భీమా బిల్లు: అక్కరకు రాని మోడి మెజారిటీ -కార్టూన్


Reforms 2.0

స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలతో, వ్యాపార వర్గాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తామని మోడి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సదరు హామీని మొదటి అడుగులోనే హుళక్కి చేయడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సఫలం అయింది.

పాతికేళ్లలో మొదటిసారిగా పూర్తి మెజారిటీ సంపాదించినా అది ఎన్నికల హామీలకు అక్కరకు రాకుండా పోయింది. పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండింటికీ ఉపయోగపడే జ్యుడీషియల్ కమిషన్ బిల్లును రెండు సభల్లో ఆమోదింపజేసుకున్నప్పటికీ భీమా ఎఫ్.డి.ఐ పరిమితి పెంపు బిల్లును మాత్రం గట్టెక్కించలేకపోయింది.

నిజానికి భీమా ఎఫ్.డి.ఐ బిల్లు యు.పి.ఏ తయారు చేసిందే. యు.పి.ఏ హయాంలో బిల్లును ఆమోదించడానికి బి.జె.పి నిరాకరించింది. ఇప్పుడూ అదే నాటకం, కానీ పాత్రధారులు తారుమారయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన బిల్లునే అధికార పక్షంలో ఉండగా ప్రతిపాదించడానికి బి.జె.పికి అభ్యంతరం లేదు. అధికారంలో ఉండగా ప్రతిపాదించిన బిల్లు ఆమోదానికి ప్రతిపక్షంలోకి వచ్చాక సహకరించకపోవడానికి కాంగ్రెస్ కు ఇబ్బంది లేదు.

బిల్లుకు ఎన్.డి.ఏ చేర్చిన సవరణలను పూర్తి స్ధాయిలో పరిశీలించడానికి బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ ను వదిలేసి ఇతర యు.పి.ఏ పక్షాలను ఆకర్శించేందుకు బి.జె.పి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి మిత్రపక్షం కాకపోయినా వ్యతిరేక పక్షం మాత్రం కానీ ఏ.ఐ.ఏ.డి.ఏం.కె సైతం మద్దతుకు నిరాకరించడంతో బిల్లు ఆగిపోయింది.

రాజ్య సభలో బి.జె.పి కి మెజారిటీ లేకపోవడమే దీనంతటికి కారణం. ఈ సందర్భంగా బి.జె.పి చేసిన ఆరోపణ ఆసక్తి కరంగా ఉంది. వచ్చే సెప్టెంబర్ లో మోడి అమెరికా సందర్శించనున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడి భీమా బిల్లును ఆమోదింపజేశారన్న క్రెడిట్ తో అమెరికా వెళ్లకుండా నిరోధించడానికే కాంగ్రెస్ తన బిల్లుకు తానే అభ్యంతరం చెప్పిందని ఆర్ధిక మంత్రి జైట్లీ ఆరోపించారు.

ఈ ఆరోపణ అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 26% నుండి 49% శాతంకు పెంచే బిల్లును ఆమోదిస్తే అమెరికా సంతోషిస్తుందని అరుణ్ జైట్లీ తన ఆరోపణలో వెల్లడి చేశారు. భీమా రంగానికి పెట్టుబడులు కరువయ్యాయని అందుకే విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నామనీ కాంగ్రెస్, బి.జె.పి లు చెప్పిన కారణం ఒట్టిదే అని దీనితో స్పష్టం అయింది.

భీమా రంగమే ద్రవ్య పెట్టుబడుల సేకరణ రంగం. భీమా పాలసీల అమ్మకం ద్వారా పెట్టుబడిని సేకరించే రంగానికి పెట్టుబడులు లేవని చెప్పడమే పెద్ద అసత్య, మోసపూరిత ప్రేలాపన! ప్రభుత్వ భీమా కంపెనీలు, ముఖ్యంగా జీవిత భీమా సంస్ధ క్లయిమ్ ల పరిష్కారంలో ప్రపంచంలోనే మొదటి స్ధానంలో ఉంది. అత్యంత సమర్ధవంతమైన జీవిత భీమా కంపెనీగా, భారత దేశంలో అత్యంత పేరు పొందిన బ్రాండ్ గా ఎల్.ఐ.సి కి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి రంగంలో విదేశీ పెట్టుబడుల అవసరం లేనే లేదు.

