మూజువాణి: తెలంగాణ మాదిరిగానే జ్యుడీషియల్ బిల్లు కూడా


SC

సుప్రీం కోర్టు, హై కోర్టులకు జడ్జిల నియామకంలో పార్లమెంటుకు కూడా అధికారాలు కట్టబెట్టడానికి ఉద్దేశించిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. 121వ రాజ్యాంగ సవరణ, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ ఏర్పాటు లను అమలులోకి తెచ్చే బిల్లు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందడం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం.

తెలంగాణ బిల్లును ఆనాటి లోక్ సభ, రాజ్య సభలు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందినపుడు అనేకమంది రాజకీయవేత్తలు, ఎ.పి.ఎన్.జి.ఓ లాంటి ఆందోళన సంస్ధలు, ఇంకా అనేకమంది మిత్రులు తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. రాష్ట్రపతి సిఫారసుతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం కోసం వచ్చిన బిల్లును ఉమ్మడి శాసన సభ, శాసన మండలిలు మూజువాణి ఓటుతో తిరస్కరించడాన్ని ఆమోదిస్తూనే లోక్ సభ, రాజ్య సభలు మాత్రం బిల్లును మూజు వాణి ఓటుతో ఆమోదించడం ఏమిటని ప్రశ్నించారు.

ఒక రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చడం లాంటి అతి ముఖ్యమైన చర్యకు దారి తీసే బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించించడం ఏమిటన్నది వారి ప్రశ్న. కానీ, భారత పార్లమెంటు, వివిధ రాష్ట్రాల చట్ట సభలు ఏర్పడిన నాటి నుండి అనేక ముఖ్యమైన బిల్లులు, ఫైనాన్స్ బిల్లులతో సహా అనేకమార్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన సంగతిని వారు విస్మరించారు. రాష్ట్ర విభజన కంటే ముఖ్యమైన ఫైనాన్స్ బిల్లులను సైతం ‘ఆయ్’ అంటూ ఆమోదించిన సందర్భాలను వారు పట్టించుకోలేదు. లేదా ముఖ్యమైన విషయంగా గుర్తించలేదు.

ఇప్పుడు మళ్ళీ అదే లోక్ సభ న్యాయ వ్యవస్ధలోని అత్యున్నత పదవుల నియామకం విషయంలో మొత్తం నియామక వ్యవస్ధను మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించేసింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ద్ధీకరణ బిల్లును ఆమోదించిన తీరుపై అభ్యంతరం చెప్పిన రాజకీయ నాయకులు, పెద్దలు, మిత్రులు అంతే ముఖ్యమైన జ్యుడీషియల్ బిల్లును అదే తీరులో ఆమోదించినా అభ్యంతరం చెప్పకపోవడం, అసలు చర్చకే తీసుకోకపోవడం అత్యంత గర్హనీయం.

ఇన్నాళ్లూ కేవలం సుప్రీం కోర్టు కొలీజియం చేతుల్లో మాత్రమే ఉన్న నియామకాలు ఇప్పుడు రాజకీయ నేతల చేతుల్లోకి కూడా రానున్నది. నియామకాలు చేపట్టే జ్యుడీషియల్ కమిషన్ కు నాయకుడుగా చీఫ్ జస్టిస్ గారే వ్యవహరిస్తారు. ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు జడ్జిలే ఉంటారు. మిగిలిన మరో ముగ్గురిని మాత్రం అంతిమంగా రాజకీయ నేతలే నియమిస్తారు. ఆరంభంలో కమిషన్ లో కోర్టులదే పై చేయిగా ఉండవచ్చు. కానీ పోను పోనూ రాజకీయ నేతల ప్రమేయంతో నియమితులయ్యే జడ్జిల సంఖ్య పెరుగుతూ పోతుంది. కాబట్టి క్రమంగా జడ్జిల నియామకాలు దాదాపు రాజకీయ నేతల చేతుల్లోకి వచ్చేస్తుంది.

రాజ్యాంగ నిర్మాతలు సమాన అధికారాలు ఇచ్చిన మూడు వ్యవస్ధలు ఇక అంతిమ పరిశీలనలో రాజకీయ నేతల నియంత్రణలోకి రావడానికి తాజా బిల్లు మార్గం ఏర్పరుస్తోంది. అలాంటి ముఖ్యమైన బిల్లును మూజువాణి ఓటుతో గట్టెక్కించడం తగునా? అన్న విషయమై పెద్దలు, మిత్రులు ఎందుకు ఆందోళన చెందరు? ఈ విషయం తీవ్ర చర్చలోకి ఎందుకు రాదు?

