సిరియా తిరుగుబాటుదారులను పోరాటయోధులుగా కీర్తించిన పశ్చిమ దేశాలు ఇప్పుడు టెర్రరిస్టులు అంటున్నాయి. ఇరాక్ ను దురాక్రమించి ఉండగా అమెరికా విడుదల చేసిన అల్-బఘ్దాది ‘ఇస్లామిక్ స్టేట్’ (ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ను స్ధాపించి సిరియా, ఇరాక్ ప్రాంతాలతో ‘కాలిఫేట్’ ఏర్పాటు చేసినట్లు ప్రకటించాక ‘ఆల్-ఖైదా కంటే తీవ్రమైన ఉగ్రవాది’ అని అమెరికా అంటోంది. ఐరాస భద్రతా సమితి వేదికగా బ్రిటన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పశ్చిమ దేశాలు జబ్బత్ ఆల్-నుస్రా, ఇస్లామిక్ స్టేట్ లను టెర్రరిస్టు సంస్ధలుగా ప్రకటిస్తూ వాటిపై యుద్ధం ప్రకటించాయి.
ఇప్పుడిక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర సామ్రాజ్యవాద పెత్తందారీ దేశాలకు ఆల్-ఖైదా స్ధానంలో సరికొత్త ప్రపంచ శత్రువు ఆవిష్కరించబడ్డాడు.
ఇసిస్/ఇసిల్ (ఇప్పటి ఇస్లామిక్ స్టేట్) ఇరాక్ లో హఠాత్తుగా విరుచుకుబడి ఆయిల్ నగరం మోసుల్ ను ఆక్రమించుకుని, బాగ్దాద్ వైపు పురోగమిస్తోందని పశ్చిమ పత్రికలు హడావుడి ప్రారంభించినప్పుడే “Another new enemy is in the making” అని భౌగోళిక రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. వారి అంచనాలను నిజం చేస్తూ ఐరాస స్టాంపుతో ఇప్పుడు కొత్త శత్రువుపై సామ్రాజ్యవాద దేశాలు యుద్ధం ప్రకటించాయి.
ఇరాక్, సిరియాలో పెచ్చుమీరుతున్న ఉగ్రవాద భయాలకు స్పందిస్తూ అంతర్జాతీయ సమాజం ఐరాస భద్రతా సమితిలో ఒక తీర్మానాన్ని ఆమోదించాయని పత్రికలు నివేదించాయి. విదేశీ (కిరాయి) సైనికులను రిక్రూట్ చేసుకుని, తర్ఫీదు ఇవ్వడానికి ఆర్ధిక వనరులను సమకూర్చుతున్నారని ఆరోపిస్తూ 6 గురు ఉగ్రవాద నాయకులపై ఆంక్షలు విధిస్తున్నామని ఈ తీర్మానం ప్రకటించింది. సిరియాలో తూర్పు, ఉత్తర ప్రాంతాలను ఆక్రమించుకున్న జబ్బత్ ఆల్ నుస్రా, ఇరాక్ లో ఉత్తర పశ్చిమ ప్రాంతాలను ఆక్రమించిన ఇస్లామిక్ స్టేట్ లు రెండూ ఉగ్రవాద సంస్ధలని, వాటికి సహాయం చేస్తున్నవారిపై ఇక నుండి ఇదే విధంగా ఆంక్షలు అమలు చేస్తామని తీర్మానం ద్వారా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ప్రకటించాయి.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు, ఆల్-ఖైదాతో సంబంధం ఉన్న ఇతర టెర్రరిస్టు గ్రూపులన్నీ తమ తమ ఆయుధాలను విసర్జించి, హింసను విడనాడి, తమను తాము పూర్తిగా రద్దు చేసుకోవాలని ఐరాస తీర్మానం డిమాండ్ చేసింది. “ఇస్లామిక్ స్టేట్ గ్రూపు క్రూరమైన, మతిలేని ఉగ్రవాద చర్యలను ఖండించడంలోనూ, వారి హింసాత్మక ఉగ్రవాద సిద్ధాంతాలను తిరస్కరించడం లోనూ అంతర్జాతీయ సమాజం ఐక్యంగా ఉందని, వాటితో తలపడడానికి సిద్ధంగా ఉందనీ ఈ తీర్మానం ద్వారా స్పష్టమైన సందేశం ఇస్తోంది” అని తీర్మానాన్ని ప్రతిపాదించిన బ్రిటిష్ ఐరాస రాయబారి మార్క్ లైయాల్ అట్టహాసంగా ప్రకటించారు.
