చరిత్ర పుటలు: రైట్ బ్రదర్స్ మొదటి విమానం -ఫోటోలు


గాలిలో ఎగురుతున్న పక్షులను చూసిన మనిషి తానూ అలా ఎగరాలని కలలు కన్నాడు. ఆ కలలతోనే అనేక కధలు అల్లుకున్నాడు. జానపద కధల దగ్గరి నుండి, పురాణేతిహాసాల వరకు మనిషి ఏదో విధంగా పక్షుల్లా గాలిలో ప్రయాణం చేశాడు. పక్షి మీద కూర్చొని కావచ్చు, తనకే రెక్కలు కట్టుకుని కావచ్చు లేదా తాను పక్షిలా మారి కావచ్చు… రకరకాలుగా తన ఊహలకు అందిన మేరకు ఎగిరినట్లు రాసుకుని తృప్తి పడ్డాడు.

అంతటితో ఆగి ఉంటే మనిషి మనిషి ఎలా అవుతాడు? ఎగరడానికి కావలసిన సరంజామాను తయారు చేసుకునే పనిలో పడ్డాడు. అట్ట ముక్కలతో రెక్కలు కట్టుకుని కొండల పైనుండి దూకి ప్రాణాలు పోగుట్టుకున్నవారు ఎందరో. ఆ క్రమంలోనే అమెరికాకు చెందిన రైట్ బ్రదర్స్ మొదటిసారి గ్లైడర్ ను తయారు చేశారు. గ్లైడర్ ద్వారా కొండల మీది నుండి దూకి భూమ్యాకర్షణ శక్తి, గాలి వాలు సహాయంతో గాలిలో ప్రయాణం చేశాడు. ఆ విధంగా విమానం తయారీకి గ్లైడర్ మొదటి మెట్టు అయింది. ఇప్పటికీ గ్లైడర్లతో కొండల పైనుండి దూకి తుత్తి తీర్చుకుంటున్నవారు ఉన్నారు. అదొక క్రీడగా అభివృద్ధి చేశారు.

దాదాపు వందేళ్ళ క్రితం రైట్ బ్రదర్స్ యంత్ర శక్తితో గాలిలో ప్రయాణించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. మొదటి ప్రయాణంలో కేవలం కొన్ని అడుగుల ఎత్తు ఎగిరి, కొన్ని అడుగుల దూరం మాత్రమే ప్రయాణం చేశారు. అలాంటి అనేక ప్రయత్నాలను చేస్తూ, అనేక ప్రయత్నాలలో విఫలం అవుతూ, కాస్త కాస్త సాఫల్యాన్ని అనుభవంలో జోడించుకుంటూ చివరికి యంత్ర శక్తితో కొన్ని వందల మీటర్ల వరకు ఎగిరే విమానం తయారు చేశారు.

రైట్ బ్రదర్స్ అంటే విల్బర్ రైట్, ఆయన తమ్ముడు ఒర్విల్లే రైట్ లు. స్ధిరమైన రెక్కలతో కూడిన మొట్టమొదటి విమానాన్ని యంత్రశక్తి సహాయంతో గాలిలో ప్రయాణించే విమానాన్ని తయారు చేసిన ఖ్యాతి వీరి సొంతం. రైట్ బ్రదర్స్ కంటే ముందే మనవాళ్లు గాలిలో ఎగిరేందుకు ఫార్ములా తయారు చేశారని, చిత్ర పటాలు గీసుకున్నారని కొందరు చెబుతారు. అవి ఎందుకు ఆచరణలోకి రాలేదో సమాచారం లేదు. మనవద్ద ముందే పరిజ్ఞానం ఉందని మాట వరుసకు అంగీకరించినా మొదటిసారి ఎగిరి చూపించిన ఘనత మాత్రం రైట్ బ్రదర్స్ దే.

ఉత్తర కరోలినా లోని బిగ్ కిల్ డెవిల్ పేరుతో ఉన్న కొండ మీది నుండి విల్బర్ రైట్ మొదటిసారిగా అక్టోబర్ 10, 1902 తేదీన గ్లైడర్ సహాయంతో కిందికి ఎగురుకుంటూ వచ్చాడు. అంతకుముందు రెండు రకాల గ్లైడర్లు రైట్ సోదరులు తయారు చేసినా అవి పెద్దగా తోడ్పడలేదు. కింది ఫొటోల్లో 1900 సం.లో తయారు చేసిన గ్లైడర్ కూలి ధ్వంసం అయిన దృశ్యాన్ని చూడవచ్చు. మూడోసారి గాలి పటం తరహాలో గ్లైదర్ ను ఎగరవేసి పరీక్షించిన అనంతరం వారు వాస్తవ ప్రయోగంలోకి దిగారు. తమ ప్రయోగాలను ఎప్పటికప్పుడు ఫోటోల ద్వారా రైట్ బ్రదర్స్ భద్రపరచడంతో ఆనాటి దృశ్యాలు మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. అప్పట్లో గ్లాస్ నెగిటివ్ తో ఫోటోలు రికార్డు చేసేవారు.

రైట్ బ్రదర్స్ ఇద్దరూ తమ సైకిల్ షాప్ వెనుక భాగంలోని వర్క్ షాపులో తమ మొదటి విహంగ ప్రయోగాలకు కావలసిన సరంజామా తయారు చేసుకున్నారు. మొదటిసారి ఎగిరిన గ్లైడర్ పైన తమ్ముడు ఒర్విల్లే పడుకుని ప్రయాణం చేశాడు. ప్రారంభంలో గ్లైడర్లకే వివిధ రూపాలు మార్చుతూ సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రయత్నాలు చేశారు.