‘చూసారా, మీరు ఇంతే’ అని ఎత్తి చూపడానికి ఈ ప్రశ్నలు వేయడం లేదు. మన పార్లమెంటు, అసెంబ్లీలు ఎప్పుడూ ఆ పద్ధతిలోనే నడుస్తున్నాయే తప్ప ఒక్క తెలంగాణ విషయంలో మాత్రమే దారి తప్పలేదని చెప్పడానికి మాత్రమే ఈ ప్రశ్నలు. మన దృష్టిని వ్యవస్ధ నడుస్తున్న తీరుపై సారించాలి. ఆ దృష్టి సారింపు ప్రతి అంశంలోనూ జరగాలి. మనకు నచ్చని అంశాలపై మాత్రమే దృష్టి సారించి, మిగిలిన అంశాలను రాజకీయ నేతల ఇష్టాయిష్టాలకు వదిలి పెట్టడం కూడదు.

తెలియని వారు ఎలాగూ మాట్లాడ లేరు. కాస్త విషయ పరిజ్ఞానం ఉన్నవారు కూడా అవసరమైనప్పుడల్లా మాట్లాడకపోతే ప్రజలకు నష్టకరం. ‘గూండాలు గుండ్రాళ్ళు విసిరే రాజ్యంలో నోరుండి చూస్తున్న ప్రతి ఒక్కరూ నేరస్ధులే’ అన్న కవి వాక్కును మరొక్కసారి గుర్తు చేయడానికే ఈ నాలుగు మాటలు!

7 thoughts on “మూజువాణి: తెలంగాణ మాదిరిగానే జ్యుడీషియల్ బిల్లు కూడా

 1. ఆరోజు తెలంగాణ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడితే….నాలుగు ఓట్లు రాలుతాయనో…..సీమాంధ్ర ప్రాంతంలో హీరోలుగా మారొచ్చనో ….మూజువాణి బిల్లుపై ఆందోళన చేశారు. అసలు మూజు వాణి ఓటు అనేది ఎప్పటినుంచో ఉన్నా కేవలం తెలంగాణ ఏర్పాటు సందర్భంగానే….జనాలకు తెలిసివచ్చింది.
  అంతెందుకు ఏ రాజకీయ నాయకుడైనా ( తెలంగాణ విషయంలో తప్ప ) ఎన్నడైనా రాజ్యంగంలోని ఆర్టికల్ గురించి చర్చ చేశారా..? కానీ 371-D ఆర్టికల్ గురించి మాత్రం ఆ రోజు ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడినవారే.

  ఇక ఇప్పుడు ఈ కొలిజియం గురించి మాట్లాడినా….జనం పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వారికి తక్షణ ప్రయోజనమో, నష్టమో లేదు. అంతకుమించి భావోద్వేగాలు రెచ్చగొట్టడం కుదరదు. కాబట్టి మాట్లాడడం వల్ల (వారి దృష్టిలో) పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు మూజువాణిని పట్టించుకునే వారు కరవయ్యారు. ప్రస్తుతం సీమాంధ్రలో రాజధాని విషయం గురించో….తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలను వ్యతిరేకించడం గురించో….లేదా మత రాజకీయాల గురించి మాట్లాడం వల్లనో…..ఉపయోగం ఉంటుంది.
  కాబట్టి వాటి గురించే మాట్లాడతారు. ఈ మధ్య ఓ తెలుగు ఎంపీ గారు రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు మహిళలు మంచి వస్త్రాలు ధరించాలని ( !? ) పార్లమెంటులో మాట్లాడి అభాసు పాలయ్యారు.

  అసలు రాజకీయ నాయకులకు జనం ప్రయోజనాలు ఏనాడు పట్టాయి కనుక.

 2. చాలా మందికి ఈ బిల్లుపై అవగాహన లేదు. జనం తమ మీద ప్రత్యక్ష ప్రభావం పడే అంశాలనే అంతగా పట్టీంచుకోవట్లేదు. ఇక ఇదెంత.

