ఉగ్ర సొరంగాలు కావవి జీవన తరంగాలు -ఫోటోలు


బంతిని గోడకేసి ఎంత బలంగా కొడితే అంతే బలంతో అది వెనక్కి తిరిగి వస్తుంది. బెలూన్ నిండా గాలి నింపి ఒత్తితే, బలహీన చోట్లు చూసుకుని బెలూన్ ను బద్దలు కొట్టుకుంటూ గాలి బైటపడుతుంది. ఇది ప్రకృతి సూత్రం. సామాజిక సూత్రం కూడా. సమకాలీన ప్రపంచంలో అందుకు ప్రబల సాక్ష్యం గాజా ప్రజల జీవ నాడులుగా మారిన సో కాల్డ్ ‘ఉగ్ర సొరంగాలు.’

సెక్యులర్ నేత యాసర్ అరాఫత్ బ్రతికి ఉన్నంత వరకూ పాలస్తీనా ప్రజల పోరాటం ఇజ్రాయెల్ నూ, దానికి మద్దతుగా నిలిచిన అమెరికా, ఐరోపా పశ్చిమ సామ్రాజ్యావాదాన్ని గడగడలాడించింది. మధ్య ప్రాచ్యంలో తమ ప్రయోజనాలకు ప్రధాన ప్రమాదకారిగా ఫతా ఉద్యమం అవతరించింది.

పాలస్తీనా ఉద్యమం అంతకంతకూ బలీయం అవుతూ ప్రపంచంలో ఒంటరి అవుతున్న నేపధ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ లను ఏలుతున్న జియోనిస్టు సామ్రాజ్యవాదం కుట్ర పన్నింది. తమ నిర్బంధంలోనే ఉన్న యాసర్ అరాఫత్ కు రేడియో ధార్మిక విష పదార్ధం పోలోనియంను ఆహారంలో కలిపి ఇచ్చింది. అప్పటివరకూ ఉత్సాహంగా ఉన్న అరాఫత్ కొద్ది రోజుల వ్యవధిలోనే కేన్సర్ వ్యాధికి గురై మరణించాడు.

అరాఫత్ మరణం అనంతరం ఫతా నాయకత్వ పగ్గాల చేపట్టిన మహమ్మద్ అబ్బాస్ ఇజ్రాయెల్, అమెరికాల అడుగులకు మడుగులు ఒత్తాడు. క్లింటన్ హయాంలో కుదిరిన ఓస్లో ఒప్పందానికి తూట్లు పొడిచేందుకు ఇజ్రాయెల్ కు సహకరించాడు. ఫలితంగా యూదు దళారీ అబ్బాస్ హయాంలో సెక్యులరిస్టు ఫతా ఉద్యమం బలహీనపడింది.

అరాఫత్ ఉండగానే ఆయనను, ఆయన నాయకత్వంలోని సెక్యులరిస్టు ఉద్యమాన్నీ బలహీనపరచడానికి ముస్లిం ఫండమెంటలిస్టు హమాస్ లోని కొందరు నాయకులను చేరదీశారు టక్కరి యూదు దురాక్రమణ పాలకులు. వారి అండతో హమాస్ కు నిధులిచ్చి గణనీయ శక్తిగా ఎదిగేందుకు దోహదపడ్డారు.

2006లో అరాఫత్ మరణం తర్వాత గాజాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ అత్యధిక మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంది. కానీ అబ్బాస్ నాయకత్వంలోని ఫతా, హమాస్ కు అధికారం ఇవ్వడానికి నిరాకరించింది. ఫలితంగా ఇరు పక్షాల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఘర్షణల్లో ఓటమికి గురయిన ఫతా, గాజా నుండి పూర్తిగా ఖాళీ చేసి వెస్ట్ బ్యాంక్ కు మాత్రమే పరిమితం అయింది. తద్వారా గాజాను అష్ట దిగ్బంధనం కావించేందుకు అవసరమైన కారణాన్ని ఇజ్రాయెల్ కు సమకూర్చింది.

ఇజ్రాయెల్ కు సహకరిస్తున్న నాయకులను హమాస్ క్రమంగా తప్పిస్తూ రావడం, ఫతా ఉద్యమం కోరలు కోల్పోయి ఇజ్రాయెల్ అదుపులోకి రావడం… ఈ పరిణామాలతో హమాస్ సంస్ధ పాలస్తీనా ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. కానీ అంతిమ పరిశీలనలో పాలస్తీనా ప్రజల జాతీయోద్యమం తీవ్రంగా నష్టపోయింది.

