‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అని సామెత. ఈ సామెత తమ విషయంలో నిజం కాదని లండనర్లు నిరూపిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటిష్ పత్రికలు అంతా కట్టగట్టుకుని ఇజ్రాయెల్ స్వయం రక్షణ హక్కు కోసం పాటు పడుతుంటే, ఇజ్రాయెల్ అమానవీయ దాడులు జరిపే హక్కులను నిలదీస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లండనర్ల నిరసనలను లండన్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం.
‘పాలస్తీనియన్ సాలిడారిటీ కాంపెయిన్’, ‘స్టాప్ ద వార్’ అనే రెండు సంస్ధలు నిర్వహించిన ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనల్లో లండన్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ న్యూస్ కార్పొరేషన్ బి.బి.సి కార్యాలయం దగ్గరి నుండే నిరసన ప్రదర్శన ప్రారంభం కావడం విశేషం. తమ కార్యాలయం వద్దనే ప్రదర్శన ఆరంభం అయినా బి.బి.సి తన ఇజ్రాయెల్ అనుకూల వైఖరితోనే నిరసన ప్రదర్శన వార్తను కవర్ చేసింది. ప్రదర్శన రణగొణ ధ్వనితో సాగినా, ప్రశాంతంగా సాగిందని బి.బి.సి అభివర్ణించింది.
బ్రిటన్ లోని 13 ఎన్.జి.ఓ సంస్ధలు కలిసి ఏర్పాటు చేసిన డిసాస్టర్స్ ఎమర్జెన్సీ కమిటీ గాజా బాధితుల కోసం సహాయం పిలుపు ఇచ్చిన 24 గంటల్లోనే 4.5 మిలియన్ పౌండ్లు (దాదాపు రు. 46 కోట్లు) సమకూరాయని తెలిపింది. గాజా దాడి పట్ల బ్రిటన్ అనుసరిస్తున్న వైఖరిని బ్రిటన్ వాసులు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ఇది తెలియజేస్తోంది.
గాజా రాకెట్ దాడుల నుండి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉన్నదని, హమాస్ రాకెట్ దాడులను తాము ఖండిస్తున్నామని బ్రిటన్ ప్రధాని కామెరాన్ ప్రకటనలు గుప్పిస్తున్నాడు. అదే సమయంలో ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ఉద్భోదిస్తున్నాడు. ఆత్మరక్షణ చేసుకునే దేశం సంయనం పాటించవలసిన అవసరం ఏమిటో బ్రిటన్ దేశాధీశుడే వివరించాలి.
నిరసన ప్రదర్శనలో లేబర్ పార్టీ ఎం.పి దియాన్ అబ్బాట్ పాల్గొన్నారు. గాజా ప్రజలకు తాము మద్దతు ఇస్తున్నామని ఆమె ప్రకటించారు. గాజా విషయంలో జరుగుతున్న అతిపెద్ద ప్రదర్శనలో తాను పాల్గూన్నందుకు ఆమె సంతోషం ప్రకటించారు. అయితే లేబర్ పార్టీ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఐరాస తరపున మధ్య ప్రాచ్యం ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఇజ్రాయెల్ పక్షం వహించడం ప్రస్తావనార్హం.
“గాజాలో పిల్లలను పెద్ద ఎత్తున హత్య చేయడం అమానుషం. ఆసుపత్రులపై కూడా బాంబు దాడులు చేయడం తీవ్ర గర్హనీయం. (రాకెట్ దాడుల సాకుతో) సామూహిక శిక్షకు గాజా ప్రజలను గురి చేయడం మానవతా వ్యతిరేక నేరం” అని ప్రదర్శకులు నినదించారని పత్రికలు తెలిపాయి. ఇజ్రాయెల్ భూ, వాయు, జల తల దాడుల్లో ఇప్పటివరకు 2,000 మందికి పైగా చనిపోగా వారిలో 700 మంది పిల్లలే. మృతుల్లో 80 శాతం అమాయక పౌరులే.
