(ఆగస్టు 25 తేదీన ఇండియా, పాకిస్ధాన్ ల విదేశాంగ శాఖల కార్యదర్శులు సమావేశమై చర్చలు జరపవలసి ఉంది. దానికంటే ముందు ఇండియాలోని పాక్ హై కమిషనర్ కాశ్మీర్ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులకు ఆహ్వానాలు పంపారు. కొందరు హురియత్ నాయకులు వెళ్ళి మాట్లాడారు కూడా. దీనిని కారణంగా చూపిస్తూ మోడి ప్రభుత్వం కార్యదర్శి స్ధాయి చర్చలను రద్దు చేసింది. ఈ అంశంపై ఈరోజు (ఆగస్టు 20, 2014) ది హిందు పత్రిక రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)
దౌత్యం పరిమిత ఓవర్ల క్రికెట్ కాదు. కానీ ఆగస్టు 25 తేదీన పాక్ తో జరగవలసిన విదేశీ కార్యదర్శుల స్ధాయి చర్చలను రద్దు చేయడం ద్వారా నరేంద్ర మోడి ప్రభుత్వం దౌత్యం అంటే అదే అన్నట్లుగా వ్యవహరించింది. గత దశాబ్ద కాలానికి పైగా ఇప్పటి వేర్పాటువాద హురియత్ నాయకులు ఇండియాలో నియమించబడిన పాక్ దౌత్యవేత్తలను క్రమం తప్పకుండా కలిశారు. 2001లో ఆగ్రా శిఖరాగ్ర సమావేశం కోసం వచ్చిన జనరల్ పెర్వేజ్ ముషార్రాఫ్ తో మొదలుకుని పాక్ నుండి ఇండియాకు సందర్శించే నేతలను కూడా వారు కలుస్తున్నారు. వేర్పాటువాదులకు పాకిస్ధాన్ ఇచ్చే ప్రాధామ్యాన్ని తెలిపే అలాంటి సమావేశాలు చికాకు పరిచేవి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ న్యూఢిల్లీ సాధారణ స్పందన ఏమిటంటే తమ అభ్యంతరాన్ని నమోదు చేసి ముందుకు సాగిపోవడం. చర్చల ప్రక్రియను పక్కకు మళ్లించేందుకు ఆ సమస్యకు అవకాశం ఇచ్చేవారు కాదు. ఇస్లామాబాద్ తో సంబంధాలను సాధారణ స్ధితికి తెచ్చేందుకు ఆ దేశంతో చర్చలు కొనసాగించడమే కీలకం అన్న గుర్తింపే ఇటువంటి వైఖరిలో దాగిన ఉద్దేశ్యం. కాశ్మీర్ విషయంలో ఇండియా-పాకిస్ధాన్ లు ఒక ఒప్పందానికి రావాలంటే అందులో హురియత్ భాగస్వామ్యం కూడా ఉండాలన్న సంగతిని అయిష్టంగానైనా అంగీకరించే వైఖరి కూడా అందులో ఇమిడి ఉంది.
ఎందుకంటే, (కాశ్మీర్ లో) ఎన్నికయిన ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రానికి సంబంధించిన విశాల రాజకీయ సమస్యల విషయంలో వేర్పాటువాద నాయకులు లోయలో గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం అధికారిక స్ధాయిలోనూ, రహస్యంగానూ హురియత్ నాయకత్వంతో చర్చలు సాగిస్తోంది. ఈ అంశాల వెలుగులో విదేశాంగ శాఖల కార్యదర్శుల స్ధాయి చర్చలకు ముందు పాక్ హై కమిషనర్ హురియత్ నాయకులతో చర్చల కోసం ఆహ్వానాలు పంపడం పట్ల అసంతృప్తిని ప్రకటిస్తే అది సరైన పద్ధతి అయి ఉండేది. కానీ చర్చలను మొత్తంగా రద్దు చేయడం ద్వారా చరిత్రను గ్రహించడంలో దిగ్భ్రాంతికరమైన అల్పత్వాన్ని ప్రదర్శించినట్లయింది. ఇది హ్రస్వ దృష్టి కూడా. సమీప గతంలో ఇండియా చాలా సార్లు ఇంతకంటే సీరియస్ కారణాల వల్ల పాక్ తో చర్చలను రద్దు చేసుకుంది. కానీ ప్రతి విరామానంతరం చర్చలకు మించిన ప్రత్యామ్నాయం లేదని మాత్రమే గుర్తించవలసి వచ్చింది. ఇప్పుడు తక్షణ సమస్య ఏమిటంటే వచ్చే సెప్టెంబర్ లో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మధ్య అనుకున్న విధంగా చర్చలు జరుగుతాయా లేదా అన్నదే.
ఈ నిర్ణయం వల్ల (కాశ్మీరు) లోయలో వేర్పాటువాద నాయకుల పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి కనుక ప్రభుత్వం తనకు తాను మేలు ఏమీ చేసుకోలేదు. “ఇండియాతో సుబృద్భావ పొరుగు సంబంధాలను నెలకొల్పుకునేందుకు మా నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఎదురు దెబ్బ” అంటూ చర్చల రద్దు నిర్ణయం పట్ల పాకిస్ధాన్ స్పందించింది. అదే విధంగా ఇప్పటికే ముట్టడిలో ఉన్న షరీఫ్ కు ఇది రాజకీయంగా కూడా ఆటంకమే. పాకిస్ధాన్ పౌర ప్రజాస్వామ్య వ్యవస్ధ యొక్క బలహీన పునాదులను ఇమ్రాన్ ఖాన్ ఆందోళనాయుత రాజకీయాలు కుదిపేస్తున్నాయి. ఇలాంటి తగవులమారి రాజకీయాలకు తోడుగా తమ ప్రధాని ఇండియా పట్ల మరీ మెతకగా ఉన్నారని భావిస్తున్న కొన్ని శక్తులు పాకిస్ధాన్ భద్రతా, రాజకీయ సంస్ధల్లో ఉన్నారు. షరీఫ్ నిలబడ్డ స్ధానాన్ని మరింతగా బలహీనపరచడమే మోడి ప్రభుత్వం చేసింది. దీర్ఘకాలికంగా అది హురియత్ నాయకులతో పాకిస్ధాన్ హై కమిషన్ సమావేశాల కంటే ఎక్కువగా ఇండియా-పాకిస్ధాన్ సంబంధాలు సాధారణ స్ధాయికి చేరుకునే అవకాశాలను బలహీనపరుస్తుంది.