తీర్మానం ఆంక్షలు విధించిన ఆరుగురు ఇక అంతర్జాతీయ ప్రయాణాల నిషేధాన్ని ఎదుర్కొంటారు. వారి ఆస్తులను స్తంభింపజేస్తారు. అబ్దెల్ రహమాన్ మహమ్మద్ జఫిర్ ఆల్ దాబిది ఆల్ జహాని, హజ్జజ్ బిన్ ఫహ్ద్ ఆల్ అజ్మీ, సయీద్ అరీఫ్, అబ్దుల్ మోహసిన్ అబ్దల్లా ఇబ్రహీం ఆల్ చరేఖ్ లు ఐరాస ఆంక్షలు విధించిన వారిలో ఉన్నారని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) తెలిపింది. ఆల్-నుస్రా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపులు రెండింటికీ ఆర్ధిక సహాయం చేసినందుకు హమద్ హమీద్ అలీ ని బ్లాక్ లిస్ట్ లో ఉంచారని, ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు ఆర్ధిక సహాయం చేసినందుకు అబు మహమ్మద్ ఆల్ అద్నాని ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని ఎపి తెలిపింది.
అమెరికా ట్రెజరీ విభాగం ప్రకారం ఆల్ జహాని సిరియా తిరుగుబాటులో పాల్గొంటున్నాడు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద గ్రూపుల నేతలతో కలిసి పని చేస్తూ భారీ తరహా ఆయుధాలను సంపాదిస్తున్నాడు. వివిధ ఆల్-ఖైదా గ్రూపులకు శిక్షణ సదుపాయాలు కల్పిస్తున్నాడు. ఆల్ అజ్మీ ఆల్-నుస్రా గ్రూపు నాయకత్వ స్ధానంలో కువైటీ నాయకులను నిలిపినందుకు బదులుగా ఆర్ధిక సహాయం అందించేందుకు అంగీకరించాడని అమెరికా ట్రెజరీ ఆరోపించింది.
ఆల్-అద్నాని విషయానికి వస్తే, ఇస్లామిక్ కాలిఫేట్ ఏర్పాటును ప్రకటించిన వీడియోలో ఐ.ఎస్ ప్రతినిధిగా ఆయన కనిపించాడని ఐరాస ప్రతినిధులు చెప్పారు. ఐ.ఎస్ నేత, కాలిఫేట్ అధినేత అయిన ఆల్-బఘ్దాది తలకు అమెరికా 10 మిలియన్ డాలర్ల వెల ప్రకటించింది. అమెరికా, ఐరోపా, ఐరాసలు చెప్పని విషయం ఏమిటంటే ఇరాక్ ని ఖాళీ చేసి వెళ్తూ ఆల్-బఘ్దాదిని ఇరాక్ జైలు నుండి విడుదల చేసింది అమెరికాయే. ఇరాక్ లో సున్నీ, షియా సెక్టేరియన్ విభజనను ఎగదోసి చిచ్చు పెట్టే బాధ్యత అతనికి అప్పగించబడింది.
ఐరాస ఆంక్షలు ప్రకటించిన మరొకరు అరిఫ్. గతంలో అల్జీరియన్ ఆర్మీ అధికారి అయిన అరిఫ్ గత సం.ము ఫ్రాన్స్ లో గృహ నిర్బంధం నుండి తప్పించుకుని సిరియా చేరుకున్నాడని, ఫ్రాన్స్, ఉత్తర ఆఫ్రికాల నుండి విదేశీ టెర్రరిస్టు సైన్యాన్ని రిక్రూట్ చేసుకుని శిక్షణ ఇవ్వడంలో ఆయన కీలక వ్యక్తి అనీ ఫ్రాన్స్ తెలిపింది. సిరియా తిరుగుబాటు సిరియా ప్రజల కోసం జరుగుతోందని, అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ పీడన నుండి సిరియా ప్రజలను విముక్తి చేయడానికి జరుగుతొందని చెబుతూ ఫ్రాన్స్ సిరియా తిరుగుబాటును ఎగదోసింది. తమ గూఢచార మిలట్రీ శిక్షకులను జోర్డాన్, టర్కీలకు పంపి ఆల్-నుస్రా తదితర గ్రూపులకు ఆయుధ శిక్షణ ఇచ్చింది. వారికి ఆర్ధిక సహాయం చేసింది. ఇప్పుడు అదే ఫ్రాన్స్ ఆల్-నుస్రా టెర్రరిస్టు సంస్ధ అని తేల్చేసింది. సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ మొదటి నుండి చెబుతున్నది ఇదే.