  తెలంగాణా ఏర్పాటు సమయం లో ఆందోళన వ్యక్తం చేసిన సీమాంధ్రులని (సారి, హైదరబాది సీమాంధ్రులని…ఇదో కొత్త జాతి.ఈ మధ్యనే పుట్టింది.) మీ సొమ్మేమి పొయింది. నీ రేషన్ కార్డులు పోతాయా? ఆరగ్యస్రీలు పోతాయా? ఫీజులు పోతాయా? అనవసరం గా రాజకీయ నాయకుల మాటలు విని రెచ్చి పోతున్నారు…..అని తెలంగాణా వాదాన్ని తెగ సపోర్ట్ చేసిన ఆంధ్ర మేధావులు 1956 స్థానికత వంటి అంశాల మీద ఇలాగే సైలెంట్ గా కూర్చున్నారు. ఎమి అనగలం? మేము ఎప్పుడు స్పందించాలో మీరు నిర్ణయిస్తారా?అంటారేమో?

 3. తెలంగాణ వచ్చాక కూడా అటు అక్కడి ప్రభుత్వం, ఇటు ఇక్కడ ప్రభుత్వం రెండూ విభజన తాలూకూ సెంటిమెంట్లు సొమ్ము చేసుకునే రంధిలో ఉన్నాయి. అందులో భాగమే మీరు చూస్తున్న ప్రకటనలు.

  స్ధానికత పైన కె.సి.ఆర్ చెప్పేవేవీ సాగవు. విభజన చట్టానికి విరుద్ధంగా పోవడం తెలంగాణ ప్రభుత్వానికి వీలు లేదు. కోర్టులు అందుకు ఒప్పుకోవు. విద్య, ఆరోగ్య రంగాలలో పదేళ్ళ వరకు ఉమ్మడి రాష్ట్ర పద్ధతినే పాటించాలని విభజన చట్టం స్పష్టంగా పేర్కొంది. దానిని తెలంగాణ ప్రభుత్వం మీరడం సాధ్యం కాదు. ఒకవేళ మీరితే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడానికి వెనుకాడమని కేంద్రం ఇప్పటికే సూచనలు ఇచ్చింది కూడా.

  ఇంతకీ రేషన్ కార్డులు, ఫీజులు ఎక్కడికి పోయాయో మీరు చెప్పనే లేదు. ఫీజులు ఆంధ్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ బాధ్యత ఆంధ్ర ప్రభుత్వానిదే తప్ప తెలంగాణది కాదు. సీట్ల కేటాయింపు రద్దు చేస్తే చట్ట విరుద్ధం తప్ప ఫీజుల చెల్లింపు చట్టం పరిధిలో లేదు. ఇతర రాష్ట్రాల విద్యార్ధులు (కొత్త) ఆంధ్రలో చదివితే వారి ఫీజులు మనవాళ్లు ఇవ్వనట్లే తెలంగాణ వాళ్ళు కూడా ఇవ్వరు.

  ఆధారాలు లేకుండా హైరానా పడడం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా మన హైరానాను సొమ్ము చేసుకోవడం రాజకీయ జలగలకు సులభం అవుతుంది.

  మనలో మనమాట. కె.సి.ఆర్ ప్రకటనలను నేను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోను. తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు సాధించుకున్నారు తప్ప కె.సి.ఆర్ తెచ్చింది కాదు. కె.సి.ఆర్ లేకపోతే ఆందోళన ఉండేదా అని కొంతమంది ప్రశ్నిస్తారు గానీ అది వాస్తవం కాదు. వ్యవస్ధలో జరిగే ముఖ్యమైన మార్పులకు అందులోని అంతర్గత శక్తులే చోదక శక్తి అవుతాయి తప్ప బాహ్య శక్తులు కాదు. బాహ్య శక్తులు సహాయకారి అవుతాయి అంతే.

  కె.సి.ఆర్ కాకపోతే మరో గి.సి.ఆర్. లేదా ఇంకో వై.సి.ఆర్. తెలంగాణ ప్రజల ఉద్యమం ప్రధాన అంతర్గత చోదక శక్తి. కె.సి.ఆర్/టి.ఆర్.ఎస్ ఒకానొక బాహ్య శక్తి మాత్రమే. అనేక పార్టీలు, సంఘాలు ఉద్యమంలో ఉన్నాయి. ప్రధాన ఉద్యమాన్ని నడిపింది ఇతర సంఘాలే గానీ టి.ఆర్.ఎస్ కాదు. (నిజానికి ఆ పార్టీ అనేక కీలక ఉద్యమాల్లో పాల్గొనలేదు. కేవలం లాబీయింగులకే పరిమితం అయింది.)

