‘పవిత్రం’ కనుక గంగా నదిని శుద్ధి చేయాలా?


Ganga pollution

“పవిత్ర” గంగానది ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని బి.జె.పి ప్రభుత్వం ఎందుకు వెనక్కి నెట్టేసిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వంలో గంగా నదిని పరిశుభ్రం చేయాలన్న ఆతృత (urgency) చూపించడం లేదని వ్యాఖ్యానించింది. ‘దేశంలో 2,500 దూరం ప్రవహించే గంగా నదిని శుద్ధి చేసే పధకాల పట్ల ప్రభుత్వం ఆసక్తి కోల్పోయిందా?’ అని ప్రశ్నించింది.

20 యేళ్ళ నాటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన విచారణ కొనసాగిస్తూ సుప్రీం కోర్టు బెంచి బుధవారం ఈ ప్రశ్నలు సంధించింది. జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ అడ్వకేట్ ను ప్రశ్నలతో ముంచెత్తింది. “పవిత్ర గంగా నదిని శుద్ధి చేయడం మీ (ఎన్నికల) మ్యానిఫెస్టోలో భాగమే. ఇంత ముఖ్యమైన సమస్యను ఇప్పుడు వెనుక పొయ్యి (back burner) పైన ఉంచరా లేక ముందు పొయ్యి (front burner) పైన ఉంచారా?” అని జస్టిస్ ఠాకూర్ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ ను ప్రశ్నించారని పత్రికలు తెలిపాయి.

‘పవిత్ర’ గంగా నదిని శుద్ధి చేయడం లాంటి ముఖ్యమైన సమస్యలను వెనక్కి నెట్టి అంత ప్రాముఖ్యం లేని వాటిని ముందుకు తెస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ధర్మాసన ప్రశ్నలకు బదులిచ్చిన రంజిత్ కుమార్, గంగా ప్రాజెక్టును పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి నీటి వనరుల శాఖ కిందికి తెచ్చారని అందువల్లనే కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

“ఈ విషయంలో ఎంతో ఆతృత ఉందని చెబితిరి… ఇప్పుడేమో మీకు ఆతృత ఏమీ లేదు. ప్రజలు ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తుంటే మీరేమో దానిని మంత్రిత్వ శాఖల మధ్య అటూ ఇటూ తిప్పుతున్నారు” అని జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తరపున హాజరయిన లాయర్, గంగా శుద్ధి కార్యక్రమం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని అని తేల్చేశారు. గంగానది పొడవునా సూయేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్.టి.పి) లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు తలపెట్టాయి. ఈ ఎస్.టి.పి లను నెలకొల్పడం భారీ ఖర్చుతో కూడుకున్న పని అని బోర్డు చెబుతోంది. నది వెంట సరైన డ్రైనేజీ వ్యవస్ధే లేదని అలాంటప్పుడు ఎస్.టి.పి లను నెలకొల్పడం వల్ల ప్రయోజనం లేదని బోర్డు స్పష్టం చేసింది.

బోర్డు పరిశీలనలను విన్న ధర్మాసనం నది మొత్తం ఒకేసారి శుద్ధి చేయడానికి బదులు విడతలు విడతలుగా ప్రాజెక్టు చేపట్టాలని సూచించింది. ఉదాహరణకు ఒక్కో విడత 100 కి.మీ మేర శుద్ధి చేయవచ్చని సలహా పడేసింది. గంగా శుద్ధి ప్రాజెక్టు ఏ దశలో ఉన్నదీ తెలియజేస్తూ వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గంగా నదిని శుద్ధి చేయడం వరకు బాగానే ఉంది. ఎందుకంటే నది నీరు శుభ్రంగా ఉండడం దేశానికి (ప్రజలకు) చాలా అవసరం. దేశ ప్రజలకు తాగు నీరు, సాగు నీరు అందించేది ప్రధానంగా నదులే కనుక ఒక్క గంగా నది మాత్రమే కాదు, దేశంలోని నదులన్నీ శుభ్రంగా ఉండాల్సిందే. కానీ గంగా నదికి లేని ‘పవిత్రత’ను అంటగట్టి అది మాత్రమే శుభ్రంగా ఉండాలనడం ఏమిటో ఒక పట్టాన అంతుబట్టని విషయం.

