జేమ్స్ ఫోలి చావు మరో వరల్డ్ వార్ కు దారి తీస్తుందా?


ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కు చెందిన మిలిటెంటు ఒకరు అమెరికా విలేఖరి జేమ్స్ ఫోలీ తలను కత్తితో కోసి చంపినట్లు చూపుతున్న వీడియో ఇటీవల ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయింది. ఈ వీడియోను సాకుగా చూపుతూ అమెరికా మళ్ళీ మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధానికి నగారా మోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్ లు యుద్ధ జ్వర పీడితులైనట్లుగా ప్రకటనలు గుప్పిస్తుండగా అమెరికా రక్షణ మంత్రి చక్ హెగెల్, సర్వ సైన్యాధ్యక్షుడు మార్టిన్ డింప్సేలు యుద్ధానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో పడ్డారు.

9/11 దాడులు చేసిన ఆల్-ఖైదా కంటే క్రూరమైన సంస్ధ ఐ.ఎస్ అనీ, ప్రపంచం అర్జెంటుగా దీని అంతు చూడాలని చక్ హేగెల్ ప్రకటించాడు. ఇటీవలి వరకూ తామే ఫ్రీ సిరియన్ ఆర్మీ, జబ్బత్ ఆల్-నూస్రా, ఇసిస్ తదితర ఉగ్రవాద సంస్ధలకు ఆయుధాలు, ధనము అందజేశామని, టర్కీ, జోర్డాన్ లలో తమ సి.ఐ.ఏ అధికారులే వారికి శిక్షణ ఇచ్చారని అమెరికా పాలకులు మర్చిపోయారు (నిజానికి జనం మర్చిపోయి ఉంటారని/మర్చిపోవాలని భావిస్తున్నారు). ఇప్పుడు అదే ఐ.ఎస్/ఇసిస్ వల్ల అమెరికా ప్రయోజనాలకు ముప్పు వస్తోందని ఆందోళన ప్రకటిస్తున్నారు. ఆ సాకుతో ఇరాక్ లో వైమానిక దాడులు నిర్వహించి సిరియాపైన కూడా దాడులు కొనసాగించాలని ఉద్యుక్తులు అవుతున్నారు.

సిరియా తిరుగుబాటును కవర్ చేసేందుకు అక్కడికి వెళ్ళిన ఫోటో జర్నలిస్టును అమెరికా మద్దతు ఉన్న ఫ్రీ సిరియన్ ఆర్మీ (ఎఫ్.ఎస్.ఏ) మిలిటెంట్లే పట్టుకుని నిర్బంధించారు. ఆ తర్వాత ఆయనను ఇసిస్ మిలిటెంట్లకు అమ్మేశారు. ఇసిస్ తీవ్రవాదులు సంవత్సరం క్రితమే జేమ్స్ ఫోలీని చంపేశారని సిరియా ప్రభుత్వం అసలు వాస్తవం వెల్లడి చేసింది. జేమ్స్ ఫోలీ తల నరికినట్లు చూపిన వీడియో అసలుది కాదని, ఫోటోగ్రఫీ టెక్నిక్ ల ద్వారా దాన్ని తయారు చేశారని బ్రిటన్ కి చెందిన ఫోరెన్సిక్ నిపుణ సంస్ధ ప్రకటించడాన్ని బట్టి సిరియా వెల్లడి నిజమే అని స్పష్టం అవుతోంది.

“camera trickery and slick post-production techniques” ఉపయోగించి వీడియో తయారు చేశారని ఫోరెన్సిక్ కంపెనీ నిపుణులు చెప్పారని బ్రిటిష్ పత్రిక టెలిగ్రాఫ్ తెలిపింది. ఆ వార్తను కింద లింక్ లో చూడండి.

