ఎస్ రామ కృష్ణ రావు
Dear Sekhar,
I regularly follow your Q&A section in the teluguvartalu website. I have one question in this context. We know that every where on this world people are suffering with some problems (may be financial/political/lack of food … and many more). I was wondering is there any place on the earth where people are living relatively happily & peacefully? If so what is your analysis for that situation.
(ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రజలు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని మనకు తెలుసు (ఆర్ధిక/రాజకీయ/ఆహార లేమి… ఇలా ఏదైనా కావచ్చు). జనం సాపేక్షికంగా సంతోషంగా, శాంతియుతంగా జీవిస్తున్న చోటు ఈ భూమి పైన ఏదన్నా ఉందా? ఒకవేళ ఉంటే అటువంటి పరిస్ధితిపై మీ విశ్లేషణ ఏమిటి?
సమాధానం:
మీరు ‘సాపేక్షికంగా’ అని ఏ ఉద్దేశంతో అన్నారో గానీ సంతోషం, శాంతి అన్నవి నిజంగానే సాపేక్షిక అనుభవాలు మరియు భావనలు. ఎన్ని ఉన్నా సుఖ శాంతులు లేని కుటుంబాలు/వ్యక్తులు/సమూహాలు ఉన్నాయి. సాపేక్షికంగా చాలా మితంగానే వినియోగ సరుకులు అందుబాటులో ఉన్నా కూడా సంతోషంతో బతుకు ప్రయాణాన్ని ముగిస్తున్నవారూ లేకపోలేదు.
“సంతోషంగా, శాంతియుతంగా” అన్న మీ పదబంధాన్ని క్లుప్తంగా “సుఖ, శాంతులు” అని ప్రస్తావిస్తాను.
సుఖ, శాంతులు ఉన్న చోటు ఎక్కడన్నా ఉందా అని వెతుక్కునే ముందు ఈ పదాలకు నిర్వచనం ఏమిటో మనకు తెలిసి ఉండాలి. సుఖము, శాంతి ఉన్న జీవితం ఏమిటి అని మనకు మనం ప్రశ్నించుకుంటే వెంటనే సమాధానం మనకు తట్టకపోవచ్చు. చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తడుముకుంటారని నా నమ్మకం.
విశాల దృష్టితో చూస్తే సుఖ, శాంతులు అప్పటి సామాజిక పరిస్ధితులతో బంధించబడి ఉంటాయి. సామాజిక పరిస్ధితులు కాలంతో పాటుగా మారుతాయి. (కాలమే మార్పులకు కారణం అని కాదు.) సుఖ, శాంతుల భావనకు ఒక్కో చోట ఒక్కో అర్ధం ఉండడం కూడా తటస్ధితుంది. ఈ రెండింటిని కలిపి సుఖ, శాంతులు స్ధలము మరియు కాలము అన్న రెండు అస్ధిర (variables) అంశాలకు బంధింపబడి ఉన్నాయని అర్ధం చేసుకోవచ్చు.
సామాజిక వ్యవస్ధల నిర్మాణం ఎల్లప్పుడూ ఒకే విధంగా లేదు. ఆదిమ మానవుడు నివసించిన సమాన సమాజాన్ని ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని సోషియాలజీ నిర్వచిస్తుంది. అనంతరం బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్ (భూస్వామ్య) సమాజం, ఆ తర్వాత పెట్టుబడిదారీ సమాజం ఏర్పడ్డాయి.
కొన్ని దేశాల్లో ప్రజలు పెట్టుబడిదారీ సమాజాన్ని కూల్చి సోషలిస్టు సమాజం ఏర్పాటు చేసుకున్నాయి. అయితే వర్గాల బలాబలాల పొందిక మారడంతో అక్కడ సోషలిస్టు సమాజాన్ని కూల్చి మళ్ళీ పెట్టుబడిదారీ సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడంలో పెట్టుబడిదారీ శక్తులు సఫలం అయ్యాయి. ప్రస్తుతం ఎక్కడా కూడా సోషలిస్టు సమాజం అనేది లేదు.