దేశంలో అత్యధిక ప్రజానీకానికి తాగు, సాగు నీరు అందిస్తున్నది గంగా నది. వారణాసి, పాట్నా లాంటి పెద్ద నగరాలతో పాటు ఇంకా 100 వరకు చిన్నా, పెద్దా పట్టణాలకు తాగు నీటిని గంగా నది అందిస్తోంది. 50 కోట్ల మంది ప్రజలు ఈ నది నీటిపైన ఆధారపడి ఉన్నారని ఒక అంచనా. 11 రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న గంగా నది ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక స్ధాయిలో కాలుష్యం బారిన పడిన నదుల్లో 6వ స్ధానాన్ని ఆక్రమించింది.

గంగా నీరు తాగిన జనం ఆరోగ్యంతో బ్రతికి బట్టకట్టాలన్నా, గంగా నీటితో సాగు చేసిన పొలాలు కాలుష్య రహిత ఫలసాయాన్ని అందించాలన్నా నది నీరు శుభ్రంగా ఉండవలసిందే. జనం వినియోగం కోసం అత్యవసరం కాబట్టి గంగా నదిని శుభ్రం చేయాలి గానీ సుప్రీం ధర్మాసనం పరోక్షంగా పేర్కొన్నట్లు గంగా నది ‘పవిత్రం’ గనుక శుభ్రం చేయాలా? అసలు గంగా నది అంత పవిత్రమే అయితే దాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చినట్లు?

‘పవిత్ర గంగా నదిని ప్రాధాన్యం ఇచ్చి శుద్ధి చేస్తాం’ అని బి.జె.పి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తే ప్రకటించవచ్చు గాక! అంత మాత్రాన అత్యున్నత కోర్టు సైతం ‘పవిత్ర గంగ’ అంటూ అసలు విషయం వదిలేసి కొసరు సంగతిని ప్రస్తావించాలా?

గంగా నది ఈ రోజు ఉన్నట్లు అంత మురికి మాయం కావడానికి కారణం ప్రధానంగా ఫ్యాక్టరీలు. ఆ తర్వాత నది ఒడ్డున ఉన్న నగరాల పాలక సంస్ధలు. ఆ మాటకొస్తే ఏ నగరం సరైన డ్రైనేజి వ్యవస్ధ గానీ, వ్యర్ధాల నిర్వహణను గానీ కలిగి ఉంది? ఇటీవల వరకూ బెంగుళూరు వ్యర్ధాలను ఏం చేయాలన్న విషయంలోనే కర్ణాటక హై కోర్టు వరుస ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. దేశంలోని ప్రతి నగరమూ, పట్టణమూ వ్యర్ధ పదార్ధాల నిర్వహణలో దారుణంగా వెనకబడి ఉన్న పరిస్ధితి. అటువంటి నగర, పట్టణ పాలనా వ్యవస్ధలు చక్కబడకుండా గంగా నది ఎన్ని ప్రాజెక్టులు కడితే శుద్ధి అవుతుంది? కాలుష్యానికి మూల కారణాల జోలికి పోకుండా ఎన్ని ఎస్.టి.పి లు కడితే నదీమ తల్లులు తమ ఒంటికి అంటించిన మురికిని వదిలించుకోగలవు?

