ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యాపై అట్టహాసంగా ఆంక్షలు ప్రకటించిన యూరోపియన్ దేశాలు, అవే ఆంక్షలను రష్యా తమపై విధించేసరికి కిందిమీదులవుతున్నాయి. అమెరికా, ఇ.యు, కెనడా, నార్వే, ఆస్ట్రేలియా దేశాల నుండి వచ్చే ఆహార దిగుమతులపై రష్యా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు యూరోపియన్ యూనియన్ కంపెనీలు స్విట్జర్లాండ్, దక్షిణ అమెరికా దేశాల లాంటి ప్రత్యామ్న్యాయ వాణిజ్య మార్గాల ద్వారా తమ ఎగుమతులు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ స్విట్జర్లాండ్ సహాయ నిరాకరణతో ఈ ప్రయత్నాలకు చెక్ పడింది.
స్విట్జర్లాండ్ యూరోపియన్ యూనియన్ కూటమిలో భాగస్వామి కాదు. అయినప్పటికీ ఇ.యు కోసం తాను కాసిన్ని ఆంక్షలను రష్యాపై విధించింది. ఇవి నామమాత్రమే. స్విట్జర్లాండ్, రష్యాల వాణిజ్యం యధావిధిగా కొనసాగుతోంది. దానితో తమ సరుకులను కూడా రష్యాకు అమ్మి పెట్టాలని ఇ.యు దేశాల కంపెనీలు స్విట్జర్లాండ్ ను కోరాయి. స్విట్జర్లాండ్ ద్వారా రష్యాకు ఆహార సరుకులు సరఫరా చేయడం ద్వారా తమ ఎగుమతులను నిలుపుకోవాలని సదరు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
గతం వారం రోజులుగా వివిధ ఇ.యు దేశాల కంపెనీల నుండి ఇటువంటి విన్నపాలు అనేకం అందాయని స్విస్ అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ పత్రిక తెలిపింది. స్విస్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రతినిధి అన్నే రిజ్జోలి ఇదే సమాచారం తమకు ఇచ్చారని రష్యన్ పత్రిక ఇజ్వెస్తియా తెలిపింది (రష్యా టుడే ద్వారా). భద్రతా కారణాల రీత్యా సదరు కంపెనీల పేర్లను చెప్పడానికి రిజ్జోలి నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఇ.యు దేశాలలోని పాల ఉత్పత్తుల కంపెనీల తరపున పని చేసే యూరోపియన్ మిల్క్ బోర్డ్ (ఇ.ఎం.బి) ఈ సమాచారాన్ని ధృవీకరించింది. రష్యాకు చేసే ఎగుమతులపై ఆంక్షలు విధించినందున ప్రత్యామ్నాయ మార్గం కోసం తాము అన్వేషిస్తున్నాని, స్విట్జర్లాండ్, దక్షిణ అమెరికాల ద్వారా రష్యాకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇ.ఎం.బి ఉపాధ్యక్షులు సీతా వాన్ కీంపెమా తెలిపారు. “ఈ దేశాల ద్వారా మా ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంది” అని ఆయన చెప్పారు. ఈ మేరకు ఇ.యు నుండి తమకు విన్నపాలు అందాయని స్విట్జర్లాండ్ అధికారులు తెలిపారు.
కానీ ఈ విధంగా వాణిజ్య రూట్ మార్చుకుని సరుకులను సరఫరా చేయడం WTO నిబంధనలకు విరుద్ధం. కానీ ఇ.యు తయారు చేసే సరుకులను స్విట్జర్లాండ్ లో ప్రాసెస్ చేసినట్లయితే అవి స్విట్జర్లాండ్ ఎగుమతులుగా మారిపోయే అవకాశం లేకపోలేదు. ఈ విధంగా ఇ.యు దేశాల ఎగుమతులను రష్యాకు తిరిగి ఎగుమతి చేసేందుకు స్విట్జర్లాండ్ తిరస్కరించింది.
“ఇ.యు దేశాల నుండి మాకు వినతులు అందాయి. పళ్ళు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం తదితర ఉత్పత్తుల కంపెనీలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ సరుకులను స్విట్జర్లాండ్ కు దిగుమతి చేసుకుని అనంతరం వాటిని రష్యాకు ఎగుమతి చేసేందుకు మేము అనుమతి ఇవ్వడం లేదు” అని స్విస్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ అగ్రికల్చర్ మరో ప్రతినిధి జర్గ్ జోర్డీ చెప్పారని ఇటార్-టాస్ వార్తా సంస్ధ తెలిపింది.
స్విస్ చట్టాల ప్రకారం ఆహార ఎగుమతులు పరిశుభ్రంగా ఉన్నాయన్న సర్టిఫికేట్ ను అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి సర్టిఫికేట్ ను విదేశాల ఎగుమతులకు ఇవ్వడం స్విస్ అధికారులకు సాధ్యం కాదని జర్గ్ జోర్డీ చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది.
స్విట్జర్లాండ్ ఇ.యు సభ్యదేశం కానందున స్విస్ ఎగుమతులపై ప్రభావం పడలేదు. పైగా ఇ.యు దేశాల ఎగుమతులపై నిషేధం ఉన్నందున ఆ మేరకు రష్యా ఎగుమతులను స్విస్ కంపెనీలు పెంచుకుంటున్నాయి. ఉదాహరణకి రష్యా ఆంక్షల అనంతరం స్విస్ వెన్న, కాఫీ ఎగుమతులు పెరిగాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఎగుమతుల స్ధానే రష్యా నుండి ఆర్డర్లు పెరగడంతో స్విస్ కంపెనీలు లబ్ది పొందుతున్నాయి.
అమెరికా, ఇ.యు ఆంక్షల వల్ల రష్యా తీవ్రంగా నష్టపోతోందని పశ్చిమ పత్రికలు కధలు కధలుగా వార్తలు ప్రచురిస్తున్నాయి. కానీ రష్యా ఆంక్షల ప్రభావం ఇ.యు పై పడుతున్న సంగతిని నామమాత్రంగా చెప్పి ఊరుకుంటున్నాయి. రష్యా ఆంక్షలు విధించిన దేశాల నుండి యేటా 10.5 బిలియన్ డాలర్ల వరకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా ఇవన్నీ ఆగిపోనున్నాయి. మాంద్యం, పడిపోయిన ఆర్ధిక వృద్ధి, నిరుద్యోగం తదితర సంక్షోభ సమస్యలతో సతమతం అవుతున్న దేశాలకు ఇది గణనీయ మొత్తమే. కాసిని ఉద్యోగాలు పెరిగితేనే ఘనంగా చెప్పుకునే పత్రికలు ఇంత భారీ మొత్తంలో దిగుమతులు తగ్గుతున్నా తెలియనట్లు నటించడం పత్రికలకు ఉండకూడని పక్షపాత వైఖరి.