భీమారంగంలో ప్రత్యేకంగా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అంటూ పెద్దగా లేదు. భారత ప్రభుత్వ భీమా రంగం ఇప్పటికే పెద్ద ఎత్తున సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. (తద్వారా భారీ సంఖ్యలో రిక్రూట్ మెంట్ కు మంగళం పలికింది.) పోనీ విదేశీ కంపెనీలు సరికొత్త తెలివితేటలను ఏమన్నా పట్టుకొస్తాయా అంటే అదేమీ లేదు. అమెరికా, ఐరోపాల్లో దివాళా తీసి, పాలదీదారుల క్లయిమ్ లు ఎగ్గొట్టి, భారీ నష్టాలను చూపిన కంపెనీలు ఇండియాలో చోటు కోసం తహతహలాడుతున్నాయి. భారత ప్రజల పొదుపు సొమ్మును దోచుకుని తమ నష్టాలను పూడ్చుకోవడానికి, సంక్షోభం నుండి బైటికి రావడానికి ఎదురు చూస్తున్నాయి.

ఈ కారణంతోనే పశ్చిమ దేశాలు, ఐ.ఏం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు భీమా రంగాన్ని ఇంకా ఇంకా ప్రైవేటీకరించి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ నెరవేర్చడం ద్వారా అమెరికాకు వెళ్తూ ఒక బహుమతిని తీసుకెళ్లాలని ప్రధాని భావించారని, ఆ క్రెడిట్ ను ప్రధానికి దక్కకుండా చేయడానికే కాంగ్రెస్ బిల్లును ఆటంకపరిచిందని జైట్లీ పరోక్షంగా వెల్లడి చేశారు.

భీమా ఎఫ్.డి.ఐ పరిమితి పెంపు పశ్చిమ బహుళజాతి కంపెనీలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కోరిక. ఈ కోరిక నెరవేర్చితే విదేశీ MNCలకు పెద్ద బొనాంజా బహూకరించినట్లే.

బిల్లును రాజ్య సభ సెలెక్ట్ కమిటీకి అప్పగించింది. సెలెక్ట్ కమిటీలో రాజ్య సభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలన్నీ సభ్యులను కలిగి ఉంటాయి. పార్టీల బలాబలాల నిష్పత్తిలో తమ సభ్యుల సంఖ్యను కలిగి ఉంటాయి. కాబట్టి కమిటీలో సైతం బి.జె.పి కి మెజారిటీ ఉండదు. సెలెక్ట్ కమిటీ సూచించే సవరణలను ప్రభుత్వం తప్పనిసరిగా బిల్లులో చేర్చవలసి ఉంటుంది. ఆ విధంగా జైట్లీ చెప్పిన కాంగ్రెస్ పంతం నెగ్గుతుంది. బిల్లు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు (వచ్చే సమావేశాల్లో) ఆమోదం పొందుతుంది.

భీమా ఎఫ్.డి.ఐ బిల్లు ద్వారా పాలక, ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా దేశ ప్రజలకు నష్టం కలిగించనున్నాయి. ప్రజల సొమ్ము విదేశీ కంపెనీల పరం కావడంతో పాటు ప్రభుత్వ భీమా కంపెనీలు ప్రభుత్వాలకు సమకూర్చుతున్న నిధులు అందకుండా పోతాయి. క్లయిమ్ లు ఎగవేయడంలో పేరెన్నిక గన్న కంపెనీలకు భారతీయుల సొమ్మును అప్పజెప్పడం ద్వారా వారి భవిష్యత్తును మరింత చీకటిమయం  చేయడమే బి.జె.పి చెప్పిన ‘అచ్ఛే దిన్ ఆనే వాలా హై’ నినాదానికి అసలు అర్ధం.