గంగా నది వెంట ఉన్న అనేక కర్మాగారాలు ప్రతి రోజూ వ్యర్ధ పదార్ధాలను నదిలోకి వదిలేస్తున్నాయి. తోలు శుభ్రం చేసే పరిశ్రమలు, రసాయన కర్మాగారాలు, టెక్స్ టైల్ మిల్లులు, డిస్టిలరీలు, ఆసుపత్రులు, కబేళాలు లెక్కకు మిక్కిలిగా గంగా నది తీరం వెంబడి పని చేస్తున్నాయి. వీటిలో కొన్ని ఫ్యాక్టరీలు వదిలే వ్యర్ధాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ వ్యర్ధాలు కలిసిన నీరు తాగడానికి అటుంచి సాగుకు కూడా పనికిరావు.

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని కాలుష్య నివారణ సంస్ధ ఆ మధ్య అధ్యయనం చేసి నది జలాలను కాలుష్య పరంగా నాలుగు రకాలుగా వర్గీకరించింది. అవి: A – తాగడానికి అనువైనవి. B – స్నానానికి అనువైనవి. C – వ్యవసాయ యోగ్యమైనవి. D – ఏ వాడకానికి పనికిరాని కాలుష్యంతో కూడుకున్నవి. ఉత్తరా ఖండ్ కాలుష్య సంస్ధ గంగా నదిని D కేటగిరీ కింద వర్గీకరించింది. గంగా నదీజలాలను అంత ఘోరంగా మార్చేశారు. గంగా నీటిలో కోలి బాక్టీరియా 5,500 స్ధాయిలో ఉన్నట్లుగా సదరు సంస్ధ గుర్తించింది. అనగా తాగడం, స్నానించడం అటుంచి చివరికి వ్యవసాయానికి కూడా గంగా జలం పనికిరాదు.

కాన్పూర్ లో 400 కి పైగా తోలు పరిశ్రమలు పని చేస్తున్నాయి. ఇవి వినియోగించే రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవి. తోలు పరిశ్రమలు వెదజల్లే దుర్గంధం నర మానవుడు అనేవాడిని చెంతకు రానీయని శక్తివంతమైనది. అక్కడి కార్మికులకు ఎన్ని టన్నుల సానుభూతి అందించినా తక్కువే అవుతుంది. (నిరుద్యోగ సైన్యం లెక్కించలేని స్ధాయిలో ఉన్నప్పుడు ఏ పనికైనా సిద్ధపడక తప్పని పరిస్ధితులు ఉంటాయి.) ఇటువంటి పరిశ్రమలు వాడే క్రోమియం రసాయనం వల్ల గంగా నది ఎంతగా కలుషితం అయ్యిందంటే 1995లో కామన్ ట్రీట్ మెంట్ ప్లాంటు నెలకొల్పినప్పటికీ, క్రోమియం కాలుష్య స్ధాయి చెక్కు చెదరకుండా ఉండిపోయింది. అనుమతించదగిన గరిష్ట స్ధాయి కంటే 70 రెట్లు ఎక్కువగా క్రోమియం పాళ్ళు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

అనేక రసాయన పరిశ్రమలు పోను మానవ జీవనం వల్ల మిగిలే వ్యర్ధాల సంగతి చెప్పనవసరం లేదు. పాపాలను వదిలించుకునే పేరుతో ప్రతియేటా తరలివచ్చే భక్తజనం వదిలే వ్యర్ధాల వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. వివిధ పట్టణాలు, నగరాలు వదిలే వ్యర్ధాలు ప్రవహించేందుకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్ధ, కాలువలు నిర్మించవలసి ఉండగా ఆయా నగర, పట్టణ పాలక సంస్ధలు వాటి సంగతే పట్టించుకోవు. సమీపంలో ఏ నది, యేరు, కాలవ ఉన్నా వ్యర్ధాలను అందులోకి తరలించడం ప్రతి చోటా కనిపిస్తుంది. వ్యర్ధాలను సలక్షణంగా ట్రీట్ చేసే ఆధునిక పద్ధతులు అభివృద్ధి చెందినా వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు లేకుండా పోయాయి. ఉన్న సంపదలన్నీ అవినీతి పాలు జేసి విదేశీ ఖాతాలు నింపుకునేందుకు, విదేశీ కంపెనీల లాభాలకు తరలించేందుకు ఆసక్తి ఉంటుంది గానీ కనీసం ‘పవిత్ర’ నదుల శుద్ధి పై కూడా ఆసక్తి ఉండదు.

