గాజా విధ్వంసం ఖరీదు $8 బిలియన్లు


40 రోజుల గాజా విధ్వంసం ఖరీదు 8 బిలియన్ డాలర్లు. అనగా 48,000 కోట్ల రూపాయలు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ ఆదాయంలో ఇది 2/3 వంతుతో సమానం. కానీ ఉమ్మడి ఏ.పి జనాభా 10 కోట్లు కాగా గాజా జనాభా కేవలం 18 లక్షలు మాత్రమే.

“గాజా భూభాగం సర్వ నాశనం అయిపోయింది. అనేక సంస్ధలు ఉమ్మడిగా పూనుకుంటే తప్ప పునర్నిర్మాణం సాధ్యం కాదు” అని గాజా గృహ నిర్మాణం మరియు ప్రజా పనుల శాఖ మంత్రి ముఫీద్ ఆల్-హసయ్నా చెప్పారని జిన్ హువా (చైనా) వార్తా సంస్ధ తెలిపింది. గాజా సిటీలో జరిగిన ఒక వర్క్ షాప్ లో మాట్లాడుతూ ఆయన ఈ సంగతి చెప్పాడు.

“గత 6 సంవత్సరాల్లో గాజా స్ట్రిప్ పైన ఇజ్రాయెల్ 3 సార్లు దాడి చేసింది. చీమ కూడా చొరకుండా గాజాను దిగ్బంధనం కావించింది. ఇప్పటి యుద్ధం అత్యంత కఠినమైనది మరియు సుదీర్ఘ మైనది. ప్రజలపైనా, వారి జీవన పరిస్ధితుల పైనా ఈ యుద్ధం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది” అని ఆల్-హసయ్నా తెలిపారు.

మంత్రి ప్రకారం ఈసారి నష్టం విలువ 6 నుండి 8 బిలియన్ డాలర్ల వరకు ఉంది. 18 లక్షల జనాభా కనుక తలసరి నష్టాన్ని లెక్కిస్తే 3,333 డాలర్ల నుండి 4,444 డాలర్ల వరకు తేలుతుంది. ఇది రూపాయల్లో చెప్పుకుంటే రు. 2 లక్షల నుండి 2.67 లక్షల వరకూ ఉంటుంది.

వర్క్ షాప్ లో వివిధ అంతర్జాతీయ సంస్ధల ప్రతినిధులు, దాత దేశాల ప్రతినిధులు హాజరై గాజా పునర్నిర్మాణం గురించి చర్చించారని ది హిందు తెలిపింది. 2.5 లక్షల మంది ప్రజలు నిర్వాసితులుగా మారారని వారందరూ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని గాజా ప్రభుత్వం తెలిపింది.

“20,000 గృహ యూనిట్లు పూర్తిగా ధ్వంసం కావడమో లేదా వినియోగానికి వీలు లేకుండా తీవ్రంగా ధ్వంసం కావడమో జరిగింది. ఇవి ఇక నివాస యోగ్యం కాదు. కొత్త ఇళ్ళు నిర్మించుకోవాల్సిందే. మరో 40,000 ఇళ్ళు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి” అని ఆల్-హసయ్నా తెలిపారు. ధ్వంసం అయిన ఇళ్ల నుండి శిధిలాలను తొలగించడం భారీ కర్తవ్యం కానుంది.

ఆరోగ్య మంత్రి ప్రకారం ఇజ్రాయెల్ సాగించిన భూ, వాయు, జల తల దాడుల్లో 2016 మంది గాజన్లు చనిపోయారు. వారిలో 3 వంతుల మంది పౌరులే. యుద్ధంలో పౌరులను చంపడం, జనావాసాలపై దాడులు చేయడం, ఒకరి/ఒక సంస్ధ తప్పిదాన్ని చూపు సామూహిక శిక్షకు గురి చేయడం… ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నేరాలు. ఈ యుద్ధ నేరాలన్నింటినీ ఇజ్రాయెల్ అనాదిగా సాగిస్తోంది. ప్రపంచ వ్యాపితంగా యుద్ధ నేరాలకు పాల్పడే అమెరికా ఆ దేశానికి మద్దతుదారు.

ఈజిప్టు మధ్యవర్తిత్వంలో ప్రస్తుతం గాజా, ఇజ్రాయెల్ ల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఇరు పక్షాలు ఎదురెదురుగా కూర్చొని జరుపుతున్న చర్చలు కావివి. ఇరు పక్షాలు చెరొక చోట కూర్చుని ఉండగా ఈజిప్టు మధ్యవర్తులు వారి మధ్య చక్కర్లు కొడుతూ చర్చలు నడిపిస్తున్నారు. గాజా తరపున హమాస్ ఒక్కటే చర్చల్లో పాల్గొనడం లేదు. ఇటీవల హమాస్, ఫతా రెండు సంస్ధలూ కలిసి గాజాలో ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రులు ఇరువురూ ఫతాకు చెందినవారే.

