సివిల్ పోలీసులకు మిలట్రీ ఆయుధాలను సరఫరా చేస్తే ఏమవుతుందో అమెరికాలో అదే జరుగుతోంది. రెండున్నర సంవత్సరాల క్రితం ట్రేవాన్ మార్టిన్ అనే 17 సం.ల నీగ్రో యువకుడిని ఒట్టి పుణ్యానికి కాల్చి చంపిన ఉదంతం మరువక ముందే మరో నీగ్రో యువకుడిని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. ఈసారి కూడా తెల్లజాతి పోలీసే హత్యకు పాల్పడ్డాడు. రోడ్డు మధ్యలో కాకుండా పక్కన నడవాలని ఆదేశించిన పోలీసుల ఆజ్ఞను త్వరగా అమలు చేయకపోవడమే ఆ యువకుడు చేసిన నేరం.
తుపాకి ఎక్కుపెట్టిన పోలీసు ముందు చేతులు ఎత్తి మోకరిల్లినప్పటికీ పోలీసు నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశాడని పత్రికలు తెలిపాయి. ఆగస్టు 9 తేదీన జరిగిన ఈ అమానుష కృత్యంకు వ్యతిరేకంగా అమెరికాలోని నగరాలన్నింటా నిరసనలు పెల్లుబుకాయి. తక్షణ పరిశీలనలో నీగ్రో పౌరుడు – తెల్ల పోలీసు వ్యవహారంగా తాజా ఘటన కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి అమెరికన్ పోలీసు వ్యవస్ధను అంతకంతకూ మిలట్రీకరణ చేసిన ఫలితంగానే సంభవించిందని సామాజిక పరిశీలకులు విమర్శిస్తున్నారు.
ఇదే అవగాహనను అమెరికా అటార్నీ జనరల్ చేసిన తాజా వ్యాఖ్యాల్లో ప్రతిబింబించింది. మిలట్రీ వద్ద మిగిలి పోయిన ఆయుధాలను పోలీసులకు సరఫరా చేయడం ద్వారా తప్పు చేశామేమోనని ఆయన భావిస్తున్నారని, ఈ విధానాన్ని పునః సమీక్షించాలని ఆయన యోచిస్తున్నారని వివిధ పత్రికలు తెలిపాయి.
మిస్సోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్ పట్టణంలో మైఖేల్ బ్రౌన్ అనే టీనేజి యువకుడు తన మిత్రుడితో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడు. మిలట్రీ గేర్ లో ఉన్న తెల్ల పోలీసులు వారిని చూసి రోడ్డు పక్కన నడవాలని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞకు స్పందించే లోగానే పోలీసులు అతన్ని లాక్కుని వెళ్ళడం ప్రారంభించారని దానితో బ్రౌన్ పరుగెత్తి పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. అయితే అతని వెంటబడిన ఒక పోలీసు కాల్పులు మొదలు పెట్టడంతో బ్రౌన్ ఆగిపోయి చేతులు ఎత్తి మోకాళ్లపై నిలబడ్డాడని కానీ పోలీసు మాత్రం అమానుషంగా గుళ్ళ వర్షం కురిపించి అతన్ని చంపేశాడని పత్రికలు తెలిపాయి.
బ్రౌన్ ను కాల్చి చంపిన 4 గంటల వరకు నెత్తురు కారుతున్న అతని శవాన్ని పోలీసులు అక్కడే ఉంచారని ఆందోళనకారులు ఆరోపించారు. బ్రౌన్ హత్య వార్త పట్టణంలో వ్యాపించడంతో ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి పోలీసులతో తలపడ్డారు. ఆందోళనకారులు ఆగ్రహంతో లూటీలకు, దహనాలకు పాల్పడ్డారని పత్రికలు తెలిపాయి. అయితే నిరసనకారులను పోలీసులు మొదట యధేచ్ఛగా లూటీలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకుని అనంతరం ఆ వంక చూపుతూ అణచివేత చర్యలను తీవ్రం చేశారని కొన్ని పత్రికలు తెలిపాయి.
హత్య జరిగిన వారం రోజుల వరకు పోలీసులు బ్రౌన్ ను హత్య చేసిన పోలీసు పేరును విడుదల చేయలేదు. నిరసనలు పెల్లుబుకడంతో కాల్పులు జరిపింది డేరెన్ విల్సన్ గా ఆగస్టు 15 తేదీన గుర్తించారు. పోలీసు పేరు గుర్తిస్తూ మైఖేల్ బ్రౌన్ ఒక స్టోర్ లో దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు ఆరోపించారు. మైఖేల్ బ్రౌన్ పై తప్పుడు ప్రచారానికి పోలీసులు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు మరోసారి వీధుల్లోకి వచ్చారు.
ఫెర్గూసన్ పట్టణంలో 70 శాతం నీగ్రో ప్రజలే నివసిస్తున్నప్పటికీ పోలీసుల్లో మాత్రం కేవలం 3 శాతం మందే నీగ్రో అధికారులు ఉన్నారని పత్రికలు తెలిపాయి. అయితే పోలీసుల చర్యను జాతి విద్వేషంగా కంటే పోలీసులు దమననీతి ఫలితంగా మాత్రమే అనేకమంది గుర్తిస్తున్నారు. ప్రదర్శనలో పాల్గొంటున్న నిరసనకారుల్లో సైతం అనేకమంది తెల్లజాతి ప్రజలు పాల్గోనడం బట్టి ఇదే నిజమని తెలుస్తోంది.
నిరసనలు రోజు రోజుకీ పెరిగిపోతూ అనేక చోట్ల హింసాత్మక రూపం దాల్చడంతో పోలీసులు మరింత అణచివేతకు పాల్పడ్డారు. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, రబ్బర్ బులెట్లు విస్తృతంగా ప్రయోగించారు. చివరికి అగ్నిమాపక దళంలోని నీగ్రో అధికారిని ఫెర్గూసన్ పోలీసు విభాగంలోకి అర్జెంటుగా రప్పించి బాధ్యతలు అప్పగించడంతో ఫెర్గూసన్ లో నిరసనలు కాస్త చల్లబడ్డాయి. కొత్త పోలీసు అధికారి ఆధ్వర్యంలో పోలీసులు తమ తుపాకులు, మిలట్రీ తరహా దుస్తులు, గేర్, లాఠీలు పక్కన బెట్టి ఆందోళనకారులతో కలిసిపోయి నచ్చజెప్పడం ద్వారా ఆందోళనలను తగ్గించడంలోనూ నిరసనకారులను శాంతింపజేయడంలోనూ సఫలం అయ్యారని వివిధ పత్రికలు తెలిపాయి.
చేతులు ఎత్తి నడుస్తూ నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం తాజా ఆందోళనల ప్రత్యేకత. మైఖేల్ బ్రౌన్ కాల్పులకు గురికాక ముందు ఏ విధంగా ఉన్నాడో చెప్పడానికి వారు అలా వినూత్న ప్రదర్శనకు దిగారు. వారిని సైతం పోలీసులు తరుముకున్న ఘటనలు అనేక నగరాలు, పట్టణాల్లో చోటు చేసుకున్నాయి.
ఈ కింది ఫోటోలను బోస్టన్ పత్రిక ప్రచురించింది.
Photos: Boston