ఉత్తర కొరియా, క్యూబా, చైనా దేశాల్లో సోషలిస్టు సమాజం ఉన్నట్లు కొందరు చెప్పబోతారు. కానీ అందులో నిజం లేదు. అక్కడి ప్రభుత్వాలు పెత్తందారీ దేశాల పెత్తనాన్ని ఎదిరిస్తున్నాయి. నికరమైన జాతీయ స్వతంత్రతను అవి కాపాడుకుంటున్నాయి. అంతే తప్ప అవి సోషలిస్టు సమాజాలు కావు.
ఈ సమాజ పరిణామక్రమాన్ని ఎందుకు చెబుతున్నానంటే ఆయా సమాజాల్లోని భావాజాలాన్ని ఆ సమాజాల నిర్మాణాలే నియంత్రిస్తాయి. ఒక సమాజంలో ఏ వర్గం ఆధిపత్యంలో ఉంటే ఆ వర్గానికి ఆమోదయోగ్యమైన భావజాలమే పెత్తనం చెలాయిస్తుంది. వ్యవస్ధ లోతుపాతుల్లోకి సాధారణ ప్రజలు వెళ్లరు. కాబట్టి తాము చూస్తున్నదే నిజం అనీ, శాశ్వతం అనీ మెజారిటీ ప్రజలు భావిస్తారు.
కాబట్టి బానిస సమాజంలో బానిస యజమానిగా ఉంటే సుఖ శాంతులతో ఉండొచ్చని బానిసలు భావిస్తారు. భూస్వామ్య సమాజంలో భూములు ఎంత ఎక్కువగా కలిగి ఉంటే అంత సుఖం అని భావిస్తారు. పెట్టుబడిదారీ సమాజంలో ఒక కంపెనీ, ఒక బ్యాంకు, ఒక పరిశ్రమ, ఒక వ్యాపారం… ఇలా ఉన్నట్లయితే సుఖం, శాంతి ఉంటాయని మెజారిటీ భావిస్తారు.
కానీ బానిస యజమానులు, భూస్వాములు, పెట్టుబడిదారులను కదిలిస్తే వారి కష్టాలు వారు చెప్పుకుంటారు. వారంతా కలిసి శుభ్రంగా కాయకష్టం చేసుకునేవాడే నిజంగా సుఖంగా, శాంతిగా బతుకుతారు అని తీర్మానిస్తారు. అలాగని వారి పరిశ్రమలు, భూములు, వ్యాపారాలు అన్నీ పక్కవాడికి/లేనివాడికి ఇచ్చేసి శారీరక శ్రమ చేయొచ్చుగా అంటే వెనక్కి తగ్గుతారు.
కొందరు శారీరక శ్రమ, మేధో శ్రమల్లో సుఖ సంతోషాల తేడాను చూస్తారు. అనగా శారీరక శ్రమ చేయవలసి రావడం కష్ట భూయిష్టమైన జీవనం గానూ, బుర్రతో పని చేసేవారు సుఖ పడుతున్నవారి గానూ చూస్తారు. కానీ తరచి చూస్తే శారీరక శ్రమ చేసేవారు, ఏ దురలవాట్లు లేకపోతే, ఏ రోగమూ లేకుండా జీవించగలరు. కానీ వారికి చేయడానికి తగిన పని దొరకని సమాజాలలో ఉన్నాం గనుక వారికి ఆ సుఖమూ దక్కడం లేదు. కేవలం మేధో శ్రమ మాత్రమే చేస్తున్నవారు ఒళ్ళు పెరిగి, రకరకాల జబ్బులతో బాధపడడం గమనించవచ్చు. దానితో నడవడం, పరుగెత్తడం, వేలు లక్షలు పోసి యంత్రాలు తెచ్చుకుని ఎక్సర్ సైజ్ లు చేయడం, డాక్టర్ల చుట్టూ తిరగడం… ఇవన్నీ వారి కష్టాలు. ఏదన్నా శారీరక కష్టం చేయాల్సిన పరిస్ధితి వస్తే వారికి మించిన ఒంటరి మరొకరు ఉండరు.
ఉన్నవాడికి ఉన్నది పోతుందేమో అనీ, దానిని ఎలా కాపాడుకోవాలా అని బెంగ. లేని వాడికి రేపు ఎలానా అన్నది బెంగ. ఈ ఇద్దరినీ సమానం చేయగలిగితే ఎవరికీ ఏ బెంగా ఉండదని నా అభిప్రాయం. అనగా సమాజంలోని ఆస్తులన్నింటిపైనా ఎవరికీ గుత్త స్వామ్యం ఉండకూడదు. (వ్యక్తిగత ఆస్తి ఉండకూడదని అర్ధం.) కానీ అవన్నీ అందరి వినియోగానికీ అందుబాటులో ఉండాలి.
