ఆర్.బి.ఐ లాభం రు. 53 వేల కోట్లు


RBI

2013-14 ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం (RBI fiscal year) లో భారత సెంట్రల్ బ్యాంకు రు. 52,679 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది గత సంవత్సరం లాభంతో పోలిస్తే 14.75 శాతం తక్కువ అని ఆర్.బి.ఐ తెలిపింది. తన లాభం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి తరలిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది.

ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం జులైలో ప్రారంభమై జూన్ తో ముగుస్తుంది. అనగా జాతీయ ఆర్ధిక సంవత్సరం లేదా జాతీయ కోశాగార సంవత్సరం కంటే ఆర్.బి.ఐ ఆర్ధిక సంవత్సరం మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది.

లాభాలు తగ్గడానికి బంగారం విలువ తగ్గడమే ప్రధాన కారణం అని ఆర్.బి.ఐ తెలిపింది. డాలర్ విలువ, రూపాయి విలువలు పడిపోవడం వల్ల కూడా లాభాలు తగ్గాయని తెలిపింది.

ఆర్.బి.ఐకి దేశంలోనూ విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా ఆర్.బి.ఐ కి ఆదాయం సమకూరుతుంది. విదేశాల ట్రెజరీలు జారీ చేసే సార్వభౌమ ఋణ పత్రాలలోనూ, ఇంకా ఇతర ద్రవ్య ఉపకరణలాలలోనూ ఆర్.బి.ఐ పెట్టుబడులు పెడుతుంది. ఇటువంటి ద్రవ్య ఆస్తుల నుండి ఆర్.బి.ఐ డివిడెండ్ సంపాదిస్తుంది.

ఆర్.బి.ఐ జాతీయ బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. ఈ రుణాలపై వడ్డీ వసూలు చేస్తుంది. ఈ వడ్డీని రేపో రేటు అంటారు. జాతీయ బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద తమ మిగులు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. బ్యాంకుల డిపాజిట్ లపై ఆర్.బి.ఐ వడ్డీ చెల్లిస్తుంది. ఆ వడ్డీ రేటును రివర్స్ రేపో రేటు అంటారు. రెపో రేటు కంటే రివర్స్ రెపో రేటు 1 శాతం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా రుణాలపై వడ్డీల ద్వారా కూడా ఆర్.బి.ఐ కి ఆదాయం వస్తుంది.

ఆర్.బి.ఐ 2013-14 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసిన మొత్తమే దాని చరిత్రలో అత్యధిక బదిలీ మొత్తం. గత సంవత్సరం 14.75 శాతం అధిక లాభం సంపాదించినప్పటికీ బదిలీ చేసిన మొత్తం తక్కువే.

గత సంవత్సరంతో పోలిస్తే ఆర్.బి.ఐ బ్యాలన్స్ షీటు మొత్తం (టర్నోవర్) ఈ సంవత్సరం పెరుగుదల నమోదు చేసింది. గతేడు రు. 23,90,700 కోట్ల టర్నోవర్ ను ఆర్.బి.ఐ చూపగా ఈ సంవత్సరం అది 26,24,400 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. అనగా నికరంగా సం. కాలంలో ఆర్.బి.ఐ టర్నోవర్ రు. 2,33,700 కోట్లు పెరిగింది.

ఆర్.బి.ఐ టర్నోవర్ పెరగడానికి ప్రధాన కారణం దాని విదేశీ కరెన్సీ ఆస్తులు వృద్ధి చెందడమే. ఇతర విదేశీ కరెన్సీలలో సైతం ఆర్.బి.ఐ పెట్టుబడులు పెడుతుంది. ఇతర విదేశీ కరెన్సీలతో పోల్చితే డాలర్ విలువ తగ్గడం చేత డాలరేతర కరెన్సీ పెట్టుబడుల పైన ఆదాయం పెరిగింది. ఇందువల్ల కూడా ఆర్.బి.ఐ టర్నోవర్ పెరిగింది.

