5.23 లక్షల కోట్ల మేరకు రాష్ట్ర జి.డి.పి ఉండగలదని అంచనా వేస్తూ రెవిన్యూ లోటు జి.డి.పి లో 1.16 శాతం గానూ, బడ్జెట్ లోటు జి.డి.పి లో 2.3 శాతం గానూ తేల్చారు. ఈ అంకెలు ఆకర్షణీయంగానే ఉన్నా అసలు ఆదాయం, వ్యయం తేలితేగాని ఈ అంకెల పస తేలదు. బడ్జెట్ ప్రతిపాదనలకు వాస్తవ ఖర్చులకు పొంతన ఉండదని అనుభవం చెబుతున్న సత్యం. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్ధిక వ్యవస్ధను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఉద్దేశించిన పత్రంగా కాకుండా ఒక తప్పనిసరి క్రతువుగా మార్చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ విషయంలో ఇది మరింత నిజం. ఏ.పి ప్రభుత్వ తాజా బడ్జెట్ కూడా అందుకు భిన్నం కాదు.
రాష్ట్ర విభజన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి 14,500 కోట్ల అదనపు సాయం అందుతుందని ఆర్ధిక మంత్రి అంచనా వేశారు. రెవిన్యూ వసూళ్లు కాకుండా బడ్జెట్ లో అతి పెద్ద మొత్తం ఇదే. కేంద్రం మామూలుగా ఇచ్చేదీ కాకుండా ఇంత అదనంగా ఇస్తుందని చెప్పిన మంత్రి అందుకు ఆధారాలు ఏమీ చూపలేదు. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో ఏ.పి కోసం ప్రతిపాదించిన వివిధ సౌకర్యాలు పోను అంత సొమ్ము ఎందుకు ఇస్తుంది? విభజన కాలంలోనూ, ఆ తర్వాత ఆనాటి కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రత్యేక హోదా కింద రెవిన్యూ లోటు పూడ్చేందుకు సంవత్సరానికి రు. 5,000 కోట్లు ఇస్తామని చెప్పారు. కనీసం ఆ మొత్తం కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదనకు నోచుకోలేదు. అలాంటిది ఏకంగా 14,500 కోట్లు ఇస్తారని రాష్ట్ర మంత్రి ఏ ఆధారంతో ఆశిస్తున్నారు?
వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి దృక్పధాత్మక పధకం పూర్తి చేస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి చెప్పారు తప్ప కేటాయింపులు ఇవ్వలేదు. బెంగుళూరు-ముంబై ఆర్ధిక కారిడార్ తో కలిసి 20 పారిశ్రామిక సమూహాలను నిర్మిస్తామని కేంద్రం చెప్పింది. వై.ఎస్.ఆర్ హయాంలో తలపెట్టిన కోస్టల్ కారిడార్ ను ఈ విధంగా మరో రూపంలో కేంద్రం ముందుకు తీసుకువచ్చిందా అన్నది భవిష్యత్తులో తేలుతుంది. తాజా కారిడార్ లో భాగంగా కాకినాడ రేవును ప్రత్యేక హార్డ్ వేర్ హబ్ గా అభివృద్ధి చేస్తామని ఇప్పటి కేంద్రం బడ్జెట్ లో చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అదనపు కేంద్ర కేటాయింపులు ఇటువంటి ఖాళీ వాగ్దానాలలో భాగమేనా? కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రం కోసం ప్రకటించిన పధకాలు వాగ్దానాలకు నిధులు ఏమీ కేటాయించలేదు. అందుకే అవి ఖాళీ వాగ్దానాలు అనవలసి వస్తోంది.
ప్రజలకు ఉపయోగపడే అవసరమైన రంగాలపై ప్రభుత్వ అనాసక్తికి మౌలికరంగ నిర్మాణాలకు కేటాయించిన మొత్తమే ఒక ఉదాహరణ. కేవలం రు. 73 కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని మౌలిక రంగాలలో పెట్టుబడులు పెట్టనున్నారో, రాష్ట్రాన్ని ఎంత మౌలికంగా అభివృద్ధి చేస్తారో అంతుబట్టని విషయం.