  కాస్త సంయమనంగా పరికిస్తే విషయాలు మన ఎరుకలోకి వస్తాయి. కె.సి.ఆర్, బాబులు చేస్తున్న రెచ్చగొట్టుడు ప్రకటనల ఉచ్చులో పడితే చాలా విషయాలు తిన్నగా అర్ధం కాకపోవచ్చు.

  తెలంగాణ రాష్ట్రం అక్కడి ప్రజలకు మేలు చేస్తుంది. చారిత్రక అన్యాయాన్ని సవరించే నిర్ణయం అది. జ్యుడీషియల్ కమిషన్ బిల్లు దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్ధల బలాబలాల పొందికను మార్చుతుంది. ఈ రెండింటి ఉపయోగాలను పోల్చకూడదు. నేను పోల్చింది మన అప్రమత్తతను. ప్రభుత్వాల నిర్ణయాలన్నింటి పట్లా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పాను. ఇందులో మీకు అభ్యంతరం ఉండకూడదు.

 4. మూజువాణి ఓటు తో గెలిచినా మరి ఏ ఓటుతో గెలిచినా దీని దీర్గ కాలిక ప్రభావాలు సామన్యమైనవి కాదు. ఎంతలేదన్నా ఏదో న్యాయం జరుగుద్దిలెమ్మని ఎదురు చూసే ప్రజలున్న దేశం మనది. ఆ ఆశకు కూడా గండి కొట్టాక (కేవలం మానసికంగానే లెండి) అమవాస చీకటి అలుముకున్నట్టుంది. ఒక్క పార్లమెంటరీ నాయకుడికి- నటించడంలో నైనా – ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రజాస్వామ్య యుతంగా మాట్లాడ లేక పోతే- ఇందుకు వామపక్షాలేమి మినహాయింపుకాదు- ఈ పార్లమెంటరీ ప్రజా స్వామ్యంలో ప్రజల ఉనికి ఏమిటీ? ఇప్పటికే న్యాయ వ్యవస్త మీద చాలా మందికి నమ్మకం పోయింది లెండి. దీని దీర్ఘకాలిక పరిణామలేమిటి?

 5. స్ధానికత పైన కె.సి.ఆర్ చెప్పేవేవీ సాగవు….. విద్య, ఆరోగ్య రంగాలలో పదేళ్ళ వరకు ఉమ్మడి రాష్ట్ర పద్ధతినే పాటించాలని”————

  1) అంటే పదేళ్ళ తరవాత విద్య ఆరోగ్య రంగాల్లొ కూడా స్థానికత వర్తిస్తుందా? అప్పుడు 1960 లో వచ్చిన వారి మనవలు ఎక్కడ చదువుకోవాలి? ఎక్కడ వైద్యం చేయించుకోవాలి? ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం వెతుక్కోవాలి?

  2) ఫీజులు ఆంధ్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ బాధ్యత ఆంధ్ర ప్రభుత్వానిదే తప్ప తెలంగాణది కాదు———-

  1960 లో వచిన వారి పిల్లలు మనవలు వారి మనవలకు కూడా అంధ్ర ప్రభుత్వం చెల్లించాలా? పన్నులు ఒకరికి, తన్నులు ఒకరికా?

  3)ఇంతకీ రేషన్ కార్డులు, ఫీజులు ఎక్కడికి పోయాయో మీరు చెప్పనే లేదు————

  ఫాస్ట్ మార్గదర్సకాలు ఇదే చెప్పబోతున్నాయి. ప్రతి పారిస్రామికవేత్త ని స్థానికులకే అవకాసలివ్వాలని అంటున్నారు. శ్థానికత అనేది ఫీజుల్లాగే అన్ని ప్రభుత్వ పధకాలకి అర్హత గా చేరిస్తే అప్పుడు 1960 బాచ్ సంగతేంటి?

  4)ఇతర రాష్ట్రాల విద్యార్ధులు (కొత్త) ఆంధ్రలో చదివితే వారి ఫీజులు మనవాళ్లు ఇవ్వనట్లే తెలంగాణ వాళ్ళు కూడా ఇవ్వరు i ACCEPT IT. NO NEED TO GIVE FOR NON LOCAL ANDHRA STUDENTS.

  5) ఐదేళ్ళు కే.సీ.ఆర్. మాటే శాసనం.ఆయన్ని పట్టించుకోకపోవడం ఏంటి. ఇలా ఏమి కాదని తెలంగాణా డిమాండ్ పట్టించుకోనందుకే సీమాంఢ్రులు అనుభవిస్తున్నారు.

  6) తెలంగాణ రాష్ట్రం అక్కడి ప్రజలకు మేలు చేస్తుంది. చారిత్రక అన్యాయాన్ని సవరించే నిర్ణయం అది. ———-

  మొత్తం అందర్నీ 1956 లెక్కతో పంపించేస్తే ఇంకా న్యాయం జరుగుతుందేమో?
  పురాణ కాలం నుంచీ ఈ లెక్కని(1500, 1700) ilaa ఇండియా మొత్తానికి వర్తింప చేస్తే ఈంకా బావుంటుంది కదా? భవిస్యథ్ ని మాని గతాన్ని తవ్వుకుందాం……..

 6. పైన చెప్పినట్లు హైరానా పడకుండా సావకాశంగా పరికించండి. ఆందోళన పడాల్సిందేమీ లేదు.

  తెలంగాణపై సాగిన వివక్ష మీ దృష్టిలో లేదు. మీరసలు దాన్ని పరిగణించరు. అందుకే గతం తవ్వుకుందాం అంటూ హేళన చేస్తున్నారు. గతమూ ముఖ్యమే, వర్తమానమూ ముఖ్యమే. తెలంగాణ వివక్ష ఒక్క గతంలో మాత్రమే లేదు. వర్తమానంలోనూ ఉంది. అందుకే ఉద్యమాలు నిరంతరం కొనసాగాయి.

  పదేళ్ళ తర్వాత వర్తించడం ఏమిటండి? చట్టం సంగతి చెబితే మీకు తోచిన విధంగా వర్తింపజేసుకుంటున్నారు. ఇప్పుడు స్ధానికులైన వారు పదేళ్ళ తర్వాత స్ధానికులు కారా? పదేళ్ళ వరకు ఏ.పి లో ఉన్నవారికి కూడా నాన్-లోకల్ కింద అక్కడ సీట్లు ఇస్తారు. ఆ తర్వాత ఆపేస్తారు. తెలంగాణలోని సీమాంధ్రులు తెలంగాణ రాష్ట్రీయులే అవుతారు.

  విభజన చట్టం ఏమి చెబుతుందంటే… మరో 10 సం.ల వరకు 13 జిల్లాల వారికి కూడా తెలంగాణ విద్యా సంస్ధల్లో పాత లోకల్-నాన్ లోకల్ ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలి. ఆ తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇప్పుడు ఏ స్ధితిలో ఉన్నాయో ఆ స్ధితికి తెలంగాణ-ఆంధ్ర సంబంధాలు చేరుతాయి. పరాయి రాష్ట్ర (ఉదా తమిళనాడు) విద్యార్ధులకు పాత ఆంధ్రలో నాన్ లోకల్ సీట్లు ఇచ్చామా? ఇవ్వలేదు. ఎన్.ఐ. కోటా కింద మాత్రమే ఇచ్చాము. పదేళ్ళ తర్వాత అదే పద్ధతి వస్తుంది.

  మీరు చెప్పేది తెలంగాణలోని ఆంధ్రా వారి గురించి. విభజన చట్టం ప్రకారం వారు ఆంధ్ర వాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళే. కాబట్టి పదేళ్ళ తర్వాత వారి పరిస్ధితి మారదు.

  1956 స్ధానికత కొత్త ప్రతిపాదన. ఆ ప్రతిపాదన ద్వారా సీమాంధ్ర నుండి వలస వచ్చినవారిని వెనక్కి పంపే ఆలోచన చేస్తే అది సాధ్యం అయ్యేదేనా? అది యూనియన్ అవగాహనకు విరుద్ధం. (భారత దేశం యూనియన్. ఫెడరల్ కాదు.) దేశానికొక రాజ్యాంగం తెలంగాణకు మరొక రాజ్యాంగం ఉండదు కదా. ఈ ప్రతిపాదనను చట్టంగా చేయలేరు. కోర్టులు అందుకు ఒప్పుకోవు. అలాంటి చట్టం చేయడానికి రాజ్యాంగంలో ప్రాతిపదిక లేదు. ఈ సంగతి మొదట మీరు తెలుసుకోవాలి.

