సంక్షోభ ఫలితం, ఫ్రెంచి ప్రభుత్వం రద్దు


ఫ్రాన్స్ లో నెలకొన్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు అక్కడి ప్రభుత్వాన్ని బలి తీసుకున్నాయి. ఫ్రెంచి ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పొదుపు విధానాలు’ వినాశకరంగా పరిణమించాయని అక్కడి ఆర్ధిక మంత్రి ఆర్నాడ్ మాంటెబోర్గ్ బహిరంగంగా విమర్శించిన మరుసటి దినమే ప్రభుత్వం రద్దు చేసుకుంటామని ప్రధాని మాన్యువెల్ వాల్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండేకు విన్నవించాడు. ప్రధాని విన్నపాన్ని ఆమోదించిన అధ్యక్షుడు ఒలాండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అదే ప్రధానిని కోరారు.

ఫ్రాన్స్ ఆర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం ఆర్ధిక వృద్ధి అన్నదే నమోదు చేయలేదు. నామమాత్ర వృద్ధితో స్తంభనకు గురైంది. నిరుద్యోగం పెరుగుతుండగా, పొదుపు విధానాల వలన ఉపాధి కల్పన బహు కష్టంగా మారింది. జర్మనీ నేతృత్వంలో యూరోపియన్ యూనియన్, ఐ.ఎం.ఎఫ్ ప్రతిపాదించిన పొదుపు విధానాలు కంపెనీల లాభాలకు భంగం కలిగించనప్పటికీ ఉపాధి లేనందున కొనుగోళ్ళు పడిపోయాయి. దానితో ఉత్పత్తి స్తంభించిపోయింది. మరోవైపు కంపెనీల లాభాలను కొనసాగించడానికి తెచ్చి పెడుతున్న అప్పులు ఆర్ధిక వ్యవస్ధకు మరింత భారం అయ్యాయి. ఈ నేపధ్యంలో ఆర్ధిక వ్యవస్ధను సరిదిద్దాలని యూరోపియన్ యూనియన్ నుండి హెచ్చరికలను ఫ్రాన్సు ఎదుర్కోవలసి వచ్చింది.

గత ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాన్యువెల్ వాల్స్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ విధానాలను టార్గెట్ చేస్తూ 21 బిలియన్ యూరోల మేర కోతలు, రద్దులు ప్రకటించాడు. ప్రభుత్వ పెన్షన్లలలో కోత ప్రకటించాడు. ఆరోగ్య సంరక్షణ లాంటి వివిధ సామాజిక సంక్షేమ పధకాలకు కోత పెట్టడమో, రద్దు చేయడమో చేసి 21 బిలియన్ యూరోలు పొదుపు చేస్తామని ప్రకటించాడు.

చెప్పినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగాలు అనేకం రద్దు చేశాడు. పెన్షన్ల చెల్లింపులు స్తంభింపజేసారు. వృద్ధుల సంక్షేమంలో కోత విధించారు. కుటుంబ సంక్షేమ ఖర్చును స్తంభింపజేశారు. నర్సరీ పాఠశాలలకు ఇస్తున్న సహాయంలో కోత పెట్టారు. మొత్తం 50 బిలియన్ యూరోల పొదుపును అధ్యక్షుడు ఒలాండే ప్రకటించగా మొదటి విడతగా 21 బిలియన్ల కోతలు అమలు చేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధామ్యంగా వాల్స్ ప్రకటించాడు. ఓ పక్క ప్రజల సౌకర్యాలకు కోత పెడుతూ కంపెనీలకు 30 బిలియన్ యూరోల మేర పన్నుల రాయితీ ప్రకటించారు.

గత అధ్యక్షుడు, వ్యాపార వర్గాల అనుకూలుడు అయిన నికోలస్ సర్కోజీ ని ఓడించి అధ్యక్షుడుగా ఎన్నికయిన ఫ్రాంషా ఒలాండే తన హయాంలోనూ సర్కోజీ విధానాలనే కొనసాగించాడు. ఐ.ఎం.ఎఫ్, ఇ.సి (యూరోపియన్ కమిషన్), యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు ఉమ్మడిగా ప్రతిపాదించిన పొదుపు విధానాలే సర్కోజీ అనుసరించిన విధానాలు. ఈ విధానాలను తిరగదోడతానని అధికారం లోకి వచ్చిన ఒలాండే ఆచరణలో అవే విధానాలు కొనసాగించాడు.

