రష్యాలో ఇక చైనా క్రెడిట్ కార్డులు


unionpay

అంతర్జాతీయ ద్రవ్య రంగంలో అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతూ రష్యా మరో నిర్ణయం తీసుకుంది. చైనా క్రెడిట్ కార్డుల సంస్ధ యూనియన్ పే కార్డులను దేశంలో వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు ప్రకటించడంతో వీసా, మాస్టర్ కార్డ్ సంస్ధల క్రెడిట్ కార్డులను రష్యా దేశం నుండి తన్ని తగలేసింది. అమెరికా ఆంక్షలను అనుసరించి కొన్ని రష్యన్ కంపెనీల ఖాతాలను వీసా, మాస్టర్ కార్డ్ లు స్తంభింపజేశాయి. అందుకు ప్రతీకారంగా చైనా డెబిట్, క్రెడిట్ కార్డుల కంపెనీ యూనియన్ పే కు రష్యా ఆహ్వానం పలికింది.

వ్యాపార మొత్తం పరంగా చూస్తే యూనియన్ పే కార్డులు ప్రపంచంలో ప్రధమ స్ధానంలో ఉన్నాయి. యూనియన్ పే తర్వాత స్ధానాన్ని వీసా ఆక్రమించగా ఆ తర్వాత స్ధానం మాస్టర్ కార్డ్ ది. లావాదేవీల సంఖ్య (ట్రాన్సాక్షన్స్) పరంగా చూస్తే వీసా కార్డులు ప్రపంచంలో ప్రధమ స్ధానాన్ని ఆక్రమించగా యూనియన్ పే రెండో స్ధానంలో ఉంది.

వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలు గత మార్చి నెలలో చెప్పా పెట్టకుండా కొందరు రష్యన్ వ్యాపారుల ఖాతాలను స్తంభింపజేశాయి. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా క్రిమియా రష్యాలో చేరిపోయింది. దీనిని సాకుగా చూపిస్తూ అమెరికా, కొందరు రష్యా వ్యాపారుల పైనా, కంపెనీల పైనా ఆంక్షలు విధించింది. దీనితో అవాక్కయిన అనేకమంది రష్యన్ కంపెనీలు, వ్యక్తులు తమ పెట్టుబడులను అమెరికా, ఐరోపాల నుండి హడావుడిగా రష్యాకు తరలించుకుపోయారు.

అమెరికా చర్యతో రష్యా తమకంటూ సొంతగా అంతర్జాతీయ లావాదేవీల కార్డును నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. అయితే అందుకు చాలా కాలం పడుతుంది. రష్యన్ కార్డు మార్కెట్ లోకి రావాలంటే, వేగంగా పని జరిగితే, కనీసం 16 నెలలు పడుతుందని తెలుస్తోంది. సాధారణంగా అయితే 2 నుండి 3 సం.ల కాలం పడుతుంది. ఈ లోపు లావాదేవీలను సాగించడానికి చైనా కార్డును వినియోగించాలని రష్యా తలపెట్టింది.

యూనియన్ పే కార్డు 2002లో మాత్రమే ప్రారంభం అయింది. వీసా (1958లో మొదలు), మాస్టర్ కార్డ్ (1967 లో మొదలు) లకు ప్రత్యామ్నాయంగా చైనా మార్కెట్ కోసమే ప్రారంభం అయిన ఈ కార్డు అనతికాలంలోనే ప్రపంచం అంతా విస్తరించింది. ప్రస్తుతం 142 దేశాలలో చైనా కార్డు యూనియన్ పే వినియోగించబడుతోంది. వ్యాపార మొత్తం పరంగా వీసా, మాస్టర్ కార్డ్ లను దాటిపోయి ప్రపంచంలో మొదటి స్ధానాన్ని ఆక్రమించింది.

రష్యాలో అతి పెద్ద బ్యాంకులయిన వి.టి.బి, గాజ్ ప్రోమ్ బ్యాంక్, ప్రోమ్ స్వాజ్ బ్యాంక్, ఎం.టి.ఎస్, రోస్ బ్యాంక్ లు యూనియన్ పే కార్డు కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయని రష్యా టుడే తెలిపింది. వి.టి.బి24 బ్యాంకు యూనియన్ పే కార్డుల ద్వారా ఎ.టి.ఎం సేవలను ప్రారంభించింది. రిటైల్ వ్యాపారంలో చెల్లింపుల కోసం చర్చలను ప్రారంభించింది. రష్యన్లు ఇక నుండి తమ ఎ.టి.ఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల పైన వీసా, మాస్టర్ కార్డ్ లోగోలకు బదులుగా యూనియన్ పే లోగోను చూస్తారు.

