రష్యాపై ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అమెరికా కంపెనీ


Kara Sea

Kara Sea

ఉక్రెయిన్ లో వినాశపూరితంగా జోక్యం చేసుకున్న అమెరికా, జోక్యాన్ని ఎదిరిస్తున్న రష్యాపై మూడు విడతలుగా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను అమెరికా బహుళజాతి చమురు కంపెనీ ఎక్సాన్ మొబిల్ పచ్చిగా ఉల్లంఘిస్తోంది. రష్యా చమురు కంపెనీ రోస్ నేఫ్ట్ పై అమెరికా ఆంక్షలు విధించగా, వాటిని ఉల్లంఘిస్తూ రష్యన్ ఆర్కిటిక్ లో చమురు అన్వేషణకు ఎక్సాన్ మొబిల్ నడుం బిగించింది.

ఆర్కిటిక్ సముద్రంలో అత్యధిక భాగం రష్యా తీరంలో భాగంగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ పుణ్యాన ఆర్కిటిక్ ఖండంలో మంచు వేగంగా కరిగిపోతోంది. మరో నాలుగైదు సంవత్సరాల్లో గణనీయంగా మంచు కరిగిపోనుంది. దాని ఫలితంగా అక్కడి విస్తారమైన సహజ సంపదలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్కిటిక్ సంపదలను కొల్లగొట్టడానికి అమెరికా, ఐరోపా, రష్యా దేశాలతో పాటు ఇండియా కూడా తన ప్రయత్నాలు తాను చేస్తోంది.

అయితే రష్యన్ ఆర్కిటిక్ తీరం అత్యంత పొడవైనది కావడాన ఆర్కిటిక్ సంపదల్లో  ఎక్కువ భాగం రష్యా వశం అవుతుందని ఒక అంచనా. ముఖ్యంగా రష్యన్ ఆర్కిటిక్ లోని చమురు సంపద భారీగా పేరుకు పోయి ఉందని భావిస్తున్నారు. ఎంత భారీగా అంటే, అమెరికా తీరం ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ కన్నా చాలా ఎక్కువ నిల్వలు అక్కడ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశంగా పేరు పొందిన సౌదీ అరేబియా కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఈ చమురు నిల్వలను వెలికి తీయడం కోసం రష్యన్ భారీ చమురు కంపెనీ రోజ్ నేఫ్ట్ తో అమెరికన్ బహుళజాతి కంపెనీ ఎక్సాన్ మొబిల్ గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విధించిన ఆంక్షలను తాను పట్టించుకోబోనని, రష్యన్ ఆర్కిటిక్ లో తన కార్యకలాపాలను నిరాఘాటంగా కొనసాగించడానికే తాము నిర్ణయించుకున్నామని ఎక్సాన్ మొబిల్ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ అధికారులు నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనే మాట్లాడడం విశేషం.

“మా సహకారం దీర్ఘకాలికమైనది. ఇక్కడ భారీ లాభాలు వస్తాయని మేము భావిస్తున్నాము. ఒప్పందం మేరకు ఇక్కడ అన్వేషణను కొనసాగించడానికే నిర్ణయించుకున్నాము” అని ఎక్సాన్ మొబిల్ రష్యా విభాగం మేనేజర్ గ్లెన్ వాలర్, అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడుతూ చెప్పారని రష్యా టుడే తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా వాలర్, పుతిన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. పరస్పర సహకారం ద్వారా ప్రపంచ ఇంధన భద్రతకు దోహద పడవచ్చనడానికి ఆర్కిటిక్ చమురు అన్వేషణ ఒక ఉదాహరణ అని పుతిన్ ఈ సందర్భంగా ఎక్సాన్ మొబిల్ నిర్ణయాన్ని కొనియాడారు.

అమెరికా ఆంక్షలు విధించిన రష్యన్ కంపెనీలలో రోజ్ నెఫ్ట్ ముఖ్యమైనది. రష్యన్ ఆర్కిటిక్ లోని యూనివర్సిటెట్స్కాయా-1 బావిలో డ్రిల్లింగ్ చేసేందుకు ఇరు కంపెనీలు శనివారం (ఆగస్ట్ 9) శ్రీకారం చుట్టాయి. ఆర్కిటిక్ లో భాగం అయిన కారా సముద్రంలో ఈ బావి నెలకొంది. “కారా సముద్రంలో మా ప్రయత్నం ద్వారా సరికొత్త చమురు నిల్వలను కనుగొంటామని ఆశిస్తున్నాము. ఆర్కిటిక్ అభివృద్ధి, రష్యా ఆర్ధిక వ్యవస్ధకు పెద్ద మొత్తంలో దోహదపడనుంది” అని రోజ్ నేఫ్ట్ అధిపతి ఇగోర్ సెచిన్ అన్నారు.

ఒక్క కారా సముద్రం లోనే 13 బిలియన్ టన్నుల చమురు నిల్వలు ఉండవచ్చని కంపెనీలు అంచనా వేశాయి. ఈ అంచనా నిజమే అయితే అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో (అమెరికా తూర్పు తీరం) కంటే ఎక్కువ. సౌదీ అరేబియాలోని మొత్తం నిల్వల కంటే కూడా ఎక్కువని ఆర్.టి తెలిపింది.

ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం ఉన్నది. డ్రిల్లింగ్ లో పాలు పంచుకుంటున్న రిగ్గు నార్వేకు చెందిన వెస్ట్ ఆల్ఫా కంపెనీకి చెందినది కావడమే ఆ విశేషం. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా రష్యా పై ఆంక్షలు విధించింది. నార్వే ఇ.యు సభ్య దేశం కానప్పటికీ అమెరికా, ఇ.యు లతో ఆ దేశ ప్రయోజనాలు పెనవేసుకుని ఉంటాయి. కాబట్టి నార్వే కంపెనీ రష్యన్ ఆర్కిటిక్ చమురు అన్వేషణలో పాల్గొనడం అమెరికా, ఇ.యు లకు అప్రతిష్టాకరంగా చెప్పుకోవచ్చు.

3 thoughts on “రష్యాపై ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అమెరికా కంపెనీ

  1. సర్,నేడు 9-8-14 మీనుండి వెలువడిన రెండు కథనాలు ఆసక్తినికలిగించాయి!

    ఆమెరిక ఆధిపత్యం ఇంకెంతోకాలం కొనసాగదనడానికి ఇవి నిదర్షనాలా!!

    ఆమెరిక విధించిన ఆంక్షలను ఆదేశకంపెనీలే ఉల్లంఘిచడానికి పూనుకోవడాన్ని ఏవిధంగా అర్ధంచేసుకోవాలి?

    బహులజాతికంపెనీల మధ్య వైవిధ్యాలుగానా?లేదా లాభాపేక్షముందు తమదేశ ఆంక్షలు పూచుకపుల్లలనా?

    అర్కిటిక్ రిజియన్లో మనదేశానికి భాగంలేనందున ఆ రిజియన్లో మన ప్రయత్నాలు పరోక్షపద్దతులవలననే అర్ధం అవుతోంది!!మరిదానికి సహకరించేది రష్యానా? లేక వేరేదైనా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s