ఆల్-చరేఖ్, సౌదీ అరేబియాకు చెందిన ఆల్-ఖైదా గ్రూపు నాయకుడు. ఒసామా బిన్ లాడెన్ కూడా సౌదీ వ్యాపారే అన్న సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఆల్-చరేఖ్ సిరియాలో ఇతర ఆల్-ఖైదా గ్రూపులను నడిపించాడని అమెరికా ఆరోపించింది. కువైట్ కి చెందిన ఆల్-ఆలీ ఆల్-నుస్రా కోసం ఆయుధాలు, ఇతర మిలట్రీ సామాగ్రి కొనుగోలు చేయడం, విదేశీ ఫైటర్లకు ప్రయాణ ఛార్జీలను చెల్లించడం తదితర విధులు నిర్వర్తించాడని ఐరాసలోని పశ్చిమ రాయబారులు ఆరోపించారు.
“సిరియా, ఇరాక్ లలో యుద్ధం చేస్తున్న విదేశీ ఫైటర్ల సంఖ్య, వారి జాతీయతల సంఖ్య మునుపెన్నడూ ఎరగనంత భారీగా ఉంది. ఈ ఘర్షణల్లో కనీసం 12,000 మంది విదేశీయులు పాల్గొన్నారని తెలుస్తోంది. యుద్ధాల్లో ఆరితేరిన ఈ ఫైటర్లు తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళాక హింసను మరింత విస్తరించే ప్రమాదం పొంచి ఉంది” అని ఐరాసలో అమెరికా రాయబారి సమంతా పవర్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎంత హిపోక్రసీ?! సరిగ్గా ఒక సంవత్సరం క్రితం లేదా 6 నెలల క్రితం చూసినా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఐరాస, సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, కతార్, ఇజ్రాయెల్ దేశాధినేతలు, అధికారుల ప్రకటనలు చూస్తే ఇప్పుడు చెబుతున్న మాటలకు సరిగ్గా విరుద్ధంగా కనిపిస్తాయి. అంత వరకూ ఎందుకు గత జూన్ లోనే సిరియా తిరుగుబాటుదారులకు 500 మిలియన్ డాలర్ల సహాయం అందజేయడానికి బారక్ ఒబామా పార్లమెంటును అనుమతి కోరాడు.
సిరియాలో హింసాత్మక చర్యలకు, పేలుళ్లకు, దహనాలకు, సామూహిక హత్యలకు పాల్పడుతున్నది విదేశీ ఉగ్రవాదులే అనీ, సిరియా ప్రజలకు ఇందులో భాగస్వామ్యం లేదని, అది కిరాయి తిరుగుబాటు మాత్రమేనని సిరియా అధ్యక్షుడు, ఇరాన్, హిజ్బోల్లా (లెబనాన్) లు చెవిన ఇల్లు కట్టుకుని చెప్పాయి. వారికి టర్కీ, జోర్డాన్, సౌదీ, కతార్ లలో శిక్షణా శిబిరాలు నెలకొల్పి శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు కూడా తమ గూఢచార మిలట్రీ సిబ్బంది ఈ శిక్షణ శిబిరాలకు వెళ్ళి శిక్షణ ఇచ్చారని స్వయంగా ప్రకటించాయి. మంచి ఉగ్రవాదులకు తాము శిక్షణ ఇస్తున్నామని సిగ్గు లేకుండా సమర్ధించుకున్నాయి. చివరికి రసాయన ఆయుధాల ప్రయోగంలో కూడా శిక్షణ ఇచ్చి, వారి చేత రసాయన ఆయుధాలతో వందల మందిని చంపించి, అది చేసింది సిరియా ప్రభుత్వం అని ఆరోపిస్తూ ఒబామా దాడి చేసేందుకు సైతం సిద్ధపడ్డాడు. ఐరాస నేత బాన్-కి-మూన్ ఏ మాత్రం వెనకబడకుండా పశ్చిమ దేశాల అబద్ధాలకు, దురాక్రమణ ఎత్తులకు మద్దతు ఇస్తూ వచ్చాడు.