  ప్రైవేటు పారిశ్రామికవేత్తలు స్ధానికులకే అవకాశాలు ఇవ్వాలంటే అది జరిగిపోతుందా? సావధానంగా ఆలోచించండి. మనవాళ్లు బెంగుళూరులో, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లోని కంపెనీల్లో పని చేయడం లేదా? ఇవి జనం కోసం చెబుతున్న మాటలు. మీకు అవి నమ్మడం ఇష్టం. నమ్మండి. కానీ మీ నమ్మకాలకు ఇతరులు బాధ్యత తీసుకోరు.

  మొన్న మోడీ లడఖ్ లో మాట్లాడుతూ ‘పాకిస్ధాన్ నేరుగా యుద్ధం చేసే సామర్ధ్యం కోల్పోయింది. కానీ ఉగ్రవాదులను పంపిస్తోంది’ అన్నారు. అంటే నిజంగానే పాకిస్ధాన్ యుద్ధం చేయలేదనేనా? అమెరికా పెత్తనాన్ని ఒప్పుకునేది లేదు అంటారు. కానీ ఆచరణలో చక్కగా ఒప్పుకుంటారు. జనం కోసం చెప్పే మాటల్ని వాటికి ఉన్న అర్ధం మేరకే తీసుకోవాలి. సాధారణంగా బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడడం మానాలి. ఆ సెన్సిబిలిటీ మన పాలకులకు లేదు. కె.సి.ఆర్ ఆ విషయంలో అది మరింత నిజం.

  కె.సి.ఆర్ మాటే శాసనం అని నేను భావించడం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా చట్టాల ప్రకారం పోవాలి. One may bend the law, but cannot break it. మీరు కె.సి.ఆర్ మాటలకుకు ఇచ్చే విలువ నేను ఇవ్వడం లేదు.

 7. 1956 స్ధానికత కొత్త ప్రతిపాదన. ఆ ప్రతిపాదన ద్వారా సీమాంధ్ర నుండి వలస వచ్చినవారిని వెనక్కి పంపే ఆలోచన చేస్తే అది సాధ్యం అయ్యేదేనా? అది యూనియన్ అవగాహనకు విరుద్ధం. (భారత దేశం యూనియన్. ఫెడరల్ కాదు.) దేశానికొక రాజ్యాంగం తెలంగాణకు మరొక రాజ్యాంగం ఉండదు కదా. ఈ ప్రతిపాదనను చట్టంగా చేయలేరు. కోర్టులు అందుకు ఒప్పుకోవు. అలాంటి చట్టం చేయడానికి రాజ్యాంగంలో ప్రాతిపదిక లేదు.

  ఈ క్లారిటీ నాకు ఇంత వరకు దొరకలేదు. ఇదే నిజమైతే చాల త్వరలో రెండు రాష్త్రాల్లొ శాంతి నెలకొంటుంది.

  తెలంగాణ లో స్థానికులు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది సీమాంధ్రులను పెట్టలేదు.(కారణం ఏదైనా).ఒక మంచి సర్కిల్ కలిగి హాయి గానే ఉన్నాం. కాని కొంతమంది రోజు వారి పనులు చేసుకోనే వారు(వెండార్స్, కర్రీ పాఇంట్ )లాంటివి కొంత సమస్యలు ఎదుర్కోంటున్నారు.

  ఒక విషయం చెప్పాలి. మేము ఎలాంటి ప్రభుత్వ పధకాలకు అర్హులం కాదు. మా ఉద్యోగుల్లో ఎక్కువ సాతం తెలంగాణా వారే. మాకు ఎలాంటి సమస్యలు లేవు. కాని ఇలాంటిచర్యలు కనీసం మన అనుకున్న వారి కోసం వ్యతిరేకించాలి కదా?

  తెలంగాణ కి ఎలాంటి అన్యాయం జరిగిందో నిజంగా నాకు తెలీదు.

  కాని అందరూ బావుండాలని ప్రసాంతం గా బతకాలని నేను కోరుకుంతాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s