గూఢచారుల పేర్లివ్వండి! -ఎంబసీలకు జర్మనీ ఆదేశం


BND (Bundesnachrichtendienst) office in Berlin

జర్మనీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎన్.ఎస్.ఎ, సి.ఐ.ఎ లాంటి అమెరికా గూఢచార సంస్ధలతో విసిగిపోయి ఇక ఎంత మాత్రం సహించలేని దశకు చేరుకున్నట్లుగా సంకేతాలిస్తూ దేశంలోని విదేశీ ఎంబసీలన్నీ తమ గూఢచార అధికారుల పేర్లను వెల్లడించాలని ఆదేశించింది. తమ దేశంలో విధులు నిర్వర్తిస్తున్న గూఢచారులందరి పేర్లను తమకు అప్పగించాలని కోరింది. ఈ మేరకు విదేశీ ఎంబసీలన్నింటికీ జర్మనీ ప్రభుత్వం గత వారం లేఖలు రాసిందని పత్రికలు సమాచారం ఇచ్చాయి.

జర్మనీ విదేశీ మంత్రిత్వ శాఖ నుండి దాదాపు విదేశీ రాయబార కార్యాలయాలన్నీ తాఖీదులు అందుకున్నాయని జర్మనీ పత్రిక డెర్ స్పీజెల్ తెలిపింది. తమ దేశాల తరపున జర్మనీలో విధులు నిర్వర్తిస్తున్నా గూఢచార శాఖ అధికారుల పేర్లను తమకు అందజేయాలని, ఎవరినీ మినహాయించడానికి వీలు లేదని జర్మనీ కోరింది. రాయబార కార్యాలయాల లోపల విధులు నిర్వర్తిస్తున్న గూఢచార అధికారుల పేర్లు కూడా తమకు ఇవ్వాలని జర్మనీ స్పష్టం చేయడం విశేషం.

సాధారణంగా ఎంబసీ కార్యాలయాలు ఆయా దేశాల సార్వభౌమాధికార పరిధిలోనివిగా పరిగణిస్తారు. వియన్నా సదస్సు ఒప్పందం ఈ మేరకు అవకాశం కల్పించింది. బ్రిటన్ లోని ఈక్వడార్ ఎంబసీలో కొన్నేళ్లుగా శరణు పొందుతున్న వికీలీక్స్ అధినేత జులియన్ ఆసాంజేను బ్రిటన్ అధికారులు తాకలేకపోవడానికి కారణం వియన్నా ఒప్పందమే. అటువంటి ఎంబసీలను కూడా జర్మనీ మినహాయించలేదు.

ఎంబసీ, కాన్సలేట్ లతో పాటు విదేశాలకు చెందిన సాంస్కృతిక సంస్ధలు కూడా తమ వద్ద పని చేసే గూఢచార అధికారుల జాబితా ఇవ్వాలని జర్మనీ కోరింది. మిలట్రీ అటాచ్ పేరుతో విదేశాల మిలట్రీలు కూడా తమ గూఢచారులను ఎంబసీలు, కాన్సలేట్ లలో నియమిస్తాయి. వారి జాబితా కూడా ఇవ్వాలని జర్మనీ ప్రభుత్వం కోరింది. తమ సన్నిహిత మిత్ర దేశాలను కూడా జర్మనీ వదలలేదు.

జర్మనీ తీసుకున్న ఈ అసాధారణ చర్యకు తక్షణ కారణం ఎవరు? ఇంకెవరు, అమెరికాయే. అమెరికా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల విషయం ఇటీవల వెల్లడి కావడం ఈ చర్యకు కారణంగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సదరు వ్యక్తులు జర్మనీ గూఢచార సంస్ధ బి.ఎన్.డి కి చెందినవారు కావడంతో జర్మనీకి ఎక్కడ కాలాలో అక్కడి కాలినట్లు కనిపిస్తోంది. ఒకరు బి.ఎన్.డి అధికారి కాగా మరొకరు జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖలో పని చేసే అధికారి. ఈ ఇద్దరూ అమెరికా తరపున పని చేస్తూ దేశ రహస్యాలను అమెరికాకు చేరవేస్తున్నారన్న అనుమానంతో జర్మనీ ఫెడరల్ ప్రాసిక్యూషన్ కార్యాలయం కొద్ది రోజుల క్రితం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపధ్యంలో జర్మనీ అసాధారణ రీతిలో గూఢచారుల సమాచారం ఇవ్వాలని కోరింది.

