ప్రశ్న: అమెరికాకి ఆధిపత్యం ఎందుకు?


US hegemony

వెంకట్ నాయుడు

మీ వెబ్ సైట్ కు ధన్యవాదాలు. నాకు సరిగా అర్ధం కాని విషయం ఏంటంటే ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం ఎందుకు చూపిస్తుంది? అసలు ఆధిపత్యం చూపించడానికి కారణాలు ఏమిటో చెప్పండి.

సమాధానం:

ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ అవసరాలు.

ప్రతి దేశంలోనూ ఆ దేశ వనరులపై గుత్తాధిపత్యం కలిగిన కొద్దిపాటి ధనిక కుటుంబాలు ఉంటాయి. వారికి సహకారంగా వారి మాట వింటూ పని చేసే ధనిక వర్గాలు మరింత మంది ఉంటారు. వారు దేశ ఆర్ధిక వ్యవస్ధని, దానికి ఆలంబనగా ఉన్న రాజకీయ, సామాజిక వ్యవస్ధలను శాసిస్తూ ఉంటారు.

ఐరోపా దేశాల్లో 14వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం సంభవించింది. అనగా అనేక శాస్త్రబద్ధ ఆవిష్కరణలు జరిగి యంత్రాలు తయారు చేశారు. ఆవిరి యంత్రంతో రైళ్లు నడపడం, యంత్ర పరికరాలతో భారీ మొత్తంలో సరుకులు ఉత్పత్తి చేయడం లాంటివి జరిగాయి. భారీ ఓడలు తయారు చేసుకుని విదేశీ వాణిజ్యం చేయడం పెరిగింది. అప్పటివరకూ ఇండియా, చైనాలు ప్రధానంగా ఉత్పత్తిలో ముందు ఉండేవి. ఐరోపాతో పోలిస్తే ఈ దేశాల్లోనే ఎక్కువ ఉత్పత్తి, వాడకం జరిగేది.

పారిశ్రామిక విప్లవం వల్ల ఐరోపా దేశాల్లో మిగులు ఉత్పత్తి బాగా పెరిగింది. ఈ మిగులు ఉత్పత్తిని అమ్ముకోవడానికి యూరోపియన్ లకు కొత్త మార్కెట్లు అవసరం అయ్యాయి. భూ మార్గం ద్వారా ఇండియా, చైనాలతో ఎంతో కొంత వ్యాపారం చేసేవారు. కానీ చారిత్రక సిల్క్ రోడ్డులో దొంగల బెడద ఎక్కువయింది. మధ్య ఆసియా నుండి వాణిజ్య మార్గంపై ఎక్కువ దాడులు జరిగేవి. దానితో జలమార్గం ద్వారా ఇండియా, చైనాలకు మార్గం కనుగోనవలసిన అవసరం వచ్చింది.

(ఆ ప్రయత్నంలోనే పశ్చిమానికి వెళ్ళి కొలంబస్ అమెరికాని కనుగొన్నాడని తెలిసిన విషయమే. నిజానికి అమెరికాని కొలంబస్ కనిపెట్టాడని చెప్పడం తెల్ల జాతుల ఆధిపత్య ధోరణిలో భాగం. ఎందుకంటే అమెరికాలో అప్పటికే ప్రజలు నివసిస్తున్నారు. వారే అసలు అమెరికన్లు. వారికి యూరోపియన్లు రెడ్ ఇండియన్లు అని పేరు పెట్టారు. ఇండియా కోసం వెళ్ళి అమెరికాయే ఇండియా అనుకుని, వారు ఎర్రగా ఉండడంతో రెడ్ ఇండియన్లు అన్నారు.)

ఆ విధంగా సరుకుల అమ్మకం కోసం (వాణిజ్యం కోసం) వచ్చి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను తమ వలసలుగా ఐరోపా దేశాలు మార్చుకున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, హాలండ్ (డచ్), పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ఇందులో ప్రధానమైనవి. ఆసియాలో బ్రిటన్ ఎక్కువ దేశాలని వలసలుగా మార్చుకుంటే ఆఫ్రికాలో ఫ్రాన్స్, లాటిన్ అమెరికాలో స్పెయిన్ వలసలను ఏర్పాటు చేసుకున్నాయి.

