ఉక్రెయిన్: ప్రొ-రష్యా బలగాల పురోగమనం


అమెరికా, పశ్చిమ దేశాలు నిలిపిన ఉక్రెయిన్ హంతక ప్రభుత్వం, తిరుగుబాటు బలగాల చేతుల్లో మరోసారి ఓటమిని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ నుంచి విడిపోయి రష్యాలో కలవాలని కోరుకుంటున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు తమపై దాడికి వచ్చిన ఉక్రెయిన్ హంతక బలగాలను స్ధిరంగా తిప్పి కొడుతున్నాయి. తాజాగా డోనేట్స్క్ మిలీషియా బలగాలు పశ్చిమ అనుకూల బలగాల నుండి నోవోజోవ్స్క్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఆ పక్కనే ఉన్న వ్యూహాత్మక మరియుపోల్ నౌకాశ్రయ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ముందుకు పురోగమిస్తున్నాయి.

ఉక్రెయిన్ లో పారిశ్రామిక అభివృద్ధి తూర్పు ఉక్రెయిన్ లోనే ప్రధానంగా కేంద్రీకృతం అయింది. రష్యా సహాయంతో ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతంలో పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల పెట్టుబడులు కూడా ఉన్నాయి. కాబట్టి తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాలు స్వతంత్రం ప్రకటించుకుని అనంతరం క్రిమియా తరహాలో రష్యన్ ఫెడరేషన్ లో భాగం అయినట్లయితే ఉక్రెయిన్ లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలిపిన ప్రయోజనం నెరవేరదు. అందుకే తాము ప్రకటించిన 18 బిలియన్ డాలర్ల సహాయం పూర్తిగా పొందాలంటే ముందు తూర్పు ఉక్రెయిన్ ను అణచివేసి రావాలని ఐ.ఎం.ఎఫ్ అధిపతి క్రిస్టిన్ లాగార్డే ఉక్రెయిన్ పాలకులను ఆదేశించింది.

ఐ.ఎం.ఎఫ్ ఆదేశాల మేరకు డోనేట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాలపైకి బలగాలను పంపి నాలుగు నెలలుగా బాంబుల వర్షం కురిపిస్తున్నప్పటికీ ఆ ప్రాంతాల తిరుగుబాటు అణచివేయడం ఉక్రెయిన్ బలగాల వల్ల కాలేదు. మలేషియా విమానాన్ని కూల్చివేయడం ద్వారా తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటును, రష్యాను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తే అదీ విఫలం అయింది. తూర్పు ఉక్రెయిన్ మిలిషియాను తమ బలగాలు మట్టి కరిపిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరెషెంకో డంబాలు పలికినప్పటికీ అవన్నీ ఉత్తమాటలే అని పశ్చిమ పత్రికలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాయి.

పెట్రో పెరెశెంకో పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఉక్రెయిన్ బలగాలు పై చేయి సాధించాయని నిన్నటి వరకు వార్తలు ప్రచురించిన రాయిటర్స్ వార్తా సంస్ధ ఇప్పుడు స్వరం మార్చింది. ఉక్రెయిన్ బలగాలు అనూహ్య రీతిలో ఓటమిని ఎదుర్కొంటున్నాయని, వెనక్కి పారిపోతున్నాయని అంగీకరించింది. పరిస్ధితి ఒక్కసారిగా తారుమారు కావడానికి కారణం రష్యన్ బలగాలు స్వయంగా రంగంలోకి దిగి తిరుగుబాటుదారుల పక్షాన పోరాడడమేనని రాయిటర్స్ చెబుతోంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరెషెంకోలు ఆగస్టు 27 తేదీన బెలారస్ రాజధాని మిన్స్క్ లో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ఇ.యు విదేశాంగ మంత్రి కేధరిన్ ఎష్టన్ కూడా హాజరయ్యారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా మిన్స్క్ వచ్చి ఇరు పక్షాలతో మాట్లాడి వెళ్లారు. అయినప్పటికీ పుతిన్, పెరెషెంకోల మధ్య చెప్పుకోదగిన ఒప్పందం ఏదీ కుదరలేదని పత్రికలు తెలిపాయి.

ఇ.యుతో అసోసియేషన్ ఒప్పందం కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ ముందుకు వెళ్ళినట్లయితే తమ ఆర్ధిక వ్యవస్ధ కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ సమావేశంలో పుతిన్, ఉక్రెయిన్ ను హెచ్చరించాడు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులో ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ ఇ.యు తో అసోసియేషన్ ఒప్పందం చేసుకోవడం వల్ల ఉక్రెయిన్ ద్వారా ఇ.యు సరుకులు రష్యాను ముంచెత్తుతాయి. ఇది తమకు సమ్మతం కాదని, తమ ఆర్ధిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉక్రెయిన్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని పుతిన్ హెచ్చరించాడు.

