సైన్యం పేరుతో తూర్పు ఉక్రెయిన్ లో నరమేధం సాగిస్తున్న ఉక్రెయిన్ హంతకదళాలు పశ్చిమ దేశాల అదుపులో ఉన్నాయి తప్ప ఉక్రెయిన్ ప్రభుత్వం అదుపులో కాదని రష్యా విదేశీ మంత్రి తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ ప్రజలకు ఆహారం, నీరు తదితర సహాయం అందజేయడానికి వీలుగా జర్మనీలో చర్చలు జరుపుతున్న విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ ఈ సంగతి పత్రికలకు తెలిపారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రికి ఈ దళాలు హెచ్చరిక జారీ చేయడం బట్టి ఇది రుజువవుతోందని ఆయన తెలిపారు.
తూర్పు ఉక్రెయిన్ లోని తిరుగుబాటు రాష్ట్రాలపై ఉక్రెయిన్ బలగాలు గత ఆరు నెలలుగా వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ దాడుల్లో లుగాన్స్క్, డోనెట్స్క్ రాష్ట్రాలలో ప్రజా నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. పౌరుల ఆవాసాలపై దాడులు చేస్తుండడంతో అనేకమంది మరణిస్తున్నారు. ఇప్పటికి 2,000 మందికి పైగా ప్రజలు చనిపోయారని ఐరాస నివేదికల ద్వారా తెలుస్తోంది. తమ ప్రజలపై తామే దాడులు చేస్తున్నప్పటికీ ఉక్రెయిన్ దుర్మార్గాన్ని పశ్చిమ దేశాలు పట్టించుకోవడం లేదు.
ఈ నేపధ్యంలో తూర్పు ఉక్రెయిన్ ప్రజలకు ఆహారం, నీరు తదితర సరుకులు అందడం లేదు. ఈ సరుకులతో నిండిన 300 ట్రక్కులను రష్యా పంపగా వాటిని ఉక్రెయిన్ అనుమతించలేదు. రష్యా సైనికులు ఈ ట్రక్కుల్లో దాగున్నారని, ట్రోజాన్ హార్స్ తరహాలో వారు తిరుగుబాటుదారులకు సహాయం చేసేందుకు వస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ రష్యా అంతర్జాతీయ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోనే ట్రక్కులను అనుమతించవచ్చని తెలిపింది.
జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరుగుతున్న చర్చలు నిన్నటితో ఫలప్రదమయ్యాయని పత్రికలు తెలిపాయి. రష్యా అందజేస్తున్న మానవతా సహాయం అందజేయడానికి ఒప్పందం కుదిరిందని రష్యా విదేశీ మంత్రి ప్రకటించారు. అయితే కాల్పుల విరమణకు మాత్రం ఒప్పందం కుదరలేదని, చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తూర్పు ఉక్రెయిన్ లో సాగుతున్న దాడుల గురించి ఆయన సమాచారం ఇచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు వద్ద రష్యన్ సరఫరా ట్రక్కులు అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. అవి అలా ఎదురు చూస్తుండగానే రష్యన్ మిలట్రీ వాహనాల వరుస ఉక్రెయిన్ లో ప్రవేశించిందని, దానిలో ఒక భాగాన్ని తాము ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనను పశ్చిమ పత్రికలన్నీ అట్టహాసంగా ప్రచురించాయి. కానీ ఈ వార్తలో నిజం లేదని అసలు తమ మిలట్రీ వాహనాలు ఏవీ ఉక్రెయిన్ లో ప్రవేశించలేదని రష్యా తిరస్కరించినా ఉక్రెయిన్ ప్రచారానికే పశ్చిమ పత్రికలు విలువ ఇచ్చాయి.
ఈ అంశంపై మరిన్ని వివరాలను సెర్గీ లావరోవ్ పత్రికలకు అందించారు. “కీవ్ లోని అధికారులు అనేక పేర్లతో ఉన్న పారా మిలట్రీ బలగాలను అదుపు చేయలేకపోతున్నారు. రైట్ సెక్టార్ లాంటి సంస్ధలే నేషనల్ గార్డ్స్ లో అధిక భాగాన్ని ఆక్రమించి ఉన్నారు. ఉక్రెయిన్ హోమ్ మంత్రికి రైట్ సెక్టార్ జారీ చేసిన హెచ్చరిక చాలు దీనిని అర్ధం చేసుకోవడానికి. ఉక్రెయిన్ లో అజోవ్ లాంటి బడా ధనిక కుటుంబాలే సాయుధ మూకలను పోషిస్తున్నాయి. నేపర్ బెటాలియన్ తదితర దళాలు కూడా ఆ కోవలోనిదే. ఇవి ఉక్రెయిన్ బధ్రతకు సవాలుగా పరిణమించాయి” అని లావరోవ్ వివరించారు.
కీవ్ బలగాలు అనేక తప్పుడు వార్తలని ప్రచారం చేస్తున్నాయని ఐరోపా భద్రతా సంస్ధ ఓ.ఎస్.సి.ఇ కి కావాలనుకుంటే సరైన సమాచారం తాము ఇవ్వగలమని లావరోవ్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దును నియంత్రించడానికి OSCE స్వయంగా డ్రోన్ లు పంపినా తమకు సమ్మతమేనని లావరోవ్ చెప్పడం గమనార్హం. రష్యన్ మిలట్రీ వాహనాలను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ చేసిన ప్రకటన నిజం కాదని ఆయన తెలిపారు.
“నిజం జరిగింది ఏమిటంటే, ఉక్రెయిన్ బలగాలే లుగాన్స్క్ ప్రాంతంలోకి చొరబడ్డాయి. రష్యా నుండి వచ్చే మానవతా సాయ ట్రక్కులను అడ్డుకోవడానికి ఆ బలగాలను ఉద్దేశించారు. స్ధానిక తిరుగుబాటు మిలీషియా ఆ బలగాలను ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ సైన్యం అలాంటి సంఘటనలను అద్వితీయమైన విజయ గాధలుగా చెప్పుకోదలిస్తే… దయ చేసి మా పైన మాత్రం ఆరోపణలు చేయకండి” అని లావరోవ్ వివరించారు. లావరోవ్ ఇంత చక్కగా వివరించినప్పటికీ పశ్చిమ పత్రికలు అదేమీ తమ వార్తల్లో రాయలేదు.
“ఐరోపా, అమెరికా లలోని మా పశ్చిమ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. తూర్పు ఉక్రెయిన్ లోని పారా మిలట్రీ యూనిట్ లను నిజంగా అదుపు చేయగలిగేది వారే. ఆ బలగాలు కీవ్ లోని కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీగా లేవు. పశ్చిమ దేశాలే వారిని నియంత్రిస్తున్నాయని మాకు తెలుసు” అని లావరోవ్ విషయాన్ని తేటతెల్లం చేశారు.
రైట్ సెక్టార్ తీవ్రవాద సంస్ధ గతవారం ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసింది. తాము చెప్పిన పోలీసు అధికారులను వెంటనే విధులనుండి తప్పించాలని లేదంటే తమ సైనికులు తూర్పు ఉక్రెయిన్ నుండి వెనక్కి వచ్చి కీవ్ పైకి దండెత్తుతామని రైట్ సెక్టార్ హెచ్చరించింది. నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో ని ఉద్దేశిస్తూ ఈ హెచ్చరిక చేసింది. తమ సంస్ధకు చెందినవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ హెచ్చరిక ద్వారా తూర్పు ఉక్రెయిన్ ప్రజలపై ఫైటర్ జెట్ లతో వైమానిక దాడులు చేస్తున్నది ఎవరో స్పష్టం అయింది.