సిరియా vs అమెరికా: పైకి తిరస్కారం, లోపల సహకారం


సిరియా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఉగ్రవాద సంస్ధలను ప్రేరేపించిన అమెరికా ఇప్పుడు అవే సంస్ధలపై దాడులు చేసేందుకు సిరియా సహకారం కోరుతోంది. “అబ్బే సిరియా సహకారం కోరే సమస్యే లేదు” అని పైకి చెబుతూనే అంతర్గతంగా సిరియా ప్రభుత్వం సహకారం అమెరికా తీసుకుంటోందని తెలుస్తోంది.

ఇరాక్, సిరియాలలో తన ఆక్రమణలో ఉన్న భూభాగాలను కలిపి ఇస్లామిక్ కాలిఫేట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ (గతంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాదులపై దాడులు చేస్తామని బారక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. సంవత్సరం క్రితం సిరియాలో నిర్బంధంలోకి తీసుకున్న ఒక అమెరికా విలేఖరి తల నరికినట్లుగా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోకు పశ్చిమ పత్రికలు విస్తృత ప్రచారం కల్పించాయి.

అమెరికా విలేఖరి తలను తెగనరికినట్లు ఈ వీడియో చూపిందని రాశాయి. కానీ వీడియోలో అలాంటి దృశ్యం ఏదీ లేదు. అమెరికా విలేఖరి చేతులు కట్టేసి ఆయనను నరికి చంపబోతున్నట్లు ఐ.ఎస్ కార్యకర్త ఒకరు తుపాకి ధరించి చెప్పడం అయితే వీడియోలో ఉంది గానీ నిజంగా చంపారా లేదా అన్న సమాచారం మాత్రం వీడియోలో రికార్డు కాలేదు. వీడియో తీయడం ఆపి ఆయనను పక్కకు తీసుకెళ్ళి చంపి ఉంటారని కొన్ని పశ్చిమ పత్రికలు చెప్పినా అందుకు సాక్ష్యాలను మాత్రం ఇవ్వలేదు.

ఈ వీడియోను అవకాశంగా తీసుకున్న పశ్చిమ దేశాధినేతలు మరోసారి ఉగ్రవాద ప్రమాదం గురించి ప్రకటనలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్ తదితర నేతలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తే తప్ప తమ దేశ ప్రజలకు శాంతి లేదని నిర్ధారించారు. ఇస్లామిక్ స్టేట్ కార్యకర్తలలో అమెరికా, బ్రిటన్ తదితర పశ్చిమ దేశాల పౌరులు కూడా ఉన్నందున వారు త్వరలోనే తమ గడ్డపైకి ఉగ్రవాద భూతాన్ని కొని తెస్తారని భయాందోళన ప్రకటించారు.

తమ దేశాలకు ఐ.ఎస్ నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని తొలగించాలంటే ఇరాక్, సిరియా లపై దాడులు చేయాలని తీర్మానించారు. ఇరాక్ లోని ఐ.ఎస్ ప్రాంతాలపై 100 మార్లు వైమానిక దాడులు చేశామని, మోసుల్ డ్యాం ను ఐ.ఎస్ చెర నుండి విడిపించామని అమెరికా ప్రకటించింది. కానీ ఈ దాడుల్లో ఐ.ఎస్ తీవ్రవాదులు ఎంతమంది చనిపోయింది చెప్పడంలో పశ్చిమ పత్రికలు, ఆ దేశాల అధికారులు విఫలం అయ్యారు.

ఇరాక్ తరహాలోనే సిరియాపై కూడా వైమానిక దాడులు నిర్వహిస్తామని చెబుతున్న అమెరికా అందుకు సిరియా ప్రభుత్వం సహాయం మాత్రం తీసుకోబోమని ప్రకటించింది. కానీ వాస్తవంలో పరోక్ష మార్గంలో అమెరికా సిరియా ప్రభుత్వంతో సమాచారం పంచుకుంటోందని రష్యా టుడే పత్రిక తెలిపింది. సిరియా సహాయం తీసుకుంటున్న వార్తలను పైకి తిరస్కరిస్తున్న అమెరికా లోలోపల మాత్రం సిరియా సహకారం తీసుకోక తప్పని పరిస్ధితిని ఎదుర్కొంటోందన్నమాట!

సిరియాపై దాడులు చేసేందుకు వీలుగా సమాచారం సేకరించేందుకు మానవ రహిత గూడచార విమానాలను సిరియా గగనతలం పైకి ఇప్పటికే అమెరికా పంపినట్లు పత్రికలు తెలిపాయి. కాంగ్రెస్ అనుమతి లేకుండానే బారక్ ఒబామా గూఢచార విమానాల ద్వారా రెక్కీ నిర్వహించేందుకు నిర్ణయించారని వైట్ హౌస్ ప్రతినిధి చెప్పారు. అయితే సిరియాపై దాడులు చేయాలంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం అందుకు సిరియా ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కానీ తమకు మాత్రం అలాంటి అనుమతి అవసరం లేదని వైట్ హౌస్ ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ చెప్పడం విశేషం.