గత సంవత్సర కాలం నుండి పుతిన్ ఈ హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. గత ఉక్రెయిన్ ప్రభుత్వానికి కూడా ఇదే విషయాన్ని పుతిన్ చెప్పాడు. రష్యాతో ఉన్న చారిత్రక సంబంధాల రీత్యా ఇ.యు అసోసియేషన్ అగ్రిమెంట్ నుండి గత అధ్యక్షుడు యనుకోవిచ్ వెనక్కి తగ్గాడు. ఆయనకి వెనక్కి తగ్గడంతోనే అమెరికా, ఇ.యు లు తీవ్రవాద, నాజీ గ్రూపులను రెచ్చగొట్టి, హింసాత్మక ఆందోళనలు ప్రేరేపించి, అనేకమందిని పౌరులను, పోలీసులను చంపేసి యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. అప్పటి హెచ్చరికనే పుతిన్ నిన్న కూడా మరోసారి ప్రస్తావించాడు.

పుతిన్, పెరెషెంకోల సమావేశంలో తూర్పు ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ అంశాన్ని చర్చిస్తారని పశ్చిమ పత్రికలు అంచనా వేశాయి. సమావేశం అనంతరం పుతిన్ ‘అది మా పని కాదు’ అని స్పష్టం చేశాడు. దాడులు చేస్తున్నది ఉక్రెయిన్ ప్రభుత్వం, దాడులు ఎదుర్కొంటున్నది తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు కాబట్టి వారూ వారు మాట్లాడుకోవాలి తప్ప తమకు అందులో పాత్రలేదని పుతిన్ స్పష్టం చేశాడు. దానితో పుతిన్ పై మరో వంకతో దుష్ప్రచారం చేయాలని కాచుకుని ఉన్న పశ్చిమ పత్రికలు నిరాశకు గురయ్యాయి.

తమ నిరాశను మరో రూపంలో అవి వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్-డాన్ బాస్ (తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం) ల మధ్య యుద్ధం డాన్ బాస్ మిలీషియాకు అనుకూలంగా మారిందని చెబుతూ దానికి కారణం రష్యన్ బలగాలేనని రాయిటర్స్ ఊహించి చెప్పింది. డాన్ బాస్ నుండి పారిపోయి వస్తున్న ప్రభుత్వ సైనికులు ఈ సంగతి చెప్పారని ఆ పత్రిక తెలిపింది.”రెండు రోజుల క్రితం రష్యా నుండి సైనికులు డాన్ బాస్ లోకి చొరబడ్డారు. వారి మిలట్రీ పరికరాలే నొవొజోవ్స్క్ లో ఉన్నాయి” అని అజోవ్ బెటాలియన్ సైనికుడు చెప్పారని రాయిటర్స్ తెలిపింది. (ఉక్రెయిన్ లోని నయా నాజీ గ్రూపు స్వోబోడా నిర్వహిస్తున్న మిలిషియా గ్రూపు అజోవ్ బెటాలియన్.) మిలట్రీ వాహనాలపై డాన్ బాస్ మిలీషియా పతాకాలు ఉన్నప్పటికీ అందులో ఉన్నది మాత్రం రష్యన్ బలగాలే అని అజోవ్ బెటాలియన్ అధికారులను ఉటంకిస్తూ ఇతర పశ్చిమ పత్రికలు కూడా తెలిపాయి.

“ఉక్రెయిన్ మిలట్రీ అకస్మాత్తుగా ఎదురు దెబ్బలు తినడాన్ని బట్టి వేర్పాటువాద బలగాలకు సహాయంగా రష్యన్ బలగాలు నేరుగా రంగంలోకి దిగాయని అర్ధం అవుతోంది. డోనేట్స్క్, లుహాంస్క్ లలో మిలీషియా బలగాలు వాస్తవానికి ఇటీవలి వరకు ప్రభుత్వ బలగాల ఒత్తిడిలో ఉన్నాయి” అని రాయిటర్స్ రాసింది. గత పరిస్ధితిపై తానే ఊహాగానాలు అల్లి, ఇప్పుడు కొత్త వాస్తవాలను గ్రహిస్తున్నట్లు రాస్తూ, సదరు కొత్త వాస్తవాలకు కారణాలుగా మరిన్ని ఊహలను రాయిటర్స్ అల్లుతోంది. వాస్తవం ఏమిటంటే తూర్పు ఉక్రెయిన్ లో ఉక్రెయిన్ బలగాలు ఎన్నడూ పై చేయి సాధించింది లేదు. విచక్షణా రహితంగా ఫైటర్ జెట్లతో బాంబు దాడులు కురిపిస్తూ అదే తమ విజయంగా ఉక్రెయిన్ చెప్పుకున్నది.

నొవొజోవ్స్క్ పట్టణం చేజారిందని ఉక్రెయిన్ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. మిలీషియా తదుపరి లక్ష్యం మరియుపోల్ అని పశ్చిమ పత్రికలు అంచనా వేస్తున్నాయి. అయితే తాము తొందరపడడం లేదని డాన్ బాస్ మిలీషియా బలగాలు చెబుతున్నాయని ఓప్-ఎడ్ న్యూస్ పత్రిక వార్తల ద్వారా తెలుస్తోంది. దోనెట్స్క్ కు తూర్పున ఉన్న వ్యూహాత్మక సవుర్ మొహిలా కొండల్ని కూడా మిలీషియా బలగాలు వశం చేసుకున్నాయని ఇతర పత్రికల ద్వారా తెలుస్తోంది. 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s