ఫలితంగా ఫ్రాన్స్ ఆర్ధిక వ్యవస్ధలో ప్రజల కొనుగోలు శక్తి నానాటికీ క్షీణించి కొనుగోళ్ళు పడిపోగా జి.డి.పి వృద్ధి తగ్గిపోతూ వచ్చింది. తెచ్చిన అప్పులు కంపెనీలకు పందేరం పెట్టడంతో, అప్పుల మొత్తం ఉత్పాదక కార్యక్రలాపాలలోకి వెళ్ళడం బదులు బహుళజాతి కంపెనీల షేర్ మార్కెట్ ఆటలకు పరిమితం అయింది. దానితో అప్పులు, ఉత్పత్తి కార్యకలాపాలను పెంచి ఉపాధిని పెంచవలసి ఉండగా అది జరగలేదు. పైగా రుణం పెరుగుతూ పోయింది. దానితో ఆర్ధిక వ్యవస్ధ మరింత కష్టాల్లో పడిపోయింది.

ఈ పరిస్ధితుల్లో ఆర్ధిక మంత్రి ఆర్నాడ్ పొదుపు విధానాలకు వ్యతిరేకిస్తూ బహిరంగంగా ముందుకు వచ్చాడు. దానర్ధం ప్రజలపై అమలు చేస్తున్న కోతలను, రద్దులను ఆయన వ్యతిరేకిస్తున్నాడని కాదు. పొదుపు విధానాల వల్ల జి.డి.పి వృద్ధి పడిపోతోంది గనుక మరిన్ని అప్పులు తెచ్చి ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటించి బహుళజాతి కంపెనీల అవసరాలు తీర్చితే జి.డి.పి వృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఆలోచన. ఇది అమెరికా పాలక వర్గాలు ప్రబోధిస్తున్న విధానాల్లో భాగం.

యూరో జోన్ దేశాల ఋణ సంక్షోభం పరిష్కరించే పేరుతో జర్మనీ, ఫ్రాన్స్ నేతృత్వంలోని ఇ.యు తీవ్ర స్ధాయి పొదుపు విధానాలను అవలంబించగా అమెరికా దానిని వ్యతిరేకించింది. పొదుపు విధానాల తీవ్రత తగ్గించి ఆర్ధిక ఉద్దీపనలు ఇవ్వాలని కోరిం. అయితే జర్మనీ నేతృత్వంలోని యూరో జోన్ కూటమి అమెరికా సలహాను తిరస్కరించింది. ఐ.ఏం.ఎఫ్, ఇ.సి.బిలు ఉమ్మడి నిధిని నెలకొల్పి ఋణ పీడిత ఐరోపా దేశాలకు సరసమైన వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తూ అందుకు బదులుగా పొదుపు విధానాలతో కూడిన విషమ షరతులను అమలు చేశాయి.

గత నాలుగేళ్లుగా పొదుపు విధానాలు అమలు చేసినప్పటికీ యూరో జోన్ ఋణ సంక్షోభం శాంతించకపోగా జర్మనీ, ఫ్రాన్స్ లను కూడా కబళించే ప్రమాదం వచ్చి పడింది. గ్రీసు, పోర్చుగల్, స్పెయిన్, ఐర్లాండ్ దేశాలను పీల్చి పిప్పి చేసిన ఋణ సంక్షోభం పొదుపు విధానాలతో మరింత తీవ్రమై ప్రధాన ఆర్ధిక శక్తులైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లకు పాకే పరిస్ధితి ఏర్పడింది.

ఈ నేపధ్యంలో ఐరోపా దేశాల్లో అమెరికా ప్రతిపాదించిన ఆర్ధిక ఉద్దీపనల విధానాలకు మద్దతు పెరిగింది. అందులో భాగంగానే ఫ్రాన్స్ ఆర్ధికమంత్రి బహిరంగ విమర్శలతో ముందుకు వచ్చాడు. ఆర్ధిక మంత్రి విమర్శలను సీరియస్ గా తీసుకుంటున్నట్లు నటిస్తూ ప్రధాని, తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని కోరాడు. అందుకు అంగీకరిస్తూ అధ్యక్షుడు ఒలాండే తిరిగి అదే ప్రధానిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం బట్టి ఇదంతా ఫ్రాన్స్ ప్రజల ముందు ఆడుతున్న నాటకం అని గ్రహించవచ్చు.

