దక్షిణ చైనా సముద్రంపై గూఢచర్యం నిర్వహించడానికి వచ్చిన అమెరికన్ విమానం చుట్టూ చైనా మిలట్రీ ఫైటర్ జెట్ (ఎస్.యు-27) ప్రమాదకరంగా గిరికీలు కొట్టిందని అమెరికా ఆరోపించింది. కాస్త ఉంటే తమ విమానాన్ని చైనా ఫైటర్ జెట్ ఢీ కొట్టి ఉండేదేనని ఆందోళన ప్రకటించింది. చైనా మిలట్రీ చర్య ‘అభద్రతతో కూడినది, వ్యవహార విరుద్ధం’ అని అమెరికా మిలట్రీ అధికారులు నిరసించారు.
ఆగస్టు 19 తేదీన ఈ ఘటన జరిగిందని పెంటగాన్ (అమెరికా మిలట్రీ హెడ్ క్వార్టర్స్) ప్రెస్ కార్యదర్శి రియర్ అడ్మిరల్ జాన్ కిర్బీ చెప్పారని డెయిలీ మెయిల్ తెలిపింది. దక్షిణ చైనా సముద్రం పైన తమ గూఢచార విమానం పి-8 పోసీడన్ ఎగురుతుండగా చైనా మిలట్రీ జెట్ ఈ చర్యకు పాల్పడిందని ఆయన చెప్పాడు. తమ విమానం చుట్టూ ‘బ్యారేల్ రోల్’ కు పాల్పడిందని ఒక దశలో 35 అడుగుల దూరం వరకు వచ్చిందని చెప్పాడు.
బారెల్ రోల్ అనేది మిలట్రీ ఫైటర్ జెట్ లు గాలిలో నిర్వాహించే విన్యాసాలలో ఒకటి. ఈ విన్యాసం ద్వారా ఫైటర్ జెట్ యుద్ధ విమానం ప్రయాణించే మార్గం బ్యారెల్ ఆకృతి (కింద పటంలో చూపినట్లుగా) లో ఉంటుంది. అందువలన ఈ తరహా విన్యాసానికి బ్యారల్ రోల్ అని పేరు వచ్చింది. టామ్ క్రూయిజ్ నటించిన హాలీవుడ్ సినిమా టాప్ గన్ చూసిన వారికి ఈ విన్యాసంపై అవగాహన ఉంటుంది.
ద.చై.సముద్రంలో చైనాకు చెందిన హైనాన్ ద్వీపానికి తూర్పు దిశగా 130 మైళ్ళ దూరంలో ఎగురుతుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. రాయబార పద్ధతుల్లో చైనా చర్యకు నిరసన తెలిపామని జాన్ కిర్బి చెప్పారు. చైనా జెట్ ఫైటర్ చర్య ప్రమాదకరమైనదని, రెచ్చగొట్టడానికే ఈ చర్యకు పాల్పడ్డారని పెంటగాన్ అధికారులు ఆరోపించారు. అసలు అమెరికా గూఢచార విమానానికి దక్షిణ చైనా సముద్రంలో ఏం పనో జాన్ కిర్బీ చెప్పనే లేదు.
బారక్ ఒబామా వేసవి విడిది కోసం వేంచేసిన మసాచూసెట్స్ నుండి ఆయన ప్రతినిధి కూడా ఈ అంశంపై స్పందించారు. అమెరికా డెప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ చైనా జెట్ ఫైటర్ – పి8 పోసీడియన్ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ చైనాతో సంబంధాల మెరుగు కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇది చెరుపు చేస్తుందని సూచించారు.
“చైనాతో మేము నిర్మాణాత్మకమైన మిలట్రీ-మిలట్రీ సంబంధాలను మేము ప్రోత్సహిస్తాము. ఇటువంటి చర్యలు అటువంటి తరహా స్ఫూర్తికి స్పష్టంగా విఘాతం కలిగిస్తాయి” అని బెన్ రోడ్స్ సుద్దులు చెప్పారు. చైనా జెట్ లు ఇదే తరహా చర్యలకు గత మార్చి, ఏప్రిల్, మే నెలలో కూడా పాల్పడ్డాయని, బహుశా అదే యూనిట్ కి చెందిన మిలట్రీ అధికారులే ఈసారి కూడా పాల్గొని ఉండవచ్చని అమెరికా మిలట్రీ అధికారులు చెప్పారని డెయిలీ మెయిల్ తెలిపింది. గత మే నెలలో కూడా అమెరికా నిరసన తెలిపింది.
