లోక్ సభ ప్రతిపక్ష హోదా: రంగంలోకి సుప్రీం కోర్టు?


SC

లోక్ సభలో ప్రతిపక్ష నాయక హోదాను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి బి.జె.పి/ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిరాకరించింది. లోక్ సభ సీట్ల మొత్తం సంఖ్యలో 10 శాతం సీట్లు తెచ్చుకోవడంలో విఫలం అయినందున కాంగ్రెస్ పార్టీ ఆ హోదాకు అర్హురాలు కాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తేల్చేశారు. ఇది రాజ్యాంగ పదవుల నియామకానికి ఆటంకంగా పరిగణించడంతో సుప్రీం కోర్టు రంగంలోకి దిగుతోంది.

వివిధ రాజ్యాంగ పదవులను భర్తీ చేయడంలో లోక్ సభ ప్రతిపక్ష నేతను విశ్వాసం లోకి తీసుకోవాలని రాజ్యాంగ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అటువంటి పదవుల్లో లోక్ పాల్ ఒకటి. కాంగ్రెస్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే మరే పార్టీకి ఇవ్వడం సాధ్యపడదు. కాబట్టి ప్రతిపక్ష నేత పదవి ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. అదే జరిగితే లోక్ పాల్ లాంటి పదవుల భర్తీ అంశం అయోమయంలో పడిపోయే పరిస్ధితి నెలకొంటుంది.

ఈ నేపధ్యంలో ప్రతిపక్ష నాయకత్వ హోదాను రాజ్యాంగం ఏ విధంగా నిర్వచించిందో అర్ధ నిర్ణయం చేయడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. లోక్ పాల్ నియామకానికి సంబంధించినంతవరకు చట్టం అర్ధంపై వ్యాఖ్యానించడానికి (interpret) సుప్రీం కోర్టు పూనుకోనుంది. సుప్రీం కోర్టు లోక్ పాల్ వరకే పరిమితం అయినప్పటికీ అది చేయనున్న వ్యాఖ్యానం ఇతర అన్ని రాజ్యాంగ పదవులకు కూడా వర్తిస్తుంది. చివరికి లోక్ సభ ప్రతిపక్ష నాయకత్వ హోదాను కాంగ్రెస్ కు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది.

ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతిపక్ష నేత (Leader of Opposition) హోదా దక్కడానికి ఏయే అర్హతలు కలిగి ఉండాలో రాజ్యాంగం/చట్టాలు నేరుగా నిర్వచించలేదు. ‘డైరెక్షన్స్ ఆఫ్ స్పీకర్’ శీర్షికన లోక్ సభ స్పీకర్ ని నిర్దేశించబడిన వివిధ బాధ్యతలలో భాగంగా మాత్రమే ప్రతిపక్ష నాయకులను నియమించే సంగతి పేర్కొనబడింది.

121వ డైరెక్షన్ ప్రకారం ఏదైనా పార్లమెంటరీ పార్టీ నేతను గానీ లేదా వివిధ పార్టీల సమూహం నిర్ణయించిన నేతను గానీ ప్రతిపక్ష నాయకునిగా స్పీకర్ నియమించాలి. యు.పి.ఏ కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది కనుక దీని ప్రకారం ప్రతిపక్ష నాయకుడిని అందించే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లే. కానీ బి.జె.పికి అది ఇష్టం లేకపోవడంతో స్పీకర్ దే అంతిమ నిర్ణయం అయింది.

ఇప్పుడు లోక్ పాల్ నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు జోక్యం చేసుకోనున్నందున కాంగ్రెస్ ఆశలు తిరిగి ప్రాణం పోసుకున్నట్లు భావించవచ్చు.

లోక్ పాల్ చట్టం ప్రకారం లోక్ పాల్ ను సెలక్షన్ కమిటీ నియమిస్తుంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు. లోక్ సభ స్పీకర్, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు/రాలు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి లు సెలక్షన్ కమిటీలో ఇతర సభ్యులు.

సెలక్షన్ కమిటీలో ఒక స్ధానం ఖాళీగా ఉన్నంత మాత్రాన కమిటీ నియామకం చెల్లకుండా పోదని కూడా లోక్ పాల్ చట్టం నిర్దేశించింది. దానితో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిని నియమించే అవసరం లేకుండానే లోక్ పాల్, సి.వి.సి, విజిలెన్స్ కమిషనర్ పదవులను భర్తీ చేసేందుకు ఎన్.డి.ఏ/బి.జె.పి/మోడి ప్రభుత్వం నిశ్చయించుకుందని లోపలి వర్గాలను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి.