ప్రతి ఒక్కరూ శారీరక, మేధో శ్రమలు రెండూ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి. సమాజంలో ఉన్న శ్రమలన్నింటినీ శ్రమ స్ధాయిని బట్టి వివిధ గ్రూపులుగా విభజించి ప్రతి ఒక్కరూ ప్రతి గ్రూపులోని ఏదో ఒక పని చేయక తప్పని పరిస్ధితిని కల్పించాలి. అలా చేస్తే ప్రతి ఒక్కరూ, ప్రతి రోజూ శారీరక శ్రమ, మేధో శ్రమ రెండూ చేస్తారు. ఆ విధంగా శారీరక శ్రమ, మేధో శ్రమల మధ్య వైరుధ్యం రద్దయిపోతుంది. అంతిమంగా శక్తి కొద్దీ పని చేసి, అవసరం కొద్దీ ఫలితం అనుభవించే విలువ సమాజంలో నెలకొన్నట్లయితే ధనిక, పేద తారతమ్యాలు అంతం అవుతాయి.
కానీ ఈ పరిస్ధితి ఎలా వస్తుంది? ఆస్తులను సమాజం పరం చేయాలంటే ఆస్తులు లేనివారు సరే అంటారు గానీ, అవి ఉన్నవారు ససేమిరా ఒప్పుకోరు. తమ ఆస్తులను కాపాడుకోవడానికి చేయాల్సిందంతా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఆస్తులు ఉన్నవాళ్లే పెత్తనం చేస్తూ ప్రభుత్వాలు నడుపుతుండడం వలన ఆస్తి సంపాదనే సుఖ, శాంతులకు ఏకైక మార్గం అన్న ఒక సార్వజనీన సూత్రం ఏర్పడిపోయింది. ప్రభుత్వాలు ఆస్తులు కలిగిన వర్గాల చేతుల్లోనే ఉన్నందున అవి యధాతధ స్ధితిని కాపాడేందుకే కృషి చేస్తాయి. ఉన్న స్ధితిని మార్చాలని ఎవరన్నా ప్రయత్నిస్తే తమ చేతుల్లోని పోలీసులు, సైన్యం, చట్టం, కోర్టులు… లాంటి నిర్మాణాలను ఉసిగొల్పుతాయి.
కానీ యధాస్ధితి కొనసాగుతున్నంతవరకూ శ్రామిక ప్రజలకు సుఖ శాంతులు ఉండవు. ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తిని ప్రకటిస్తూ ఉంటారు. అవి సమ్మెలు, ఆందోళనలు కావచ్చు. సాయుధ ప్రతిఘటనలోకి చేరవచ్చు, రెచ్చగొట్టబడి ఉగ్రవాద గ్రూపుల్లో చేరవచ్చు. దారి తప్పి గూండా గిరి, రౌడీ యిజం, మాఫియా లలో చేరిపోవచ్చు. ఇవన్నీ సమాజంలోని అసంతృప్తుల వ్యక్తీకరణకు వివిధ రూపాలే. అంతమాత్రాన అవన్నీ సమర్ధనీయమే అని కాదు. వీటిల్లో యధాతధ స్ధితిని మార్చేసి, పైన చెప్పినట్లుగా సమాన విలువలతో కూడిన సమాజం ఏర్పాటయ్యే కృషి ఏమన్నా ఉంటే దానిని నిస్సందేహంగా సమర్ధించవచ్చు.