(అమెరికా, కెనడా దేశాలకి బ్రిటన్ నుండి ప్రధానంగా, స్పెయిన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాల నుండి కాస్త తక్కువగా జనమే వలస వెళ్లారు. అక్కడి ప్రజలని తన్ని, తరిమి, చంపి తమ వశం చేసుకున్నారు. లాటిన్ అమెరికాలో స్పెయిన్ ఎక్కువగా ఇలాంటి అరాచకాలకు పాల్పడింది. అమెరికా, కెనడాలను పూర్తిగా తమ వశం చేసుకోవడానికి బ్రిటన్లు నెత్తురు పారించారు. స్ధానిక తెగలను దాదాపుగా నిర్మూలించారు. మిగిలినవారిని అలాస్కాకు తరిమేశారు.)

క్రమంగా వలస దేశాల ప్రజలు తిరుగుబాట్లు చేశారు. జాతీయోద్యమాలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో ఖాళీ చేయక తప్పని పరిస్ధితి వచ్చింది. పూర్తిగా ఖాళీ చేస్తే వారి వాణిజ్య ప్రయోజనాలు ఏం కావాలి? తాము వెళ్లిపోయాక కూడా తమ కంపెనీల ప్రయోజనాలు కొనసాగించడానికి వలస దేశాలు మరో ఎత్తు వేశాయి. 

తమ వాణిజ్య ప్రయోజనాలు కాపాడే శక్తులను ఆ దేశాల్లోనే అభివృద్ధి చేసుకున్నారు. స్ధానికంగా ఒక సంపన్న వర్గాన్ని సృష్టించి వారు తమ అదుపాజ్ఞలలో ఉండేట్లు చేసుకున్నారు. అనగా తమ తరపున పని చేసే దళారీలను అభివృద్ధి చేశారు. ఆయా దేశాల స్వాతంత్ర ఉద్యమాలు కూడా ఈ దళారీల అదుపాజ్ఞల్లో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. స్వాతంత్రం పేరుతో ఈ దళారీలకు అధికార మార్పిడి చేసి తాము వెళ్ళిపోయారు. వారు వెళ్ళినా వారి వాణిజ్య ప్రయోజనాలు మాత్రం కొనసాగాయి. కాకపోతే ప్రత్యక్ష పాలన కంటే పరోక్ష పాలనలో కాసిని ఎక్కువ హక్కులు ప్రజలకు దక్కాయి. అదే స్వాతంత్రం అని పాత వలస దేశాల ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు.

కానీ వాస్తవంగా స్వాతంత్రం ఎలా ఉండాలి? దేశ వనరులన్నీ అక్కడి ప్రజల ఆధీనంలో ఉండాలి. ఉత్పత్తి కార్యకలాపాలన్నీ స్ధానిక దేశీయులే నిర్వహించాలి. వారు పెట్టుబడిదారీ సంపన్నులైనా సరే, వనరులు మార్కెట్ల పైన మాత్రం వారికే ఆధిపత్యం ఉండాలి. అలా ఉంటేనే నిజమైన స్వాతంత్రం. కానీ పాత వలస దేశాల్లో అలాంటి పరిస్ధితి లేదు.

గతంలో సైన్యాన్ని, పాలనను ఎగుమతి చేసి ప్రత్యక్షంగా పాలిస్తే ఇప్పుడు పెట్టుబడిని రుణాలు, సహాయం రూపంలో ఎగుమతి చేసి దాని ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్ధలను నియంత్రిస్తున్నారు.

ఉదాహరణకి కె.జి బేసిన్ గ్యాస్ తీసుకుందాం. రిలయన్స్ పేరుకి మన దేశ కంపెనీయే. దానికి భాగస్వామి ఎవరు? బ్రిటిష్ పెట్రోలియం. రిలయన్స్ కంపెనీలో పెట్టుబడులు ప్రధానంగా విదేశీ బ్యాంకులవి ఉంటాయి. వాల్ స్ట్రీట్ బ్యాంక్ నుండి రుణం తీసుకున్నట్లు రిలయన్స్ కంపెనీయే చెబుతుంది. ఆ రుణానికి వడ్డీ చెల్లిస్తారు కదా? అది ఎవరిది? మన గ్యాస్ అమ్మగా వచ్చిన డబ్బే. ప్రభుత్వమే కంపెనీ పెట్టి గ్యాస్ వెలికి తీసి జనానికి అమ్మితే ఇప్పటి ధర కంటే చాలా చాలా తక్కువకు అమ్మవచ్చు. కానీ పెట్టుబడులు విదేశీ కంపెనీలవి కనుక అవి అందుకు ఒప్పుకోవు. చచ్చినట్లు వారి మాట ప్రకారం ధరలు నిర్ణయిస్తారు. వారి ఆజ్ఞల మేరకే 1 mmbtu గ్యాస్ ధర 2 డాలర్ల చిల్లర ఉంటే (ఇదే చాలా ఎక్కువ) ఇప్పుడు 8.4 డాలర్లకు పెంచారు. ఇక్కడ మనకు రిలయన్స్ కంపెనీ కనిపిస్తుంది. కానీ అసలు డిమాండు రిలయన్స్ ది కాదు. వారికి అప్పులు ఇచ్చిన వాల్ స్ట్రీట్, ద సిటీ (లండన్) బ్యాంకులది.

