టెక్నాలజీ: 2 గంటల్లో అమెరికా చేరగల చైనా సబ్ మెరైన్?


Sub

చైనా శాస్త్రవేత్తల కృషి ఫలిస్తే త్వరలో శబ్ద వేగంతో ప్రయాణించగల జలాంతర్గాములు చైనా అభివృద్ధి చేయవచ్చు. రెండు గంటల్లోనే షాంఘై నుండి శాన్ ఫ్రాన్ సిస్కోకు చైనా జలాంతర్గాములు చేరవచ్చు. ఇంకా చెప్పుకుంటే చైనా ప్రయోగించే టార్పెడోలు సముద్ర గర్భంలో అత్యంత వేగంతో ప్రయాణించి అమెరికన్ నౌకలను ధ్వంసం చేయవచ్చు. చైనా తలపెట్టిన  సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం మిలట్రీ రహస్యం. దీనికి సంబంధించిన సమాచారాన్ని చైనా మిలట్రీ అధికారి ఒకరు సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్  (ఎస్.సి.ఎం.పి) పత్రికకు వెల్లడించి అమెరికా గుండెల్లో గుబులు పుట్టించాడు.

శబ్ద వేగంతో ప్రయాణించగల సముద్ర గర్భ వాహనాన్ని తయారు చేయగల పరిజ్ఞానాన్ని చైనా పరీక్షిస్తున్నదని ఎస్.ఎం.పి.సి పత్రిక ఇచ్చిన సమాచారం తెలిపింది. చైనాలోని హార్బన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటువంటి సూపర్-ఫాస్ట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ పరిజ్ఞానం ఆచరణలోకి వస్తే జలాంతర్భాగంలో శబ్ద వేగాన్ని మించి కూడా ప్రయాణాలు చేయడం సాధ్యపడుతుంది. కనీసం గంటకు 3,600 మైళ్ళ వేగంతో జలాంతర్గాములు లేదా టార్పెడోలు ప్రయాణించడం సాధ్యం కావచ్చని తెలుస్తోంది.

పాత సోవియెట్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనూహ్య వేగాలను సాధించవచ్చని చైనా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రయాణ పరికరం చుట్టూ భారీ పరిణామంలో గాలి బుడగలను సృష్టించినట్లయితే అది నీటితో రాపిడి ఎదుర్కోవలసిన అవసరాన్ని తప్పిస్తుంది. దానితో పరికరం అనూహ్యం వేగం అందుకోవడం సాధ్యపడుతుంది.

చైనా ప్రొఫెసర్ లీ ఫెంగ్ చెన్ ప్రకారం ప్రయాణ వాహనం నీటిని తాకినప్పుడు ఆ వాహనానికి అమర్చిన ఒకానొక యంత్రప్రక్రియ నిరంతరం ఒక ప్రత్యేకమైన ద్రావకాన్ని వెదజల్లుతుంది. ఇది వాహనం చుట్టూ ద్రవపూరిత పొరను నిర్మిస్తుంది. ఈ పొర కొద్ది సేపటికి కరిగిపోతుంది. అయితే వాహనం గంటకు 46 మైళ్ళ వేగం అందుకున్నప్పుడు ‘సూపర్ కేవీటేషన్’ దశలో ప్రవేశించేందుకు తగిన వేగాన్ని అందుకున్నట్లవుతుంది. ఈ దశలో ఒక గాలి బుడగ ద్రావకం స్ధానంలో ఏర్పడుతుంది. బుడగ ద్వారా గతంలో ఎరగని వేగాలను వాహనం అందుకోగలుగుతుంది.

“మా పద్ధతి ఏ యితర పద్ధతుల కంటే భిన్నమైనది. ఉదాహరణకి వెక్టార్ ప్రోపల్షన్ కంటే భిన్నమైనది. ద్రవ రూపంలోని పొర టెక్నాలజీని సూపర్ కేవీటేషన్ దశతో కలపడం ద్వారా వేగానికి సంబంధించిన సవాళ్లను గణనీయ స్ధాయిలో అధిగమించవచ్చు. సముద్ర గర్భ ప్రయాణాలను నియంత్రించడం సులభతరం చేయవచ్చు. ఈ సిద్ధాంతం రీత్యా పసిఫిక్ సముద్రాన్ని కేవలం 100 నిమిషాల్లో చుట్టి రావచ్చు. లేదా అట్లాంటిక్ సముద్రాన్ని ఇవతలి నుండి అవతలికి గంటలోపే దాటవచ్చు.

తమ కృషిలో ప్రగతి సాధిస్తున్నామని చైనా ప్రొఫెసర్ చెప్పారు. అయితే తమ శాస్త్రవేత్తలు అధిగమించవలసిన సవాళ్ళు, ఆటంకాలు ఇంకా ఉన్నాయని ఆయన చెప్పాడు. తమ పరికరానికి సరిగ్గా సరిపోయే స్టీరింగ్ నియంత్రణలను అభివృద్ధి చేయడం ఒక ముఖ్యమైన సవాలు అని ఆయన చెప్పారు. మొత్తం ఆపరేషన్ కు అవసరమైన భారీ శక్తిని అందించే ఇంజన్ తయారు చేయడం మరో సవాలని చెప్పారు.

చైనా అభివృద్ధి చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మిలట్రీ రహస్యంగా ప్రభుత్వం వర్గీకరించింది. అందువల్ల పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. వేగంగా ప్రయాణించే టార్పెడోలను, ఇంకా ఇతర ఆయుధాలను సూపర్ కేవీటేషన్ సహాయంతో అభివృద్ధి చేసేందుకు అమెరికా, రష్యా, జర్మనీ, ఇరాన్ దేశాలు కూడా కృషి చేస్తున్నాయి. ఈ పరిజ్ఞానం ఆచరణలోకి వచ్చినట్లయితే సముద్ర గర్భంలో పౌర ప్రయాణాలను కూడా సాధ్యం చేయవచ్చు. గాలిలో ఎంత వేగంతో ప్రయాణిస్తున్నామో అంతే వేగంతో సముద్ర గర్భం గుండా ప్రయాణం చేయవచ్చు. చివరికి వ్యక్తులు సైతం వేగంగా ప్రయాణించగల స్విమ్ సూట్లను అభివృద్ధి చేయవచ్చు.

2 thoughts on “టెక్నాలజీ: 2 గంటల్లో అమెరికా చేరగల చైనా సబ్ మెరైన్?

  1. అమెరికా అహంకారానికి భారత్‌లాంటి దేశాలు
    ఏం చేయలేవు .అమెరికా ఆధిపత్యానికి చైనా మందు ఇవ్వాల్సిన తరుణం త్వరలోనే వస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s