మోడి ప్రభుత్వం లాగానే టి.డి.పి ప్రభుత్వం కూడా ఆర్ధిక అస్తవ్యస్త పరిస్ధితికి గత ప్రభుత్వాన్నే కారణంగా చూపింది. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి లేదని, వ్యూహాత్మక వ్యయం లోపించిందని, అవినీతి పెచ్చరిల్లిందని, ప్రభుత్వ పాలన విఫలం అయిందని ఆర్ధిక మంత్రి గర్జించారు. తద్వారా భవిష్యత్తులో ఆవిష్కృతం కానున్న తమ వైఫల్యానికి కారణాలు చూపేందుకు ఇప్పుడే భూమిక ఏర్పరుచుకున్నారు. ఆయన ప్రతిపాదించిన నేల విడిచి సాము చేసే లోటు బడ్జెట్ తోనే ఈ సంగతి ధ్రువపడుతోంది.
ఎన్నికల్లో తాము ప్రధానంగా 5 వాగ్దానాలు చేశామని వాటిని అమలు చేసేందుకే బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి చెప్పారు. రైతుల, డ్వాక్రా సంఘాల రుణాల రద్దు, పెన్షన్ పెంపు, రు. 2 కు 20 లీటర్ల మినరల్ వాటర్ (ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి), బెల్ట్ షాపుల రద్దు, రిటైర్ మెంట్ వయసు పెంపు…. ఈ వాగ్దానాల అమలు ఆదర్శ ప్రభుత్వ పాలనలో భాగమని మంత్రి చెప్పుకున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన రిటైర్ మెంట్ చెల్లింపులు వాయిదా వేసేందుకే రిటైర్మెంట్ వయసు పెంచరన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. షరతులు లేకుండా రైతు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పారు. దాదాపు 40,000 కోట్లు రైతుల రుణాల రద్దు చేసే ప్రభుత్వం తమదే అన్నారు.
ఇప్పుడు ఆర్.బి.ఐ ని అడ్డం పెట్టుకుని సవాలక్ష షరతులు విధించారు. గడువు పరిమితి లేదని, రుణాలు చెల్లించినా మాఫీ వర్తింపజేస్తామని చెప్పి ఇప్పుడు శ్లాబ్ సిస్టం తరహాలో రకరకాల గడువులు విధించారు. జనవరి నుండి మార్చి వరకు చెల్లించబడిన రుణాలన్నీ బుక్ అడ్జస్ట్ మెంట్లే అని భావిస్తూ ఆ మూడు నెలలకు మాఫీ లేదని మెలిక పెట్టింది. తద్వారా 3,000 కోట్ల మాఫీని ప్రభుత్వం ఎగవేసిందని పత్రికలు అంచనా వేశాయి. చివరికి రైతు ఋణ మాఫీకి కేవలం 5,000 కోట్లు మాత్రమే కేటాయిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రకటించారు. ‘పంచపాండవులంటే మంచం కోళ్లలాగా ముగ్గురు’ అన్న తిక్క సూత్రాన్ని పాటించినట్లయింది.
రైతులకు పావలా వడ్డీకి కేటాయించింది రు. 230 కోట్లు. విచిత్రంగా ఉపాధి హామీ పధకానికి రు. 1,386 కోట్లు కేటాయిస్తున్నామని వ్యవసాయ బడ్జెట్ లో చెప్పారు. ఈ పధకం కేంద్ర ప్రభుత్వానిది కాగా రాష్ట్ర ప్రభుత్వం దానిని తన ఖాతాలో వేసుకోవడమే విచిత్రం. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాము అనడమే గానీ అదేమిటో ఇంతవరకు ఎవరూ చెప్పింది లేదు. మార్కెట్ కూ, రైతుకూ మధ్య ఉన్న దళారీ జలగల వ్యవస్ధను రద్దు చేస్తే రైతుకు అంతకు మించిన లాభం ఉండదు. ఈ దళారీల గుప్పెట్లోనే ఉన్న ప్రభుత్వాలు దళారీల జోలికి వెళ్ళడం జరిగేపని కాదు.
బెల్టు షాపులు రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికి మళ్ళీ అదే రీతిలో మద్యం ఆదాయాన్ని పెంచుకునేందుకు పధకాలు రచిస్తున్నారు. సర్కారీ కొలువులతో మద్యం విక్రయించేందుకు నడుం బిగిస్తున్నారు. కొత్త డిస్టీలరీలు స్ధాపించబోతున్నారు. ఫలితంగా బెల్ట్ షాపులు పొరబాటున రద్దు అయినా దాని ఫలితం జనానికి చేరే మార్గం మూసేశారు. తాగుడు పెంచేందుకు పధకాలు వేస్తూ బెల్టు షాపులు రద్దు చేస్తామనడం పెద్ద మోసం. ఈ మోసానికి పాలకులు నిస్సిగ్గుగా పాల్పడుతున్నారు. ప్రజల ఉసురు తీస్తూ ఖజానా నింపుతున్నారు.