ఇలా ద్రవ్య పెట్టుబడి ఎగుమతి చేసి ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్ధలను, విధానాలను నియంత్రించడమే సామ్రాజ్యవాదం.

రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ బాగా బలహీనపడింది. ఫ్రాన్స్ కూడా. జర్మనీ, జపాన్, ఇటలీలు ఓడిపోయాయి గనుక అవి ఎలాగూ పెత్తనంలో లేవు. అమెరికా యుద్ధంలో చివరిగా ప్రవేశించింది. తక్కువ నష్టంతో బైటపడింది. ఆ విధంగా అమెరికా అగ్ర సామ్రాజ్యవాద దేశంగా అవతరించింది.

అయితే అప్పటికి సోవియట్ రష్యా, చైనాలు సోషలిస్టు దేశాలు 2వ వరల్డ్ వార్ ఫలితంగా తూర్పు యూరప్ దేశాలు సోషలిజం కిందికి వచ్చాయి. వారికి సోవియట్ రష్యా నాయకత్వం వహించడంతో రష్యా మరో అగ్రరాజ్యం అయింది. స్టాలిన్ మరణం తర్వాత రష్యా కూడా పెట్టుబడిదారీ దేశంగా మారింది. కనుక రష్యాకు కూడా మార్కెట్లు అవసరం అయ్యాయి. అమెరికాతో పోటీ పడుతూ వివిధ దేశాల్లో మార్కెట్లను వశం చేసుకుంది. ఆ విధంగా ఇండియా రష్యా ప్రాబల్యం కింద కొనసాగింది.

కానీ యుద్ధ ఆర్ధిక వ్యవస్ధను నడపలేక సోవియట్ రష్యా కూలిపోయింది. విచ్ఛిన్నానికి గురయింది. చిన్న చిన్న జాతులను కలిపి రష్యన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోగా సోవియట్ రష్యాలో భాగంగా ఉన్న మధ్య ఆసియా దేశాలు రిపబ్లిక్కులుగా అవతరించాయి. రష్యా కూలిపోవడంతో అమెరికా ఏకైక అగ్రరాజ్యం అయింది.

ఆర్ధిక (వాణిజ్య) ప్రయోజనాలు నెరవేరాలంటే రాజకీయ వ్యవస్ధలను కూడా నియంత్రించాలి. మరో మాటలో చెప్పాలంటే ఒక దేశానికి రాజకీయ స్వతంత్రం రావాలంటే ఆర్ధిక స్వతంత్రం ఉండాలి. ఆర్ధిక స్వతంత్రం లేకుండా రాజకీయ స్వతంత్రం మనలేదు. ఎందుకంటే ఆర్ధిక వ్యవస్ధకు కొనసాగింపే రాజకీయ వ్యవస్ధ. ఆర్ధిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల రూపంలో వ్యక్తం అవుతాయి. ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే అన్నీ ఆర్ధిక గ్రూపులు ఉన్నట్లు లెక్క.

కనుక పాత వలస దేశాలు ఇంకా ఆర్ధిక పరాధీనతలోనే ఉన్నాయి. పరాధీన దేశాలపై ఆధీన దేశాలు పెత్తనం చేస్తాయి. తమ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు చేయాలని ఒత్తిడి చేస్తాయి. ఒత్తిడిలకు లొంగకపోతే రష్యా, ఇరాన్, సిరియా, లిబియా తదితర దేశాలపై చేస్తున్నట్లు అబద్ధాలు ప్రచారం చేసి దాడులకు దిగుతాయి. అది కూడా సామ్రాజ్యవాదంలో భాగమే.

 

2 thoughts on “ప్రశ్న: అమెరికాకి ఆధిపత్యం ఎందుకు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s