అంతిమంగా మరోసారి చెప్పవలసిన విషయం: సుఖ శాంతులు సాపేక్షికం. సమాజంలోని ఆర్ధిక అసమానతలే సుఖ శాంతుల లేమికి కారణం. ఇవి ఉన్నంతవరకూ సుఖ శాంతులు ఉండనే ఉండవు. ఆర్ధిక అసమానతలు ఏ మేరకు తొలగిపోతే ఆ మేరకు సుఖ శాంతులు సమకూరుతాయి. ఆర్ధిక అసమానతలు సమాజంలో వైరుధ్యాలకు ప్రధాన కారణం. ఆ వైరుధ్యాలు పరిష్కారం కావాలంటే ఆర్ధిక అసమానతలు తొలగిపోయే వ్యవస్ధ ఏర్పడాలి. అలాంటి వ్యవస్ధను తెస్తామంటే కలిగిన వర్గాలు ఊరుకోవు. కనుక ఘర్షణలు అనివార్యం. శాశ్వత సుఖ, శాంతుల కోసం కొద్ది కాలం ఘర్షణలను సహించవచ్చు. ఏ హింసాత్మక ఘర్షణా, తిరుగుబాటు లేకుండా సమాజాలు మారుతూ పోయి ఇప్పుడున్న పెట్టుబడిదారీ సమాజం ఏర్పడలేదు. ప్రపంచ వ్యాపితంగా ప్రజాస్వామిక విప్లవాలకు నాయకత్వం వహించి హింసాత్మక తిరుగుబాట్లు లేవదీసింది పెట్టుబడిదారీ వ్యాపార వర్గాలే. కాబట్టి సకల ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లగల శాశ్వత సుస్యందన నందన వనం కోసం శ్రామిక వర్గం తిరుగుబాటు చేసి ఆస్తులను సమాజపరం చేయగల రోజు రావాలి. వస్తుంది కూడా. సమాజాల ప్రయాణం ఎల్లప్పుడూ ఆ దిశలోనే సాగుతోంది.
ఒక బొమ్మ వేయాలంటే రెండు రంగులన్నా కావాలి. నల్ల సిరాతో బొమ్మ వేయవచ్చును కదా అంటే తెల్లకాగితం మీదనో మరొక రంగు కాగితం మీదనో అలా బొమ్మ వేయగలం కాని అదే నలుపురంగు కాగితం పైన వేయలేము కదా. అనేకరంగుల్లో ఉన్న బొమ్మ కేవలం రెండురంగుల (ఉదా. తెలుపు + నలుపు) బొమ్మ కన్నా హెచ్చుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రపంవం అనేది ఒక అందమైన వర్ణచిత్రం అనుకుంటే అనేకరకాల వైరుధ్యాలే దానికి రంగులు అని అనుకోవచ్చును. ఏ వైరుధ్యాలు లేని సమాజం అంటే ఒకేరంగులో ఉన్న బొమ్మ అన్నమాటే. అది అసాధ్యం. అప్పుడు ప్రపంచం అనేదే లేకుండా పోతుంది. ఇలా కాకున్నా మరొకలా చెప్పుకున్నా సారాంశం అదే. ఒక కథలో ఒకే పాత్ర ఉన్నా అనేక పాత్రలు ఉన్నా, పాత్ర లేదా పాత్రల కన్నా భిన్నమైన రంగస్థలం కావాలి. అది లేకుండా పాత్ర(ల)కు ఉనికే లేదు. ఏకత్వం అనేది వేదాంతసారం కావచ్చునేమో కాని ప్రపంచస్థితిగా స్థాపనం చేయటం అసాథ్యం.
Dear V.Sekhar I regularly read your Q and A. YOUR every article is educative and thinkable. I am also a follower of marxist philosopy. Regarding economics and history your answers are very very studiable. Thank U.