గాజా దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలని గాజా యూనిటీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇది కనీస కోరిక. దిగ్బంధనం ఎత్తివేయకుండా ఇంత భారీ నష్టాన్ని గాజన్లు భరించవలసి రావడం అంటే సో కాల్డ్ అంతర్జాతీయ సమాజం ఇక తనకు సిగ్గు, లజ్జ లాంటి విలువలు ఏవీ లేవని అంగీకరించినట్లే. ఇజ్రాయెల్ దిగ్బంధనానికి సహకరిస్తున్న ఈజిప్టు సైనిక ప్రభుత్వమే చర్చలలో మధ్యవర్తిత్వం వహించడం ఒక పెద్ద అపభ్రంశం.

సాధారణంగా ఇజ్రాయెల్, పాలస్తీనాల చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఈసారి కూడా మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా ప్రయత్నించింది. కానీ ఇజ్రాయెల్ అందుకు అంగీకరించలేదని సమాచారం. యుద్ధం సాగుతున్నంత కాలం ఇజ్రాయెల్ కు అమెరికా నేరుగా మందుగుండు సరఫరా చేసింది. ఇది ఒబామాకు చెప్పకుండా ఇజాయెల్ నేరుగా రక్షణ శాఖ నుండి తన పలుకుబడిని ఉపయోగించి తెప్పించుకుందని పశ్చిమ పత్రికలు చెబుతున్నాయి.

ఇది తెలిసిన వెంటనే ఒబామా సరఫరాలకు అడ్డు పడ్డారని, పౌరుల మరణాలు పెద్ద సంఖ్యలో ఉన్నందున వైట్ హౌస్ అనుమతి లేకుండా మందుగుండు సరఫరా చేయవద్దని ఒబామా ఆదేశాలు ఇచ్చారట. అందుకే అమెరికా మధ్యవర్తిత్వానికి ఇజ్రాయెల్ అంగీకరించలేదని దానితో ఈజిప్టు రాయబారం నడుపుతోందని పశ్చిమ పత్రికలు రాస్తున్నాయి.

చూడబోతే ఇదేదో పిట్ట కధలానే కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికా ఆజ్ఞ లేకుండా ఈజిప్టు సైనిక ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేయడం కలలోని మాట! అదీ కాక 2,016 మంది మరణాలకు దారితీసిన యుద్ధంలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలపై విచారణ చేయాలని ఐరాస మానవ హక్కుల సంస్ధ నిర్ణయించింది. (ఇరువైపులా యుద్ధ నేరాలను విచారిస్తామని చెబుతూ ఇజ్రాయెల్-పాలస్తీనాలను ఐరాస మానవ హక్కుల సంస్ధ ఒకే గాటన కట్టేసింది.) అమెరికా మందుగుండు సరఫరా చేసింది కనుక ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు అధ్యక్షుడు ఒబామా బాధ్యత లేకుండా చేయడానికే ఈ సరికొత్త నాటకానికి తెరతీశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చర్చల్లో ఇజ్రాయెల్ ముందుకు తెచ్చిన డిమాండు విపరీతం. ఇజ్రాయెల్ భద్రత కోసం హమాస్ తన ఆయుధాలను విసర్జించాలట. గాజా మొత్తాన్ని నిరాయుద్ధం చేయాలట. అంటే పాలస్తీనా ఆత్మరక్షణ హక్కును నిర్మూలించాలన్నది ఇజ్రాయెల్ డిమాండ్. ఇంతకు మించిన దురహంకారం ఇంకేముంటుంది? గాజా మొత్తాన్ని నిరాయుధం చేస్తే ఇక ఎలాంటి ఆటంకం లేకుండా గాజా తీరాన్ని ఇజ్రాయెల్ సైన్యంతో నింపేసి చమురు, సహజ వాయువులను తవ్వుకు పోవచ్చని ఇజ్రాయెల్ పధకం వేసింది. ఏడున్నర దశాబ్దాల ఇజ్రాయెల్ దురహంకారాన్ని అనునిత్యం అనుభవించే గాజన్లు ఈ డిమాండ్ ను అంగీకరించరు.

అసలు ఇజ్రాయెలే తన దురాక్రమణ నుండి వెనక్కి తగ్గాలి. ఐరాస తీర్మానాల ప్రకారం 1967 నాటి సరిహద్దులకు వెనక్కి తగ్గాలి. వెస్ట్ బ్యాంక్ లోని చట్ట విరుద్ధమైన యూదు సెటిల్మెంట్ లను నిర్మూలించాలి. ఓస్లో ఒప్పందం ప్రకారం పాలస్తీనా రాజ్య స్ధాపనకు మార్గం సుగమం చేయాలి. తన అణ్వాయుధాలను నిర్మూలించి అణ్వస్త్ర రహిత మధ్య ప్రాచ్యం ఏర్పడడానికి దోహదం చేయాలి. ఇజ్రాయెల్, దాని వెనుక ఉన్న అమెరికా పశ్చిమ రాజ్యాల సామ్రాజ్యవాద పెత్తనం అంతం కాకుండా మధ్య ప్రాచ్యంలో శాంతి సాకారం కాజాలదు.

Photos: Huffington Post, Daily Mail, Al-Jajira

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s