బీహార్ బకెట్ ఛాలెంజ్: మోడికి అవమానం? -కార్టూన్


Bucket challenge to Modi

ఐస్ బకెట్ ఛాలెంజ్! ఇది గత కొద్ది వారాలుగా ప్రపంచాన్ని ఊపేస్తున్న సవాలు. ఎ.ఎల్.ఎస్ అనే మోటార్ న్యూరాన్ వ్యాధి గురించిన అవగాహన పెంచేందుకు అమెరికాలోని ఏ.ఎల్.ఎస్ అసోసియేషన్ వారు ప్రారంభించిన ఈ సవాలు ప్రపంచ వ్యాపితంగా అనేకమంది సెలబ్రిటీలను రంగంలోకి లాగుతోంది.

ఏ.ఎల్.ఎస్ పూర్తి రూపం అమియోట్రోపిక్ లాటరల్ స్కెలేరోసిస్. ఇది ప్రాణాంతక వ్యాధి. లౌ గెహ్రిగ్స్ వ్యాధి అని కూడా దీనిని పిలుస్తారు. ఈ వ్యాధి సోకితే మెదడు, వెన్నుపాముల్లోని మోటార్ న్యూరాన్ కణాలు క్రమక్రమంగా చనిపోతాయి. మోటార్ న్యూరాన్లు మెదడు నుండి వెన్ను పాముకు, అక్కడి నుండి శరీరం అంతా విస్తరించి ఉండే నరాలకు ఆదేశాలను పట్టుకెళ్తాయి.

మోటార్ న్యూరాన్లు చనిపోతే నరాలు పని చేయడం క్రమంగా ఆగిపోతుంది. ఫలితంగా మాట పడిపోతుంది. కాళ్ళు, చేతులు కదలడం మానేస్తాయి. ఏ పనీ సొంతగా చేసుకోలేరు. అసంకల్పిత ప్రతీకార చర్యలు ఉండవు. ఆదేశాలు అందకపోవడం వల్ల నరాలు క్రమంగా క్షీణిస్తాయి. చిన్నవి అవుతాయి. అవయవాలు చిక్కిపోతాయి. చివరికి రోగి చనిపోతాడు. రోగి బ్రతికి ఉన్నంత కాలం రోగితో పాటు వారికి సేవలు చేసేవారిని కూడా మానసికంగా తీవ్ర ప్రభావాలకు గురి చేస్తుంది.

ఈ వ్యాధిపై అవగాహన కలిగించేందుకు ప్రారంభించిన సవాలు ప్రకారం సవాలు స్వీకరించినవారు బాగా చల్లటి నీళ్ళను ఒక బకెట్ నిండా తీసుకుని నెత్తిపై కుమ్మరించుకోవాలి. అలా చేయలేకపోతే ఒక 100 డాలర్లు ఏ.ఎల్.ఎస్ అసోసియేషన్ కు విరాళంగా ఇవ్వాలి. దానితో పాటు సవాలు స్వీకరించాలని మరో ముగ్గురిని నామినేట్ చేయాలి.

ఈ సవాలు ద్వారా తమకు ఆగస్ట్ 26 తేదీ నాటికి 88.5 మిలియన్ డాలర్లు సమకూరాయని ఏ.ఎల్.ఎస్ అసోసియేషన్ తన వెబ్ సైట్ లో తెలిపింది.

హాలీవుడ్ నటులు అనేకమంది ఈ సవాలు స్వీకరిస్తూ వీడియోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది సవాలు అమలు చేస్తూనే విరాళం కూడా ఇస్తున్నారు. మరికొంతమంది 100 డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని విరాళం ఇస్తున్నారు. మన తెలుగు నటులు కూడా కొందరు ఐస్ నీరు నెత్తిపై పోసుకుని వీడియోలు పోస్ట్ చేశారు.

హాలీవుడ్ నటుడు మేట్ డామన్ ఈ సవాలును మరో అంశాన్ని జోడించాడు. వాటర్ డాట్ ఓ.ఆర్.జి అనే వెబ్ సైట్ ను ప్రారంభించి నీటి వృధా అరికట్టాలని ప్రభోదిస్తున్నందున నీటిని ఆయన వృధా చేయదలుచుకోలేదు. దానికి బదులుగా టాయిలేట్ నీరు సేకరించి నెత్తిపై కుమ్మరించుకుని ఆ వీడియోని నెట్ లో పెట్టాడు. తాను ఉంటున్న కాలిఫోర్నియాలో కరువు ఏర్పడిందని, నీటికి కరువుగా ఉందని ఆయన చెప్పాడు. తమలాగే ప్రపంచంలో 80 కోట్ల మందికి శుభ్రమైన నీరు అందుబాటులో లేదని, 240 కోట్ల మందికి సానిటేషన్ వసతులు కూడా లేవని వీడియోలో చెప్పాడు. తద్వారా స్వకార్యం కూడా నిర్వహించాడు.