నేనిచ్చుకునే సమాధానం దాదాపు ఇదే. అదనంగా నేను భావిస్తున్నది జాతి రాజ్యాలు(nation states) అన్నవి ఇటీవలి కాలంలోవి. ఇంచుమించు చరిత్ర గమనంలో 400 ఏళ్లు. ఏ ఒక భౌగోళిక హద్దులలోనూ సోషలిస్టు సామ్రాజ్యం(సుఖ,శాంతుల వ్యవస్థ) ఏర్పడటం సాధ్యంకాదు. సుఖమూ, శాంతీ అనేవి వ్యక్తి నియంత్రణలో ఉండే అంశాలని చాలాకాలంగా జ్ఞానులు భావించారు. అలా ప్రజలని భావింపజేసారు. ఈనాడు వ్యక్తి సుఖ , శాంతులు సమాజ పద్దతి మీద ఆధారపడి ఉంటాయని అర్ధం చేసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. వారంతా ఆ సుఖ. శాంతులు సోషలిస్టు సమాజంలోనే సాధ్యమని స్థూలంగా ఒప్పుకుంటారు. కాని ఆ సోషలిస్టు సమాజం ఒక జాతి రాజ్యం చేతుల్లో, చేతల్లో ఉందని అనుకుంటారు. నేను అలా అనుకోటం లేదు. వ్యక్తులకి ఉండే స్వార్ధానికి సామాజిక గౌరవం, సమ్మతి కాస్త తక్కువైనా జాతి రాజ్యాల స్వార్ధానికి దేశభక్తి వంటి పేర్లతో చాలా సామాజిక గౌరవం చాలా ఉంది. ఒక దేశం పేరుతో బయట దేశాలలో జరిగే దోపిడీ ప్రపంచవ్యాప్తమైనది. దానికి సమ్మతి, గౌరవం ఉన్నాయి. నేను అనుకోటం ఇది దేశాలు చేసే దోపిడీ అనటం కన్న, పర్యావరణ నాశనాన్ని పట్టించుకోకుండా భూమిని కుళ్లబొడవటం అనటం కన్న ఇది ఏకమైన ప్రపంచ వ్యాపార వర్గం చేస్తున్న లక్ష్యరహితమైన దారుణం. నియంత్రణ లేని పులిమీద మానవుని వివేచనారహితమైన ప్రయాణం. ఇది ప్రపంచమానవుడు గ్రహించగలిగే దిశగానే ప్రయాణం సాగుతోందని నా అవగాహన.
శ్యామలరావు గారూ, వర్తమాన సమాజాన్ని దృష్టిలో ఉంచుకుంటూ వైరుధ్యాలు లేని సమాజం ఊహించుకున్నపుడు మీరు చెప్పినట్లే ఎలా సాధ్యం అనిపిస్తుంది. కానీ పాత సమాజాల లోని విలువలు ఇప్పుడు లేకుండా పోవడమో, రూపం మార్చుకోవడమో జరిగినట్లే వైరుధ్య రహిత సమాజంలో కూడా అప్పటి పరిస్ధితులకు తగిన విలువలు అభివృద్ధి అవుతాయి. వైరుధ్య రహితం అంటే మనుషుల మధ్య అంతరాల వైరుధ్యాలు పోతాయి గానీ, ఆలోచనల మధ్య వైరుధ్యాలు కొనసాగుతాయి. ప్రకృతికి, మానవ సమాజానికి మధ్య ఉన్నది నిరంతరం కొనసాగే వైరుధ్యం. ఈ వైరుధ్యం వల్లనే శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు సాధ్యం అవుతున్నాయి. ప్రకృతిని అదుపులోకి తెచ్చుకునేందుకు మనిషి చేసే ప్రయత్నం, ప్రకృతిలో కనిపెట్టవలసిన జ్ఞానం నిరంతరం ఇంకా ఇంకా మిగిలిపోతూ ఉండడమే ఈ వైరుధ్యం. ఈ వైరుధ్యం సామాజిక పరిణామాలకు అతీతమైన సార్వత్రిక వాస్తవం.
అనగా… మీరు చెప్పిన భాషలో: సమాజంలో ఎప్పటికీ ఆయా సామాజిక దశలకు తగినట్లు వర్ణమాల ఉనికిలో కొనసాగుతూ ఉంటుంది.
వివినమూర్తి గారు,
జాతి రాజ్యం అంటే బ్రాడ్ గా ఒక దేశం అన్న భావనను వ్యక్తం చేస్తున్నారని భావిస్తూ…
ప్రపంచం యావత్తూ సోషలిస్టు వ్యవస్ధగా మారే పరిస్ధితి ఏక కాలంలో ఎలా సంభావిస్తుంది? పోనీ ఏక కాలంలో కాకపోయినా దీర్ఘ కాలిక పోరాట రూపంలో నైనా జాతి రాజ్యాల సరిహద్దులకు అతీతంగా సోషలిస్టు విప్లవం రావడం సాధ్యమని మీరు భావిస్తున్నారా?