వచ్చే సెప్టెంబర్ అంతానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సి.వి.సి), సి.వి.సి కార్యాలయంలో పని చేసే విజిలెన్స్ కమిషనర్ పదవులు ఖాళీ అవుతాయి. ప్రస్తుతం ఆ పదవుల్లో ఉన్నవారు అప్పటికి రిటైర్ అవుతారు. ఈ రెండు పదవులను త్రిసభ్య కమిషన్ సిఫారసుతో రాష్ట్రపతి భర్తీ చేస్తారు. ప్రధాని, హోమ్ మంత్రి, లోక్ సభ ప్రతిపక్ష నేతలతో కూడిన త్రిసభ్య కమిషన్ ఈ సిఫారసులు చేస్తుంది. ఈ పదవులను కూడా ప్రతిపక్ష నేత లేకుండానే భర్తీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సుప్రీం కోర్టు రంగప్రవేశంతో బి.జె.పి పధకాలకు ఆటంకం ఏర్పడినట్లే. లోక్ సభ ప్రతిపక్ష నాయక పదవి రాజ్యాంగం ప్రకారం అత్యంత ముఖ్యమైనదని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆర్.ఏం లోధా వ్యాఖ్యానించడం విశేషం. లోక్ పాల్ చట్టంలో ప్రతిపక్ష నేత పదవికి ప్రాముఖ్యత ఉన్నదని, సభలో ప్రభుత్వం పక్షం అభిప్రాయం కాకుండా దానికి భిన్నమైన పక్షం యొక్క అభిప్రాయానికి ఈ పదవి ప్రాతినిధ్యం వహిస్తుందని కాబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాల్సి ఉందని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.

దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ పరిస్ధితి దృష్ట్యా ఈ సమస్యను వాస్తవంగా నెలకొన్న పరిస్ధితుల ప్రాతిపదికన పరిశీలించాల్సి ఉందని చీఫ్ జస్టిస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తగినన్ని సీట్లు లేకపోవడం, యు.పి.ఏ కూటమి పార్టీలను ఒక గ్రూపుగా గుర్తించడానికి స్పీకర్ నిరాకరించడం, ఫలితంగా ముఖ్యమైన రాజ్యాంగ పదవులన్నింటినీ ప్రభుత్వమే ఏకపక్షంగా నియమించుకోగల పరిస్ధితి ఏర్పడడం… ఇవన్నీ ప్రత్యేక రాజకీయ పరిస్ధితిగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారని భావించవచ్చు.

ఒక లోక్ పాల్ చట్టం కోసమే కాకుండా ఇతరత్రా ఉనిక్లో ఉన్న, ఉనికిలోకి రానున్న చట్టాల దృష్ట్యా కూడా లోక్ సభ\ ప్రతిపక్ష నేత పదవికి ప్రాముఖ్యత ఉన్నదని చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. లోక్ పాల్ నియామకాన్ని ఎంతమాత్రం పొడిగించడానికి వీలు లేదని, లోక్ పాల్ నియామకాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడానికి వీలు లేదని ఆయన నొక్కి చెప్పారు.

గత ఫిబ్రవరిలో యు.పి.ఏ ప్రభుత్వం లోక్ పాల్, ఇతర సభ్యుల నియామకం కోసం 8 మంది సభ్యులతో సర్చ్ కమిటీ ఏర్పాటు చేసింది. కానీ వారిలో ఇద్దరు కమిటీలో ఉండడానికి నిరాకరించారు. దానితో లోక్ పాల్ నియామకం వీలు కాలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నేత లేకుండానే పదవుల భర్తీకి పూనుకోవడం రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రజాస్వామ్య స్ఫూర్తికి బదులుగా ఏకపక్ష వైఖరి చొరబడుతోందని పలువురు నిపుణులు ఆందోళన ప్రకటించారు.

తదుపరి హియరింగ్ ను  సెప్టెంబర్ 9 తేదీకి చీఫ్ జస్టిస్ వాయిదా వేశారు. ప్రతిపక్ష నేత విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నందున సుప్రీం జోక్యంతో ఆసక్తికరమైన పరిణామాలకు బీజం పడినట్లయింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s