బులెట్ ప్రూఫ్ అద్దాలు లేకుండా ఎర్రకోటపై నిలబడి మొదటిసారి దేశ ప్రజలకు స్వాంతంత్ర్య సందేశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడి విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలికారు. ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఇండియా రావాలనీ పిలుపు ఇచ్చారు. ఇక్కడ సరుకులు ఉత్పత్తి చేసి ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆశ చూపారు. విదేశీ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తానని ఎర్రకోట బురుజులపై నిలబడి చాటింపు వేశారు.
ఇప్పుడు ఏ సరుకు చూసినా ‘మేడ్ ఇన్ చైనా’ స్టిక్కర్ ను ప్రదర్శించేవే. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కొరియా, జపాన్… ఇలా ఏ దేశ బహుళజాతి కంపెనీ చూసినా చైనాలో పరిశ్రమలు పెట్టినవే. చైనాలో కోట్లాది సంఖ్యలో అందుబాటులో ఉన్న మానవ వనరుల శ్రమ శక్తిని అత్యంత చౌక వేతనాలకు అప్పగించడం వల్ల పశ్చిమ బహుళజాతి కంపెనీలకు ఖర్చు తగ్గి, లాభాలు పెరగడమే కాకుండా చౌక ధరలకు తమ సరుకులను అమ్ముకునే అవకాశం వచ్చింది.
ఎన్ని కంపెనీలను ఆహ్వానించినా చైనా తన సార్వభౌమ నియంత్రణను మాత్రం వదులుకోలేదు. గూగుల్ లాంటి కంపెనీలు చైనా నియంత్రణను ధిక్కరించాలని ప్రయత్నించినా అక్కడి ప్రభుత్వం కళ్ళెం వేసింది. ‘మా నిబంధనలకు లోబడి వ్యాపారం చేసుకుంటే చేసుకో, లేదా నిరభ్యంతరంగా దేశం విడిచి వెళ్లిపో’ అని స్పష్టం చేసింది. అప్పటి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వం కూడా గూగుల్ కు మద్దతుగా వచ్చినప్పటికీ చైనా లెక్క చేయలేదు.
ఫలితంగా గూగుల్ కిక్కురుమనకుండా చైనా నిబంధనలు పాటించింది. పోర్నోగ్రఫీ వెబ్ సైట్లను గూగుల్ సర్చ్ లో అనుమతించకపోవడం, తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాజకీయ భావాలు వ్యక్తం చేసే వెబ్ సైట్లను అడ్డుకోవడం… ఇత్యాది అంశాలు గూగుల్ కు అభ్యంతరం తెలిపింది. కానీ చైనాలో వ్యాపారాన్ని వదులుకోలేక నియంత్రణలకు లోబడిపోయింది.
కానీ భారత పాలకులకు అటువంటి జాతీయ చైతన్యం, దేశభక్తియుత భావోద్వేగాలు ప్రదర్శించిన చరిత్ర లేదు. దేశ వనరులను అప్పనంగా విదేశీ కంపెనీలకు అప్పగించిన చరిత్రే గానీ దేశ ప్రజలకు వినియోగపెట్టిన చరిత్ర లేదు. చివరికి ప్రభుత్వ రంగాన్ని పోషించినా దానిని ప్రధానంగా ప్రైవేటు పెట్టుబడిదారుల ఆర్ధిక శక్తిని పెంచడానికే వినియోగపెట్టారు.
యు.పి.ఏ దేశాన్ని ఘోరంగా పాలించిందని చెబుతూ అధికారంలోకి వచ్చిన మోడి ప్రభుత్వం అదే విధానాలను కొనసాగిస్తూ విదేశీ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నారు. విదేశీ కంపెనీలు వస్తే పెట్టుబడి వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని, పోటీ పెరిగి చౌక ధరలకు సరుకులు వస్తాయని గత ప్రభుత్వాలు చెప్పగా, ఇప్పటి ప్రభుత్వం వాటన్నింటినీ పక్కనబెట్టి మీరు తయారు చేసిన సరుకులు ఎక్కడైనా అమ్ముకోండి అంటోంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ‘మేడ్ ఇన్ ఇండియా’ సరుకులే కనపడాలని ప్రధాని కోరుతున్నారు.
ప్రధాని కోరిక సాకారం అయ్యేమాట ఎలా ఉన్నా, అందుకు తగిన శక్తి యుక్తులు పాలక వ్యవస్ధకు ఉన్నాయా అన్నది అసలు సమస్య. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు ‘మేడ్ ఇన్ ఇండియా’ కలను సాకారం చెయ్యాలంటే మొదట మన పాలకులకు సామ్రాజ్యవాద పెత్తనాన్ని తిరస్కరించి ఎదిరించే దమ్ము, ధైర్యం, నిబద్ధత, చైతన్యం ఉండి తీరాలి. ఇవన్నీ భారత పాలకులకు లేని లక్షణాలే ఇన్నేళ్ల వారి చరిత్ర నిరూపించింది.
సర్,మేడ్ ఇన్ చైనా స్లోగాన్ సూచించేది-చైనా వాపునా?బలుపును కాదా? శ్రమదోపిడీకి నిదర్శనమా?
మేడ్ ఇన్ ఇండియా స్లోగాన్ నినాదం ద్వారా మోడీ ఇక్కడి శ్రమను అప్పనంగా బహులజాతికంపనీలకు అప్పగించడానికి తలుపులు తెరుస్తున్నారా?
దీనికి ప్రధానకారణం మనకంటూ సొంతజాతీయవిధానంలేకపోవడమేనా?
వాపు, బలుపు రెండూను. పెట్టుబడిదారీ అభివృద్ధి స్వల్పకాలికంగా బలుపు,
దీర్ఘకాలికంగా వాపు. పెట్టుబడిదారీ విధానం అంటేనే శ్రమ దోపిడీ.
అవును. తలుపులు తెరవడం ఇది కొత్త కాదు. పి.వి.నరసింహరావు తోనే మొదలైంది. యు.పి.ఏ ఒక వంక ప్రజాకర్షక పధకాలు ఎరగా వేస్తూ మరోవంక తలుపులు తెరుస్తూ వచ్చింది. ప్రజాకర్షక విధానాలు మతిలేని పాపులిస్టు విధానాలుగా ఎన్.డి.ఏ చెబుతోంది. అనగా యు.పి.ఏ చేసిన నటన కూడా తాము చేయబోమని చెప్పడం.