Foley murder video ‘may have been staged’

బ్రిటన్ నుండి వెళ్ళి ఇసిస్ లో చేరిన తీవ్రవాదిగా చెబుతున్న వ్యక్తి  కత్తిని 6 సార్లు జేమ్స్ గొంతుపై లాగినప్పటికి ఒక్క చుక్క నెత్తురు కారలేదని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. బహుశా కెమెరాను పక్కకు తిప్పి ఆయనను చంపి ఉండవచ్చని వారు తెలిపారు. కెమెరా ముందు తల నరికినట్లు చూపిన దృశ్యం నిజానికి ఫోటోగ్రాఫిక్ టెక్నిక్ మాత్రమేనని తెలిపారు.

ఫోరెన్సిక్ కంపెనీ ఆషామాషా కంపెనీ కాదు. భద్రతా కారణాల రీత్యా కంపెనీ పేరును టెలిగ్రాఫ్ వెల్లడి చేయలేదు. కానీ బ్రిటన్ వ్యాపితంగా వివిధ ప్రభుత్వ ఫోరెన్సిక్ విధులను ఆ కంపెనీ నిర్వహిస్తోందని పత్రిక తెలిపింది. కాబట్టి ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనపై అనుమానాలు అవసరం లేదు. వారు చెప్పినట్లు కెమెరా షూటింగ్ అయ్యాక చంపి ఉండవచ్చన్నది నిజమే కావచ్చు. కానీ ఆ చంపడం అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాలు, పశ్చిమ కార్పొరేట్ పత్రికలు చెబుతున్నట్లు ఇటీవల ఆగస్టు 19 తేదీన జరిగింది కాదని సిరియా అధికారుల వెల్లడి ద్వారా తెలుస్తోంది.

సిరియాలో పౌరుల మరణాలను ఐరాస ఎప్పటికప్పుడు లెక్కిస్తూ ప్రకటించింది. జేమ్స్ ఫోలీ మరణం విషయం కూడా ఐరాసకు తెలుసని కావాలంటే ఆ సమాచారాన్ని ఐరాసను అడిగి తెలుసుకోవచ్చని సిరియా ప్రకటించింది. కానీ పశ్చిమ పత్రికలేవీ ఈ వార్తను ప్రచురించలేదు. స్వతంత్ర వార్తా సంస్ధ ఇన్ఫో వార్స్ మాత్రమే ఈ వార్తను ప్రచురించింది.

“జేమ్స్ ఫోలీని మొదట ఫ్రీ సిరియన్ ఆర్మీ అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ను ISIS కు (ఇప్పటి IS) కు అమ్మేసింది. ఐరాసను సంప్రదించి ఈ విషయాన్ని ధృవీకరించుకోవచ్చు. సంవత్సరం క్రితమే జేమ్స్ ఫోలీని చంపేశారు. ఇప్పుడు కాదు. ఆ పిక్చర్ ను మాత్రమే ఇప్పుడు విడుదల చేశారు. కానీ ఆయన్ను సంవత్సరం క్రితమే చంపారు. మా వద్ద ఖచ్చితమైన సమాచారం ఉంది. ఐరాస వద్ద కూడా ఆ సమాచారం ఉంది” అని సిరియా ప్రభుత్వ ప్రతినిధి బౌతైనా షాబన్ చెప్పారని ఆర్.ఐ.ఏ నొవొస్తి (రష్యన్ పత్రిక) ను ఉటంకిస్తూ ఇన్ఫో వార్స్ పత్రిక తెలిపింది.

జేమ్స్ ఫోలి ని చంపేస్తామని ఇసిస్ నుండి ఆయన కుటుంబానికి ఆగస్టు 12 తేదీన ఒక లేఖ అందినట్లు పశ్చిమ పత్రికలు తెలిపాయి. ఇరాక్ లో వైమానిక దాడులకు ఒబామా అనుమతి ఇస్తే అందుకు ప్రతీకారంగా జేమ్స్ ను చంపేస్తామని లేఖలో బెదిరించారని పత్రికలు తెలిపాయి. ఉగ్రవాదులతో చర్చించడం, వారి డిమాండ్లకు తల ఒగ్గడం తమ విధానం కాదని చెబుతూ ఆ లేఖకు స్పందించ లేదని అమెరికా అధికారులు చెప్పారు.