భీమా బిల్లు కోసం కాంగ్రెస్ పైన ఆశలు పెట్టుకున్న బి.జె.పి, ఆ పార్టీ నిరాకరణతో ఇతర పక్షాలను ఆకర్శించేందుకు ప్రయత్నించి విఫలం అయింది. ఆ విషయాన్నే పై కార్టూన్ సూచిస్తోంది. మోడీ హామీ ఇచ్చిన సంస్కరణల మలివిడత ఊపుకు ఆరంభంలోనే లంగరు పడిందని సూచిస్తోంది. కానీ ఇది తాత్కాలికమే. 

6 thoughts on “భీమా బిల్లు: అక్కరకు రాని మోడి మెజారిటీ -కార్టూన్

 1. మీకొక ప్రశ్న. ఇంతకు మునుపు బాంకింగ్ రంగంలో ప్రైవేట్ సెక్టర్ వాళ్లు వచ్చినపుడు కూడా మన ప్రభుత్వ రంగం బాంకులకు నష్టం అనే భావన ఉండేది. కాని ప్రైవేట్ సెక్టర్ బాంక్ ల కన్నా ప్రజలు పబ్లిక్ సెక్టర్ బాంకుల వైపుకు మొగ్గు చూపుతున్నారని ఫలితాలు నిరూపించాయి. భీమా రంగంలో ఇందుకు భినం గా ఉండే అవకాశాలు ఎలా ఉంటాయో అంటే విదేశి భీమా వైపు భారత ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతారో చెప్పగలరా?

 2. వైద్యం రంగంలో ఇప్పుడున్న ప్రైవేట్ ఇన్సురెన్స్ కంపెనీలే చెల్లింపుల సమయంలో ప్రజలను విసిగిస్తున్నాయని,చాలా మందికి వాటిపై మంచి అభిప్రాయం లేదు.ఇటువంటి పరిస్థితిలో కొత్త ఇన్సురెన్స్ కంపెనీలు ఎలా పాగా వేయగలవు? ఉద్యోగస్తులు, ప్రైవేట్ కంపెనిలలో పనిచేసే వారికి మాత్రం సేవలు బాగా అందిస్తాయి. వ్యక్తిగతం గా పాలసి తీసుకొన్నవారిని ప్రశ్నలతో విసిగిస్తాయి. ఈ సబ్జెక్ట్ పై నాకు ఏమాత్రం అవగాహన లేదు. మీరు జవాబిచ్చే ముందు దానిని పరిగణలోకి తీసుకొని సమాధానం చెప్పండి.

 3. after following your blog iam unable to sleep properly. iam terrifying about the future of INDIA. who has to save this. we elected MODIji with full majority at least he should think the welfare of Indian economy and Indian public

 4. @moola & SriRam

  పాలసీ అనేది పాలసీ కొనుగోలుదారుడికి, ఎల్.ఐ.సి కి మధ్య ఒక కాంట్రాక్టు. కిస్తీ (ప్రీమియం) రూపంలో సంవత్సరానికి ఇంత (నెలవారి, త్రైమాసికం, అర్ధ సంవత్సరం గా కూడా విభజించి కట్టుకోవచ్చు) అని పాలసీ దారుడు చెల్లిస్తే అతనికి ఏమన్నా ప్రమాదం జరిగి చనిపోయినప్పుడు భీమా చేసిన మొత్తాన్ని అతని కుటుంబానికి చెల్లించాలని ఇద్దరు కాంట్రాక్టు కుదుర్చుకుంటారు. పాలసీ కాలపరిమితి, ఇన్సూరెన్స్ మొత్తం, కిస్తీ పీరియడ్ (Mly, Qly, Hly or Yrly) లాంటివి పాలసీదారుడు ఎంచుకుంటాడు. ఆ మొత్తానికి ప్రీమియం ఎంత చెల్లించాలో ఎల్.ఐ.సి నిర్ణయిస్తుంది.