కాగా ఇజ్రాయెల్ వైపు చనిపోయినవారంతా ఆ దేశ సైనికులే. వారు కూడా ఎక్కువమంది గాజాలో చొరబడిన ఫలితంగా ప్రాణం కోల్పోయినవారే. హమాస్ రాకెట్ దాడులు ఇజ్రాయెల్ సైనికులను, మిలట్రీ స్ధావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నవేనని ఈ వాస్తవం తెలియజేస్తోంది. కానీ ఐరాస మాత్రం, ఇండియా పాలకుల తరహాలో ఇరువైపులా సంయమనం పాటించాలని, ఇరు పక్షాల యుద్ధ నేరాలపై విచారణ చేస్తామని గోడ మీద కూర్చుని సుద్దులు చెబుతోంది.
గాజా దాడికి వ్యతిరేకంగా ఆగస్టు 9 తేదీన ప్రపంచ వ్యాపితంగా ‘ఆగ్రహ దినం’ (Day of rage) పాటించాలని పిలుపు ఇచ్చిన సందర్భంగా లండన్ లో ప్రదర్శన జరిగింది. అదే రోజున ప్యారిస్, సౌత్ ఆఫ్రికా లోని అనేక నగరాలు, జర్మనీ తదితర ఐరోపా నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. కేప్ టౌన్ (సౌత్ ఆఫ్రికా) లో 50,000 మందికి పైగా ప్రదర్శనలో పాల్గొనగా, ప్యారిస్ లో 20,000 మంది పాల్గొన్నారని పత్రికలు తెలిపాయి. ప్యారిస్ లో ప్రదర్శనపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ ప్రదర్శన ఆగలేదు. బెంగుళూరులో కూడా నిరసన ప్రదర్శన జరిగింది.
“కొన్ని వందల వేలమంది తమ ఇళ్లను వదిలి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఆరోగ్య సేవల వ్యవస్ధ దాదాపు కూలిపోయింది. వేలాది మంది ప్రజలకు శుభ్రమైన నీరు అందుబాటులో లేదు. అనేకమందికి అసలు నీళ్లే అందుబాటులో లేవు” అని డిసాస్టర్స్ ఎమర్జెన్సీ కమిటీ సి.ఇ.ఓ సలే సయీద్ ప్రదర్శకులకు తెలిపారు.
బ్రిటన్ పాలక పార్టీ అయిన కన్సర్వేటివ్ పార్టీ ఎం.పి బరోనెస్ వర్సి తమ పార్టీ విధానానికి నిరసనగా రాజీనామా ప్రకటించారు. ఇజ్రాయెల్ కు ఆయుధాలు సరఫరా చేయడం బ్రిటన్ మానుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. “ఇప్పుడు మనం తక్షణమే చేయవలసింది ఏమిటంటే బ్రిటన్ ప్రభుత్వ విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి చేయాలి. ఇజ్రాయెల్ కు ఆయుధ ఎగుమతుల లైసెన్స్ లను తక్షణమే రద్దు చేయాలి. వైరి పక్షాలు బాధ్యతతో వ్యవరించేలా అంతర్జాతీయ ప్రయత్నాలు ప్రారంభించాలి” అని ఆమె బి.బి.సి రేడియోతో మాట్లాడుతూ అన్నారని పత్రికలు తెలిపాయి.
బ్రిటన్ లోని అనేకమంది యూదులు కూడా లండన్ ప్రదర్శనల్లో పాల్గొనడం విశేషం. అనేకమంది యూదులకు నిరసనలో పాల్గొనాలని ఉన్నప్పటికీ ప్రదర్శకులకు టార్గెట్ గా మారతామన్న భయంతో రాలేదని ప్రదర్శనలో పాల్గొన్న యూదు పౌరులు చెప్పారు.
పాశ్చాత్య దేశాల ఆకృత్యాలను అక్కడి ప్రజలే విమర్శిస్తుంటే భారత్ మాత్రం ఇంకా…. చేతగానితనంతో సంయమనం పాటించాలని కోరడం ఆపాలి. ఇకనైనా పార్లమెంట్లో ఇజ్రాయెల్ దాష్టీకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి.