ఇరాక్, సిరియాల్లో 900 మంది ఫ్రెంచి జిహాదీలు


IS fighters

IS fighters

మధ్య ప్రాచ్యంను కుదిపేస్తున్న ఇస్లామిక్ ఘర్షణల్లో పశ్చిమ దేశాల పౌరులు పాల్గొనడం నానాటికీ పెరుగుతోంది. సిరియాలో పశ్చిమ దేశాలు ప్రేరేపించిన కిరాయి తిరుగుబాటు మొదలైనప్పటి నుండి అనేక ఇస్లామిక్ దేశాల నుండి ఆకర్షించబడిన అమాయక యువత సిరియాకు ప్రయాణం కట్టారు. సో కాల్డ్ జిహాద్ లో పాల్గొనడానికి పశ్చిమ దేశాల నుండి కూడా ముస్లిం యువత ఇరాక్, సిరియాలకు వెళ్ళడం పెరిగిపోయిందని ఆ దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి.

‘ఇస్లామిక్ స్టేట్’ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా పేరు మార్చుకుంది) సంస్ధ కాలిఫేట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించడంతో జిహాదీల గమ్యంలో ఇరాక్ కూడా కలిసింది. ఇరాక్, సిరియా దేశాల్లో తమ అదుపులో ఉన్న ప్రాంతాలతో కలిపి ‘ఇస్లామిక్ కాలిఫేట్’ ఏర్పాటు చేశామని ఐ.ఎస్ (గత ఐ.ఎస్.ఐ.ఎస్) ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐ.ఎస్ లో చేరి శిక్షణ పొందిన వారిలో ఫ్రాన్స్ పౌరులు కూడా ఉన్నారని ఆ దేశ హోమ్ మంత్రి బెర్నార్డ్ కజేనివే బుధవారం ప్రకటించాడు. వివిధ గ్రూపుల్లో మొత్తం 900 మంది వరకు ఫ్రాన్స్ పౌరులు ఉన్నారని వారిలో అత్యధికులు ఇస్లామిక్ స్టేట్ గ్రూపులో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. మిలిటెంట్ గ్రూపుల్లో చేరకుండా నిరోధించడానికి ఫ్రాన్స్ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి సంఖ్య పెరుగుతోందే గానీ తగ్గడం లేదు.

“ఈ లక్షణంలో భాగంగా ఉన్నవారు ప్రస్తుతం 900 మంది వరకు ఉన్నారు. వారు ఇరాక్ లో గానీ సిరియాలో గానీ యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇస్లామిట్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లేవంత్ సంస్ధ వారిని రిక్రూట్ చేసుకుంది. తాను ఎక్కడెక్కడైతే యుద్ధం చేస్తోందో ఆ ప్రాంతాలన్నింటికీ తమ కేడర్ ను తిప్పుతుంది” అని ఫ్రాన్స్ ఇన్ఫో రేడియో తో మాట్లాడుతూ బెర్నార్డ్ చెప్పారని ది హిందు తెలిపింది.

బ్రిటన్ పౌరులు కూడా అనేక మంది సిరియా, ఇరాక్ ఘర్షణల్లో పాల్గొంటున్నారని ఆ దేశ ప్రభుత్వం అనేకమార్లు తెలిపింది. గత జూన్ లో బ్రిటిష్ విదేశీ మంత్రి విలియం హేగ్ పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం కనీసం 400 మంది బ్రిటన్ పౌరులు ఇరాక్, సిరియాలలో పని చేస్తున్నారు. ఈ సంఖ్య ఇప్పుడు 500 కు చేరుకుందని డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది.

బ్రిటిష్ పౌరులు ఇద్దరు ఇరాక్ చేరుకున్న అనంతరం మరింత మంది బ్రిటిష్ ముస్లింలు ఇరాక్ రావాలని పిలుపు ఇస్తూ వీడియో సందేశాన్ని ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రకారం మధ్య ప్రాచ్యం తరలి వెళ్తున్నవారందరూ ఇంటర్నెట్ ద్వారానే జిహాద్ లో రిక్రూట్ అవుతున్నారు. ఉన్నత చదువుల్లో ఉన్నవారు కూడా ఆకర్షితులై ఇరాక్, సిరియా వెళ్తున్నారని బ్రిటన్ ప్రభుత్వ సమాచారం.

విచిత్రం ఏమిటంటే బ్రిటన్ జాతీయ సైన్యంలో చేరుతున్న వారి కంటే మధ్య ప్రాచ్యం లో టెర్రరిస్టు గ్రూపుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం. గత ఏప్రిల్ నెలతో ముగిసిన సంవత్సర కాలంలో బ్రిటిష్ రిజర్వ్ సైన్యంలో చేరేందుకు కేవలం 170 మంది రిజిస్టర్ చేసుకోగా మధ్య ప్రాచ్యం ప్రాంతానికి మాత్రం వందల మంది వెళ్తున్నారని బ్రిటన్ మంత్రులను ఉటంకిస్తూ మెయిల్ ఆన్ లైన్ తెలిపింది. వారంతా ఐ.ఎస్ తోనే పని చేస్తున్నారని విదేశీ మంత్రి విలియం హేగ్ అంగీకరించారని పత్రిక తెలిపింది.

బ్రిటన్, ఫ్రాన్స్ లే కాకుండా ఇంకా అనేక ఇతర యూరోపియన్ దేశాల నుండి కూడా ముస్లిం యువత తరలి వెళ్తున్నట్లు పత్రికలు నివేదించాయి.

ఇస్లామిక్ కాలిఫేట్ ఏర్పాటు చేశామని ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బకర్ ఆల్-బఘ్దాదిని ఇరాకీ జైలు నుండి విడుదల చేసింది అమెరికాయే కావడం గమనార్హం. అబూ బకర్ ను 4 యేళ్ళు జైల్లో ఉంచిన అమెరికా 2009లో ఇరాక్ నుండి ఖాళీ చేస్తూ ఆయనను విడుదల చేసి వెళ్లింది. ‘మిమ్మల్ని న్యూయార్క్ లో కలుసుకుంటాను’ అని అమెరికన్లతో బఘ్దాది చివరిసారిగా తనను విడుదల చేసినవారితో చెప్పాడని జిహాద్ వాచ్ వెబ్ సైట్ తెలిపింది.

జిహాద్ వాచ్ ప్రకారం ఫిన్ లాండ్, బెల్జియం, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియాల నుండి అనేకమంది జిహాది పాల్గొనడానికి ఇరాక్, సిరియాలకు తరలి వెళ్లారు. “జిహాది లేకుండా జీవితమే లేదు” అంటూ ఆంగ్ల బాషలో పశ్చిమ దేశాల ప్రజలకు పిలుపు ఇస్తూ వారం రోజుల క్రితం ఒక వీడియోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. ఐ.ఎస్ నేత అబూ బకర్ స్వయంగా ఫేస్ బుక్ ఖాతా నిర్వహించడం విశేషం.

ఇరాక్ ఆయిల్ నగరం మోసుల్ ని ఆక్రమించిన అనంతరం అక్కడి సెంట్రల్ బ్యాంకు నుండి 466 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారం దోచుకుందని, ఇరాకీ చమురు అమ్ముకుంటూ మరింత సొమ్మును ఐ.ఎస్ సంపాదిస్తోందని తెలుస్తోంది. ప్రపంచంలో టెర్రరిస్టు సంస్ధలుగా పశ్చిమ దేశాలు చెప్పే గ్రూపులన్నింటిలోనూ ఐ.ఎస్ గ్రూపు అత్యంత ధనికవంతంగా అవతరించింది.