  ఇప్పుడు ఈ పాలసీ క్లయిమ్ కు వచ్చింది అంటే పాలసీదారుడు చనిపోయి ఉండవచ్చు, లేదా కాల పరిమితి ముగిసి ఉండవచ్చు. చనిపోతే డెత్ క్లయిమ్ అంటారు. బతికే ఉండి పాలసీ కాలపరిమితి ముగిస్తే మెచ్యూరిటీ క్లయిమ్ అంటారు. క్లయిమ్ ల పరిష్కారం అంటే హామీ ఇచ్చిన మొత్తాన్ని బోనస్ తో కలుపుకుని చెల్లించడం.

  సాధారణంగా ప్రైవేటు కంపెనీలు డెత్ క్లయిమ్ ల విషయంలో అనేక కొర్రీలు పెట్టి ఎగవేస్తాయి. ఒకవేళ ఏదన్నా జబ్బు చేసి చనిపోతే జబ్బు ఉన్న సంగతి తమకు ముందే చెప్పలేదు అంటాయి. లేదా బాగా తిప్పుకుని చెల్లించాల్సిన సొమ్ముతో కొత్త పాలసీలు కట్టేలా ఒత్తిడి చేస్తాయి. రికార్డ్ లు లేవు అంటాయి. కృత్రిమ నష్టాలు చూపి హామీ ఇచ్చిన మొత్తం కంటే తగ్గించి చెల్లిస్తాయి. ఇలా ఎగవేయడంలో పశ్చిమ కంపెనీలు పేరెన్నిక గన్నవి.

  ఎల్.ఐ.సికి ఇలాంటి రికార్డు లేదు. చెల్లింపు తేదీకి మూడు నెలలు ముందే సమాచారం ఇచ్చి అవసరమైన పత్రాలు తెప్పించుకుని గడువు తేదీతో ముందే చెక్కు ఇచ్చేస్తుంది. ఇప్పుడయితే బ్యాంకు ఖాతా తీసుకుని నేరుగా అందులో జమ చేస్తోంది. డెత్ క్లయిమ్ లు వచ్చినపుడు బ్రాంచి మేనేజర్లు చాలా ఉదారంగా ఇన్వెస్టిగేషన్ ముగించి చెల్లింపులు జరిగేలా చూస్తారు.

  జీవిత భీమా పాలసీ అనేది దీర్ఘకాలిక స్వభావం కలిగినది. కనీసం 5 సం.ల నుండి 35 సం.ల కాలం వరకు పాలసీదారుల సొమ్ము భద్రంగా ఉంచి చెల్లించాలి. ఈ రోజు పాలసీ ప్రారంభించి రెండు రోజుల తర్వాత ప్రమాదం జరిగి చనిపోయినా భీమా మొత్తాన్ని చెల్లించాలి. భీమా కంపెనీలు పాలసీదారుల సొమ్మును ఇతర చోట్ల పెట్టుబడిగా పెట్టి లాభాలు సంపాదించి ఆ లాభాలని బోనస్ రూపంలో చెల్లించాలి. కట్టిన డబ్బును భద్రంగా ఉంచడం, దానిని సరైన చోట పెట్టుబడి పెట్టడం జరిగాలి.

  విదేశీ ప్రైవేటు కంపెనీలు ఏం చేస్తాయంటే వసూలు చేసిన సొమ్మును ప్రపంచం అంతా తిప్పుతాయి. షేర్ మార్కెట్లలో పందేలు కాస్తాయి. తమ సొంత కంపెనీలకు పెట్టుబడులుగా తరలిస్తాయి. మన ప్రభుత్వ కంపెనీ అయితే పాలసీదారులకు చెల్లింపులు పోను మిగిలిన డబ్బును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాయి. ప్రభుత్వ ఆర్ధిక శక్తికి ఆసరా ఇస్తాయి. స్ధానిక సంస్ధలకు (మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లు) డబ్బు ఇచ్చిన ఉదాహరణలో చాలా ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలకు మన జనం సొమ్ము అప్పజెపితే ఇవేవీ జరగవు కదా.