నిజానికి మీరు చెబుతున్న తరహా భావనలో (నేను అర్ధం చేసుకున్నదే మీరు చెప్పేది అయితే) బ్రిటన్ తదితర పశ్చిమ రాజ్యాలలో కొన్ని సంస్ధలు వెలిసి పని చేస్తున్నాయి. వాటికి పెద్దగా ఫాలోయింగ్ లేదు గానీ పత్రికలు నడుపుతున్నాయి. వీటి ప్రకారం ట్రాన్స్ నేషనల్ కంపెనీల వల్ల ఒకే దేశంలో సోషలిస్టు విప్లవం సాధ్యపడదు. ప్రపంచ స్ధాయి సంస్ధ ఏర్పడి కృషి చేసి ప్రపంచ విప్లవం కోసం కృషి చేయాలి.
అయితే ఇది సరికాదని నా అభిప్రాయం. లెనిన్ అంటారు ‘జాతీయవాది కాకుండా అంతర్జాతీయ వాది కాలేరు’ అని. ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు సమాజం నెలకొనాలని కోరుకోవడంలో తప్పు లేదు, అవసరం కూడా. కానీ అది జాతుల సోషలిస్టు స్వతంత్రత ద్వారానే సాధ్యపడుతుంది. ఒక దేశంలో విప్లవం రావడానికే అతి సూక్ష్మ నిర్మాణం మొదలుకొని ప్రాంతాల వారీ కమిటీల వరకు నిర్మించుకుని కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ఉద్యమాలు నిర్మించి దశలవారీగా ఉద్యమాలను చేపట్టి అంతిమంగా లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది. అలాంటిది ప్రపంచ నిర్మాణం సాధ్యమయ్యే పనేనా?
ప్రపంచంలో ఇంకా విస్తారమైన దేశాలలో పాలకవర్గాలు సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో పని చేస్తూ దళారీలుగా ఆయా రాజ్యాలను నియంత్రిస్తున్న పరిస్ధితుల్లో నూతన ప్రజాస్వామిక విప్లవ దశ అవసరం కొనసాగుతోంది. ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో ఇలా ప్రతి యూనిట్ లోనూ అసమాన అభివృద్ధి నెలకొని ఉన్న దశలో, పెట్టుబడిదారీయేతర దేశాల్లో ఇంకా ఉత్పత్తి విధానం సామ్రాజ్యవాద వ్యవస్ధకు అనుబంధంగానే కొనసాగుతున్నందున నూ.ప్ర.వి దశ దాటిపోలేదు. ఇది మీరు చెప్పిన అవగాహను negate చేస్తుంది.
మీరు చెబుతున్న జాతి రాజ్యాల స్వార్ధం నిజానికి పెట్టుబడిదారీ స్వార్ధం. విప్లవ సాధనకు దేశభక్తియుత చైతన్యం ఒక సాధనం. వర్గ శత్రువు స్వభావాన్ని వెల్లడి చేసే స్వభావం జాతి చైతన్యానికి ఉంటుంది. ఒకే జాతి సమాజంలోనే అనేకానేక ఆర్ధిక వర్గ శక్తులు తమ తమ ప్రయోజనాలకు బద్ధులై ఉన్నపుడు ప్రధాన శత్రువును ఒంటరిని చేసే ఐక్య సంఘటన నిర్మాణం అవసరం నేటికీ కొనసాగుతోంది. ఈ కారణాల రీత్యా కూడా సోషలిస్టు విప్లవాల మొదటి భౌగోళిక పరిమితి జాతి రాజ్యమే. సోషలిస్టు చైతన్యంలోనే అంతర్జాతీయ చైతన్యం ఇమిడి ఉంటుంది కనుక సోషలిస్టు జాతి, స్వభావ రీత్యా జాతి స్వార్ధాన్ని విడిచి పెట్టి పొరుగు జాతి యొక్క సోషలిస్టు విముక్తికి సహాయపడుతుంది. ఒక్కో జాతీ సోషలిస్టు విముక్తి సాధించే కొద్దీ అంతర్జాతీయతా స్వభావం బలపడుతూ పోతుంది. సోషలిజం అంటేనే సర్వరకాల వైరుధ్యాలను తొలగించుకుంటూ పోవడం. కనుక సోషలిస్టు అంతర్జాతీయతలో జాతి స్వార్ధం అసలు సమస్య కానే కాదు.
మీరు చెప్పిందాన్ని మీరు చెప్పదలుచుకున్న కోణంలోనే అర్ధం చేసుకున్నానా అన్న అనుమానం నాకు మిగిలి ఉంది.