ఎందుకంటే ప్రజలను జాతీయ ఆకాంక్షల పునాదిగా ఏకం చేయగల సెక్యులరిస్టు ఫతా ఉద్యమం ఇప్పుడిక ఇజ్రాయెల్ అదుపు ఆజ్ఞలకు లోబడుతూ జాతీయ స్వతంత్ర లక్ష్యాన్ని మొద్దుబార్చింది. మరోవైపు ప్రజల ఆదరణ పొందిన హమాస్, మత సంస్ధ కావడంతో ప్రజలందరినీ ఏకం చేయగల సత్తా దానికి కరువయింది. పైగా హమాస్ పైన ఉగ్రవాద ముద్ర వేయడం ద్వారా ప్రపంచ దేశాల మద్దతును దూరం చేయడంలో ఇజ్రాయెల్-అమెరికా-ఐరోపా దుష్ట్ర త్రయం సఫలం అయింది. ఆ విధంగా పాలస్తీనా ప్రజల న్యాయమైన ఉదాత్త లక్ష్యమైన పాలస్తీనా స్వతంత్ర రాజ్యం దూరం జరుగుతూ వస్తోంది.

హమాస్ పైన ఉగ్రవాద ముద్ర వేయడంలో సఫలం అయిన ఇజ్రాయెల్ మొత్తం పాలస్తీనా జాతీయోద్యమాన్ని బలహీనపరచగలిగింది. ఒకపక్క వెస్ట్ బ్యాంక్ పాలకులకు నిధులు అందిస్తూ (వెస్ట్ బ్యాంక్ లో వసూలయ్యే పన్నులలో కొంత భాగం తిరిగి ఇస్తూ సహాయం అని చెబుతుంది ఇజ్రాయెల్) మరో పక్క గాజాను అష్ట దిగ్బంధనం కావించింది. తద్వారా గాజా ప్రజలు హమాస్ ను దూరం చేస్తారని తమ మాట వింటున్న ఫతా కింద జమకూడుతారని ఆశించింది. కానీ గాజా ప్రజలు హమాస్ ను వదులుకోలేదు.

గాజా ప్రజల్ని సాధ్యమైనంత గట్టిగా, తీవ్రంగా, బలంగా మోదితే మాట వింటారన్నది ఇజ్రాయెల్ అప్రకటిత అణచివేత నీతి. యుద్ధ నీతిని అవహేళన చేయగల ఈ నీతి ఇజ్రాయెల్ కు ప్రీతిపాత్రమైనది. వెస్ట్ బ్యాంక్ లోనేమో క్రమ క్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ యూదుల కోసం అక్రమ సెటిల్మెంట్లు నిర్మించడం, గాజాలోనేమో తీవ్ర నిర్బంధం, దిగ్బంధనం అమలు చేస్తూ ప్రజల నైతిక స్ధైర్యానికి గండి కొట్టేందుకు ప్రయత్నించడం… ఈ ద్విముఖ సూత్రాన్ని అమలు చేయడం ద్వారా గాజా, వెస్ట్ బ్యాంక్ లను కూడా ఇజ్రాయెల్ లో కలిపేసుకుని ‘మహా ఇజ్రాయెల్’ (గ్రేటర్ ఇజ్రాయెల్) ను స్ధాపించడం యూదు పాలకుల లక్ష్యం. ఈ మహా ఇజ్రాయెల్ లో ఈజిప్టుకు చెందిన సినాయ్, సిరియాకు చెందిన గోలన్ హైట్స్ కూడా భాగం చేసుకోవాలని ఇజ్రాయెల్ ఆశ.

ఇజ్రాయెల్ పరోక్ష ప్రాపకంలో ఎదిగిన హమాస్ క్రమంగా ఇజ్రాయెల్ ఏజెంట్లను నిర్మూలించి పాలస్తీనా ప్రజల ఆదరణ చూరగొనడంతో హమాస్ ను అణచివేయడం ఇజ్రాయెల్ కర్తవ్యం అయింది. 2000 సం.లో గాజా తీరంలో చమురు, సహజవాయు నిక్షేపాలు కనుగొనడంతో గాజా భాగంగా కలిగిన పాలస్తీనా స్వతంత్ర, స్వయం సమృద్ధి గల రాజ్యంగా అవతరించేందుకు అవసరమైన ఆర్ధిక వనరులు ఉన్నాయని ప్రపంచం ముందు రుజువయింది. 2000లో అంచనా వేసిన మొత్తం కంటే అనేక రెట్లు సహజ సంపద గాజా తీరంలో ఉన్నదని మరి కొద్ది సంవత్సరాల తర్వాత వెల్లడి అయింది. దానితో గాజా తీరాన్ని పాలస్తీనా ప్రజలకు దూరం చేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నింది. అందులో భాగమే గాజా దిగ్బంధనం.

గాజా నుండి వరదలా వచ్చి పడే రాకెట్ల నుండి రక్షణ కోసమే తాము గాజా దిగ్బంధనం అమలు చేస్తున్నామని, హమాస్ టెర్రరిస్టుల వృద్ధిని నిరోధించడానికి అది అవసరమని ఇజ్రాయెల్ చెబుతుంది. అది వాస్తవం కాదు. ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గి హమాస్ అధికారం చేపట్టింది. అటువంటి హమాస్ పైన ఉగ్రవాద ముద్ర వేయడం ద్వారా పాలస్తీనా జాతీయ విమోచన ఉద్యమాన్ని సులభంగా అణచివేయడమే ఇజ్రాయెల్-అమెరికాల కుయుక్తి. నిజానికి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నది యూదు రాజ్యమే. ఏదో ఒక సాకు చూపిస్తూ గాజాపై పదే పదే దాడులు చేయడం ద్వారా ప్రజల స్ధైర్యాన్ని దెబ్బతీయాలని ఇజ్రాయెల్ పన్నాగం. తీవ్ర అణచివేత అమలు చేస్తే పాలస్తీనీయులు విసిగి గాజా తీర సంపదలలో వాటా వదులుకుంటారని ఆశీస్తోంది. కానీ అది నెరవేరడం లేదు.