ఆగస్టు 19 నాటి చర్య వల్ల అమెరికా విమాన సిబ్బంది ప్రమాదానికి సమీపంలోకి వెళ్లారని కిర్బి ఆరోపించాడు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని వాపోయాడు. ఒక దశలో జెట్ ఫైటర్ పొట్ట భాగం పోసీడన్ సిబ్బందికి కనపడేట్లుగా విన్యాసం చేశారని చెప్పాడు. జెట్ ఫైటర్ సాయుధంగా ఉందని చూపేందుకే అలా చేశారని ఆయన సూచించాడు.
- Chinese SU 27
- SU 27 from P-8
- P-8 Poseidon
- Barrel Roll
అంతర్జాతీయ చట్టాలపై అమెరికాకు హఠాత్తుగా గౌరవం ఎందుకు పుట్టుకు వచ్చిందో మరి! ‘ఇస్లామిక్ స్టేట్’ వల్ల తమ ప్రయోజనాలకు భంగం కలిగిందని చెబుతూ అమెరికా జెట్ విమానాలు గత కొద్ది రోజులుగా ఇరాక్ పై బాంబు దాడులు చేస్తున్నాయి. ఇది ఏ అంతర్జాతీయ చట్టాల ప్రకారం జరిగిందో అమెరికా చెప్పాల్సిన విషయం. వివిధ దేశాల నుండి ఉగ్రవాదుల పేరుతో అక్రమంగా అరెస్టు చేసి పట్టుకెళ్ళి గ్వాంటనామో జైలులోనూ, ధాయిలాండ్, పాకిస్ధాన్ లాంటి చోట్లనూ చిత్రహింసలు పెట్టిన అమెరికా ఏ అంతర్జాతీయ చట్టాల ప్రకారం సదరు ఘోరాలను సాగించిందో చెప్పాల్సి ఉంది.
పి-8 పోసీడన్ విమానం గూఢచర్యం నిర్వహించేందుకు, రెక్కి (reconnaissance) నిర్వహించేందుకు ఉపయోగిస్తారు. ఒక ప్రాంతంపై దాడులు చేయబోయే ముందు ఆ ప్రాంతం గురించి పూర్తి వివరాలు సేకరించడాన్ని రెక్కీ అంటారని తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంలో సంవత్సరం పొడవునా రెక్కీ నిర్వహించాల్సిన అవసరం ఏమిటి? చైనాతో స్నేహ సంబంధాలు కాంక్షిస్తూ గూఢచార విమానాల తోనూ, విమాన వాహక నౌకలతోనూ, మిలట్రీ స్ధావరాలతోనూ ఆ దేశాన్ని చుట్టుముట్టడం ఏ వ్యవహార సూత్రాలకు అనుకూలం?
2001లో ఇదే తరహాలో పోసీడియన్ విమానం చుట్టూ చైనా ఫైటర్ జెట్ లు చెక్కర్లు కొట్టింది. జెట్ పైలట్ వైఫల్యం వల్ల అమెరికా విమానాన్ని ఢీ కొట్టింది. దానివల్ల ఫైటర్ జెట్ పైలట్ చనిపోగా పోసీడియన్ విమానం అత్యవసరంగా హైనాన్ ద్వీపంపై దిగాల్సి వచ్చింది. అప్పటినుండి చైనాతో మిలట్రీ సంబంధాలను రద్దు చేసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. (కానీ ఆ తర్వాత కూడా ఇరు దేశాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాయి.)
దక్షిణ చైనా సముద్రం అమెరికా పక్కన లేదు. అది చైనా పక్కనే ఉంది. అనేక వేల కిలో మీటర్ల తీరంతో పాటు చైనా ద్వీపాలు కూడా ఈ సముద్రంలో ఉన్నాయి. అలాంటి సముద్రం వద్ద చైనా లేదా ఇతర స్ధానిక దేశాల మిలట్రీ విమానాలు కాపాలా కాస్తాయి గానీ ఎక్కడో వేల మైళ్ళ దూరంలోని దేశాల విమానాలకు అక్కడ పని లేదు. తగుదునమ్మా అంటూ చైనా భూభాగం వద్ద రెక్కీకి వచ్చి మళ్ళీ చైనా పైనే ఆరోపణలు గుప్పించడం, హెచ్చరికలు జారీ చేయడం గూండా గిరీ తప్ప మరొకటి కాదు.
చైనా కాబట్టే విషయం బయటకు వచ్చింది కానీ భారత్ అయితే చేష్టలుడిగి చూడాల్సిందే కదా……..