ఆ శంకతో మరో కోణంలో నుంచి ఇలా స్పందిస్తున్నాను.
అమెరికా సామ్రాజ్యవాద దోపిడి అంటే అమెరికా అనే దేశం చేస్తున్న దోపిడి అని కాదు. లేదా అమెరికా జాతి చేస్తున్న దోపిడీ అని కాదు. దాని అర్ధం అమెరికన్ పెట్టుబడిదారులు చేస్తున్న దోపిడీ అనే. ఇలా అభివృద్ధి చెందిన పెట్టుబడి రాజ్యాలలోని పెట్టుబడిదారీ వర్గాలు సామ్రాజ్యవాద దోపిడీని సాగిస్తూ తమలో ఉన్న వైరుధ్యాలను పరిష్కరించుకోవడం కోసం ప్రపంచ వ్యాపిత గొలుసుగా ఏర్పడి ఉన్నారు. (ఇది లెనినిజం లోని ముఖ్యమైన భాగం) సంక్షోభ సమయాల్లో ఈ గొలుసులో కొన్ని భాగాలు బలహీనపడతాయి. వివిధ సామ్రాజ్యవాద గ్రూపుల మధ్య వైరుధ్యాలు తీవ్రమై ఇక ఎంతమాత్రం సామరస్య పూర్వకంగా వైరుధ్యాలను (మార్కెట్ల పంపిణీ, వనరుల పంపిణీ మొ.వి) పరిష్కరించుకోలేని దశలో ఈ విధంగా సామ్రాజ్యవాద గొలుసులో బలహీన లంకె ఏర్పడుతుంది. అలా బలహీనంగా ఉన్న దగ్గర సోషలిస్టు శక్తులు అప్రమత్తంగా ఉండి విప్లవానికి పిలుపు ఇవ్వగలిగితే అది విజయవంతం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఇలా వివిధ జాతులకు చెందిన సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గాలు గొలుసు కట్టుగా ఏర్పడి ఉన్నట్లు చెప్పిన అవగాహనను లెనిన్ సమకాలీకులు కొందరు (పేర్లు గుర్తు లేవు) తిరస్కరించారు. వారి అనుచరులే నేను పైన చెప్పిన ప్రపంచ వ్యాపిత విప్లవం పేరుతో పత్రికలు నడుపుతున్నారు. ఆచరణలో ఈ అవగాహన సామ్రాజ్యవాదులకు సహాయం చేస్తుంది. సామ్రాజ్యవాద గొలుసు కట్టు వల్లనే మీరు జాతి స్వార్ధం లోకి వెళ్లారేమోనాని అనుమానం.
ప్రధాన వైరుధ్యాలు పక్కన పెడితే, సమాన వైరుధ్యాలమధ్య సఖ్యత ఎప్పుడు? ఈ సమాన వైరుధ్యాలు చివరి వరకు కొనసాగుతాయా? కొనసాగుతాయని ఒక పక్క తెలుస్తూన్నా , సమాన వైరుద్యాల మధ్య సఖ్యత లేక పోడమే ప్రధాన వైరుధాలకన్నా ప్రమాదకరమని ఈ దేశ అనుభవాలు చెభుతున్నాయి. శేఖర్ గారు దీనికి మీరేమంటారూ?
తిరూపాలు గారూ, సమాన వైరుధ్యాలు అంటే మీ ఉద్దేశం?
ఈ మాట ఇండైరెక్ట్ గా వాడానండి. సమాన వైద్యాలంటె సన్నిహిత భావజాలంగా లేక ఒకే భావ జాలం మద్య వైరుద్యాలుగా భావించ గలరు.
అలాంటి వాటిని చర్చల ద్వారా, ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా పరిష్కరించుకోవలసిందే. అలా చేయలేకపోతే ఆ వైరుధ్యాల పాత్రధారుల వైఫల్యం అవుతుంది.
సోషలిస్టు భావజాలం అని చెబుతూనే పెడదారి పట్టేవారి, పట్టించేవారిది కూడా అంతిమ పరిశీలనలో శత్రు వైరుధ్యంగానే తేలుతుంది. ఇవన్నీ నిరంతర చర్చలు, ఆచరణలే తేల్చాల్సిన విషయాలు. నిజాయితీ తప్పనిసరి షరతు.