  జనం ఎందుకు మొగ్గు చూపుతారు అన్నది కాదు సమస్య. మన డబ్బు మన దగ్గర ఉంటే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. దేశ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. విదేశీ కంపెనీకి ఇస్తే వాడి ఇష్టం వచ్చినది చేసుకుంటాడు. డబ్బు వసూలు చేసి ఐ.పి పెడితే అడిగే నాధుడు ఉండడు. దేశీయ ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేస్తేనే దిక్కు దివాణం ఉండడం లేదు. నాగార్జున, శారదా లాంటి కంపెనీలు వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేస్తే ప్రభుత్వాలు ఏం చేశాయి? యూనియన్ కార్బైడ్ వాడు భోపాల్ లో 20,000 మందిని చంపినా, వాడిని ప్రత్యేక విమానంలో అమెరికాకు పంపిన ఘనత మన ప్రభుత్వాలది. రేపు భీమా, బ్యాంకుల సంగతీ అంతే.

  బ్యాంకులైనా, భీమా కంపెనీలైనా మన డబ్బు మన ప్రభుత్వానికి ఇవ్వడం సరైనదా లేక విదేశీ కంపెనీలకు ఇవ్వడం మంచిదా? జనం సొమ్ము దేశంలోనే ఉంటే దానితో మన దేశాన్ని నిర్మించుకోవచ్చు. బ్రిటిష్ వాడు వచ్చింది వ్యాపారం కోసమేగా. వాడ్ని ఎందుకు తన్ని తగలేశాం? విదేశీ కంపెనీలను ఆహ్వానించడం విదేశీ పాలకులను ఆహ్వానించడంతో సమానం. కాకపోతే అప్పుడు నేరుగా పాలిస్తే ఇప్పుడు డబ్బుతో పాలిస్తున్నారు.

  పెట్టుబడులు లేవనడం అబద్ధపు ప్రచారం. కోటి కోట్ల సొమ్ము నల్ల డబ్బుగా మారితే దాన్ని వెలికి తీయకుండా విదేశీ దోపిడీదారుల్ని పిలవడం ఏమిటి?

  వాస్తవం ఏమిటంటే మన దేశం, మన ఆర్ధిక వ్యవస్ధ మన చేతుల్లో లేదు. వివిధ ఆర్టికల్స్ లో చెప్పినట్లుగా విదేశీ బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉంది.

  ఎఫ్.డి.ఐ లను ఏ రంగంలో ఆహ్వానించినా అది కేవలం ఆ రంగం సమస్యగా మాత్రమే చూడకూడదు. మనవాళ్లు ఇంకా ప్రభుత్వ బ్యాంకులనే నమ్మితే ప్రైవేటు బ్యాంకులకు లాభాలు ఎలా వస్తున్నాయి? అక్కడ ఎవరు డబ్బు దాస్తున్నారు? జనం 100 రూ.లు బ్యాంకుల్లో దాస్తే అందులో 70 రూ.లు పబ్లిక్ సెక్టార్ లో, 30 రూ.లు విదేశీ, స్వదేశీ ప్రైవేటు బ్యాంకుల్లో దాచారనుకుందాం. ఆ 30 రూ.లు ప్రైవేటు వాడికి ఇచ్చినట్లేగా. అది ప్రభుత్వానికి పూర్తిగా అందుబాటులో ఉండనట్లేగా. జనం నమ్మకం అని కాకుండా అసలు విదేశీ కంపెనీలకు మన సొమ్ములు, మన వనరులు అప్పగించడం ఏమిటని ఆలోచించాలి. దేశానికి ఏది మేలు అని ఆలోచించాలి. ఎటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆలోచిస్తే అది సమస్యను సరైన కోణంలో గుర్తించకపోవడం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s