“సిరియాలో ఐ.ఎస్ పై దాడులకు అస్సాద్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకునే పధకాలు ఏవీ మాకు లేవు. దీనిని మేము ఉగ్రవాద భయంగా పరిగణిస్తున్నాము” అని ఎర్నెస్ట్ చెప్పాడు. ఉగ్రవాద భయం ఉందని తాము భావిస్తే ప్రపంచంలో ఏ దేశం గగనతలం లోకైనా ప్రవేశించడానికి తమకు అనుమతి అవసరం లేదని వైట్ హౌస్ ప్రతినిధి చెబుతున్నాడు. అమెరికా రౌడీయిజానికి ఇంతకు మించిన సాక్ష్యాలు కావాలా?

అమెరికా ప్రకటనను సిరియా ప్రభుత్వం తిరస్కరించింది. తమ గగనతలంలో ప్రవేశించాలంటే తమ అనుమతి కోరాల్సిందేనని స్పష్టం చేసింది. అదే సమయంలో ఐ.ఎస్ తో తలపడేందుకు తాము సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కానీ అది అంతర్జాతీయ సమాజం పర్యవేక్షణలో జరగాలని సిరియా ఉప ప్రధాని మరియు విదేశీ మంత్రి వాలిద్ ఆల్-మొఅల్లెమ్ స్పష్టం చేశాడు. “సహకారానికి, సమన్వయానికి సిరియా సిద్ధమే… ఉగ్రవాదంపై యుద్ధంలో ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ సహకారానికి సిద్ధం. కానీ ఏ ప్రయత్నం జరిగినా అది సిరియా ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ మాత్రమే జరగాలి” అని వాలిద్ ప్రకటించాడు. తమ అనుమతి లేకుండా వైమానిక దాడులు చేస్తే అది తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లే అని స్పష్టం చేశాడాయన.

సిరియాకు చెప్పి చేసే ఉద్దేశ్యం, పధకం ఏమీ లేదని చెప్పిన అమెరికా వాస్తవంలో దానికి విరుద్ధంగా చేస్తున్నదని సిరియా ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది. అమెరికా తాను సేకరించిన గూఢచార సమాచారాన్ని అనధికారికంగా సిరియా ప్రభుత్వంతో పంచుకుంటోందని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. ఇరాక్, రష్యాల ద్వారా తమ వద్ద ఉన్న సమాచారాన్ని సిరియాకు చేరవేస్తోందని సిరియా ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ తెలిపింది.

“సహకారం ఇప్పటికే ప్రారంభం అయింది. డమాస్కస్ ప్రభుత్వానికి బాగ్దాద్, మాస్కోల ద్వారా అమెరికా సమాచారం ఇస్తోంది” అని సిరియా అధికారులు చెప్పారని ఎ.ఎఫ్.పి తెలిపింది. “సిరియా భూభాగంపై ఉన్న ఐ.ఎస్ టార్గెట్ ల సమాచారాన్ని ఒక పశ్చిమ దేశం సిరియా ప్రభుత్వానికి సరఫరా చేసింది. వివిధ ఐ.ఎస్ టార్గెట్ లతో కూడిన జాబితాను అందజేశారు” అని మధ్యప్రాచ్యంలోని ఒక సోర్స్ చెప్పారని ‘బిజినెస్ ఇన్సైడర్’ పత్రిక తెలిపింది.

ఇదే వార్తను పలు ఇతర పత్రికలు కూడా ధృవీకరించాయి. కానీ అమెరికా అధికారులు మాత్రం ఈ వార్తను తిరస్కరించారు. సిరియా అధ్యక్షుడు అస్సాద్ ను తాము గుర్తించడం లేదు కనుక సిరియాతో సమన్వయం లేదని అమెరికా విదేశీ శాఖ ప్రతినిధి మేరీ హార్ఫ్,  వైట్ హౌస్ జాతీయ భద్రతా సమితి ప్రతినిధి కేట్లిన్ హైడెన్ చెప్పారు. పైకొక మాట చెప్పి ఆచరణలో మరొకటి చేయడం అమెరికాకి కొత్త కాదు. నిన్నటివరకు అస్సాద్ పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పిన అమెరికా ఇప్పుడు అదే ఉగ్రవాదం సాకుగా చూపిస్తూ సిరియా, ఇరాక్ లపై దాడులకు తెగబడడం ఆ దేశ అంతర్జాతీయ సామ్రాజ్యవాద ఎత్తుగడలలో భాగంగా జరుగుతోంది తప్ప నిజంగా ఉగ్రవాద నిర్మూలన అమెరికా లక్ష్యం కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s