బ్రిటిష్ పత్రిక ది ఎకనమిస్ట్ ప్రకారం ఐ.ఎస్ కు ఇరాక్ లో 6,000 మంది ఫైటర్లు ఉండగా సిరియాలో 3,000 నుండి 5,000 మంది వరకు ఫైటర్లు ఉన్నారు. ఈ కొద్ది మంది అధునాతన శిక్షణ కలిగిన 20,000 మంది ఇరాక్ ప్రభుత్వ బలగాలను మోసుల్ నుండి తరిమి కొట్టారని పశ్చిమ పత్రికలు కొమ్ము బూర ఊది చెప్పడంతో పశ్చిమ ప్రభుత్వాలు నమ్మేసాయట!

ఇరాక్, సిరియాల నుండి తమ తమ దేశాలకు తిరిగి వచ్చే జిహాదిస్టుల నుండి పెను ప్రమాదం పొంచి ఉందని ఇప్పుడు పశ్చిమ ప్రభుత్వాలు తమ ప్రజలకు చెప్పుకుంటున్నాయి. బహుశా భవిష్యత్తులో పశ్చిమ ప్రభుత్వాలకు అవసరం అయినప్పుడు కొన్ని టెర్రరిస్టు పేలుళ్లు, హత్యలు జరగవచ్చు. సదరు ఉగ్ర చర్యలకు పాల్పడింది తిరిగి వచ్చిన ఐ.ఎస్ ఉగ్రవాదులే అని గూఢచార సంస్ధలు తీవ్రంగా పరిశోధించి తేల్చేస్తాయి. ఫ్రాన్స్ లో కొన్ని చోట్ల పోలీసులు దాడులు చేసి నాటు బాంబులు దొరికినట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఐ.ఎస్ కోసం రిక్రూట్ చేస్తుండగా కొందరిని అరెస్టు చేశామని స్పెయిన్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. త్వరలో పేలుళ్లు జరిగినా ఆశ్చర్యం లేదు.

4 thoughts on “ఇరాక్, సిరియాల్లో 900 మంది ఫ్రెంచి జిహాదీలు

  1. సర్,దయచేసిచెప్పండి?

    ఏమైనప్పటికి ఇస్లాం(జిహాదీ/ఇతర ప్రేరేపిత గ్రూపులు) అంతశక్తివంతంగా ప్రేరేపితులను ఆకర్షించడానికి గల కారణాలేమిటి?

    మతం/మతమౌఢ్యం అంతగొప్పదా?

  2. మంచి ప్రశ్న మూల గారు. అన్ని మతాలలో మత మౌడ్యం ఎంతో కొంత ఉంట్టుంది. దానిని అడ్డుపెట్టుకొని సామ్రాజ్యాలు స్థాపించాలని ప్రయత్నించరు. ప్రజలు దేశావిదేశాలనుంచి మద్దతు తెలపరు. అది వ్యక్తిగత నమ్మకం గాను, చాలా పరిమిత స్థాయిలో ఉంట్టుంది. ఇది మత మౌడ్యం కన్నా ఎక్కువ. యురోప్, ఇండియా, ఆస్ట్రేలియా దేశాలలో ఉండేవారు అందరు కలసి సిరియా, ఇరాక్ వెళ్లి మరీ యుద్దంలో పాల్గోవటం విచిత్రం గా ఉంది. ఈ పని ఇతర మతాల వారు ఇలా చేస్తారని అనుకోలేము. ఆధునిక సమాజం లో , ఆధునిక టెక్నాలజిని ఉపయోగించుకొని, మధ్యయుగాల నాటి మైండ్సెట్ తో వాళ్లు ప్రవర్తిస్తున్న తీరు చూసి ప్రపంచ వ్యాప్తంగా తలలు పట్టుకొంట్టున్నారు. కొన్ని పోటొలు చూస్తే, వారాల తరబడి ప్రజలను బందించి, మహిళలను స్లేవ్ మార్కేట్ లో అమ్ముతున్నారని వార్తలు చదివితే, ఆ రోజుల్లో మన దేశం మీద దండయాత్ర చేసినపుడు, మన దేశ ప్రజలపై అమానవీయ అకృత్యాలు ఇలాగే చేసి ఉండేవారేమో అని అనిపించక తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s