మన ఆంధ్ర ప్రదేశ్ లో మంజులత కళానిధి అనే విలేఖరి ‘ఐస్ బకెట్ సవాలు’ ను ‘రైస్ బకెట్ సవాలు’గా మార్చేసింది. ఏ.ఎల్.ఎస్ వ్యాధి సంగతి ఎలా ఉన్నా అసలు దేశంలో అనేకమందికి తింటానికి తిండి లేదని, కాబట్టి ఆసక్తి ఉన్నవారు నీరు వృధా చేయడానికి బదులు ఒక బకెట్ బియ్యాన్ని నిరుపేదలకు సహాయం చేయాలని కోరుతూ వీడియో పోస్ట్ చేశారు. ఆమె బకెట్ బియ్యాన్ని ఒక పేదకు ఇస్తున్న ఫోటోను ది హిందు పత్రిక ప్రచురించింది. ఆమె వీడియో పోస్ట్ చేసిన గంటలోపే 150 మంది సవాలు స్వీకరించినట్లు తెలుస్తోంది.

మంజులత సవాలును కోయంబత్తూరు లోని హోమ్ గార్డ్ లు సీరియస్ గా తీసుకుని మద్దతు ప్రకటించారు. కోయంబత్తూరు జిల్లా హోమ్ గార్డ్ కమాండర్ బి.బాలాజీ తమ హోమ్ గార్డ్ ల నుండి తలా కె.జి బియ్యం సేకరించి మెట్టుపళయం దగ్గర ఉన్న మరుధుర్ అనే కుగ్రామంలో పేదలకు పంచారు. సోమవారం 100 మంది హోమ్ గార్డులు తమ వాటా బియ్యం ఇవ్వగా మంగళవారం మరో 100 మంది ఇచ్చారు. మిగిలిన 132 మంది కూడా ఒకటి రెండు రోజుల్లో ఇస్తారని, ఆ విరాళాన్ని కూడా మరో చోట పంచుతామని వారు చెప్పారు.

గాజా విలేఖరి అయిమన్ అలౌల్ ఐస్ బకెట్ సవాలును మరోమలుపు తిప్పాడు. 40 రోజుల బాంబు దాడుల్లో గాజా జనావాసాలను విధ్వంసం కావించి శిధిలాల కుప్పగా మార్చిన దారుణాన్ని మరింత వెలుగులోకి తెచ్చేందుకు దీనిని వాడుకున్నాడు. రబుల్ బకెట్ ఛాలెంజ్ లేదా రిమెయిన్స్ బకెట్ ఛాలెంజ్ పేరుతో ఇజ్రాయెల్ బాంబు దాడులు మిగిల్చిన శిధిలాలను నెత్తిపై కుమ్మరించుకోవాలని సవాలు విసిరాడు.

కాగా బీహార్ ఉప ఎన్నికల సందర్భంగా మూడు రాజకీయ పార్టీలు ఐస్ బకెట్ సవాలు లేదా రైస్ బకెట్ సవాలును వినూత్న పద్ధతిలో స్వీకరించి నెరవేర్చాయని కార్టూనిస్టు సూచించారు. బి.జె.పి వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్ల 40 ఎం.పి సీట్లలో 33 సీట్లను బి.జె.పి కూటమి గెలుచుకుందన్న వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్, ఎల్.జె.పి, జె.డి(ఎస్) పార్టీలు ఈసారి ఉమ్మడిగా పోటీ చేశాయి. తద్వారా 10 ఎమ్మెల్యే సీట్లలో 7 గెలుచుకున్నాయి.

పార్లమెంటు ఎన్నికలకు, అసెంబ్లీ ఉప ఎన్నికలకు వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లలో పెద్ద తేడా ఏమీ రాలేదు. కాకపోతే ఈసారి మూడు పార్టీల ఓట్లు కలవడంతో బి.జె.పికి మెజారిటీ వచ్చిన సీట్లను కూడా వశం చేసుకోగలిగాయి. ఫలితాలతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్న మూడు పార్టీలు ఇక మోడి పతనం మొదలైందని సంబరపడుతున్నాయి. కానీ ఎవరు గెలిచి ఎవరు ఓడినా జనానికి మాత్రం ఏ సంబరమూ లేకుండా పోయింది.

Photos: Internet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s