గంగా నదికి అంటగట్టిన పవిత్రత వల్లనైనా ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో దానికి స్ధానం దక్కింది. ‘పవిత్రం’ కానీ నదులు సంగతి ఏ కోర్టులు, ఏ మేనిఫెస్టోలు పట్టించుకోవాలి?

దేశ ప్రజల జీవనం ఆరోగ్య వంతంగా, రోగాల రహితంగా ఉండాలి కాబట్టి, వ్యవసాయ సాగుకు అందించే నీరు రసాయనాల రహితంగా ఉండాలి కాబట్టి, మన పంట చేలు అందించే ఫలసాయం కడుపు నింపాలి గానీ రోగాలు నింప కూడదు కాబట్టి గంగా నది, ఇంకా అనేక నదులు, కాలువలు శుభ్రంగా ఉండాలి తప్పితే అవి పవిత్రం అయినందుకు కాదు.

 

 

4 thoughts on “‘పవిత్రం’ కనుక గంగా నదిని శుద్ధి చేయాలా?

 1. పవిత్రం గనుకనే గంగా నదిని ప్రయారిటీలో శుభ్రం చేయ్యాలి. మిగిలిన నదులలో పుష్కరాలకో లేక వేరే పుణ్య కార్యక్రమాలప్పుడో భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. ఒక్క గంగలో మాత్రమే అనేక లక్షలమంది ప్రతినిత్యం స్నానం చేస్తారు. మిగిలిన నదులని శుభ్రం చేయ్యాలనే మీమాట నిజమేగానీ గంగని ప్రయారిటీతో శుభ్రం చెయ్యాలి. దానికంటే ముందు కాలుష్య కారకాలని గుర్తించి కంట్రోల్ చెయ్యాలి.

 2. @ ఒక జాతి లేదా ప్రాంతంలోని ప్రజల క్రమశిక్షణ…విలువలను ఆ ప్రాంతంలో ప్రవహించే నదులు ప్రతిఫలిస్తాయని….ఎక్కడో చదివాను. అలాంటి పర్యావరణ స్పృహ లేకపోవడం వల్లే…గంగానదికి ఇటువంటి దుర్గతి పట్టింది. ఒక్క గంగానదే కాదు….కాలుష్యం బారిన పడ్డ అన్ని నదులను ప్రక్షాళన చేయాల్సిందే.