ఇప్పుడదంతా తిరగబడింది. సిరియా ప్రభుత్వ వాదనకు తామే బలం చేకూర్చుతూ సిరియాలో తిరుగుబాటుదారులు విదేశీ ఫైటర్లే అని తామే అంగీకరిస్తున్నారు. దీనర్ధం బషర్ ఆల్-అస్సాద్ కు పశ్చిమ దేశాలు ఇక మద్దతు ఇస్తాయని కాదు. ఐరాస తీర్మానం అర్ధం పశ్చిమ దేశాలు కొత్త శత్రువును సృష్టించుకున్నాయని అర్ధం. ఇక నుండి ఆల్-ఖైదా ఉగ్రవాదాన్ని భూతంగా చూపడం క్రమంగా తగ్గించవచ్చు. దాని స్ధానంలో ఇస్లామిక్ స్టేట్ పైన కేంద్రీకరణ పెంచవచ్చు. సిరియా, ఇరాక్ లలో పశ్చిమ దేశాల (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, ఆస్ట్రేలియా మొ.వి) పౌరులు కూడా పోరాడారని ఆ దేశాలు ఇప్పటికే అనేకసార్లు చెప్పాయి. ఐరాస తీర్మానం ద్వారా వీరు తమ స్వదేశాలకు తిరిగి వచ్చి ఉగ్రవాద చర్యలకు పాల్పడవచ్చని ఇప్పుడు బహిరంగంగా, అందరికీ వినబడేట్లు చాటి చెప్పాయి.
ఇదంతా ఎందుకంటే ఇంటా, బయటా సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే. సామ్రాజ్యవాద ప్రయోజనాలు అంటే ఆ దేశాల్లోని బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు. ఈ కంపెనీలు తెచ్చి పెట్టిన ఆర్ధిక సంక్షోభం వల్ల పశ్చిమ దేశాల ప్రజల్లో అసంతృప్తి అధికం అవుతోంది. నిరుద్యోగం పెరిగి దరిద్రం తాండవిస్తోంది. కానీ కంపెనీల లాభాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పొదుపు విధానాల ద్వారా వేతనాలు తగ్గించి, ఉద్యోగాలకు కోతపెట్టి, సంక్షేమ సదుపాయాలు రద్దు చేస్తే అసంతృప్తి ఎందుకు పెరగదు? ఈ సామాజిక సంక్షోభాల వల్ల ఏ చిన్న అలజడి జరిగినా ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పోలీసులపై దాడులకు దిగుతున్నారు. అక్కడక్కడా లూటీలకు పాల్పడుతున్నారు.
ఈ పరిస్ధితుల వల్ల ప్రజలు ప్రభుత్వాలపై వ్యతిరేకత పెంచుకుంటున్నారు. వారి వ్యతిరేకతను, తిరుగుబాటు తత్వాన్ని (radicalization) పక్కదారి పట్టించేందుకు ఎప్పటికప్పుడు కొత్త శత్రువులు కావాలి. ఒకప్పుడు కమ్యూనిస్టు భూతం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఆల్-ఖైదా ను సృష్టించుకున్నారు. దాని నాయకుడు అని చెప్పిన లాడెన్ చనిపోయాడు. (మంచి) ఆల్-ఖైదా గ్రూపులకు తామే శిక్షణ ఇచ్చామని చెప్పుకున్నందున కొత్త గ్రూపు కావాలి. పాత్రధారులు వారే, కానీ పైన అట్టను మార్చారు. కొత్త సీసాలో పాత సారా. ఇది ఇంట సమస్యల కోసం.
బైట ప్రయోజనాలు కూడా సామ్రాజ్యవాద ప్రయోజనాలే. కాకపోతే ప్రత్యర్ధులు దేశ ప్రజలు కాదు, ఇతర దేశాల ప్రజలు. పెట్టుబడి రియలైజేషన్, అధిక ఉత్పత్తి సంక్షోభం, మార్కెట్ల కుదింపు… తదితర సమస్యల పరిష్కారానికి ఇతర దేశాల మార్కెట్లు, వనరులు కావాలి. వాటిని బలవంతంగా లాక్కునేందుకు ఒక సాకు కావాలి. ఆ సాకు ఆయా దేశాల్లోని పాలకులకు కూడా ఉపయోగపడాలి. ఇతర దేశాల్లో ఐ.ఎస్/ఆల్-నుస్రా/ఆల్-ఖైదా తదితర టెర్రరిస్టులు ప్రవేశిస్తే వారిని తుదముట్టించడానికి అమెరికా మిలట్రీయే రావాలి. ఉగ్రవాద నిర్మూలనలో అమెరికాకు అనుభవం, తెలివి ఉన్నందున వారి సేవలు బాగా ఉపయోగపడతాయని ఇతర దేశాల ప్రజలు కూడా భావిస్తారు. అందువల్ల తమ ప్రభుత్వాలు అమెరికాను ఆహ్వానిస్తే వారు సహకరించే వాతావరణం ఉండాలి.
