెలిపింది. యు.పి.ఏ విధానాలను కొనసాగిస్తే 2014-15 లో 5.5 శాతం వార్షిక వృద్ధి సాధ్యమేనని మాజీ మంత్రి విశ్వాసం ప్రకటించారు.
ఆర్ధిక వృద్ధి కోసం యు.పి.ఏ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చిదంబరం గుర్తు చేశారు. మాన్యుఫాక్చరింగ్ రంగం వృద్ధి కోసం ఎక్సైజ్ సుంకం తగ్గించామని, విద్యుత్ డిమాండ్ వృద్ధి కోసం బొగ్గు గనులను కంపెనీలకు అప్పజెప్పామని, మైనింగ్ రంగంలో కూడా ఇదే తరహా చర్యలు తీసుకున్నామని చిదంబరం తెలిపారు. మైనింగ్ రంగంలో అనుమతులను శీఘ్ర గతిన లభించేందుకు యు.పి.ఏ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని, భూసేకరణ చట్టాన్ని చూసీ చూడనట్లు పోవాలని అనధికారిక ఆదేశాలు జారీ చేసింది. బహుశా చిదంబరం ఉద్దేశ్యం ఈ చర్యలే అయి ఉండాలి.
చిదంబరం పేర్కొన్న చర్యల ద్వారా ఆర్ధిక వృద్ధి నిజంగా ఎలా సాధ్యం అయిందో స్పష్టం అయిపోయింది. కంపెనీలకు ఎక్సైజ్ సుంకం తగ్గించడం అంటే ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకోవడం. ఇదే ప్రభుత్వం ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతోందని చెబుతూ సబ్సీడీలను క్రమంగా తగ్గించింది. ఖర్చులు తగ్గించాలంటే సగటు జనంపై పెట్టే ఖర్చు గుర్తుకు వస్తుంది. ప్రోత్సాహకాలు ఇవ్వాలంటేనేమో కంపెనీల పన్నులు గుర్తుకు వస్తాయి. వృద్ధి పెరిగింది ఇలాగ. జనాన్ని కొట్టి, కంపెనీలను మేపి, బొగ్గు గనుల్ని ఉదారంగా ఇచ్చేసి వృద్ధి పెంచారు. ఇవే విధానాలను కొనసాగించాలన్న చిదంబరం సలహాను మోడి ప్రభుత్వం ఇప్పటికే పాటిస్తోంది కూడా.
భారత దేశ ఆర్ధిక వృద్ధి కధ ఎప్పుడూ ఇదే. ఆ మాటకు వస్తే ఏ దేశంలోనైనా ఇదే తంతు. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం. గద్దల బలుపు చూపుతూ ‘చూసారా మా వృద్ధి’ అంటూ చాటుకోవడం.
కేవలం పన్నుల తగ్గింపు వల్ల పారిశ్రామిక ఉత్పత్తి పెరగదు. భారీ యంత్రాలు తిప్పడానికి విద్యుత్ ధరలు తగ్గాలి, కొలిమిలో మండించడానికి పెత్రోల్, బొగ్గు ధరలు తగ్గాలి. 2004కి ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జిలు పెంచడం వల్ల అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి.
చంకలు గుద్దుకుని ప్రయోజనమేమిటి?
సామ్రాజ్యవాద దేశాలకి ముడి సరుకులు అమ్మే దేశంగా ఉన్నంత కాలం మన దేశం బాగుపడదు. అయితే సోషలిస్త్ అవ్వాలి లేదా సామ్రాజ్యవాది అవ్వాలి. సామ్రాజ్యవాదికి ముడి సరుకులు అమ్మేవానిగా ఉన్నంత కాలం మనం బాగుపడము. మన ఇందియా పారిశ్రామిక వృద్ధి అమెరికాకి మన దేశం నుంచి అయ్యే ఎగుమతుల మీద ఆధారపడి ఉందన్నారు కాబట్టి ఈ వ్యాసం చదవండి: http://content.janavijayam.in/2014/06/law-of-diminishing-returns-and.html
మన భారతీయులు కూడా సుదూర సముద్ర ప్రయాణాలు చేసి, దేశాలని ఆక్రమించుకుని, వలస పాలనలు చేసి ఉంటే మన దేశం కూడా ఒక సామ్రాజ్యవాద శక్తి అయ్యుండేది. 1757లో మీర్ జాఫర్ ఆంగ్లేయులకి లొంగిపోవడం వల్ల మన దేశానికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అమెరికాకి లొంగి ఉంటున్న నరేంద్ర మొదీ మీర్ జాఫర్ కంటే ఏమీ గొప్పవాడు కాదు.