  -ఐతే ఇక్కడ నాదో చిన్న పాయింట్ ఏమంటే……గంగా నది పవిత్రం కాబట్టి ప్రక్షాళన చేయాలంటున్నారు. కానీ అసలు ఆ పవిత్రత వల్లే గంగానది కాలుష్యం బారిన పడుతోందని నా నమ్మకం. ఎందుకంటే…కాశీకి వెళ్లి గంగలో మునిగితే పాపాలు పోతాయనే నమ్మకం (?)తో… ఆ నది పరిస్థితి ఎలా ఉందని గ్రహించకుండా రోజూ వేలాది మంది అలా ఒక నదిలో మునగడం వల్ల అతలాకుతలం అవుతోంది.
  – ఇక గంగా నదిలో శవాలను విసిరే సంగతి అందరికీ తెలిసిందే. ఇలా గంగా నది పవిత్రత వల్ల భక్తకోటికి పుణ్యం వచ్చే సంగతి ఏమో గానీ…గంగానది మనుగడకు మాత్రం ముప్పు వచ్చింది.
  – ఇక ఏ నదికి లేని పవిత్రత గంగకు ఎలా వచ్చిందో అంతుబట్టదు.
  – కేవలం పురాణాల ఆధారంగా (శివుని భార్యగా) వచ్చిందే ఐతే….అటువంటి స్థల పురాణాలు కేవలం గంగ కే కాదు. దేశంలోని చాలా నదులకు ఉన్నాయి. ( సీతారాములు భద్రాచలం వద్ద గోదారిలో జలకాడడం లాంటివి. నర్మదకు, కృష్ణకు, కావేరికి…ఆఖరుకు ఊరి చివరన వాగులకు కూడా ఏదో ఓ పురాణం ఉంటుంది. కేవలం వాటి ఆధారంగా పవిత్రత వచ్చి ఉంటుందా. ఇంకా ఏమైనా కారణాలున్నాయా….?) సింధు, బ్రహ్మపుత్రా నదులు హిందువులకు పవిత్రమైన మానస సరోవరంలో జన్మిస్తాయి ఐనా వాటికి పెద్ద పవిత్రత లేదు. కానీ మధ్యలో ఇంకెక్కడో పుట్టే గంగకు పవిత్రత వచ్చింది. ఎందుకని…?
  – కొందరేమంటారంటే హిమాలయాల్లోని ఆయుర్వేద మొక్కలు….అనేకం గంగానదిలో కలుస్తాయని అందువల్ల ఆ నదికి రోగాలను నయం చేసే మహాద్భుత శక్తి ఉందని కొంచెం( సూడో ) సైన్స్ ను కలగలపుతారు. కానీ హిమాలయాల్లోంచి ఒక్క గంగానదే కాదు. హిమాలయాల్లో చిన్నా పెద్దా నదులు కనీసం వందకు పైనే ఉంటాయి. వాటిల్లోంచి కూడా ఆయుర్వేద శక్తి రావాలి కదా. కానీ మిగతా నదులను పట్టించుకున్న నాథుడే లేడు. వాటికి ఏ పవిత్రతా లేదు.

  – మరో చారిత్రక నిజం ఏమంటే…..గంగానది ఇటీవల పెరిగిన పరిశ్రమల కారణంగానే కాలుష్యం బారిన పడలేదు. ఏ పరిశ్రమలు లేని 17 వ శతాబ్దంలోనే గంగానది కాలుష్య కాసారంగా మారిందని….ఆ కాలంలోని సాహిత్య ఆధారాల ఆధారంగా తెలుస్తోంది.( ఇది నా సొంత అభిప్రాయం కాదు. హిందూ పత్రికలో ఓ వ్యాసంలో ప్రస్తావించారు.)

  అంటే గంగ కాలుష్యానికి కేవలం పరిశ్రమలే కాదు ఇంకా చాలా కారణాలున్నాయి. వాటిలో దాని పవిత్రత కూడా ఒకటి. నిజంగా గంగను పవిత్రంగా భావిస్తే….పుణ్యం రావాలనుకుంటే ఆ నదిలో అంత్యక్రియలు నిర్వహించడం….పూలు, పూజా సామగ్రి వదిలేయడం….వేలాది మంది మునగడం మానుకోవాలి.

  -ఇంకో సంగతి ఏమంటే గంగ అంటే కేవలం ఇప్పుడు మనం అంటున్న గంగేనా….? ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి….
  మన సంస్కృతిలో గంగ అంటే నీరు. నీటికి పర్యాయంగా గంగను వాడుతారు. చాలా నదులను చివరన గంగ అనే పేరుతో ( గోదారి గంగ, పెన్ గంగ, కావేరి గంగ ఇలా చాలా ఉన్నాయి…) పిలుస్తారు. కాబట్టి హిందూ పురాణాలు లేదా మన సంస్కృతిలో మనం గంగ అని అత్యంత పవిత్రత ఇస్తోంది కేవలం …..ఉత్తర ప్రదేశ్ లోని గంగ మాత్రమే కాదని…జీవరాశులకి ప్రాణాధారమైన నీటికి అని నా ఉద్దేశం. ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే. ఇతరులెవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.
  కానీ దేశంలోని ప్రజలందరికీ..ఆ మాటకొస్తే సమస్త జీవరాశులకి ప్రాణాధారమైన ఒకనదిని పవిత్రత పేరుతో ముప్పు తీసుకు రావడం శోచనీయం. మనుషుల మధ్యే కాదు..ఆఖరికి నదుల మధ్య కూడా విచక్షణ ఎందుకు…?
  అందుకే “పవిత్రమైన” గంగ నదినే కాదు……గుర్తింపుకు నోచుకోని “కడజాతి” నదులను కూడా ప్రక్షాళన చేయాలి.