మినరల్ వాటర్ అంటే ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటో మంత్రిగారు చెప్పి ఉంటే బాగుండేది. భౌగోళికంగానూ, భౌతికంగానూ నీటి వనరుల దగ్గరే వివిధ రక్షణలతో కాపాడబడుతూ అవసరమైన లవణాలు తగినంతమేర సమృద్ధిపరచబడితే అటువంటి నీటిని లవణ జలం (మినరల్ వాటర్) అంటారు. వాణిజ్య కంపెనీలు ఇష్టానుసారంగా నీటిని తవ్వితీసి ట్రీట్ మెంట్ పేరుతో రసాయనాలు కలిపి బాటిళ్లలో నింపితే అది మినరల్ వాటర్ కాజాలదు. ఎటువంటి బాహ్య ప్రభావితాలకు గురికాకుండా ఉండే మాతృక (ఒరిజినల్) లవణ జలం మనిషి ఆరోగ్యానికి ఎంతో విలువైనది. అలాంటి నీరు ప్రజలకు చేరకుండా అడ్డుకుని వాటిని కంపెనీలకు అప్పజెప్పి వాణిజ్య సరుకుగా మార్చి తీరిగ్గా రెండు రూపాయలకు కిలో బియ్యం తరహాలో రెండు రూపాయలకు ఇరవై లీటర్ల లవణ జలం అంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం సిగ్గు చేటు. ప్రకృతి సహజసిద్ధమైన నీరు తక్కువ ఖరీదుకు అందిస్తామన్న స్ధితికి దేశాన్ని/రాష్ట్రాన్ని చేర్చింది కాక తగుదునమ్మా అంటూ రాయితీలు ఇవ్వడం ఏ గుడ్ గవర్నెన్స్ కు ప్రతీకయో పాలకులకు తెలియకుండా ఏమీ లేదు.
ఆర్ధిక మంత్రి చెప్పిన 5 ముఖ్యమైన వాగ్దానాలూ బాబు గారి కొద్ది రోజుల సుపరిపాలన పుణ్యాన ఈ విధంగా అపహాస్యపూరితంగా ప్రజలకు చేరనున్నాయి.
పాఠశాల విద్యకు రు. 12,595 కోట్లు ప్రకటించారు. చెప్పుకోదగిన కేటాయింపు ఇది ఒక్కటే. కానీ ఇది వాస్తవంగా అమలులోకి రావడమే సమస్య. బడ్జెట్ లోతు మొత్తానికి (రు. 12,064 కోట్లు) సరిగ్గా కాస్త ఎక్కువ మొత్తాన్ని అనాదిగా విస్మరించబడిన పాఠశాల విద్యకు కేటాయించినట్లు చెప్పడం ద్వారా ప్రభుత్వం ఏమన్నా కిరికిరి చేస్తుందా అన్నది పరిశీలించవలసిన విషయం.
రాష్ట్ర విభజనను తిట్టిపోస్తూ, ఆ విభజన వల్ల వచ్చే ఆదాయంపైన ఆశలు పెట్టుకోవడం యనమల బడ్జెట్ ప్రత్యేకత. విభజన వల్ల ఆదాయం పోయిందంటూనే లక్ష కోట్ల బడ్జెట్ ప్రతిపాదించడం మరో ప్రత్యేకత. బెల్ట్ షాపుల రద్దు అంటూనే మద్యం ఆదాయం పెంపుకు పధకం వేయడం ప్రత్యేక మోసం. భారీ లోటుతో కనపడని పన్నులతో బాదనున్నామని చెప్పకుండా చెప్పారు. వెరసి సగటు పౌరుడి జేబుకు చిల్లు పెట్టి దళారీల జేబులు నింపనున్నారు. సంక్షేమం కేటాయింపులు చూపుతూ ఆ పేరుతో బోధనా రుసుము, ఆరోగ్య శ్రీ లాంటి ఉన్నత వర్గాలకు తరలించుకుపోయే ఏర్పాట్లు చేసుకున్నారు. బడ్జెట్ లో కొంత వేరు చేసి ఇంకో పత్రం రాసుకుని అదే వ్యవసాయ బడ్జెట్ అంటూ రైతన్నలను అపహాస్యం చేశారు. ఇది అంకెల గారడీతో కూడిన, ఆచరించే ఉద్దేశ్యం లేని మోసపూరిత బడ్జెట్!