“The Party with a difference” అని బి.జె.పి నేతలు తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. “The party with differences” అని కాంగ్రెస్ పరాచికాలాడుతుంది. కాంగీ పరాచికాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ కంటే తాము భిన్నం ఏమీ కాదని వివిధ సందర్భాల్లో బి.జె.పి నిరూపించుకుంది. తాజాగా ఎ.ఎ.పి ని చీల్చి ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు బి.జె.పి ప్రయత్నించిన సంగతి వెల్లడి అయింది.
గత లోక్ సభ ఎన్నికల్లో అమేధిలో రాహుల్ గాంధీ పై పోటీ చేసి ఓడిపోయిన కుమార్ బిశ్వాస్ కు బి.జె.పి, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వజూపిందని తెలిసింది. కుమార్ బిశ్వాస్ స్వయంగా పత్రికలకు ఈ సంగతి తెలిపాడు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే తమ వద్దకు ఒక బి.జె.పి నేత వచ్చి బేరం ఆడారని, తాను బి.జె.పి పెద్దల ఆదేశాల మేరకే బేరం ఆడుతున్నట్లు కూడా చెప్పారని బిశ్వాస్ చెప్పారు.
“ఎన్నికల అనంతరం నాకు స్నేహితుడు కూడా అయిన ఒక బి.జె.పి ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చాడు. నేను ఎన్నికల్లో ఓడిపోయాను గనుక అభినందనలు చెప్పడానికో లేక సానుభూతి పలకడానికో వచ్చి ఉంటాడని నేను అనుకున్నాను. కానీ నేను ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలని తమ పార్టీ కోరుతున్నట్లు ఆయన చెప్పారు. బి.జె.పి నాయకత్వం తరపునే నన్ను కలుస్తున్నానని కూడా ఆయన చెప్పారు” అని కుమార్ బిశ్వాస్ ఒక న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ చెప్పారు.
బి.జె.పి ఆఫర్ ని తాను తిరస్కరించానని బిశ్వాస్ తెలిపారు. ఈ విషయాన్ని తాను వెంటనే పార్టీ నేతలకు చెప్పానని చెప్పారు. తన వద్దకు వచ్చిన బి.జె.పి ఎమ్మెల్యే ఎవరో చెప్పడానికి బిశ్వాస్ నిరాకరించారు.
49 రోజుల పాటు ఢిల్లీ ప్రభుత్వం నడిపిన ఎఎపి లోక్ సభ ఎన్నికల ముందు హడావుడిగా రాజీనామా చేసింది. చేతగాక రాజీనామా చేసిందని, లోక్ సభ ఎన్నికల కోసమే రాజీనామా చేసిందని విమర్శలు ఎదుర్కొంది. ఎఎపి త్యాగాన్ని ప్రజలు గుర్తించలేదు. ఫలితంగా ఢిల్లీలో ఒక్క లోక్ సభ స్ధానాన్ని కూడా ఎఎపి గెలుచుకోలేకపోయింది. ఊహించని విధంగా పంజాబ్ లో కొన్ని స్ధానాలు గెలుచుకున్నప్పటికీ లోక్ సభ లో ప్రభావం చూపగల స్ధానాలను పొందలేకపోయింది.
ఎఎపి ఎమ్మెల్యేలను కొంతమందిని కొనివేయడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు బి.జె.పి ప్రయత్నించినట్లు ఈ నెల ప్రారంభంలో ఆరోపణలు వచ్చాయి. కొందరు ఎమ్మేల్యేలు ఎఎపికి రాజీనామా చేసి బి.జె.పిలో చేరతారని పుకార్లు సైతం వ్యాపించాయి. ఈ మేరకు ఎఎపి నేత మనీష్ సిసోడియా పత్రికల ముందే బి.జె.పిపై ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన 5గురు ఎం.ఎల్.ఎ లను సమీపించి కోట్ల రూపాయలు ఇస్తామని ఎర చూపారని కానీ వారు లొంగలేదని ఆయన చెప్పారు. 5 గురు ఎం.ఎల్.ఎ ల పేర్లను కూడా ఆయన వెల్లడించారు.
బి.జె.పి నేతల “The party with a difference” నినాదం సొగసు ఇలా ఉంది.
చూస్తుంటే ఆప్ కూడా నాటకాలు ఆడుతోందని అర్ధమైపోతోంది. ఎప్పుడో మూడునెలల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు చెప్పడంతోనే ఆయన నిజాయితీ ఎంతో తెలిసిపోతోంది. ఇంతకాలం ఆయన ఈవిషయాన్ని చెప్పడానికి టైం దొరకలేదా !!!!!????. ఇంతకాలం చెప్పకుండా ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు జరగచ్చు అనుకుంటున్నవేళ చెప్పడం రాజకీయాల్లో భాగమేగానీ నిజం కాదు.
అంటే విశ్వాస్ కుమార్ కూడా ఆ ఆఫర్‌పై ఇన్ని రోజులు ఆలోచించే తిరస్కరించారా లేక ఇన్ని రోజులు ఎందుకు బయటకు చెప్పలేదు. ఒకవేళ ఎప్పటికి ద్వారాలు తెరుచుకునే ఉండేలా ఈ మూడు నెలలు వేచి చూసినట్లున్నారు కదా?//