ప్రశ్న: ఆర్కిటిక్ సంపదలో ఇండియాకు భాగం ఎలా?


Arctic scramble

మూల:

అర్కిటిక్ రిజియన్లో మనదేశానికి భాగంలేనందున ఆ రిజియన్లో మన ప్రయత్నాలు పరోక్షపద్దతులవలననే అర్ధం అవుతోంది!!మరిదానికి సహకరించేది రష్యానా? లేక వేరేదైనా?

సమాధానం:

ఈ అంశాన్ని గతంలో రెండు ఆర్టికల్స్ లో వివరించాను. వాటికి లంకెలు కింద ఇస్తున్నాను.

ఆర్కిటిక్ సంపదలను వివాదరహితంగా పరిష్కరించుకునేందుకు వీలుగా ఆర్కిటిక్ దేశాలు కలిసి ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ అనే సంఘం ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో 8 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. ఇతర దేశాలు కూడా ఇందులో చేరవచ్చు. కానీ ప్రస్తుతానికి పరిశీలక హోదా మాత్రమే ఇస్తారు.

మరిన్ని హక్కులతో కూడిన సభ్యత్వం కావాలంటే శాశ్వత సభ్య దేశాలకు ఆర్కిటిక్ సంపదలపై ఉన్న సార్వభౌమ అధికారాలను అంగీకరించాలని షరతు విధించారు. షరతుకు అంగీకరిస్తేనే పరిమిత హక్కులతో కూడిన శాశ్వత సభ్యత్వం ఇస్తారు.

చైనా ఈ షరతును నిరాకరిస్తోంది. అది సరైనది కూడా. ఎందుకంటే సముద్ర జలాలకు సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ చట్టాలు (ఉదా: UNCLOS = United Nations Convention on law of the seas) ఉన్నాయి.  ఆర్కిటిక్ కౌన్సిల్ శాశ్వత సభ్య దేశాలకు ఈ చట్టం ప్రకారం సంక్రమించే సార్వభౌమ హక్కులు పోను ఇంకా మరింత మిగులు సముద్రం ఆర్కిటిక్ లో ఉంటుంది. ఈ భాగం పైన కూడా సార్వభౌమ హక్కులు తమకు ఉన్నాయని ఆర్కిటిక్ కౌన్సిల్ దేశాలు వాదిస్తున్నాయి. ఇది అంగీకారయోగ్యం కాజాలదు.

ఆర్కిటిక్ కౌన్సిల్ లో ఇండియాకు లభించిన పరిశీలక హోదా వల్ల ఇండియాకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. చైనాకు పరిశీలక సభ్యత్వం ఇవ్వవలసిన పరిస్ధితుల్లో దానికి counterweight గా మాత్రమే ఇండియాకు కూడా ఇచ్చారు. అమెరికా ప్రయోజనాలకు బంటుగా ఈ హోదా దక్కింది తప్ప స్వతంత్ర ప్రయోజనాలు కలిగిన దేశంగా కాదు.

అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం తీరప్రాంతం కలిగిన దేశాలకు 200 నాటికల్ మైళ్ళ మేరకు ఎక్స్ క్లూజీవ్ ఎకనమిక్ జోన్ హక్కులు ఉంటాయి. ఆ తర్వాత సముద్రం అంతా అంతర్జాతీయ జలాల కిందికి వస్తాయి. వీటిని వినియోగించుకునే హక్కు అన్ని దేశాలకు సమానంగా ఉంటుంది.

ఆర్కిటిక్ ధ్రువంలో భూభాగం లేదు. అంటార్కిటికా (దక్షిణ ధ్రువం) లో మాత్రమే భూ భాగం ఉంది. అంటార్కిటికా ఖండాన్ని కేవలం శాస్త్ర ప్రయోగాలకు మాత్రమే వినియోగించాలని దేశాలన్నీ ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం అమలులో ఉన్నంతవరకు అంటార్కిటికా సంపదల జోలికి ఎవరూ పోకూడదు. ఆ విధంగా అంటార్కిటికా కాస్త ప్రశాంతంగా ఉంటోంది.

కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ లో మంచు వేగంగా కరిగిపోతోంది. విస్తారమైన మత్స్య సంపద, చమురు, సహజ వాయువు ఇక్కడ ఉన్నందున ఆర్కిటిక్ పై పట్టు కోసం పోటీ నెలకొని ఉంది. పోటీని సామరస్యంగా పరిష్కరించుకునే కృషిలో భాగంగా ఆర్కిటిక్ తీర దేశాలు ఆర్కిటిక్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నాయి. తమ వివాదాల పరిష్కారానికే కాకుండా ఆర్కిటిక్ లోకి మరే ఇతర దేశం ప్రవేశించకుండా ఉండేందుకు కౌన్సిల్ ను సభ్య దేశాలు వినియోగిస్తున్నాయి.

ఆర్కిటిక్ కరగడం వలన సముద్ర ప్రయాణ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సముద్ర రవాణా దూరాల కంటే ఆర్కిటిక్ ద్వారా వెళ్ళే రవాణా దూరాలు చాలా తగ్గిపోతాయి. కొన్ని వేల కి.మీ దూరం కలిసి వస్తుంది. ఆ విధంగా కూడా ఆర్కిటిక్ పై పట్టు కోసం వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ క్రమంలో ఆర్కిటిక్ కేంద్రంగా సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దేశాలు తెర తీసాయి. కఠినమైన మంచు ఖండాలను కోసుకుంటూ పోగల నౌకల అభివృద్ధి కోసం పెద్ద దేశాలు పోటీ పడుతున్నాయి. ఒకవైపు పోటీ పడుతూ మరోవైపు గూఢచార కార్యకలాపాలు వేగవంతం చేశాయి. ఇతర దేశాల శాస్త్ర పరిజ్ఞానాన్ని దొంగిలించేందుకు, లేదా నాశనం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తద్వారా ఇప్పటికే దేహం నిండా గాయాలతో సతమతం అవుతున్న ప్రపంచ శాంతికి మరిన్ని గాయాలు చేస్తున్నాయి.

ఆర్కిటిక్ లో లభించే ఇంధన వనరులు కార్బన్ ఉద్గారాలను వెలువరించేవి. ఇవి శుభ్రమైనవి కావు. కార్బన్ ఉద్గారాల వల్లనే భూమి వేడెక్కుతోంది కనుక బొగ్గు, చమురు వినియోగం తగ్గించాలని ఇండియా, చైనా లాంటి దేశాలపై పశ్చిమ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. కానీ ఆర్కిటిక్ లోని అవే వనరుల కోసం పోటీ పడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ భయాలు చైనా, ఇండియా తదితర దేశాల అభివృద్ధి పధకాలను అడ్డుకునేందుకే తప్ప తాము ఆచరించడానికి కాదని పశ్చిమ దేశాలు ఆ విధంగా రుజువు చేసుకున్నాయి.

ఇప్పుడు కావలసింది ఆర్కిటిక్ లో ఇండియా వాటా కాదు. అసలు ఏ దేశమూ ఆర్కిటిక్ జోలికి పోకుండా కట్టడి చేయడం కావాలి. అంటార్కిటికా తరహాలో దేశాలు ఒప్పందం కుదుర్చుకుంటే గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడంలో చిత్త శుద్ధి ప్రదర్శించినవారు అవుతారు.

కానీ ఆచరణ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆర్కిటిక్ సంపద కోసం పోటీ పడడం ద్వారా భవిష్యత్తులో అంటార్కిటికా ఒప్పందాన్ని సైతం ఉల్లంఘించబోమన్న గ్యారంటీ లేదని ఆయా దేశాలు చాటుతున్నాయి. భూగ్రహం క్షేమం కాంక్షించేవారు ఈ ధోరణిని తిరస్కరించాలి. సూర్య రశ్మి, గాలి లాంటి రెన్యుబుల్ ఇంధన వనరుల వినియోగంపై శ్రద్ధ పెట్టాలని ఒత్తిడి చేయాలి.

గత ఆర్టికల్స్ కు లంకెలు:

కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?

ఆర్కిటిక్ లో అమెరికా కట్టెలమ్మి, రష్యా పూలమ్మి

 

2 thoughts on “ప్రశ్న: ఆర్కిటిక్ సంపదలో ఇండియాకు భాగం ఎలా?

  1. ధనిక దేశాల వారి కావాల్సిన ఆయిల్ అవసరాలు తీర్చడానికి కోసం గల్ప్ దేశాలు, ఆఫ్రికా దేశాలు కూడా సరిపోక ఆర్కిటిక్ పై పడ్డారు. వీళ్ల దురాశను తీర్చాలంటే భూగ్రహమే కాదు….ఈ విశ్వమంతా కూడా సరిపోదు.
    అత్యాశకు పోయే వాడు వినాశనం కాక తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s