గత సంవత్సరంలో బంగారం విలువ బాగా తగ్గిపోయింది. ఫలితంగా ఆర్.బి.ఐ వద్ద నిలవ ఉన్న బంగారం పరిణామంలో మార్పు లేకపోయినప్పటికీ దాని విలువ తగ్గడం వలన బంగారం ఆస్తి తగ్గినట్లయింది. ఆర్.బి.ఐ వద్ద ప్రస్తుతం 557.75 టన్నుల బంగారం ఉంది. దీని విలువ గతంలో ఋ. 1,28,685 కోట్లు ఉండగా అది గతేడు ఋ. 1,24,004 కోట్లకు తగ్గిపోయింది.

ఆర్.బి.ఐ లయబిలిటీ (చెల్లించవలసిన మొత్తం) పెరగడం వల్ల కూడా లాభం తగ్గినట్లు తెలుస్తోంది. రూపాయి విలువ పెరిగినప్పుడు చెలామణీలో ఉన్న కరెన్సీ విలువ పెరుగుతుంది. కాబట్టి ఆర్.బి.ఐ లయబిలిటీ ఆ మేరకు పెరుగుతుంది. కరెన్సీ మరియు బంగారం పునఃమూల్యాంకనా ఖాతా (CGRA) లో పెరుగుదల సంభవించినప్పుడు కూడా లయబిలిటీ పెరుగుతుందని తెలుస్తోంది.

ఆర్.బి.ఐ దేశీయ ఆస్తుల కంటే విదేశీ ఆస్తులే ఎక్కువ. దాదాపు రెట్టింపు. శాతాలలో చూస్తే విదేశీ ఆస్తుల భాగం 67 శాతం ఉండగా స్వదేశీ ఆస్తుల భాగం 33 శాతం ఉంది. అంతకు ముందు సంవత్సరం (2012-13)లో విదేశీ ఆస్తుల భాగం 63.8 శాతం ఉండగా స్వదేశీ ఆస్తుల భాగం 36.2 శాతం ఉంది.

2013-14 సంవత్సరంలో ఆర్.బి.ఐ మొత్తం ఆదాయం 13.1 శాతం తగ్గి రు. 64,617 కోట్లుగా నమోదయింది. దాని మొత్తం ఖర్చు కూడా రు. 12,549 కోట్ల నుండి 4.9 శాతం తగ్గి రు. 11,934 కోట్ల వద్ద నమోదయింది. ఆదాయం తగ్గడంతో ఖర్చులు కూడా తగ్గించుకుంది.

ఆర్.బి.ఐ ఆదాయం, నిర్వహణ గురించి ఈ అంశాలు ఒక అవగాహనను ఇస్తాయి.

2 thoughts on “ఆర్.బి.ఐ లాభం రు. 53 వేల కోట్లు

  1. సర్, దయచేసి ఈ కింది సందెహాన్ని నివ్రుత్తి చేయగలరు.

    1) రూపాయి విలువ పెరిగినప్పుడు చెలామణీలో ఉన్న కరెన్సీ విలువ పెరుగుతుంది అని అన్నారు. ఇది ఏవిదంగా ఆర్.బి.ఐ లయబిలిటీ పెరగదానికి దొహదం చెస్థుందొ ఉదాహరనలతొ వివరించగలరు. కరెన్సీ మరియు బంగారం పునఃమూల్యాంకనా ఖాతా (ఛ్ఘృఆ) లో పెరుగుదల సంభవించినప్పుడు కూడా లయబిలిటీ పెరుగుతుందని అని అన్నారు. దీని గురుంచి కూదా వివరించగలరు.

  2. సర్ రెసెర్వె బంక్ ఒఫ్ ఇందీ భరత ప్రబుత్వ సంస్త న లెక దానిలొ ఎం అయిన విదెషి పెత్తుబదులు వున్నయా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s