బి.జె.పి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన అమిత్ షా భారత దేశం కోసం తాను కంటున్న కలలేమిటో వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి అమిత్ షాకు అప్పగించడానికి బి.జె.పి కార్యర్గం లాంఛన ప్రాయంగా ఆమోద ముద్ర వేసిన అనంతరం ఆయన బి.జె.పి జాతీయ కౌన్సిల్ ను ఉద్దేశించి ప్రసంగించారు. సదరు ప్రసంగంలో తన ఉద్దేశ్యాలేమిటో శాంపిల్ గా వివరించారాయన.
ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఐడియాలజీ ఒక్కటే దేశాన్ని శాసించిందని ఇక నుండి కాంగ్రెస్ ఐడియాలజీని పక్కకు నెట్టి కేవలం బి.జె.పి ఐడియాలజీ మాత్రమే ఉండేలా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. బి.జె.పి ఐడియాలజీ నలుమూలలా విస్తరించడానికి నాయకులు, కార్యకర్తలు కంకణ బద్ధులు కావాలని ఆయన ఉద్భోదించారు.
“ఇన్నాళ్లూ కాంగ్రెస్ సిద్ధాంతమే దేశ రాజకీయాల్లో ప్రధాన స్ధానం ఆక్రమించింది. ఇక జాతీయ రాజకీయాలను మన సిద్ధాంతాలు ఆక్రమించవలసిన సమయం ఆసన్నమయింది” అని అమిత్ షా ప్రసంగంలో పేర్కొన్నారు. బి.జె.పి సిద్ధాంతాలు దేశమంతా విస్తరించకుండా, పాదుకొనకుండా ప్రభుత్వం ఎంతోకాలం మనలేదని, పార్టీ హస్తాలు నలుమూలలా విస్తరించకపోతే దీర్ఘకాలం పాలన చేయలేమని హెచ్చరించారు.
అమిత్ షా చెబుతున్న బి.జె.పి సిద్ధాంతాలు దేశం అంతా విస్తరించడం అంటే ఏమిటో పై కార్టూన్ లో కార్టూనిస్టు స్పష్టంగా వివరించారు. ఒక వ్యవస్ధ, అది ప్రజాస్వామ్యం అయినా మరేదయినా సజీవంగా ఉండాలంటే వేయి ఆలోచనలను స్వాగతించాలి. వేయి ఆలోచనలు సంఘర్షించడానికి తగిన వాతావరణాన్ని ఏర్పరచాలి.
సమాజంలోని విరుద్ధ శక్తులు సంఘర్షించిన చోటనే ఆయా సమాజాలు అభివృద్ధి సాధించాయని మానవ సమాజ చరిత్ర గానీ, అనేక దేశాలలో చెలరేగిన విప్లవాల చరిత్ర గానీ స్పష్టంగా నిరూపించే సత్యం. సనాతన విలువలతో బిగదీసుకుపోయి, భావ, భౌతిక సంఘర్షణలను అనుమతించకుండా స్తంభించిన సమాజాలు అభివృద్ధి లేక కునారిల్లాయని కూడా చరిత్ర నిరూపించిన సత్యం.
ఒక మాగ్నకార్టాను ప్రకటించిన బ్రిటన్, ఒక పారిస్ కమ్యూన్ కి ప్రాణం పోసిన ఫ్రాన్స్, ఒక మీజీ రెస్టోరేషన్ కు సాహసించిన జపాన్, నీగ్రో బానిసల తిరుగుబాటుతో తెలివి తెచ్చుకున్న అమెరికా, ఒక స్పార్టకస్ కు ప్రాణం పోసిన రోమన్ సామ్రాజ్యం, ఒక అటా టర్క్ నెత్తిన పెట్టుకున్న టర్కీ, ఒక లెనిన్ దివిటీని ప్రపంచానికిచ్చిన రష్యా, ఒక మావో నిప్పు రవ్వతో దావానలం రగిలించిన చైనా…. కళ్ళు తెరిచి వెతికితే చరిత్ర చెప్పే రుధిర వాస్తవాలు ఎన్నో…
మరి భారత దేశం? తపస్సు చేసిన శంభూకుడి శిరస్సు నరికిన పాలకుడిని దేవుడుగా కొలుస్తోంది. వేదం పఠించిన పంచముడి నాలుకలు తెగ్గోయాలని శాసించిన మనువును గురోత్తముడిగా పూజిస్తోంది. దేవ దానవ యుద్ధం అంటూ జాతుల తగాదాలను ఏకపక్ష విజయగాధగా చెప్పుకుని తరిస్తోంది. అసుర మానవ జాతిని శాశ్వతంగా రాక్షసీకరించి అసుర రాజుల వధలను పండగ చేసుకుంటోంది. ఏకలవ్య శిష్యరికాన్ని బొటన వేలు బలితో అపహాస్యం చేసింది. ఇప్పుడూ అదే సామాజిక విలువల ఐడియాలజీ దేశాన్ని కమ్మేయాలంటున్న నేతల పరిష్వంగంలో మొద్దు నిద్ర పోతోంది.
అత్యంత హీనమైన, అమానవీయమైన కుల సమాజం గనకనే భారత సమాజం అతి తేలికగా వలస దేశంగా శతాబ్దాల తరబడి పరాయి పాలనలో మగ్గిపోవలసిన పరిస్ధితి దాపురించింది.
కింది కులాలకు చదువు, చైతన్యం నిరాకరించి, వేదాలు వినకుండా చెవుల్లో సీసం పోసి, తపస్సు చేయకుండా శంభూకుల శిరస్సులను వధించిన సమాజం గనకనే భారత దేశ పాలకులు ఇప్పటికీ దళారీ వ్యవస్ధ నాయకులుగా పెద్ద దేశాల ఎంగిలి మెతుకుల కోసం దేశ సంపదలను బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెడుతున్నారు.
సొంత సహజ వనరులను పరాయి కంపెనీలకు అప్పజెప్పి వారి దగ్గర ఉద్యోగాలను అడుక్కునే నిష్ట దరిద్రం లోకి జనాన్ని నెట్టేవారా అగ్రరాజ్య హోదా కోసం కలలు కనేది? నవ్విపోదురు గాక!!!
సామాజిక చలన శీల శక్తులను సనాతన సంప్రదాయాల సంకెళ్లలో బంధించి, కులాల కుళ్లులో దొర్లించి, మత కొట్లాటల మూఢత్వంలో ముంచివేసి, వేయి ఆలోచనలకు బదులు ఒకే ఒక్క కుళ్ళు ఆలోచనను బతికించుకుంటే భారత దేశం ఇక ఎక్కడ తేలుతుంది? అగ్రరాజ్య హోదా సరికదా, నల్ల బానిసల గుడ్డి వెలుతురునైనా చూడగలదా ఇండియా?
సర్, వివేకానందుడు,నేతాజి,గాంధీ,అంబెడ్కర్,జె.పి లాంటి వాళ్ళనుండి మనం ఎందుకు స్పూర్తిపొందలేకపోయాము?