తమ దేశంలో గూఢచర్యం చేసినందుకు అమెరికాపై కారాలు మిరియాలు నూరుతున్న జర్మనీ అమెరికా పైన తానూ అదే నిర్వాకానికి పాల్పడింది. ఈ సంగతి జర్మనీ పత్రిక డెర్ స్పీజెల్ బైట పెట్టింది. అయితే అది పొరబాటున జరిగిందని అది కూడా ఒక్కసారే జరిగిందని ఆ పత్రిక చెబుతోంది.
ఒబామా మొదటి అధ్యక్షరికంలో విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) గా హిల్లరీ క్లింటన్ పని చేయగా రెండో విడత అధ్యక్షరికంలో జాన్ కెర్రీ పని చేస్తున్నారు. వీరిద్దరి ఫోన్ లను ఒక్కొక్కసారి చొప్పున జర్మనీ విదేశీ గూఢచార సంస్ధ బి.ఎన్.డి ట్యాప్ చేసిందిట.
అమెరికా తరపున గూఢచర్యం చేసినందుకు గాను తమ అధికారులు ఇద్దరినీ జర్మనీ కొద్ది రోజుల క్రితమే అరెస్టు చేసింది. అదే ఊపుతో సి.ఐ.ఏ గూఢచారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే జర్మనీలో విదేశీ రాయబార కార్యాలయాలలో పని చేస్తున్న గూఢచారుల పేర్లు ఇవ్వాలని ఎంబసీలకు, కాన్సలేట్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంగతి కూడా డెర్ స్పీజెల్ పత్రికే వెల్లడి చేయడం గమనార్హం.
ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడి చేసిన ఎన్.ఎస్.ఏ పత్రాల ద్వారా అమెరికా గూఢచర్యం గురించి తెలిసినప్పటి నుండి జర్మనీ-అమెరికా సంబంధాలు కాస్త ఉద్రిక్తంగా మారాయని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ ఉద్రిక్త సంబంధాలు ఇ.యు-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడానికి ఏమీ ఆటంకం కాలేదు.
ఒప్పందం కుదిరిన తర్వాత ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఉద్రిక్తతను పెంచుతూ పోయారు. ఎన్నికల్లో ఆమె మూడోసారి ఛాన్సలర్ గా గెలిచి పదవి నిలుపుకున్నారు. ఇప్పుడు ఏమి అవసరం వచ్చిందో ఇంకా తెలియలేదు గానీ ఉద్రిక్త సంబంధాలు మళ్ళీ తెరమీదికి వచ్చాయి.
పత్రిక ప్రకారం హిల్లరీ క్లింటన్ మాజీ ఐరాస అధిపతి కోఫీ అన్నన్ కు చేసిన ఫోన్ కాల్ ను 2012 లో ఒకసారి బి.ఎన్.డి రికార్డు చేసింది. అప్పటికి కోఫీ అన్నన్ సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి ఐరాస ప్రతినిధిగా అంతర్జాతీయ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. 2013 లో మరోసారి కెర్రీ కాల్ ను రికార్డ్ చేసింది. ఈ రెండూ పొరబాటున జరిగాయని పత్రిక చెబుతోంది.
క్లింటన్ ఫోన్ ను బి.ఎన్.డి ట్యాప్ చేసిన సమాచారాన్ని అమెరికాకు చేరవేసింది జర్మనీ అధికారే. బి.ఎన్.డి లో పని చేస్తున్న సదరు అధికారి అమెరికా తరపున జర్మనీ గూఢచార సంస్ధలో పని చేస్తుండడం విశేషం. ఒకపక్క అమెరికా ఫోన్ ట్యాపింగ్ గురించి జర్మనీ ప్రశ్నిస్తుంటే, జర్మనీ గూఢచర్యం గురించి ప్రత్యర్ధికి సమాచారం ఇవ్వడం జర్మనీ ఛాన్సలర్ కు సహజంగానే కోపం తెప్పించింది. ఆ కోపాన్ని విదేశీ ఎంబసీలన్నింటిపైనా చూపినట్లు కనిపిస్తోంది.
బి.ఎన్.డి లో పని చేస్తున్న జర్మనీ అధికారి తాను అమెరికా గూఢచారులకు 218 రహస్య పత్రాలు అమ్మానని అంగీకరించాడు. జులైలో ఆయనను అరెస్టు చేసిన తర్వాత, జర్మనీ రక్షణ శాఖకు విధాన సలహాదారుగా పని చేస్తున్న అధికారి సాగిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జర్మనీకి చెందిన కీలక సమాచారాన్ని ఆయన అమెరికాకు అందిస్తున్నట్లు తెలిసింది.
దానితో అగ్గి మీద గుగ్గిలం అయిన జర్మనీ సి.ఐ.ఏ అధికారిని దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశించింది. ఇంకా ఎవరెవరు విదేశీ గూఢచారులు ఎంబసీల్లో ఉన్నది పేర్లు ఇవ్వాలని విదేశాలన్నింటిని కోరింది.
టర్కీ పైన కూడా బి.ఎన్.డి అనేక యేళ్లుగా నిఘా పెట్టిన సంగతిని డెర్ స్పీజెల్ తెలిపింది. ఈ నిఘా ఇప్పటికీ కొనసాగుతున్నదని తెలిపింది. ఇ.యు లో చేరేందుకు టర్కీ దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తుపై దశాబ్దాల తరబడి చర్చలు సాగుతున్నాయే గాని అవి పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రారంభంలో గ్రీసు, సైప్రస్ లు టర్కీ చేరికకు అభ్యంతరం చెప్పగా ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్ తీవ్ర అభ్యంతరం ప్రకటిస్తోంది. ఈ నేపధ్యంలోనే టర్కీ పై జర్మనీ గూఢచర్యంను అర్ధం చేసుకోవాల్సి ఉంది.