అనంతరం ఇరాక్ లో వైమానిక దాడులకు ఒబామా ఆదేశాలు ఇచ్చేశారు. 100 సార్లు దాడులు చేశామని కూడా చెప్పారు. ఈ దాడుల ద్వారా మోసుల్ డ్యాంను ఐ.ఎస్ నుండి విడిపించి కుర్దు స్వయంప్రతిపత్తి ప్రాంతానికి అప్పగించినట్లు పశ్చిమ పత్రికలు ఆర్భాటంగా తెలిపాయి. ఆ తర్వాత క్రమంగా సిరియాపై కూడా దాడులు చేయబోతున్నట్లు మెల్లగా ప్రకటిస్తూ వచ్చారు. ఉమ్మడి శత్రువే కనుక ఈ దాడులకు సిరియా ప్రభుత్వం మద్దతు కూడా ఇవ్వవచ్చని ఊహాగానాలు చేశారు. ఇవ్వవచ్చు కాదు, సిరియా ప్రభుత్వం సహకరిస్తోంది కూడా అని సిరియా అధికారులే చెప్పినట్లు వార్తలు రాశారు.

తీరా అసలు విషయం ఏమిటంటే వీడియో లక్ష్యం సిరియాపై దాడులకు తగిన పునాదిని ఏర్పాటు చేసుకోవడమే. సిరియా అధ్యక్షుడు తిరుగుబాటును క్రూరంగా అణచివేస్తున్నాడని, తన ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించాడని ఆరోపిస్తూ గత సంవత్సరం సిరియాపై దాడికి బారక్ ఒబామా సిద్ధమైన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. కానీ చివరి నిమిషంలో రష్యా కలుగజేసుకుంది. సిరియా రసాయన ఆయుధాలను ఐరాస ఆధ్వర్యంలో నాశనం చేయడానికి సిరియాను ఒప్పించింది. దానితో దాడికి తగిన కారణం అమెరికాకు లేకుండా పోయింది. అదీకాక సిరియాపై దాడులను అమెరికా ప్రజలు తిరస్కరించారు. సిరియా దాడికి ప్రజల్లో మద్దతు లేదని, మరో యుద్ధం ద్వారా మరో ఆర్ధిక సంక్షోభం ఎదుర్కోవాలని వారు భావిస్తున్నారని వివిధ సర్వేల్లో వెల్లడి అయింది. దానితో రష్యా మధ్యవర్తిత్వం అమెరికాకు కలిసి వచ్చింది. ఆ విధంగా సిరియాపై దాడి తప్పిపోయింది.

ఈ సంవత్సర కాలంలో రష్యాపై దుష్ప్రచారం చేయడానికి అమెరికా తీవ్రంగా కృషి చేసింది. మలేషియా విమానం MH17 కూల్చివేత రష్యా పనే అని ప్రచారం చేసింది. తద్వారా రష్యా మాటకు విలువ లేకుండా చేయాలని ప్రయత్నించింది. ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగేలా రష్యాను వివిధ రకాలుగా ప్రేరేపించి విఫలం అయింది. ఇప్పుడు జేమ్స్ ఫోలి వీడియో ద్వారా సిరియాపై దాడులకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇరాక్ పైన వైమానిక దాడులు చేయడానికి అమెరికా మరే దేశాన్ని సాయం కోరలేదు. సిరియాపై దాడికి మాత్రం వివిధ దేశాలను కూడగడుతోంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని ఇప్పటికే మద్దతు ప్రకటించాడు. ఇసిస్ వల్ల బ్రిటన్ కు ఎంత నష్టమో ఆయన తన ప్రజలకు వివరిస్తున్నాడు. జర్మనీ కూడా పరోక్ష మద్దతు ఇవ్వడానికి అమెరికాతో చర్చలు జరుపుతోంది. ఫ్రాన్స్  విదేశీ మంత్రి లారెంట్ ఫెబియస్ కూడా ఇసిస్/ఐ.ఎస్ క్రూరత్వం ఎంత భయంకరమో చెబుతూ తమ ప్రజలను సిద్ధం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ప్రస్తుతానికి ‘ఆలోచిస్తున్నాం’ అని చెబుతున్నాడు. త్వరలో మద్దతు ప్రకటించడం ఖాయం.

