ప్రపంచ వ్యాపితంగా అరుదైన సూపర్ మూన్ -ఫోటోలు


అరుదుగా కనిపించే సూపర్ మూన్ ఆగస్టు 10, 2014 తేదీ రాత్రి సంభవించింది. చంద్ర కళల ప్రకారం నెలకొకసారి పౌర్ణమి రోజున పూర్తి రూపంలో చంద్రుడు కనిపించే సంగతి తెలిసిందే. భూమి చుట్టూ వర్తులాకారంలో (elliptical shape) తిరిగే చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి సమీపంలో వచ్చే సందర్భం ఒకటి ఉంటుంది. కానీ ఆ సందర్భం ఎప్పుడూ పౌర్ణమి రోజు కానవసరం లేదు. పౌర్ణమి రోజున పూర్తిగా చంద్రుడు కనిపించే రోజునే భూమికి అతి దగ్గరిగా చంద్రుడు వస్తే దానిని సూపర్ మూన్ అని పిలుస్తున్నారు.

సూపర్ మూన్ అన్న పదజాలం గ్రహ శాస్త్రం (Astronomy) లోనిది కాదు. అది జ్యోతిష శాస్త్రంలోనిది. ఆస్ట్రానమీ లో సూపర్ మూన్ ను పెరిగీ మూన్ (Perigee Moon) అని పిలుస్తారు. వర్తులాకార కక్ష్యలో అతి దగ్గరి దూరాన్ని పెరిగీ అనీ అత్యంత దూరంగా ఉండే దూరాన్ని ఆపొగి అని పిలుస్తారు. పెరిగీ మూన్ ఉన్నట్లే అపొగి మూన్ కూడా ఉంది. ఆస్ట్రాలజీలో ఆపొగి మూన్ ను మైక్రో మూన్ అని పిలుస్తారు. మైక్రో మూన్ అన్నది పెద్దగా వాడుకలో లేని పదం.

సూపర్ మూన్ లేదా పెరిగీ మూన్ 14 నెలలకు ఒకసారి సంభవిస్తుంది. పెరిగి మూన్ సంభవించిన మరుసటి నెలలోనూ,  దానిని ముందు నెలలోనూ కూడా పౌర్ణమి రోజుల్లో మరోసారి పెరిగీ మూన్ కనిపిస్తుంది. కానీ ఇది అసలు పెరిగీ మూన్ కంటే కాస్త చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఒక సూపర్ మూన్ సైకిల్ లో మూడుసార్లు సూపర్ మూన్ కనిపిస్తుంది. అతి పెద్ద సైజులో కనిపించే సూపర్ మూన్ 14 నెలలకు ఒక్కసారే సంభవం. గత సంవత్సరం సూపర్ మూన్ జూన్ 23 తేదీన సంభవించింది.

ఆగస్టు 10 తేదీన సూపర్ మూన్ కనిపించింది కనుక సెప్టెంబర్ 9 తేదీన మరోసారి కాస్త చిన్న సైజులో సూపర్ మూన్ కనిపిస్తుంది. ఆసక్తి ఉన్నవారు గుర్తు పెట్టుకుని చూడవచ్చు. పెరిగీ మూన్ అన్ని దేశాల్లో కనిపిస్తుంది. కాకపోతే ఆకాశం మేఘాలు లేకుండా క్లియర్ గా ఉండాలి. భవనాలు లేని బహిరంగ ప్రదేశంలో అయితే స్పష్టంగా చూడవచ్చు.

ఆస్ట్రానమీ ప్రకారం భూమి, చంద్రుడు ల మధ్య దూరం 357,000 కి.మీ మరియు 406,000 కి.మీ మధ్య మారుతూ ఉంటుంది. కాబట్టి పెరిగీ మూన్ 357,000 కి.మీ దూరంలో సంభవిస్తే ఆపొగి మూన్ 406,000 కి.మీ దూరంలో కనిపిస్తుంది. నాసా ప్రకారం పెరిగీ మూన్ సాధారణ పౌర్ణమి నాటి చంద్రుడు కంటే 14 శాతం పెద్దదిగానూ, 30 శాతం ఎక్కువ వెలుతురు తోనూ కనిపిస్తుంది.

సూపర్ మూన్ వల్ల భూకంపాలు, సునామీలు వస్తాయని ఒక ప్రచారం ఉంది. 2004లో హిందూ మహా సముద్రంలో వచ్చిన భూకంపం మరియు సునామీ, 2011 నాటి ఫుకుషిమా భూకంపం మరియు సునామీలు సూపర్ మూన్ సమీపిస్తున్న రోజుల్లోనే వచ్చినందున వాటికి కారణం కూడా సూపర్ మూన్ గానే కొందరు చెబుతారు. కానీ ఈ వాదనలకు శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని శాస్త్రవేత్తలు తేల్చేశారు. అయినా మూఢనమ్మకాల వలన ఈ ప్రచారం ప్రబలంగానే సాగుతోంది.

సూపర్ మూన్ వల్ల సముద్రంలో అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడతాయన్న ప్రచారం కూడా జాస్తిగానే ఉంది. అసలు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెబుతుంటారు. కానీ చంద్రుడు అతిదగ్గరగా వచ్చే సూపర్ మూన్ రోజు కూడా చంద్రుడి ప్రభావం సముద్ర అలలపైనా కాసిన్ని అంగుళాల కంటే ఎక్కువ ఉండదని శాస్త్రవేత్తలు నిగ్గు దేల్చారు. కావున సముద్రం అల్లకల్లోలంగా ఉంటే ఖర్మ కాలి ఆరోజు పౌర్ణమి అయితే రెండింటికీ సంబంధం ఉందని భావించనవసరం లేదు. సూపర్ మూన్ రోజు కూడా సముద్రంపై ప్రభావం కొన్ని అంగుళాలకు మించి ప్రభావం ఉండదు.

ఈ ఫోటోలను బి.బి.సి, ద టెలిగ్రాఫ్ పత్రికలు అందించాయి.

Photos: BBC, The Telegraph, The Atlantic

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s