ఇండియా కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఆల్-నుస్రా, ఆల్-ఖైదా, ఐ.ఎస్ లకు బదులు ఇండియన్ ముజాహిదీన్, లష్కర్-ఏ-తొయిబా, జైష్-ఏ-మహమ్మద్ తదితర పేర్లు ఇక్కడ వినిపిస్తాయి.
చెవిన ఇల్లు కట్టుకుని చెప్పాయి
సర్, ఇది జాతీయమా? దీనర్ధం ఏమిటి?
ఇండియా కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఆల్-నుస్రా, ఆల్-ఖైదా, ఐ.ఎస్ లకు బదులు ఇండియన్ ముజాహిదీన్, లష్కర్-ఏ-తొయిబా, జైష్-ఏ-మహమ్మద్ తదితర పేర్లు ఇక్కడ వినిపిస్తాయి.
సర్,దీనర్ధమేమిటి? పశ్చిమదేశాలు వారిసామ్రాజ్యవదాన్నివిస్తరిచుకోవడంలో భాగంగా పైన పేర్గొన్న సంస్తలను పెంచిపోసించి,వాడుకొని తీరా అవసరం తీరాక/వికటించి నిర్వీర్యం చేస్తున్నాయి!
అలానేమనదేశంకూడా పైన పెర్కొన్న ఇండియన్ ముజాహిదీన్, లష్కర్-ఏ-తొయిబా, జైష్-ఏ-మహమ్మద్ తదితర సంస్థలను పెంచిపోసించాయా? తీరా అవసరంతీరాయని వాటిని వ్యతిరేకిస్థున్నాయా?
రెండింటిని ఒకేగాటానికికట్టడం ఎంతవరకు సమర్ధనీయం??
సమర్ధనీయమే, భేషుగ్గా. భింద్రన్ వాలే ను పెంచి అవసరం తీరాకా చంపేయ్య లేదా? ముంబై దాడులకు రెక్కీ నిర్వహించింది సి.ఐ.ఏ గూఢచారి హేడ్లీయే కదా. ఐనా హేడ్లీని అప్పగించాలని ఇండియా ఎందుకు అడగలేదు?
హైద్రాబాద్ లో మసీదు పై దాడి చేసి ఆ నేరాన్ని ముస్లిం టెర్రరిజం పైకి నెట్టారు. తీరా దర్యాప్తులో హిందూ సంస్ధలు దానికి కారణం అని తేలింది. ఈ లోపు ముస్లిం యువకులపైన ఉగ్రవాద ముద్ర పడిపోయింది. వారిని పోలీసులు ఇప్పటికీ వదలడం లేదు.
పార్లమెంటు పై దాడి కేసులో ఉరి తీసిన అఫ్జల్ గురు కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని సుప్రీం కోర్టే చెప్పింది. ఐనా దేశ ప్రజల అంతరాత్మ శాంతించాలని చెప్పి ఉరి తీశారు. అఫ్జల్ గురు తెలియకుండా కేసులో ఇరుక్కునేలా పధకం వేసింది కాశ్మీర్ లోని సైన్యమే అని అరుంధతి రాయ్ లాంటి వారు సాక్ష్యాలతో నిరూపించారు.
ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందూ వివిధ చోట్ల స్వల్ప స్ధాయి పేలుళ్లు జరిగాయి. ఇవి ఒక పార్టీకి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని పోగు చేయడానికే జరిగాయని కొందరి వాదన. ఇందుకు ప్రస్తుతం సాక్ష్యాలు లేవు. భవిష్యత్తులో వెల్లడి కావచ్చు.
గోధ్రా రైలు దహనం ప్రమాదం అని అప్పటి రైల్వే శాఖ నియమించిన కమిటీ తేల్చింది. ఐనా ముస్లింలను అరెస్టు చేసి జైళ్ళలో కుక్కారు. వారింకా అక్కడే మగ్గుతున్నారు.
ఉగ్రవాదం ప్రజల్లో నుండి వస్తే దానిని అణచివేయడానికి పాలకులకు ఎంతో సేపు పట్టదు. పాలకుల మధ్య తగాదాలు పరిష్కరించుకోవడానికీ, వారి రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పుడితే గనక అది ఎన్నాళ్లైనా సజీవంగా ఉంటుంది. అదే అసలు తమాషా.