ఇరాక్ పై అనుకున్నదే తడవుగా దాడులు చేసిన అమెరికా సిరియాపై దాడికి ఎందుకు మద్దతు కోరుతోంది? ఎందుకంటే సిరియాపై దాడుల అసలు లక్ష్యం ఐ.ఎస్ కాదు గనక. సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ నేతృత్వంలోని ప్రభుత్వమే అమెరికా దాడులకు అసలు లక్ష్యం. తమ దేశంపై తమ అనుమతి లేకుండా దాడి చేస్తే (అది ఐ.ఎస్ ఆధీనంలోని భూభాగంపైన ఐనా సరే) అది దురాక్రమణ దాడిగానే పరిగణిస్తామని సిరియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపధ్యంలో సిరియా ప్రభుత్వ బలగాలపై దాడులు ఎక్కుపెట్టడం అమెరికాకు తేలిక అవుతుంది.

కానీ సిరియా వద్ద రష్యా సరఫరా చేసిన ఆధునిక వాయు రక్షణ వ్యవస్ధలు ఉన్నాయి. ఇరాన్ సరఫరా చేసిన ఆయుధాలు ఉన్నాయి. ఐ.ఎస్ పై దాడి పేరుతో ప్రభుత్వ బలగాలపై దాడి చేస్తే సిరియా వెంటనే స్పందిస్తుంది. ఎంతమొత్తంలోనైనా అమెరికా నష్టపోయే పరిస్డితి వస్తుంది. సిరియా బలగాల నుండి చిన్న స్పందన వచ్చినా అమెరికా-సిరియాల మధ్య పూర్తి స్ధాయి యుద్ధం చెలరేగే అవకాశం పొంచి ఉంది. సిరియాతో పాటుగా ఇరాన్ సైతం స్పందించే పరిస్ధితి ఏ రూపంలోనైనా తలెత్తవచ్చు. అదే జరిగితే మధ్య ప్రాచ్యం మొత్తం యుద్ధ సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యం లేదు.

ఒక జర్మనీ నాయకుడు అన్నట్లు “ప్రపంచ యుద్ధాలు ఇలాగే మొదలవుతాయి.” యుద్ధం మొదలు కావడానికి తక్షణ కారణం చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ వాస్తవ కారణం ఆయా దేశాలు ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంక్షోభాల్లో కూరుకుని ఉండడమే. ఆర్ధిక సంక్షోభ పరిస్ధుతులు ప్రపంచ యుద్ధానికి కావలసిన కారణాలను ఏర్పరుస్తుంది. అమెరికా, ఐరోపాలు పీకలలోతు సంక్షోభంలో కూరుకుని ఉన్నాయి. ఎన్ని ఉద్దీపనలు అమలు చేసినా, ఎంత తీవ్రమైన పొదుపు విధానాలు అమలు చేసినా సంక్షోభం ఇంకా తీవ్రం అవుతోందేగాని తగ్గడం లేదు. మార్కెట్ల విస్తరణకు చైనా ఆర్ధిక ఆటంకంగా మారగా రష్యా రాజకీయ ఆటంకంగా అవతరించింది. డాలర్ ఆధిపత్యం కూల్చివేతకు రష్యా, చైనాలు క్రమబద్ధంగా, స్ధిరంగా పని చేస్తున్నాయి. అమెరికా మాట వినడానికి ఐరోపా దేశాలు కూడా మారాం చేస్తున్నాయి. సిరియాపై దాడి విషయంలోనూ అమెరికా, ఐరోపా రాజ్యాల మధ్య విభేదాలు తలెత్తిన సూచనలు కనిపిస్తున్నాయి. కానీ విభేదాలకు అతీతంగా మార్కెట్ ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని నమ్మితే అమెరికాకు మద్దతు ఇవ్వడానికి ఐరోపా రాజ్యాలకు అభ్యంతరం ఉండదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s