అష్టదిగ్బంధనంను ఛేదించి జీవనం గడపవలసిన అనివార్య పరిస్ధితుల్లో గాజా ప్రజలు సొరంగాలను నిర్మించుకున్నారు. నిజానికి ఈ సొరంగాలు ఇటీవల కాలానివి కాదు. అలెగ్జాండర్ సైన్యాలు పాలస్తీనాపై దాడికి వచ్చినపుడు నిర్మించిన సొరంగాలు ఇప్పుడు అక్కరకు వస్తున్నాయి. గాలి, నేల, సముద్రం… ఇలా అన్నీ మార్గాలనూ బంధించిన ఫలితంగా అప్పటి సొరంగాలను మరింత విస్తరించి ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్ధకు ఆలంబనగా అభివృద్ధి చేసుకున్నారు గాజా ప్రజలు.

భూమి సరిహద్దుల గుండా గాజాలోకి వచ్చే ప్రతి చిన్నా, పెద్దా సరుకును ఇజ్రాయెల్ పరీక్షించి గాని అనుమతించదు. గుండు సూది మొదలుకుని ప్రతిదీ తనిఖీ చేయవలసిందే. నిత్యావసరమైన అనేక సరుకులను నిషేధించింది. దానితో గాజా భూగర్భ సొరంగాలు ప్రజల జీవన వాహకాలుగా మారాయి. సి.బి.ఎస్ న్యూస్ ప్రకారం గాజా దిగ్బంధనం వల్ల ముడి సరుకుల దిగుమతి ఆగిపోయి పారిశ్రామిక కార్యకలాపాలు ఆగిపోవడంతో లక్ష ఉద్యోగాలు ప్రజలు కోల్పోయారు. వాణిజ్యం లేకపోవడం కూడా ఉపాధిని, ఆదాయాన్ని హరించివేసింది. 80 శాతం ప్రజలు ఐరాస తదితర సంస్ధల సహాయంపై ఆధారపడి బ్రతుకుతున్నారు.

గాజా సొరంగాలు ఎంత నిత్యజీవిత అవసరంగా మారాయంటే ఈజిప్టు యువకుడు ప్రేమించిన గాజా యువతిని ఇంటికి తెచ్చుకోవాలన్నా ఈ సొరంగాలే మార్గం అయ్యాయి. అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష యుద్ధకాండల నుండి గాజా ప్రజలకు ఊపిరి సరఫరా చేస్తున్నది ఈ సొరంగాలే. అందువల్లనే ఒక సొరంగం కూల్చివేస్తే పది సొరంగాలను వారు నిర్మిస్తున్నారు.

ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల హత్యను సాకుగా చూపి జులై 8 నుండి గాజాపై సాగిస్తున్న దాడుల్లో సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రకటన వెలువడిన మరుసటి రోజే రాయిటర్స్ వార్తా సంస్ధ విలేఖరిని తీసుకెళ్లి చెక్కు చెదరని తమ సొరంగాలను హమాస్ నాయకులు చూపించారు. ఆ ఫోటోలే ఇవి.

ఈ సొరంగాలు ఇజ్రాయెల్, అమెరికాలు ఆరోపిస్తున్నట్లు ఉగ్ర సొరంగాలు కావు. అవి గాజా ప్రజల జీవన తరంగాలకు వాహకాలు. అసలు ఉగ్రవాదం అమెరికా, ఇజ్రాయెల్ పాలక వ్యవస్ధల్లోనే కొలువు తీరి ఘనీభవించిపోయింది. అది తాను అవసరం అనుకున్న చోటికల్లా ఉగ్రవాదులను సరఫరా చేస్తూ శాంతియుత సమాజాలను అల్లకల్లోలం కావిస్తోంది. ఒక బిన్ లాడెన్ కు ప్రాణం పోసిన అమెరికా, ఇప్పుడు ఇరాక్-సిరియాల్లో ఆల్-బఘ్దాదికి ప్రాణ ప్రతిష్ట చేసింది. లాడెన్ కంటే తీవ్ర ఉగ్రవాదిగా ఆయనకు పశ్చిమ పత్రికలు ఉచిత ప్రచారం కల్పిస్తున్నాయి. తద్వారా పశ్చిమ ప్రజలు భయపడేందుకు సరికొత్త భీకర శత్రువును సృష్టిస్తున్నాయి. అసలు ఉగ్రవాదం ఈ శక్తుల్లో కొలువై ఉండగా పాలస్తీనా ప్రజల నెత్తురు వేడిని కాపాడే గాజా సొరంగాలను ఉగ్ర సొరంగాలని చెప్పడం ప్రపంచాన్ని మోసం చేయడమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s