రష్యన్ బ్యాంకులు బాంక్ రోస్సియా, ఎస్.ఎం.ఎఫ్ బ్యాంక్ లపైన అమెరికా ఆంక్షలు విధించడంతో సదరు బ్యాంకుల ఖాతాదారుల లావాదేవీలను వీసా, మాస్టర్ కార్డ్ లు మార్చి 2014 నుండి అనుమతించలేదు. దానితో రష్యన్ ఫైనాన్షియర్లు అనేకమంది తమ పెట్టుబడులను వెనక్కి తెచ్చుకున్నారు. అమెరికా ఆంక్షల వల్ల రష్యా నుండి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని, ఇక రష్యాకు కష్టమేననీ పశ్చిమ పత్రికలు కధలు కధలుగా వార్తలు రాస్తున్నాయే తప్ప రష్యన్ పెట్టుబడులు అమెరికా నుండి వెళ్లిపోయాయన్న సంగతిని మాత్రం పొరబాటున కూడా రాయడం లేదు.

“వీసా, మాస్టర్ కార్డ్ లపైన 100 శాతం నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్వరూ వాటిని నమ్మడం లేదు. మా క్లయింట్ లలో చాలా మంది తమ లావాదేవీలను డాలర్, యూరో లలో నిర్వహించడం మానేశారు. చైనా కరెన్సీ యువాన్ లలో నిర్వహిస్తున్నారు. అందువల్ల వారు యూనియన్ పే కార్డు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు” అని మాస్కో నుండి పని చేసే లైట్ బ్యాంక్ డిప్యూటీ ఛైర్మన్ డెనిస్ ఫోనోవ్ వ్యాఖ్యానించడం బట్టి రష్యాలో పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

కొందరు రష్యన్ల ఖాతాలను స్తంభింపజేసినందుకు గాను వీసా, మాస్టర్ కార్డ్ లను సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలని రష్యన్ రిజర్వ్ బ్యాంక్ డిమాండ్ చేస్తోంది. కనీసం 3 నుండి 4 బిలియన్ డాలర్ల వరకు డిపాజిట్ చేస్తేనే రష్యాలో లావాదేవీలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

రష్యాలో ఇప్పటికే 20,000 వరకు యూనియన్ పే కార్డులు సర్క్యులేషన్ లో ఉన్నాయని తెలుస్తోంది. సెప్టెంబర్ లోపు మరో 100,000 కార్డుల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఈ సంఖ్య త్వరలో అనేక రెట్లు పెరగనుంది.

ప్రపంచ వ్యాపార మొత్తం పరంగా యూనియన్ పే కార్డులు 5.3 ట్రిలియన్ల టర్నోవర్ ను కలిగి ఉంది. ఈ విషయంలో ప్రపంచంలో అది పెద్ద మొత్తం కలిగి ఉన్న కంపెనీ ఇదే. మొత్తం ప్రపంచ వ్యాపారంలో 47 శాతంతో ఇది సమానం. వీసా కార్డుల మార్కెట్ వాటా 40.6 శాతం ఉండగా మాస్టర్ కార్డ్ వాటా 12.2 శాతం ఉన్నదని నిల్సన్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

లావాదేవీల పరంగా చూస్తే గత సంవత్సరం ప్రధమార్ధంలో వీసా సంస్ధ 4.6 ట్రిలియన్ డాలర్ల మొత్తం చేతులు మారేందుకు దోహదం చేసింది. యూనియన్ పే 2.5 ట్రిలియన్లతో రెండో స్ధానంలో ఉంది. 2014 ఆరంభం నాటికి యూనియన్ పే 4.2 బిలియన్ కార్డులను జారీ చేసింది.

One thought on “రష్యాలో ఇక చైనా క్రెడిట్ కార్డులు

  1. నాకు క్రెదిత్ కార్ద్ లేదు. నేను IDBI Net Banking ఉపయోగించి ఆన్లైన్‌లో వస్తువులు కొంటుంటాను. మన దేశంలో చాలా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు 50,000 FD ఉన్నవాళ్ళకి మాత్రమే క్రెదిత్ కార్ద్‌లు ఇస్తాయి. IDBI నుంచైతే క్రెదిత్ కార్ద్ పొందడం ఇంకా కష్టం. మనం క్రెదిత్ కార్ద్ వాడకపోతే మనకి ఏమీ నష్టం లేదు కానీ వీసా, మాస్తర్ కార్ద్ కంపెనీలకి నష్టం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s