బి.ఎన్.డి సంస్ధ జర్మనీ విదేశీ గూఢచార సంస్ధ. మన దేశానికి ‘రా’ (RAW – Research and Analysis Wing) ఎలాగో జర్మనీకి బి.ఎన్.డి అలాగ. జర్మనీ తరపున పని చేయాల్సినవారు అమెరికా తరపున పని చేయడం జర్మనీ కోపానికి కారణం అయింది. అనేక దేశాల గూఢచారులు డబుల్ ఏజెంట్లుగానూ, ట్రిపుల్ ఏజెంట్లుగానూ పని చేస్తూ దొరికిపోవడం అప్పుడప్పుడూ పత్రికల్లో కనపడే విషయమే. ఎన్.ఎస్.ఎ సంస్ధ చివరికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొబైల్ ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు బైటపడడంతో జర్మనీ ఆనాడే అమెరికాను హెచ్చరించింది. ఇక ముందు చేయబోమని అమెరికా హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన తర్వాత కూడా గూఢచర్యం (espionage) కొనసాగడంతో జర్మనీకి నసాళానికి అంటి ఉండవచ్చు.

కానీ జర్మనీ అడగగానే వివిధ దేశాలు తమ తమ గూఢచారుల జాబితాను ఇచ్చేస్తాయా అన్నది ఆసక్తికరమైన విషయం. పేర్లు ఇచ్చే పనైతే వారిక గూఢచారులు ఎలా అవుతారు? మిలట్రీ అటాచ్ గా పని చేసే వారు ఎలాగూ బహిరంగమే. కనుక ఇబ్బంది లేదు. వివిధ విధుల ముసుగులో పని చేసే గూఢచారుల పేర్లను ఏ దేశమైనా ఎందుకు ఇస్తుంది?

ఇద్దరు జర్మనీ అధికారుల విద్రోహం బైటపడిన వెంటనే అమెరికా గూఢచార సేవల అధిపతిని దేశం నుండి బహిష్కరించింది. బహిష్కరణకు గురయిన అధికారి సి.ఐ.ఏ కు చెందిన అత్యున్నత అధికారి అని తెలుస్తోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ ద్వారా వెల్లడి అయిన ఎన్.ఎస్.ఏ కార్యకలాపాల నేపధ్యంలో కూడా సి.ఐ.ఏ అధికారి బహిష్కరణ జరిగిందని, ఇచ్చిన హామీల ప్రకారం సహకరించడానికి అమెరికా నిరాకరించడంతో జర్మనీ తక్షణ చర్యలు ప్రారంభించింది.

ఒక్క అమెరికా తరపునే జర్మనీలో 200 మంది గూఢచార అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారని డెర్ స్పీజెల్ తెలిపింది. విదేశాలన్నీ తమ తమ రాయబార కార్యాలయాల్లో వివిధ విధుల మాటున గూఢచార అధికారులను నియమించాయని జర్మనీ ప్రభుత్వం నమ్ముతోంది. అత్యధిక సంఖ్యలో గూఢచారులను నియమించుకున్న దేశం అమెరికా కాగా, తర్వాత స్ధానాలను రష్యా, చైనాలు ఆక్రమించాయని తెలుస్తోంది.

విదేశాలతో పరస్పర అవగాహన పెంచుకోవడానికి కూడా జర్మనీ ఆదేశాలు ఉద్దేశించబడ్డాయని ఆ దేశ అధికారులు గొణుగుతున్నారు. పరస్పర అవగాహన అన్న మర్యాదను గౌరవించుకునేవారయితే గూఢచారులను ఎందుకు నియమిస్తారు? ఇంతకీ జర్మనీ ఇతర దేశాల్లో నియమించుకున్న తమ గూఢచారుల పేర్లను వెల్లడి చేస్తుందా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s