ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది?
‘అస్సాంలోని చిరపుంజి’
ఈ ప్రశ్న- సమాధానం చిన్నప్పుడు చిన్న తరగతుల్లో ముఖ్యమైన బిట్ ప్రశ్నగా మాస్టార్లు చెప్పేవాళ్లు. కాలక్రమేణా చిరపుంజి ఆ హోదాను కోల్పోయింది. గతంలో అస్సాంలో ఉన్న చిరపుంజి మేఘాలయ విడిపోయాక కొత్త రాష్ట్రంలో భాగం అయింది.
ఇప్పుడు చిరపుంజి స్ధానాన్ని మోసిన్రామ్ ఆక్రమించింది. మోసిన్రామ్ గ్రామం కూడా మేఘాలయ లోనిదే. చిరపుంజి కి 16 కి.మీ దూరంలోనే ఉన్న మోసిన్రామ్ గ్రామ్ మేఘాలయ రాష్ట్రంలో తూర్పు కాశీ కొండల జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి 1400 మీటర్ల (4,600 అడుగులు) ఎత్తులో ఉండే మోసిన్రామ్ ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కురిసిన గ్రామంగా రికార్డు కలిగి ఉంది.
కొలంబియాలోని మరో రెండు ప్రాంతాలు మోసిన్రామ్ గ్రామానికి పోటీ వస్తాయని ఒక సమాచారం. కానీ 1985లో 260 సెంటీ మీటర్ల (1000 అంగుళాలు) వర్షపాతాన్ని మోసిన్రామ్ నమోదు చేయగా ఇంతవరకు అంత భారీ వర్షపాతాన్ని కొలంబియాలోని ఆ రెండు ప్రాంతాలు నమోదు చేయలేదు.
మోసిన్రామ్ లో సగటున సంవత్సరానికి 118.72 సెం.మీ వర్షపాతం కురుస్తుంది. కొలంబియాలోని లోరో గ్రామం 1952-89 మధ్య సగటు సంవత్సర వర్షపాతం 127.17 సెం.మీ నమోదు చేసినట్లు వికీ పీడియా ద్వారా తెలుస్తోంది. కొలంబియాలోని లోపెజ్ డెల్ మికే అనే మరో గ్రామంలో 1960-2012 కాలంలోసగటు సంవత్సర వర్షపాతం 128.92 సెం.మీ అట.
మోసిన్రామ్ సగటు సంవత్సర వర్షపాతం 118.72 సెం.మీ (467 అంగుళాలు). అయితే 1985లో 260 సెం.మీ వర్షపాతం కురవడంతో మేఘాలయ గ్రామం రికార్డు పుటలకు ఎక్కింది.
ఇంత భారీ వర్షపాతంతో ప్రజలు ఎలా జీవనం సాగిస్తారన్నది ఆసక్తికరమైన విషయం. మిగతా అన్నీ చోట్లకు మల్లెనే ఇక్కడి ప్రకృతే వారికి తగిన జీవన అలవాట్లను నేర్పింది. ఇక్కడ రోజంతా 24 గంటలూ వర్షం కురవదు గానీ, వర్షం కురవని రోజంటూ మాత్రం ఉండదు. అందువల్ల వర్షంలో పొలం పనులు చేసుకోవడానికి వీలుగా శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే గొడుగులను వీరు తయారు చేసుకుంటారు.
మోసిన్రామ్ వాసులు తయారు చేసుకునే గొడుగులు ప్రకృతి అందించేవే. వెదురు, అరటి ఆకులతో అల్లుకునే ఈ గొడుగులు తలకు తగిలించుకునే విధంగా తయారు చేస్తారు. కాబట్టి చేతులతో మోయనవసరం లేదు. వెడల్పు కాస్త ఎక్కువగా ఉండేట్లు చూస్తారు. తద్వారా రెండు చేతులతో పని చేసేందుకు వారికి కుదురుతుంది.
మోసిన్రామ్ చుట్టు పక్కల ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకించిన లక్షణం ఏమిటంటే రబ్బరు చెట్ల వేర్లు తోనే వంతెనలు నిర్మించుకోవడం. కొండల ప్రాంతం గనుక అడుగడుక్కీ పెద్ద పెద్ద లోయలు తారసపడతాయి. కురిసిన వర్షాన్ని పారించే కాలువలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ లోయల్నీ, కాలవల్నీ దాటేందుకు అటూ, ఇటూ ఉన్న రబ్బరు చెట్ల వేర్లను మెలివేసి వ్యాపింపజేయడం ద్వారా ప్రకృతి సిద్ధమైన వంతెనలను ఇక్కడి ప్రజలు అభివృద్ధి చేసుకున్నారు.
రబ్బరు చెట్ల వేర్లు మెలివేయడం, అవి వంతెనగా మారడం ఒక నాటితో జరిగేది కాదు. కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగింది. చెట్లను నరికి చెక్కలుగా మార్చి నిర్మించే వంతెనల కంటే ఇవి శక్తివంతంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి సజీవ వేర్లు. వంతెనలో భాగం అయ్యాక కూడా వేర్లు పెరుగుతూ అల్లుకుంటూ ఉంటాయి. దశాబ్దాలు, శతాబ్దాలు గడిచే కొద్దీ బలీయంగా అల్లుకుపోతాయి. ప్రకృతిని అనుకూలంగా మలుచుకుని నిర్మించుకున్న ఇలాంటి సహజ వేర్ల వంతెనలు మేఘాలయాలోని ఖాసీ ప్రాంతానికే పరిమితం. ప్రపంచంలో ఇంకెక్కడా ఇవి కనపడవు. వేర్లను ముడులు వేసి ఎత్తులను చేరే నిచ్చెనలుగా కూడా ఉపయోగిస్తారు.
మోసిన్రామ్ లో ఎందుకింత వర్షపాతం? బంగ్లా దేశ్ లో వరదలకు నిలయమైన మైదాన ప్రాంతాల నుండి నీటి ఆవిరిని ఇముడ్చుకున్న గాలులు ఉత్తరాన ఉన్న మేఘాలయ ప్రాంతం మీదికి వస్తాయి. ప్రయాణ మార్గం అంతటా నీటి ఆవిరిని ఇముడ్చుకుంటూ ఈ గాలులు మేఘాలుగా మారుతాయి. ఈ మేఘాలు మేఘాలయలోని ఎత్తైన కొండలను ఢీకొంటాయి. అక్కడ తీవ్ర ఒత్తిడికి గురై గ్రామాలను వర్షంలో ముంచెత్తుతాయి. ఈ ప్రక్రియ సంవత్సరం పొడవునా జరగడం వల్ల ఖాసీ కొండల గ్రామాలు సంవత్సరం అంతా వర్షంలో తడుస్తూ ఉంటాయి.