1903లో వారు మొట్టమొదటిసారిగా యంత్రం అమర్చిన గ్లైడర్ ని తయారు చేశారు. దానినే మొదటి యంత్ర విమానంగా చెబుతున్నారు. రెండు చెక్క ప్రొపెల్లర్ లను అమర్చి 12 HP ఇంజన్ ను ప్రత్యేకంగా తయారు చేసి విమానానికి అమర్చారు. 1903 డిసెంబర్ 14 తేదీన ఈ విమానంతో ఎగరడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. అనంతరం డిసెంబర్ 17 తేదీన 12 సెకన్ల పాటు కొద్ది అడుగుల ఎత్తులో 120 అడుగుల దూరం ప్రయాణించి చరిత్ర సృష్టించారు. పెద్ద రైట్ స్ధిరత్వం కోసం ఒక పక్క రెక్కను పట్టుకుని కొన్ని అడుగులు వేసి వదిలివేయగా, చిన్న రైట్ విమానంపై పడుకుని ప్రయాణం చేశాడు.

అనంతరం 1904 మే నెలలో రైట్ బ్రదర్స్ రెండో యంత్ర విమానాన్ని తయారు చేశారు. ఒహియో రాష్ట్రంలో హాఫ్ మన్ గడ్డి నేలలపై నుండి ఎగరడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలలో కాస్త కాస్త సఫలం అవుతూ 1905, సెప్టెంబర్ 29 తేదీన 60 అడుగుల ఎత్తుకు ఎగిరారు. ఆ విమానానికి ఫ్లైట్ 41 అని పేరు పెట్టారు. ఇందులో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి కూర్చునేలా రెండు కుర్చీలు అమర్చారు. దీనిని రీ మోడలింగ్ చేస్తూ 1908 వరకూ ప్రయోగాలు చేశారు.

రైట్ బ్రదర్స్ ప్రయోగాలు సఫలం అయ్యే కొద్దీ వారికి కావలసిన నిధులను సమకూర్చేందుకు అమెరికా ఆర్మీ ముందుకు వచ్చింది. ఆ విధంగా గాలిలో ప్రయాణించే పరిజ్ఞానం అభివృద్ధి కావడానికి మిలట్రీ అవసరాలే దోహదం చేశాయి. మిలట్రీ అవసరం అంటే ప్రత్యర్ధి దేశపు కంపెనీలపై పై చేయి సాధించడమే అని వేరే చెప్పనవసరం లేదు. అయితే మిలట్రీ అధికారికి ఎగురుతున్న అనుభవం చూపడానికి రైట్ బ్రదర్స్ చేసిన మొదటి ప్రయోగంలోనే మిలట్రీ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. 1908 సెప్టెంబర్ 17 తేదీన వర్జీనియా రాష్ట్రంలోని ఫోర్ట్ మైయర్ వద్ద మిలట్రీ అధికారుల కోసం ప్రదర్శన (demonstration) చేస్తుండగా విమానం కూలిపోయి దానిపై కూర్చున్న అధికారి ధామస్ సెల్ ఫ్రిడ్జ్ చనిపోయాడు. పైలట్ గా ఉన్న ఒర్విల్లే రైట్ కి ఒక కాలు, మూడు పక్కటెముకలు విరిగిపోయి ప్రాణాలతో బైటపడ్డాడు.

1909లో న్యూయార్ కో జరిగిన ఒక ప్రదర్శనలో 33 నిమిషాల సేపు ఒర్విల్లే రైట్ ప్రయాణం చేశాడు. న్యూయార్క్ ప్రజలు చూస్తుండగా హడ్సన్ నది పైన ఆయన చేసిన ప్రయాణం చరిత్ర పుటల్లో శాశ్వతంగా లిఖించబడింది. ఇక అప్పటి నుండి ఐరోపా దేశాల్లో కూడా రైట్ బ్రదర్స్ తమ విమానాలతో ప్రదర్శనలు ఇచ్చారు. మిలట్రీ అధికారి మరణంతో ఎక్కువగా తమ కుటుంబ సభ్యులనే పక్కన కూర్చోబెట్టుకుని ప్రదర్శనలు ఇచ్చారు. రైట్ బ్రదర్స్ సోదరి కేధరిన్ రైట్ తో కలిసి ఫ్రాన్స్ లో 1909 ఫిబ్రవరి 15 తేదీన వారు ఇచ్చిన ప్రదర్శన ఫోటోను కింద చూడవచ్చు.

అంతిమంగా 1909 జులై నాటికి రైట్ సోదరులు అమెరికన్ మిలట్రీకి తమ విమానాన్ని అమ్మగలిగారు. ఆ విధంగా మొట్టమొదటి విమానాన్ని సొంతం చేసుకున్న సంస్ధగా అమెరికన్ ఏరోనాటికల్ డివిజన్ అవతరించింది.

రైట్ బ్రదర్స్ రికార్డు చేసిన ఫోటోలను అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో భద్రపరిచారు. వాటిలో కొన్నింటిని ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది. మొదటి పైలట్ ఒర్విల్లే పుట్టిన రోజు ఆగస్టు 19. ఆయన కృషికి గుర్తింపుగా 1939లో ఆనాటి అమెరికన్ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ నేషనల్ ఏవియేషన్ డే గా ఆగస్టు 19 తేదీని ప్రకటించాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s