 3. మన దేశంలో ఇలా కోడి గుడ్దు మీద ఈకలు పీకెవాల్లకు లోటు లేదు. మనది లౌకిక రాజ్యమే, కానీ అత్యధిక ప్రజలు దేనినైనా పవిత్రంగా భావిస్తే ఆ భావనను కోర్టులు యధాతధంగా వాడుతాయి, అది ఏ మతానికి చెందినది అయినా? ఇదే ఈకలు ప్రభుత్వాలు ఖర్చులు పెట్టి మక్కాకు జనాలను పంపితే పీకరు కదా !

 4. హజ్ సబ్సిడీ బాగోతం గురించి కొన్ని మట్టి బుర్రలకి ఎంత చెప్పినా అర్థం కాదు. లేక అర్థమైనా, అవనట్లు నటిస్తూ రంకెలేస్తుంటారో తెలీదు.
  http://articles.economictimes.indiatimes.com/2012-05-08/news/31626845_1_haj-subsidy-pilgrims-saudi-airline
  1. హజ్ సబ్సిడీ ఇవ్వమని ఏ ముస్లిమూ, ఏ ప్రభుత్వాన్నీ అడగలేదు. పైగా ఈ హజ్ సబ్సిడీ మా కొద్దు మొర్రో అని అసదుద్దీన్ ఓవైసీ లాంటి నాయకులు పార్లమెంట్లో అనేక సార్లు బాహాటంగానే మొరపెట్టుకున్నారు.
  2. ప్రభుత్వం హజ్ యాత్రకి కేవలం ఎయిర్ ఇండియా లోనే వెల్లాలని నిర్దేశించింది. విమాన టికెట్ లో కొంతభాగం సబ్సిడీ కింద ప్రభుత్వం ఎయిర్ ఇండియాకి ఇస్తుంది. హజ్ సబ్సిడీ ఇచ్చేది హజ్ యాత్రీకులకు కాదు. ఎయిర్ ఇండియా సంస్థకి.
  ఉదాహరణకి, ఓ యాభై మంది హైదరాబాద్ నుండి బెంగులూర్ కి వెల్లాలనుకుంటే, ఒక్కొక్కరూ విడివిడిగా టికెట్ కొంటే తలకు 1000 రూ. అనుకుంటే, అదే అందరూ కలిసి గుత్త గా ఒకే బస్సును మాట్లాడుకుంటే 600,700 రూ. ల్లోనే వెల్లొచ్చు. ఇది కామన్ సెన్స్.
  3. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాకి అదనపు నిధులు రాబట్టడానికి ప్రభుత్వం హజ్ ని వాడుకుంటుంది. ఈ విషయంలో అసలు ప్రభుత్వం కలుగ జేసుకోకుండా ఉంటే, హజ్ యాత్రీకులు వేరే ప్రైవేటు విమాన సంస్థలతో బేరాలాడుకుని, మరింత తక్కువరేట్లకే, మెరుగైన సౌకర్యాలు పొందగలరు. ఒవైసీ అడిగేది అదే. కానీ ప్రభుత్వం అలా చేయదు. కానీ, కొన్ని మట్టి బుర్రలు మాత్రం, లౌకిక వాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ముస్లింలకు సబ్సిడీ ఇస్తుంది చూశారా అంటూ అతి తెలివితో వాదిస్తుంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s