రాజీనామా చేసిన ఆర్ధిక మంత్రి ఆర్నాడ్ జర్మనీపై విమర్శలు ఎక్కుపెట్టడం గమనార్హం. జర్మనీ పాలకులు పొదుపు విధానాల పట్ల ‘అబ్సెషన్’ కు లోనై యూరోపియన్ ఆర్ధిక వ్యవస్ధను కిందికి లాగుతున్నారని ఆయన ఆరోపించాడు. “ఈ అర్ధం లేని పొదుపు విధానాలకు భారతం పలకాలని ప్రపంచం మొత్తం మమ్ములను ప్రార్ధిస్తోంది. ఈ విధానాలు యూరో జోన్ ను మరింత లోతైన మాంద్యంలోకి నెడుతున్నాయి. యూరో జోన్ కూటమి ప్రతి ద్రవ్యోల్బణం లోకి జారిపోయే పరిస్ధితి ముంచుకొచ్చింది. పొదుపు విధానాలు బడ్జెట్ లోటులను తగ్గించడానికి బదులు మరింత పెంచుతున్నాయని అంగీకరించాలంటే మనకు మేధోపరమైన మరియు రాజకీయ ధైర్యం కావాలి” అని ఆర్నాడ్ విమర్శలు గుప్పించాడు.

జర్మనీ ప్రతిపాదిస్తున్న పొదుపు విధానాలు విఫలం అయ్యాయని అంగీకరించేందుకు యూరో జోన్ లోని ఒక సెక్షన్ ఆర్ధికవేత్తలు, వర్గాలు భేషజాలకు పోతున్నారని, వాటిని విడనాడాలని ఆర్నాడ్ సూచిస్తున్నాడు. ప్రధాని వాల్స్ నియమించే కొత్త మంత్రివర్గంలో తమకు స్ధానం అవసరం లేదని కూడా ఆర్ధిక మంత్రి ప్రకటించడం విశేషం.

వ్యాపార వర్గాలను సంతోషపరిచే ఉద్దేశ్యంతో అధ్యక్షుడు ఒలాండే ఇప్పటికే 5 నెలల క్రితం ఒకసారి ప్రభుత్వాన్ని మార్చాడు. సోమవారం (ఆగస్టు 25) మరోసారి మంత్రివర్గం రద్దును ఆమోదించడం ద్వారా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రెండు ప్రభుత్వాలు మార్చిన ఘనతను సో కాల్డ్ సోషలిస్టు ఒలాండే సొంతం చేసుకున్నాడు. రాజీనామా చేసిన ఆర్ధిక మంత్రి తనతో పాటు మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని ప్రకటించాడు. వీరు ముగ్గురూ లెఫ్ట్ పార్టీకి చెందినవారు. వారు ప్రభుత్వంలో భాగం కానట్లయితే అధ్యక్షుడు ఒలాండేకు పార్లమెంటులో మెజారిటీ తగ్గిపోతుంది. 2015 బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఒలాండే మెజారిటీ సంగతి తేలుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఫ్రాన్స్ లో ఎన్నికలు తప్పకపోవచ్చు.

ఫ్రాన్స్ లో నెలకొన్న స్వల్ప రాజకీయ అలజడి ఐరోపాలోని అభివృద్ధి చెందిన దేశాల ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు ఇంకా కుదుటపడలేదని తెలియజేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్ ల మధ్య ఆర్ధిక విధానాల విషయంలో విభేదాలు పెరుగుతున్నాయని కూడా తెలియజేస్తోంది. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం, 2009 యూరో జోన్ ఋణ సంక్షోభం, అమెరికాను చుట్టుముట్టిన వృద్ధి రాహిత్య పరిస్ధితుల నుండి అమెరికా, ఐరోపాలు కోలుకోలేదని తెలియజేస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s